ఎన్నికల బజారులో మరింత నల్లధనం
ABN, First Publish Date - 2023-08-23T03:35:58+05:30
భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలదొక్కుకుందని మన నేతలు నిత్యం గొప్పగా చెప్పుతుంటారు. అయితే మనది ఎటువంటి ప్రజాస్వామ్యం?...
భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలదొక్కుకుందని మన నేతలు నిత్యం గొప్పగా చెప్పుతుంటారు. అయితే మనది ఎటువంటి ప్రజాస్వామ్యం? నిరంతరం కొనసాగే ఎన్నికల వాతావరణంలో, నాయకుల దూషణల పర్వం, హామీల వర్షం ఒక ఎత్తైతే పెద్ద ఎత్తున అక్రమ ధన ప్రవాహం మరో ఎత్తు. నిర్వీర్యమైన ఎన్నికల కమిషన్, ఇతర భ్రష్ట వ్యవస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల ప్రహసనంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. కర్ణాటక ఎన్నికల ఘట్టం ముగిసిన నాలుగు నెలలకే మరోసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూలు ఇంకా ప్రకటించక ముందే పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ప్రారంభించాయి. నేతల బహిరంగ సభలు ఇప్పటికే మొదలయ్యాయి. ఎన్నికలకు ఎంతో ముందు నుంచే నిధులు ప్రవహించేందుకు పార్టీలు వెసులుబాటు కల్పించుకుంటున్నాయి. సార్వత్రక ఎన్నికలకు కూడా ఇప్పుడే రంగం సిద్ధమయింది. ఎప్పుడో జరిగే ఎన్నికలకు సంబంధించి సర్వేలు ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా వెలువడుతున్నాయి. ఈ ప్రచారాలకు, సభలకు, సర్వేలకు, ప్రజలకు పంచేందుకు ఖర్చు పెడుతున్న వేల కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది?
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు సమర్పించే వివరాలు వేరు, ఆచరణలో ఖర్చు పెట్టే నిధులు వేరు. ఆ విషయం ప్రతి ఎన్నికలోనూ రుజువవుతోంది. బీజేపీ అత్యంత సంపన్న పార్టీ అని, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని ఇటీవల ‘అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్’ సంస్థ పార్టీల ఆర్థిక స్తోమతపై నివేదిక ఇచ్చింది. ఆయా పార్టీల ఆడిట్ నివేదికలను బట్టి ఈ విషయాన్ని అది నిర్ధారించింది కనుక అదేమీ పెద్ద పరిశోధన చేసి కనిపెట్టిన విషయం కాదు. వాస్తవానికి ఆడిట్ నివేదికల్లో కాకిలెక్కలే ఉంటాయని, తమ పరిమితులు ఏ అభ్యర్థీ పాటించరని ఎన్నికల కమిషన్‌కు తెలియని విషయం కాదు. అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టుకుంటాడో కచ్చితంగా తెలుసుకున్న తర్వాతే అతడికి సీట్ ఇచ్చే సంప్రదాయం మన దేశంలో ఎప్పుడో మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో 83 శాతం కోట్లకు పడగెత్తిన వారేనని ‘ఇండియా టుడే’ విశ్లేషించింది. డబ్బులు లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఈ దేశంలో ఏ మాత్రమూ లేదు.
కేంద్రంలో అధికారంలోకి రాకముందు నల్లధనంపై నరేంద్ర మోదీ యుద్ధ భేరీ మోగించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని ప్రతీ పైసాతో సహా వెలికి తీసుకువస్తానని ఆయన ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. నల్లధనాన్ని వెలికితీసే ఉద్దేశంతోనే 2016లో పెద్ద నోట్ల రద్దును అమలు చేశామని కూడా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మోదీ సర్కార్ పేర్కొంది. అయితే మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విదేశీ బ్యాంకుల్లో నల్లధనం పెరగడమే కాని తగ్గుతున్న దాఖలాలు లేవు. రెండేళ్ల క్రితం డేటాను పరిశీలిస్తే ఒక్క స్విస్ బ్యాంకుల్లోనే 2020లో రూ. 20,700 కోట్లుగా ఉన్న డిపాజిట్లు 2021 నాటికి రూ. 30,500 కోట్లకు పెరిగాయి. ఇక భారత దేశంలో రద్దయిన నోట్లలో 99 శాతం మళ్లీ బ్యాంకులకు తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంకే ఒప్పుకుంది. అసలు దేశంలో నల్లధనం ఎంత ఉందో తమ వద్ద అంచనా లేదని మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చెప్పింది.
2014 నుంచీ జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ధన ప్రవాహం పెరుగుతుందే కాని తగ్గిన దృష్టాంతాలు ఎక్కడా లేవు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికీ, ప్రజలను ప్రలోభపెట్టేందుకు రూ. 60 వేల కోట్లు వెచ్చించారని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ డా. ఎస్ వై ఖురేషీ, సిబిఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ డి. కార్తికేయన్ నేతృత్వంలో ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. 2014లో రూ. 30 వేలకోట్లు ఖర్చు కాగా ఈ ఖర్చు 2019 నాటికి రెట్టింపైంది. అభ్యర్థులు తమకు డబ్బులు ఇచ్చారని అత్యధిక ఓటర్లు అంగీకరించారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే వచ్చే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ, 2024లో జరిగే సార్వత్రక ఎన్నికల్లోనూ ఎంత డబ్బు ఖర్చవుతుందో మనం ఊహించవచ్చు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టలేని ప్రభుత్వానికి నల్లధనాన్ని నిర్మూలిస్తామని వాగ్దానాలు చేసే హక్కు ఉందా?
అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ ఆడ్వాణీ జనసంఘ్ కాలం నుంచే ఎన్నికల సంస్కరణల కోసం ఎంతో కృషి చేశారు. వారి డిమాండ్ మేరకే ఎన్నికల సంస్కరణలపై 1971లో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటయింది. రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలన్న అటల్, ఆడ్వాణీ డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. తార్కుండే, కృష్ణయ్యర్, దినేశ్ గోస్వామి, ఇంద్రజిత్ గుప్తా తదితరుల సారథ్యంలో పలు కమిటీలు ఎన్నికల సంస్కరణలకు సంబంధించి చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని, అద్భుతమైన సంస్కరణలు ప్రవేశపెడతారని ఆశించినవారు లేకపోలేదు. ఆయన హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో కంటే దారుణంగా ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టింది. మోదీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా నేతృత్వంలోని 20వ లా కమిషన్ ఎన్నికల సంస్కరణలు, ముఖ్యంగా అభ్యర్థులు, పార్టీల ఎన్నికల ఖర్చులకు సంబంధించి కీలకమైన సిఫారసులు చేసింది. రాజకీయ పార్టీలు రూ. 20వేలకు మించి తమకు వచ్చే ప్రతీ విరాళాన్ని వెల్లడించాలని జస్టిస్ షా అన్నారు. జస్టిస్ షా నివేదిక సమర్పించిన రెండేళ్లలోనే మోదీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది! ఆగమేఘాలపై 2017లో ఫైనాన్స్ బిల్లులో భాగంగా ఎన్నికల బాండ్ల పథకాన్ని దొడ్డి దారిన మనీ బిల్లు రూపంలో ప్రవేశపెట్టి లోక్‌సభలోనే ఆమోదించేలా చూసుకుంది. దీనివల్ల రాజ్యసభ ఆమోదం అవసరం లేకుండా పోయింది. 2017 ఫైనాన్స్ చట్టం రిజర్వు బ్యాంకు చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఆదాయపు పన్ను చట్టం, తదితర చట్టాల్ని సవరించింది. ఏ బ్యాంకు అయినా ఎన్నికల బాండ్లను విడుదల చేసేందుకు వీలుకల్పించింది. ఏ రాజకీయ పార్టీ కూడా తనకు వచ్చిన విరాళాల గురించి చెప్పనవసరం లేకుండా చేసింది. అసలు ఆదాయపు పన్ను పరిధిలోకే ఈ విరాళాలు రాకుండా చూసింది. కంపెనీల చట్టం ప్రకారం గత మూడేళ్లలో వచ్చిన నికర ఆదాయంలో 7.5 శాతం మాత్రమే విరాళాలు ఇవ్వాలన్న నిబంధనను కూడా మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. నల్లధనాన్ని, అవినీతిని చట్టబద్ధం చేసేందుకే ఎన్నికల బాండ్లను ప్రవేశ పెట్టారని విమర్శలు వెల్లువెత్తినప్పటికీ మోదీ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. దీనిపై ఏడీఆర్ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే ఆ పిటీషన్‌ను ఎప్పుడు విచారిస్తారో తెలీని పరిస్థితి నెలకొన్నది. తమకు వచ్చిన విరాళాలపై రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్లలో సుప్రీంకు వివరాలు సమర్పించి రెండేళ్లయింది. ఎన్నికల బాండ్లు అధికారంలో ఉన్న వారికే ప్రయోజనం చేకూరుస్తాయని, కొద్ది మంది చేతుల్లో సంపద కేంద్రీకృతం కావడానికి దోహదం చేస్తాయని దాదాపు 80 మంది మాజీ సివిల్ సర్వీస్ అధికారులు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఎన్నికల బాండ్లపై సుప్రీం విచారణ వేగంగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని వారు కోరినప్పటికీ కమిషన్ నుంచి ఉలుకూ పలుకూ లేదు. మోదీ ప్రభుత్వం అనుమతి లేకుండా సుప్రీంకు వెళ్లే ధైర్యం కమిషన్‌కు ఎక్కడిది?
మోదీ ప్రభుత్వానికి కూడా తాను తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించని, తన చెప్పుచేతల్లో ఉండే ఎన్నికల కమిషనే కావాలి. నెలాఖరులో రిటైరు కావల్సిన జీ హుజూర్ అధికారులను పదిరోజుల ముందు ఎన్నికల కమిషనర్లుగా నియమించే సంప్రదాయానికి మోదీ సర్కారే తెర లేపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లకు సంబంధించి చట్టం చేసేంతవరకూ తాము ఒక ప్యానెల్‌ను నియమిస్తామని, అందులో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారని గత మార్చిలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించి ఎన్నికల కమిషనర్లను నియమించే త్రిసభ్య కమిటీలో ప్రధాన న్యాయమూర్తినే తొలగిస్తూ ఇటీవల బిల్లు ప్రవేశపెట్టింది. ప్రధాన న్యాయమూర్తి బదులు కేంద్ర న్యాయ శాఖ మంత్రిని చేర్చింది. అంటే ఎన్నికల కమిషనర్ ఎంపికలో ప్రతిపక్ష నేత అభ్యంతరం వ్యక్తపరిస్తే ప్రధానమంత్రి, న్యాయ మంత్రి కలిసి నిర్ణయం తీసుకుని తమకు ఇష్టం వచ్చిన వారిని నియమిస్తారన్నమాట. ఎన్నికల కమిషనర్ల నియామకానికి అయిదుగురు సభ్యుల కమిటీని నియమించాలని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ కమిటీకి అధ్యక్షత వహించాలని లాల్ కృష్ణ అడ్వాణీ 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారన్న విషయాన్ని మోదీ విస్మరించారు. ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ చెప్పినట్లు వ్యవహరించి, అనేక దారుణాలకు పాల్పడ్డ నవీన్ చావ్లాను యుపిఏ హయాంలో ఎన్నికల కమిషనర్‌గా నియమించినప్పుడు అరుణ్ జైట్లీ నేతృత్వంలో 180 మంది ఎన్డీఏ ఎంపిలు అప్పటి సీఈసీకి లేఖ రాసిన విషయం కూడా మోదీ మరిచిపోయినట్లున్నారు.
నల్లధనం, అవినీతి, రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూల్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని పాపాలు లేవని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించేవారు. మరి మోదీ ప్రభుత్వంలో గతంలో కంటే భిన్నంగా ఏమైనా జరుగుతోందా? ఒక రకంగా కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలను మించిన అక్రమాలు మోదీ ప్రభుత్వ పాలనలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో, ఎన్ని వేల కోట్ల రూపాయల నల్లధనం ఎన్నికల బజారులో ప్రవహిస్తుందో ఎవరికి వారు ఊహించుకోవచ్చు. ఎన్ని దారుణాలు సంభవించినా ఎన్నికల కమిషన్ ఎంత నిస్సహాయంగా ఉండిపోతుందో మరి చెప్పనవసరం లేదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - 2023-08-23T03:35:58+05:30 IST