సామాజిక న్యాయమే ఎన్నికల ఎజెండా
ABN, First Publish Date - 2023-10-11T03:36:10+05:30
ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను క్రితం సారి కంటే ముందుగానే ముగించేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 2018లో డిసెంబర్ 13 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది...
ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను క్రితం సారి కంటే ముందుగానే ముగించేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 2018లో డిసెంబర్ 13 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ సారి డిసెంబర్ మొదటి వారంలోనే, మరింత స్పష్టంగా చెప్పాలంటే గతంలో కంటే 8 రోజులు ముందుగానే ఎన్నికల ప్రక్రియ ముగియనున్నది. ఐదు రాష్ట్రాలలోనూ నవంబర్ నెలాఖరు లోపే పోలింగ్‌ను ముగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. బహుశా, డిసెంబర్‌లో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఒక కీలకమైన ఎజెండాను మోదీ సర్కార్ నిర్ణయించుకుని ఉండవచ్చు. ఐదు రాష్ట్రాలలోనూ అక్టోబర్ 9 నుంచి రెండు నెలల పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. నిజానికి దేశంలో తరచు ఏదో ఒక రాష్ట్రం లేదా కొన్ని రాష్ట్రాలలో సుదీర్ఘ కాలం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అవుతుంటే పాలన అస్తవ్యస్తం అవుతుందని భావించినందువల్లే జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదించింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చినా రాకున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టి ఇప్పటికే వచ్చే వేసవిలో జరగనున్న సార్వత్రక ఎన్నికలపైనే ఉన్నదని చెప్పక తప్పదు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం, నిర్వహణను ఆయన ఇప్పటికే ‘మోదీ కేంద్రీకృత ఎన్నికలు’గా మార్చారు! ప్రస్తుత ప్రచార సరళినే సార్వత్రక ఎన్నికల వరకూ ఆయన అదే ఉధృతిలో కొనసాగిస్తారనే విషయంలో సందేహం లేదు. అందువల్ల ప్రతిపక్షాలు ఐదు రాష్ట్రాలలో విజయంతో పాటు మోదీని ఢీకొనడంపై దృష్టి మరింతగా సారించాల్సి ఉంటుంది.
ఐదు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు ఒక వేళ విజయాలు లభించినా రాబోయే సార్వత్రకంలో వాటి గెలుపు అనిశ్చితమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇవే అయిదు రాష్ట్రాల్లో ఓడిపోయింది. ఉత్తర భారతంలో హిందీ ప్రాంతాలైన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకుంది. తెలంగాణలో కేసీఆర్ రెండవసారి అధికారానికి వచ్చారు. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్‌నే యథాప్రకారం విజయం వరించింది. 2018లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్‌లలో అంతకు ముందు 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓడించినందుకు, రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చినందుకు కాంగ్రెస్ తనకు తిరుగులేదని భావించింది. రాహుల్ గాంధీకి ఎక్కడలేని ఘనతను ఆపాదించింది. అయితే సరిగ్గా ఆరు నెలల తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దేశమంతటా పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ అయిదు రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ చెప్పుకోదగ్గ విజయాలు కైవసం చేసుకున్నది. ఈ రీత్యా, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో లాగా విజయాలు లభించినా ఆ ఫలితాలను సెమి ఫైనల్ అనుకుని ప్రతిపక్షాలు సంబరపడిపోతే అంతకంటే అమాయకత్వం ఉండదు.
అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడబోదని చెప్పలేము. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీకి, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను కత్తిమీద సాములా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. అందువల్లే మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను ‘మోదీ కేంద్రీకృత ఎన్నికలు’గా మార్చడం ద్వారా తన పట్ల ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు, ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలాబలాలేమిటో కూడా ఈ ఎన్నికల్లో తేలనున్నది. కాంగ్రెస్ జయాపజయాలు ఈ సారి ‘ఇండియా’ కూటమి సంఘటితం కావడంపై ప్రభావం చూపనుందనడంలో సందేహం లేదు. కనుక ఈ మూడు రాష్ట్రాల్లో గెలుపు బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్యం. ఇది కాంగ్రెస్ భవిష్యత్‌కు సవాలు వంటింది. మోదీ ఈ మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో దెబ్బతిన్నా తేరుకుని లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలను చావు దెబ్బ తీయగల శక్తి సామర్ధ్యాలు మోదీకి ఉన్నాయని గత అనుభవాలు నిరూపించాయి.
నిజానికి ఇవి అసెంబ్లీ ఎన్నికలే అయినప్పటికీ తమ జాతీయ ఎజెండాను సంబంధిత రాష్ట్రాల్లో ప్రతిఫలించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఇప్పటికే రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. బీజేపీకి ఎప్పటిలా మోదీ ఆకర్షణ, జాతీయ వాదం, హిందూత్వ, డబుల్ ఇంజన్ సర్కార్‌తో పాటు ప్రతిపక్షాల అవినీతి, కుటుంబపాలనపై విరుచుకుపడడం ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. తాజాగా మహిళా రిజర్వేషన్‌ను ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే కర్ణాటక ఎన్నికల్లోనే సామాజిక న్యాయాన్ని తన అస్త్రంగా ఉపయోగించుకుంది. అదే అస్త్రాన్ని ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉపయోగించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. కులజనగణన నిర్వహించాలని కాంగ్రెస్ తాజాగా డిమాండ్ చేయడం అందులో భాగమే. మహిళా రిజర్వేషన్‌లోనూ ఓబీసీలకు సైతం కోటా కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కులజనగణనను రాహుల్ గాంధీ ‘సమాజపు ఎక్స్‌రే’గా ప్రకటించారు. తమ జనాభాకు తగ్గట్లుగా ఆయా వర్గాలకు హక్కులు లభించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రభుత్వ కార్యదర్శులుగా ముగ్గురే ఓబీసీలు ఉన్నారని లోక్‌సభలో ఆయన ఘంటాపథంగా వెల్లడించడాన్ని యథాలాపంగా తీసుకునేందుకు వీలులేదు. తమ నలుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు ఓబీసీలేనని ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రకటించారు. తాము కోల్పోయిన ఓబీసీ, దళిత, ఆదివాసీ, మైనారిటీ ఓటు బ్యాంకును తిరిగి పొందేందుకు కాంగ్రెస్ ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తోంది. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 45 శాతం ఓబీసీలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో కమల్‌నాథ్ 15 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓబీసీ కోటాను 14 నుంచి 27 శాతానికి పెంచారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి రెండు రోజుల ముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ తన రాష్ట్రంలో కూడా కుల జనగణన జరిపిస్తానని ప్రకటించారు. సిఎస్‌డిఎస్ సర్వే ప్రకారం రాజస్థాన్‌లో కూడా 35 నుంచి 40 శాతం ఓబీసీలు ఉన్నారు. ఈ వర్గాలు అధికంగా ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు లభిస్తే అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పూర్వవైభవానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు.
గతంలో మండల్ కమిషన్‌ను సమర్థించిన పార్టీలన్నీ ఇప్పుడు ‘ఇండియా’ కూటమిలో ఉండడం యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బిహార్‌లో జనతాదళ్ (యు), రాష్ట్రీయ జనతాదళ్ ‘ఇండియా’ కూటమిలో ఉన్నాయి. బిహార్‌లో కులాల ఆధారంగా జరిగిన సర్వే ప్రకటించిన తర్వాత దేశంలో కాంగ్రెస్‌కు ఒక బలమైన సైద్ధాంతిక భూమిక లభించిందనడంలో సందేహం లేదు. మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ ఆమోదింపజేశారు. తద్వారా ప్రతిపక్షాలు తమ వ్యూహాన్ని మరింత పటిష్ఠం చేసుకునే అవకాశాన్ని ప్రతిపక్షాలకు మోదీయే స్వయంగా కల్పించారు. ఈ నేపథ్యంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ ఎజెండాను స్పష్టంగా నిర్ణయించే అవకాశాలున్నాయి. అన్ని కులాలను ఉపకులాలుగా చీల్చి వాటికి ప్రయోజనాలు సమకూర్చి హిందూత్వ ప్రభావ పరిధిలోంచి ఆయా కులాలు బయటపడకుండే చూడాలన్నది మోదీ నాయకత్వంలోని బీజేపీ లక్ష్యం కావచ్చు. అయితే కులాల అస్తిత్వాన్ని, వాటికి లభిస్తున్న అవకాశాలను ఒక చర్చనీయాంశంగా మార్చి మత పరిధితో నిమిత్తం లేకుండా ఆ కులాల వారిని చైతన్యవంతం చేసేందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఒక రకంగా ప్రతిపక్షాల ఎజెండా బీజేపీ హిందూత్వ వాదానికి ఒక సవాల్. ప్రజలు ఏ దిశగా ఆలోచిస్తారో ఎన్నికల ఫలితాలు నిరూపిస్తాయి.
నిజానికి సామాజిక అంతరాలు, ఆర్థిక అసమానతలను ఒక వాదం చెరిపివేయగలదా అన్నదే సామాజిక శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న. మధ్యప్రదేశ్‌లో మూడేళ్లలో కేవలం 21 మంది యువకులకు మాత్రమే ప్రభుత్వోద్యోగాలు లభించాయని ఆ రాష్ట్ర యువజన సామాజిక సంక్షేమ మంత్రి యశోధరా రాజే సింధియా గత మార్చిలో అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ రాష్ట్రంలోని మొత్తం 39 లక్షలమంది నిరుద్యోగుల్లో అత్యధికులు ఓబీసీ వర్గాలకు చెందినవారే. 2020లో ఏడు లక్షలమంది వలస కూలీలు మధ్యప్రదేశ్‌కు వివిధ ప్రాంతాలనుంచి తిరిగి వచ్చారు. వేలాది మంది కాలినడకన వచ్చారు. ఒక ప్రభుత్వ సర్వే ప్రకారం వీరిలో 59 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందినవారే. వారిలో 51.4 శాతం మంది 18–30 సంవత్సరాల మధ్య యువకులు. వీరందరిదీ ఏ మతం? మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రత తెలిసినందువల్లే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం కల్పిస్తానని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా నిరుద్యోగాన్ని అరికట్టలేని ముఖ్యమంత్రి ఇప్పుడేమి చేయగలరు? దేశంలో ఇతర పార్టీల ప్రభుత్వాలు ఉచితాలు అమలు చేస్తుంటే తీవ్రంగా విమర్శిస్తున్న మోదీ మధ్య ప్రదేశ్‌లో లాడ్లీ బెహనా పథకం పేరుతో బలహీన వర్గాలకు చెందిన ప్రతిమహిళకూ నెలకు రూ. 1500 చొప్పున ఇస్తానని. విద్యార్థులకు ఈ–స్కూటీలు పంచుతానని, అంగన్‌వాడీ వర్కర్లకు, పంచాయితీ అధ్యక్షులకు గౌరవ వేతనం పెంచుతానని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటిస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? మధ్యప్రదేశ్ రుణ భారం రూ. 3.5 లక్షల కోట్లు కాగా రాష్ట్ర ప్రజలలో ప్రతీ ఒక్కరిపై రూ.41వేల అప్పు ఉన్నదని మోదీకి తెలియదా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అయినా సామాజిక న్యాయం దేశంలో ప్రధాన ఎజెండా కావడం మత రాజకీయాలకంటే మంచిదేనని భావించాలి.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - 2023-10-11T03:36:10+05:30 IST