ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజేయుడు పరాజితుడైన వేళ..

ABN, First Publish Date - 2023-05-17T01:09:07+05:30

స్థూలంగా చూస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి అంత ప్రత్యేకత ఏమీ లేదు. ఆ రాష్ట్రంలో అయిదు సంవత్సరాలకోసారి ప్రత్యామ్నాయ ప్రభుత్వం వస్తూనే ఉంటుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్థూలంగా చూస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి అంత ప్రత్యేకత ఏమీ లేదు. ఆ రాష్ట్రంలో అయిదు సంవత్సరాలకోసారి ప్రత్యామ్నాయ ప్రభుత్వం వస్తూనే ఉంటుంది. 2018లో కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన కుమారస్వామి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ 2019లో కుట్రపూరితంగా కూలదోసింది. ఒక వేళ అలా జరిగి ఉండకపోయినా కుమార స్వామి ప్రభుత్వం అంతర్గత కలహాలతో ఎప్పుడో పడిపోయి ఉండేది. లేదూ, ఈ ఎన్నికల్లో మట్టికరిచి బీజేపీకి అధికారం అప్పజెప్పి ఉండేది. 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వెనుక మోదీ, అమిత్ షాలు అమలు చేసిన ‘ఆపరేషన్ కమల్’ లేదని ఎవరూ చెప్పలేరు. న్యాయవ్యవస్థ కూడా వారికి ఆనాడు సహకరించింది. పోనీ, ఈ ఆపరేషన్ కమల్ అమలు చేసిన తర్వాతనైనా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సరిగా నడిపారా అంటే అదీ లేదు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి, అరాచక పాలనను తమ పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తున్నా మోదీ అడ్డుకోలేకపోయారు. తన వ్యక్తిగత ఆకర్షణ, హిందూత్వ రాజకీయాలు, ఎన్నికల వ్యూహరచన ఈ మూడూ కలిస్తే అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ను మరోసారి ఓడించవచ్చునని ఆయన భావించారు. కర్ణాటకకు పదే పదే వచ్చి ఊరూ వాడా తిరిగారు. ముఖ్యమంత్రుల్నీ, కేంద్రమంత్రుల్నీ, సంఘ్ పరివార్ దళాల్నీ తిప్పారు. గుళ్లూ గోపురాలు సందర్శించారు. అంతకుముందే హిజాబ్, హలాల్ వంటి అంశాలను తెరమీదకు తీసుకువచ్చారు. ఎన్నికల సమయంలో బజరంగ్ దళ్ నిషేధాన్ని వివాదం చేసి హనుమాన్ చాలీసాలను చదివించడం సాగించారు. ఎన్నికల సమయంలోనే ‘కేరళ ఫైల్స్’ సినిమాను విడుదల చేయించి కర్ణాటకలో ప్రచారం చేశారు. అయితే అవేవీ ఫలించలేదు. గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ విముక్త భారత్ అన్న బీజేపీ ఆకాంక్షను దక్షిణాది ప్రజలు ఆమోదించలేదు.

కర్ణాటక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ కాకుండా ద్విముఖ పోటీ జరిగినందువల్లే కాంగ్రెస్ అధిక సీట్లు సాధించగలిగింది. కన్నడిగులు ఈ సారి తమ ఓట్లను చీలనివ్వలేదు. బీజేపీ విధానాల పుణ్యమా అని మైనారిటీలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. ఆనవాయితీగా సైంధవ పాత్ర పోషించే జనతాదళ్ (ఎస్)ను అడ్డు తొలగించుకున్నారు. ద్విముఖ పోటీ జరిగినప్పుడు ప్రజా వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం ఆత్మరక్షణలో పడక తప్పదు. పైగా మోదీ పుణ్యమా అని అక్రమంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వద్ద చెప్పుకోవడానికి ఒక్క ఘనకార్యమూ లేదు. 40 శాతం కమిషన్ గురించి ప్రతిపక్షాలు చేసిన ప్రచారం మారణాయుధంగా మారింది. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి ఎంత ఊదరగొట్టినా ఒక ఇంజన్ తుప్పుపట్టి ముందుకు సాగనప్పుడు మోదీ మాత్రం ఏమి చేయగలరు?

బహుశా మోదీ తనను తాను ఎక్కువ అంచనా వేసుకుని ఉంటారు. అదే కాకపోతే కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్నాయని తెలిసినా రాహుల్ గాంధీపై ఎందుకు అనర్హత వేటు వేయిస్తారు? కాంగ్రెస్ తనను ఏమీ చేయలేదనేది ఆయన ధీమా కావచ్చు. కాంగ్రెస్‌పై మాత్రమే కాదు, ప్రతిపక్షాలపై కూడా ఆయనకు చిన్నచూపు ఉన్నది. విపక్ష నేతలనందరినీ కేసుల్లో ఇరికించినా, ఈడీ, సిబిఐ దాడులు చేయించినా తననేమీ చేయలేరనే అతి ఆత్మవిశ్వాసం మూలంగానే ఆయన విశృంఖలంగా వ్యవహరించారు. పార్లమెంట్ సహా పలు రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటమాడారు. పోనీ తన పార్టీలో ఉన్న వారి పట్ల కూడా ఆయన ఉదారంగా వ్యవహరించారా అంటే అదీ లేదు. కర్ణాటకలో సీనియర్ నేత యడ్యూరప్పతో పాటు అనేకమంది నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. లింగాయత్‌ల అధిపత్యాన్ని అంగీకరించేది లేదన్నారు. తాను పోటీ చేయమన్న చోట పోటీ చేయాల్సిందేనన్నారు. అనేకమంది సీట్లు మార్చారు. తన స్వంత రాష్ట్రం గుజరాత్‌లో అయితే ఇలాంటి ప్రయోగాలు చెల్లుతాయేమో కాని తాను ఆడింది ఆట కావడానికి కర్ణాటక, గుజరాత్ కాదు కదా. ‘నేను లోకల్’ అని కర్ణాటక ఓటరు ప్రకటించాడు. లింగాయత్, ఒక్కలిగలు మాత్రమే కాదు, బీసీలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు కూడా అత్యధిక సీట్లు కాంగ్రెస్‌కు అప్పజెప్పారు. భారత రాజకీయాల్లో మతం కన్నా కులం పాత్ర బలంగా ఉంటుందని మరోసారి తేలింది. బిజెపి విద్వేష రాజకీయాలను పౌర సమాజం, విద్యావంతులతో పాటు సామాన్యులు కూడా వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని కర్ణాటక ఎన్నికలు రుజువు చేశాయి. ఉదాహరణకు అత్యంత ధనికుడైన ఆరోగ్యమంత్రి సుధాకర్ మన హాస్యనటుడు బ్రహ్మానందం లాంటి హేమాహేమీలను రప్పించి ప్రచారం చేయించుకున్నా ఒక కోచింగ్ సంస్థ నడిపే సామాన్య యువకుడి చేతుల్లో ఓడిపోయాడు. 13 మంది బిజెపి మంత్రులతో పాటు, మూడు రాష్ట్రాలకు పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న, నాలుగుసార్లు వరుసగా గెలిచిన సి.టి. రవి కూడా తన ఒకప్పటి కుడిభుజం చేతుల్లో పరాజయం చెందాడు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గెలిచిన చిక్‌మగళూర్ 19 సంవత్సరాల తర్వాత మళ్లీ కాంగ్రెస్ వశమైంది.

‘దక్షిణాది రాజకీయాలు భిన్నంగా ఉంటాయి, అక్కడ మా పప్పులేమీ ఉడకవు’ అని అనేక మంది బీజేపీ నాయకులు ఇప్పుడు ఢిల్లీలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం వారికి ఇదివరకు తెలియనిదేమీ కాదు. అయితే ఆ వాస్తవాన్ని మోదీ, అమిత్ షాలకు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. దేశంలో ఎక్కడైనా తామే చక్రం తిప్పగలమని, తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి నెగ్గుకు రాగలమని ఆ ఇద్దరు అగ్రనేతలు భావించారు. ఢిల్లీ నుంచే అన్ని విషయాల్లో చక్రం తిప్పితే కాంగ్రెస్ మాదిరి దెబ్బతింటామన్న విషయం వారు గ్రహించలేకపోయారు. కర్ణాటకలోనే కాదు దేశమంతటా తమ పార్టీలోనే హేమాహేమీలైన నాయకులను వారు ప్రక్కన పెట్టి అందర్నీ తమ చెప్పుచేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్రమంత్రులను నామమాత్రం చేశారు. పార్లమెంట్‌లోనూ, బయటా జీహూజూర్‌ల ద్వారా పరిస్థితులను అదుపులో పెట్టుకునేందుకు యత్నించారు. కర్ణాటకలో ఇలాంటివేవీ చెల్లకపోవడం మోదీ, షాలు భావి సంకేతాలుగా భావించాలి.

సంఘటితంగా పోరాడితే ఎంతో కొంత సత్ఫలితం వస్తుందని కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ గుర్తించి తీరాలి. అయితే తనను తాను అరివీర భయంకరుడులా చిత్రించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పుడు ప్రతి ఎన్నికలూ ఒక అగ్నిపరీక్ష లాంటివి. ఎందుకంటే తాను తప్ప ఎవరూ బిజెపిని గెలిపించలేరనే వాతావరణాన్ని ఆయనే కల్పించుకున్నారు. ప్రతి చోటా ‘మోదీ, మోదీ’ అంటూ జనాలు జయధ్వానాలు చేస్తుంటే ఉప్పొంగిపోయారు. తన చుట్టే పార్టీ కేంద్రీకృతమయ్యేలా చూసుకున్నారు. అదే ఇప్పుడు మోదీకి భారంగా పరిణమించే పరిస్థితి ఏర్పడుతోంది. పరిపాలనను గాలికి వదిలేసి నిత్యం ఎన్నికల పైనే దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి కనపడుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇతర రాష్ట్రాల్లో ప్రతిఫలించకుండా మోదీ అహోరాత్రాలు పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దక్షిణాదిలో తాము అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటకను కోల్పోయిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం బీజేపీకి అనివార్యంగా మారింది. అయితే ఆ రాష్ట్రంలో గెలిచే పరిస్థితులు, కనీసం నిలదొక్కుకునే పరిస్థితులు అంత సులభంగా కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత బిజెపిలో చేరిన ఇతర పార్టీల నేతలు పార్టీలో తమకు ప్రాబల్యం కల్పించకపోతే ‘ఘర్ వాపసీ’ కోసం ఎదురు చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పడే ఓట్ల కంటే కాగితపు పులులైన నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు.

కర్ణాటక ఫలితాల అనుభవంతో, తాను ఇచ్చిన కాంగ్రెస్ విముక్త భారత్ నినాదం సరైనదా అని బీజేపీ పునరాలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. కన్నడ ఓటర్లు ఇచ్చిన ఊపిరితో కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో పునరుత్థానం చెందే ప్రయత్నాలు చేయకమానదు. మరో వైపు పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడక తప్పదు. దీనితో 2024 ఎన్నికలు అత్యంత సంక్లిష్టంగా, రసవత్తరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. మోదీ అమ్ముల పొదిలోని అస్త్రాలన్నీ అయిపోయిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజకీయాల్లో తన పాత్రను, ముఖ్యంగా తన పార్టీ పాత్రను మోదీ పునర్నిర్వచించుకోవాల్సివున్నది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఏమి నేర్చుకోవాలి? అంతటా తాము చక్రం తిప్పగలమన్న అతి ఆత్మవిశ్వాసాన్ని విడనాడాలి. స్థానిక నేతలను విశ్వాసంలోకి తీసుకుని అధికార వికేంద్రీకరణను అమలుపరిచే విషయమై ఆలోచించాలి. మతతత్వ రాజకీయాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు మానుకుని పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ప్రజల్లోకి వెళ్లగలిగే మార్గాలను అన్వేషించాలి. తమకే తప్ప మరెవరికీ దేశభక్తి లేదని నిందించే బూటకపు ప్రచారాన్ని మానుకోవాలి. నియంతృత్వపోకడలు, అణిచివేసే విధానాలు, కక్ష సాధింపు చర్యలు, ఏజెన్సీల దుర్వినియోగం, ప్రలోభాల ద్వారా ప్రతిపక్షాలను, మేధావులను బలహీనం చేయగలగడం ఎల్లవేళలా సాధ్యపడదని గ్రహించాలి. కార్పొరేట్ సంస్థలు ప్రతి సారీ తమను కాపాడలేవన్న వాస్తవాన్ని గుర్తించాలి. పార్లమెంట్‌లోనూ, ఇతర వ్యవస్థల్లోనూ ప్రజాస్వామిక విధానాలను అనుసరించాలి. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై పార్లమెంటరీ కమిటీల ద్వారా విచారణకు ఆదేశించేందుకు, సభల్లో చర్చించేందుకు వెనుకాడకూడదు. మీడియా స్వతంత్రంగా వ్యవహరించేందుకు తగిన వాతావరణం కల్పించాలి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-05-17T01:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising