ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మోదీ హ్యాట్రిక్‌ను అడ్డుకోవడం సాధ్యమేనా?

ABN, First Publish Date - 2023-09-01T03:31:23+05:30

ముంబైలో సమావేశమవనున్న ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలకు శుభాశుభ వార్తలు. వీటిపై అవి తప్పక మేధో మథనం చేసి తీరాలి. తొలుత ప్రతికూల వార్తను చూద్దాం. 2024 లోక్‌సభ ఎన్నికలలోనూ...

ముంబైలో సమావేశమవనున్న ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలకు శుభాశుభ వార్తలు. వీటిపై అవి తప్పక మేధో మథనం చేసి తీరాలి. తొలుత ప్రతికూల వార్తను చూద్దాం. 2024 లోక్‌సభ ఎన్నికలలోనూ భారతీయ జనతా పార్టీ అగ్రగామిగా కొనసాగనున్నది. కొత్తగా ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి సభ్య పక్షాలు సాధించుకునే మొత్తం సీట్ల కంటే బీజేపీ గెలుచుకునే స్థానాల సంఖ్య అధికంగా ఉండే అవకాశమున్నది. నైరాశ్యానికి గురి చేసే ఈ వార్త వెనుక ఒక మంచి పరిణామం కూడా ఉన్నది. కీలక రాష్ట్రాలలో ‘ఇండియా’ కూటమి పుంజుకోనున్నది. ప్రభుత్వ వ్యతిరేకత, కనీసం కొన్ని కీలక అంశాలపై, బాగా వ్యక్తమవుతోంది. ‘మోదానీ’ ఆరోపణ ప్రజలపై ప్రభావం చూపడం ప్రారంభమయింది. అయినప్పటికీ 2024 సార్వత్రక పోరు దేశమంతటా రెండు కూటముల మధ్య ఒక గట్టి పోటీగా ఉండనున్నది.

గత నెలలో విడుదల చేసిన రెండు దేశవ్యాప్త సర్వేల ఫలితాలు ఈ శుభాశుభ వార్తలను సూచిస్తున్నాయి. వీటిలో ఒక సర్వేను ‘ఇండియా టీవీ’కై సిఎన్‌ఎక్స్ నిర్వహించగా మరో సర్వేను ‘ఇండియా టుడే’కై ‘సి వోటర్’ నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికలను ఇప్పటికిప్పుడు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయమై ఈ రెండు సర్వేల అంచనాలు తుల్యంగా ఉన్నాయి. బీజేపీకి స్పష్టమైన విజయం లభిస్తుంది, అయితే మెజారిటీ తగ్గుతుంది అన్నదే ఆ రెండు సర్వేల అంచనా. 2023 జూలైలో 292 లోక్‌సభ నియోజకవర్గాలలో 44,500మందికి పైగా వయోజనుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా బీజేపీకి 290తో సహా ఎన్డీఏకు మొత్తం 318 సీట్లు వస్తాయని; కాంగ్రెస్‌కు 66తో సహా ‘ఇండియా’ కూటమికి మొత్తం 175 స్థానాలు కైవశమవుతాయని సిఎన్ఎక్స్ అంచనా వేసింది. 2023 జూలై మధ్య నాళ్ల నుంచి ఆగస్టు మధ్య నాళ్ల దాకా 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో దాదాపు 26,000 మంది ఓటర్లతో నిర్వహించిన సర్వేతో పాటు 1,35,000 ఇంటర్వ్యూలతో సేకరించిన సమాచార విశ్లేషణ ఆధారంగా బీజేపీకి 287తో సహా ఎన్డీఏ కూటమికి మొత్తం 306 సీట్లు దక్కుతాయని, కాంగ్రెస్‌కు 74తో సహా ‘ఇండియా’ కూటమికి 193 స్థానాలు లభిస్తాయని సి వోటర్ వెల్లడించింది. ఈ అంకెలను పూర్తిగా విశ్వసించవలసిన అవసరం లేదు. అసలు ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు నిర్వహించిన ఈ సర్వేల ఫలితాలు సూచనాత్మకమైనవి మాత్రమే. ఏమైనా ‘ఇండియా’ కూటమి నాయకులకు ఈ సర్వేల ఫలితాలలో నాలుగు పాఠాలు ఉన్నాయి. అవేమిటో వివరంగా చూద్దాం.

1) బీజేపీ కనిపిస్తున్నదాని కంటే దుర్బలంగా ఉన్నది అనేది మొదట చెప్పవలసిన విషయం. సీట్ల వాటా కంటే ఓట్ల వాటానే, రెండు కూటముల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ ఉంటుందని సూచిస్తోంది. సి వోటర్ సర్వే ప్రకారం ఎన్డీఏ దేశవ్యాప్తంగా 43 శాతం ఓట్లను గెలుచుకుంటుంది; ‘ఇండియా’ భాగస్వామ్య పక్షాలకు లభించే మొత్తం ఓట్లు 41 శాతంగా ఉంటాయి. 2019 ఎన్నికలలో తనకు కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు చాలా వాటిలో బీజేపీ ఒక సంతృప్తికర స్థాయికి చేరుకున్నది. వాయవ్య రాష్ట్రాలలో మాత్రమే ఈ పార్టీ తన సీట్లను కోల్పోయే అవకాశమున్నది. బీజేపీ ప్రాబల్యమున్న ఈ రాష్ట్రాలలో ‘ఇండియా’ కూటమి కొన్ని భారీ లాభాలను, పలు స్వల్ప ప్రయోజనాలను పొందనున్నదని ఉభయ సర్వేలు వెల్లడించాయి. మహారాష్ట్ర, బిహార్‌లలో ఈ కూటమి బాగా ప్రయోజనం పొందనున్నది. మహారాష్ట్రలో ఎన్డీఏ 17 నుంచి 21 సీట్లను నష్టపోవచ్చని ఉభయ సర్వేలు అంచనా వేశాయి. బిహార్ విషయంలో వాటి అంచనాలలో పెద్ద తేడా ఉన్నప్పటికీ ఎన్డీఏ కనీసం 15 సీట్లను కోల్పోయే అవకాశమున్నదని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ‘ఇండియా’ కూటమి స్వల్ప లబ్ధితోనే బీజేపీ మెజారిటీని తగ్గించివేయగలదని సర్వేలు స్పష్టం చేశాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకోవాలంటే బీజేపీ, తనకు ఇంతవరకు కనీస బలం కూడా లేని రాష్ట్రాలలో ఎన్నో కొన్ని సీట్లను గెలుచుకోవలసిన అవసరమున్నది. అయితే కేరళ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో బీజేపీకి స్వల్ప లబ్ధి సైతం అసాధ్యమని ఉభయ సర్వేలు వెల్లడించాయి. తమిళనాడులో బీజేపీ కాకపోయినా దాని మిత్ర పక్షాలు ప్రయోజనం పొందే అవకాశమున్నది. ఓడిషా, తెలంగాణలలో బీజేపీ పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు మృగ్యం. కనుక భారతీయ జనతా పార్టీ వ్యూహకర్తలు కలవరపాటుకు గురయ్యేందుకు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


2) ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత నిగూఢంగా ఉన్నది. అది అంతకంతకు పెరుగుతున్నది. ఈ వ్యతిరేకత ఎక్కడ ఉన్నదో తెలుసుకుని, దానిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రతిపక్ష కూటమి నిర్ణయించుకోవాలి. సి వోటర్ ఇంటర్వ్యూ చేసిన ప్రతీ ఐదుగురిలో ముగ్గురు ప్రభుత్వ పనితీరును (59 శాతం), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనాదక్షతను (63 శాతం) అంగీకరించారు. జనవరి 2023 నాటితో పోల్చితే ఈ ఆమోదనీయత అతి స్వల్పంగా తగ్గింది. సగం మందికి పైగా ఓటర్లు (52 శాతం) ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీకే ప్రాధాన్యమిచ్చారు భారత్ జోడో యాత్ర ఎంతగా విజయవంతమయినప్పటికీ రాహుల్ గాంధీకి ఈ విషయంలో కేవలం 16 శాతం మంది మాత్రమే మద్దతునిచ్చారు. ఈ దృష్ట్యా ప్రస్తుత దశలో ఎన్నికల ప్రధాన నినాదాన్ని మోదీ వర్సెస్ రాహుల్‌గా ప్రతిపక్ష కూటమి రూపొందించడం అవివేకమే అవుతుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ‘కౌన్ బనేగా ప్రధానమంత్రి’ అనే విషయమై ‘ఇండియా’ కూటమి చర్చించడానికి ఇది అనువైన సమయం కానేకాదు.

ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై ప్రతిపక్ష కూటమి తన దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరమున్నది. ఇదొక అత్యావశ్యక పాఠం. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు పట్ల కేవలం 47 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. వీరు గత జనవరిలో 54 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే నరేంద్ర మోదీ కేవలం 2 పాయింట్ల ఆధిక్యతలో మాత్రమే ఉన్నారు. ఇదే విషయంలో ఎనిమిది నెలల క్రితం మన్మోహన్ కంటే మోదీ 15 పాయింట్ల ఆధిక్యతలో ఉండడం గమనార్హం.

‘ఇండియా టుడే’ వెల్లడించిన మరొక వాస్తవం (టీవీ కార్యక్రమంలో ఈ అంశం ప్రస్తావన ఎందుకనోలేదు!) : అదానీ గ్రూపుకు అనుకూలంగా మోదీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందన్న రాహుల్ గాంధీ ఆరోపణతో మూడింట ఒక వంతు మంది ఏకీభవించలేదు. అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ నివేదికలలోని ఆరోపణలను అత్యధికులు విశ్వసిస్తున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు ఈ అంశాలు ‘ఇండియా’ కూటమికి ఒక స్పష్టమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయని మరి చెప్పనవసరం లేదు.

3) లోక్‌సభకు అత్యధిక ప్రతినిధులను పంపించే ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష కూటమికి అనుకూల పరిస్థితులు లేవు. ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడే అవకాశం కూడా కనిపించడం లేదు. 2019 సార్వత్రక ఎన్నికలలో గెలుచుకున్న సీట్ల (62) కంటే 2024లో మరిన్ని సీట్లను బీజేపీ గెలుచుకోనున్నదని ఉభయ సర్వేలు స్పష్టంగా చెప్పాయి. ఈ కీలక రాష్ట్రంలో 2014 నుంచి బీజేపీ ఏ ఎన్నికలలోనూ ఓడిపోలేదన్నది తెలిసిన విషయమే. అత్యధిక ఓట్లు బీజేపీకే లభిస్తాయని కూడా సర్వేలు స్పష్టంగా చెప్పాయి. క్షేత్ర స్థాయిలో సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్ ఏకమైనప్పటికీ బీజేపీకి అవి దీటైన పోటీనివ్వలేవు.


4) కాంగ్రెస్ పనితీరుపైనే ‘ఇండియా’ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. కాంగ్రెస్‌కు 65 నుంచి 75 సీట్లు మాత్రమే లభించగలవని ఉభయ సర్వేలు స్పష్టం చేశాయి. అయితే ‘ఇండియా’ భాగస్వామ్య పక్షాలలో కాంగ్రెస్‌కు మాత్రమే తన బలాన్ని మరింతగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలు స్పష్టంగా చెప్పాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా లేవు. ఈ రాష్ట్రాలలో అన్ని సీట్లలోనూ లేదా అత్యధిక స్థానాలలో కాంగ్రెస్–బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ జరగనున్నది. కాంగ్రెస్ తన పరిస్థితులను ఇతోధికంగా మెరుగుపరచుకుని గణనీయమైన సీట్లను సాధించుకోలేకపోతే బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా ‘ఇండియా’ ఎట్టి పరిస్థితులలోనూ అడ్డుకోలేదని ఉభయ సర్వేలు ఖండితంగా చెప్పాయి. తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం, జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ తమ తమ ప్రాబల్య రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో సీట్లు సాధించుకున్నప్పటికీ ‘ఇండియా’కు పెద్దగా ప్రయోజనముండబోదని మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో కాంగ్రెస్‌కు సీట్ల సంఖ్య స్వల్పంగాను, ఓట్ల వాటా చెప్పుకోదగ్గ స్థాయిలోను పెరగగలదని ఉభయ సర్వేలు చెప్పాయి. ఇందుకు ఉదాహరణగా 2019 ఎన్నికలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌పై బీజేపీ ఆధిక్యత 25 శాతంగా ఉన్నది. రాబోయే సార్వత్రక ఎన్నికలలో ఈ ఆధిక్యత రాజస్థాన్‌లో 8 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 10 శాతానికి తగ్గగలదని సర్వేలు అంచనా వేశాయి. ఏది ఏమైనా ‘ఇండియా’ కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ తప్పనిసరిగా 100కి పైగా (125 అయితే మరీ మంచిది) సీట్లను గెలుచుకోవలసి ఉన్నది. బీజేపీ, దాని నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ముంబైలో సమావేశమవనున్న ‘ఇండియా’ భాగస్వామ్య పక్షాల నాయకులు తమ అంతర్గత సమస్యలను శీఘ్రగతిన పరిష్కరించుకుని, తమ సమైక్యతను పటిష్ఠం చేసుకోవల్సిన అవసరమున్నది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2023-09-01T03:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising