ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సమీక్ష’ సరైనదేనా?

ABN, First Publish Date - 2023-02-01T00:30:14+05:30

సింధునదీజలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ పాకిస్థాన్‌కు భారతదేశం ఇటీవల నోటీసు ఇచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింధునదీజలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ పాకిస్థాన్‌కు భారతదేశం ఇటీవల నోటీసు ఇచ్చింది. ఈ ఒప్పందానికి కట్టుబడి, భారతదేశం ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నప్పటికీ, పాకిస్థాన్‌ ఏకపక్షంగా, మొండిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నందువల్లనే నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని భారతదేశం అంటున్నది. భారతదేశం నోటీసు జారీచేసినందువల్ల మూడునెలల్లోగా ఉభయదేశాలూ చర్చలకు కూచోవాల్సి ఉంటుంది. గత ఆరుదశాబ్దాలకాలంలో అనుభవంలోకి వచ్చిన పాఠాలతో ఈ ఒప్పందాన్ని లోతుగా సమీక్షిస్తామని భారతదేశం ప్రకటించింది. సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) నిబంధనలకు లోబడి కిషన్‌గంగా, రాటిల్‌ ప్రాజెక్టులపై ఆర్బిట్రేషన్‌ కోర్టు విచారణ జరుపుతున్న తరుణంలో, ఇప్పుడు భారతదేశం ఏకంగా ఒప్పందాన్నే సవరించాలనడం కోర్టు దృష్టిని మళ్ళించడానికేనని పాకిస్థాన్‌ విమర్శిస్తున్నది. రెండు దేశాల ఒప్పందాలన్నీ గాలికి కొట్టుకుపోతున్న తరుణంలో, ఆరు దశాబ్దాలుగా కచ్చితంగా అమలవుతున్న ఈ ఏకైక ఒప్పందాన్ని వివాదంలోకి లాగడం సరికాదని నీటి నిపుణుల సలహా.

జమ్ముకశ్మీర్‌లో ఝీలమ్‌ నదిమీద 330మెగావాట్ల కిషన్‌గంగ, చీనాబ్‌ నదిమీద 880మెగావాట్ల రాటల్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టుల విషయంలో పాకిస్థాన్‌ దశాబ్దంన్నరగా రచ్చచేస్తున్నది. ఈ ప్రాజెక్టులు భారత్‌ స్వేచ్ఛగా ఉపయోగించుకోగలిగే జలాల పరిధిలోనే ఉన్నాయని భారత్‌ వాదన. కానీ, శాశ్వత ఇండస్‌ కమిషన్‌ నిపుణుల మధ్యవర్తిత్వంతో వ్యవహారం ద్వైపాక్షికంగా తేల్చుకోవడానికి ఇష్టపడని పాకిస్థాన్‌ తటస్థ నిపుణుల పర్యవేక్షణలో నిజానిజాలు నిర్థారించాలని మొదట డిమాండ్‌ చేసింది. ఆ తరువాత, మధ్యవర్తిత్వ న్యాయస్థానం కావాలన్నది. భారత్‌ దీనిని వ్యతిరేకించడంతో ఈ ఒప్పందానికి సంధానకర్త అయిన ప్రపంచబ్యాంకు తటస్థ నిపుణుడిని నియమించింది. కానీ, పాకిస్థాన్‌ హేగ్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టులోనే విషయం తేల్చాలన్నది. ఒప్పందంలో ఉన్న ఒక్కో దశ వివాదపరిష్కార మార్గాన్ని అనుసరించకుండా ఏకంగా హేగ్‌ కోర్టుకు పోవడం సరికాదంటూ ఈ ప్రక్రియను నిలువరించడంలో భారతదేశం గతంలో విజయవంతమైంది. కానీ, పాకిస్థాన్‌ ఒత్తిడితో చివరకు ప్రపంచబ్యాంకు తటస్థనిపుణుడికీ, హేగ్‌ కోర్టులో వాదనలకూ సై అన్నది. తటస్థనిపుణుడి ప్రక్రియకు సహకరించిన భారతదేశం గత శుక్రవారం నుంచి విచారణ ఆరంభించిన హేగ్‌ కోర్టు గడపమాత్రం తొక్కలేదు. ఒప్పందం ప్రకారం తనకు దక్కాల్సిన నీటిని ఈ రెండు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాయన్న పాకిస్థాన్‌ ఆరోపణకు తగిన ఆధారాలు లేవని భారతదేశం అంటున్నది. పైగా పాక్‌ ఒత్తిడికి లొంగి ప్రపంచబ్యాంకు ఒకే అంశంపై రెండు సమాంతర ప్రక్రియలు ఆరంభించడం వల్ల తీర్పులు భిన్నంగా వచ్చే అవకాశం ఉన్నదనీ, సయోధ్యకు అన్నిమార్గాలూ మూసుకుపోయిన స్థితిలో, ఒప్పందాన్ని తిరగరాసుకోవడం తప్ప గత్యంతరం లేదని భారతదేశం వాదన.

సింధు సహా ఈ రెండు నదుల నీటిమీద పాకిస్థాన్‌కు సర్వహక్కులూ ఉన్నప్పటికీ, తాగునీటికి తప్ప మరే అవసరాలకు వీటి జలాలను వినియోగించుకోకుండా భారత్‌కు పరిమితులునప్పటికీ, హేగ్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కిషన్‌గంగ ప్రాజెక్టు ఏర్పడింది. తొమ్మిదేళ్ళ సుదీర్ఘచర్చలు పునాదిగా, 1960లో నెహ్రూ–అయూబ్‌ఖాన్‌ సంతకాలు చేసిన ఈ ఒప్పందంలో పటిష్టమైన నిబంధనలు, పలుదశల వివాద పరిష్కారమార్గాలు ఉన్నందునే అది చిరకాలం నిలువగలిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలా నదీజలాల పంపకాలకు ఇది ఒక ఆదర్శ నమూనాగా ఉపకరించింది. ఉభయదేశాల మధ్యా ఎన్ని పొరపొచ్చాలు వచ్చినా, చివరకు యుద్ధాలు జరిగినా, అది నిలబడింది. ఈ నేపథ్యంలో, కేవలం ఓ రెండు ప్రాజెక్టులకు సంబంధించి తలెత్తిన విభేదాన్ని పదహారేళ్ళుగా పరిష్కరించుకోలేని భారత్‌–పాకిస్థాన్‌లు చక్కగా చర్చించి, ఉభయులకూ అంగీకారయోగ్యంగా ఒప్పందాన్ని తిరగరాసుకోవడం సాధ్యమయ్యేపనేనా అన్నది నిపుణుల ప్రశ్న. ప్రస్తుతం పాకిస్థాన్‌తో ఏమాత్రం సయోధ్యలేని వాతావరణం ఉన్నస్థితిలో, దానిని చర్చలకు రప్పించి, ఒప్పందాన్ని పునఃస్సమీక్షించేందుకు ఒప్పించి, భారతదేశం సానుకూల ప్రయోజనాలు సాధించగలదా అన్నది అనుమానం. నోటీసులు ఇవ్వడం వెనుక పాకిస్థాన్‌ మెడలువంచాలన్న ఆలోచన ఉండవచ్చును కానీ, ఆరుదశాబ్దాల ఒప్పందాన్ని సమీక్షించడమన్న ప్రతిపాదన భారత్‌ ప్రయోజనాలను అంతిమంగా పరిరక్షిస్తుందా అన్నది ప్రధానం.

Updated Date - 2023-02-01T00:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising