ఈ అధికార వ్యసనానికి విరుగుడు లేదా?
ABN, First Publish Date - 2023-09-01T03:24:07+05:30
పదేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణలో మనకు తెలియకుండానే జరిగిపోతున్న ఒక ప్రమాదకరమైన పరిణామాన్ని ఎవరూ గుర్తించడం లేదు, గుర్తించినా నోరుమెదపడం లేదు...
పదేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణలో మనకు తెలియకుండానే జరిగిపోతున్న ఒక ప్రమాదకరమైన పరిణామాన్ని ఎవరూ గుర్తించడం లేదు, గుర్తించినా నోరుమెదపడం లేదు. అధికార పొందికను ‘యథాతథ స్థితి’ ఆవరించింది. మూడోసారి అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. యుద్ధమే జరగాల్సిన చోట సర్దుబాటు కోసం గుంజాటనపడుతున్న స్థితి కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌లోని చతురత అత్యంత ప్రమాదకరమైంది. మన తెలియకుండానే మన వెన్నెముకకు మత్తు ఇచ్చి చప్పట్లు కొట్టించుకోగల దిట్ట కేసీఆర్. దళితుడికి ముఖ్యమంత్రి పదవి వాగ్దానం సంగతి దేవుడెరుగు. మూడెకరాల భూమి ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? అని ఎవరూ ప్రశ్నించలేదు. పోనీ కనీసం లోతుగా చర్చించనూ లేదు. భూమి ఉపాధి వనరు మాత్రమే కాదు. వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకమైంది, మన ఉనికికి చిరునామా భూమి. సామాజిక స్థానాన్ని నిర్ణయించగల శక్తి ఉన్న వనరు. సామాజిక చలన స్వభావాన్ని ప్రభావితం చేయగలదు. అందుకే చరిత్ర నిండా భూమే ఆవరించి ఉంటుంది. దాని చుట్టూ జరిగిన పోరాటాల చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది.
కేసీఆర్ పదేళ్ల పాలనను నిశితంగా పరిశీలిస్తే తెలిసేదేమిటి? బడాయి మాటల వెనుక దాగిన ప్రమాద స్థాయిని అంచనా వేయగల పరికరమేదైనా మనవద్ద ఉందా? ‘సంక్షేమం’ పేరిట ఊదరగొడుతున్న పథకాల అసలు సారమేంటి? ఎవరికి సంక్షేమం? ఎవరికి అధికారం? ఈ ప్రశ్నలు వేసుకుంటే... పొరలుపొరలుగా తెలంగాణ సమాజాన్ని ఆవరిస్తున్న ప్రమాదం ఖరీదు ఏపాటిదో అర్థమవుతుంది.
ఉద్యమ సారథ్యమంతా మటుమాయమైంది. ‘ఊక’ మొత్తం అధికారంలో భాగమైంది. ‘మూకల’ ప్రాబల్యం పెరిగిపోయింది. రూకలుగలవారంతా అమాత్యులయ్యారు. మూడెకరాల భూమి, కేజీ టు పీజీ విద్య లాంటి రాష్ట్ర ఆవిర్భావం సమయంలో చేసిన వాగ్దానాలు నీటి మూటలయ్యాయి. కానీ, ఆ తర్వాత వచ్చి చేరిన రైతుబంధు, ఉచిత విద్యుత్ లాంటివి అధికార సాధనలో తిరుగులేని ఆయుధాలయ్యాయి. రైతుబంధు అందుతున్నదెవరికి? ఉచిత విద్యుత్ వల్ల ఏ వర్గాలకు ఎక్కువ మేలు జరుగుతోంది? కేజీ టు పీజీ విద్య అందివుంటే ఏ వర్గాలు బాగుపడేవి అనే ప్రశ్నలే ఉత్పన్నం కాలేదు. అవే ఎన్నికలు, వారే అభ్యర్థులు, అదే వాగ్దానశూరత్వం, అవే జనరంజక ఉపన్యాసాలు. మందుతో మాయపుచ్చే సభలూ, జన సందోహాలు ముందు కలలు ఏకరువు పెట్టే నేతలు.
పథకం ప్రకారం ‘ఒక అధికార పొందిక’ను నిరవధికంగా కొనసాగించే పనిలో ఉన్నారు కేసీఆర్. ప్రశ్నించగల నేతనూ, నిటారుగా నిలబడే నాయకుణ్ని, నిపుణత ప్రదర్శించగల వ్యక్తిత్వాన్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆదరించడం లేదు. ‘అధికారాన్ని’ అలవాటుగా మార్చే క్రమంలో కేసీఆర్ చేస్తున్న యజ్ఞంలో ‘స్వేచ్ఛ’ సమిధ అయిపోతోందన్న ‘ఎరుక’ను కూడా కేసీఆర్ విజయవంతంగా రద్దు చేశారు. గతం కోసం జ్ఞాపకం చేసే పోరాటాన్ని మనకు తెలియకుండానే నిషేధించారు.
‘అధికారం’ అలవాటుగా మారడం అత్యంత ప్రమాదకరమైన పరిణామం. ‘సమ్మతిని సృష్టించి’ దాని ద్వారా ఏర్పడిన సానుకూల వాతావరణంలో ‘అధికారాన్ని’ ఓటు రూపంలో పొందడంలో కనీసం ఐచ్ఛికం కాకపోయినా, ఏదో ఒక ఒప్పుకోలు ఉంటుంది. కానీ, కేసీఆర్ గడచిన పదేళ్లుగా తెలంగాణ ప్రజానీకానికి అర్థంకాకుండా అధికారాన్ని ‘అలవాటు’ చేస్తున్నారు. అట్లా అలవాటు చేసే క్రమంలో ‘అధికార ప్రాయోజిత బృందాల’ను ఏర్పాటు చేస్తున్నారు. అవి మనకు బయటకు కేసీఆర్ అభిమాన ప్రాయోజిత బృందాలుగా కనపడి భ్రమింపచేయవచ్చు కానీ, అంతిమంగా అవి చేస్తున్నది ‘Advertising of Totalitarianism’ అని గుర్తించాలి. ఆశావహుల పేరిట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆర్భాటాలు చేస్తున్నవారంతా ఈ కోవలోకే వస్తారు.
ప్రశ్నించవీలులేని వాతావరణం మనకు తెలియకుండానే అలవాటుగా మారుతున్న వైనాన్ని నిశిత దృష్టిగలవారు ఎరుక చేసుకోవాలి. బతుకమ్మలు, బోనాలు, నిమజ్జనోత్సవాల్లో ఈ తరహా Sponsor Groups మూలాలు... ఆయా సందర్భాల్లో మనకు కనిపించే రంగుల ఫ్లెక్సీల్లో దర్శనమిస్తాయి. కులవృత్తుల ప్రోత్సాహం పేరిట, దళిత బహుజనోద్ధరణ పేరిట జరుగుతున్న సంక్షేమ యాగంలో ‘అధికార పొందిక’కు తాము దూరమవుతున్నామన్న స్పృహ మూలవాసుల్లో లేకుండా పోతోంది. ‘రైతుబంధు, దళిత బంధు, బీసీబంధు, గిరిజన బంధు’ పథకాల వెన్నంటి అట్టడుగు వర్గాలకు అధికారాన్ని దూరం చేసే బృహత్ ప్రయత్నమొకటి నిరాటంకంగా సాగుతోంది. బడుగు జీవులకు ‘ఏలిక’ ప్రసాదించిందే ప్రాప్తం. ప్రజాస్వామ్యయుతమైన పాలన క్రమంగా వితరణ క్రతువుగా మారుతోందన్న జాగరూకత లేకుండా పోవడమే మహా విషాదం. సాలభంజికల మంత్రివర్గాన్నీ, చప్పట్లు చరిచే జనసమూహాల్నీ, బారులు తీరి ఓట్లు వేసే బడుగు జీవులను తయారు చేసుకున్న తర్వాత ప్రశ్న తానంతటదే రద్దవుతుంది. స్వేచ్ఛ అంతర్ధానమవుతుంది. చైతన్యపూరితమైన ఆందోళనల్లో, ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమబావుటాల్లో పురుడుపోసుకున్న ‘తిరుగుబాటు తత్వం’ క్రమంగా కనుమరుగవుతుంది.
అధికారం అలవాటుగా మారే క్రమం చాలా నిర్దయగా ఉంటుంది. అచేతనత్వం మన స్వభావంలో ఇమిడిపోతుంది. అనస్తీషియా స్థితిలో అంగీకారపత్రం రాసినట్టూ, యథాలాపంగా బడ్డీకొట్టుకెళ్లి సరుకులు కొన్నట్టూ ఓటు కూడా అలవాటుగా చేసే దినచర్యలా మారుతుంది.
‘ప్రశ్న’, ‘స్వేచ్ఛ’ లాంటి మాటలు వినబడే స్థలాలను పాలకులు దుర్భిణీలు పెట్టి వెతుకుతారు. నిఘా డ్రోన్లను పురమాయిస్తారు. ‘ఏకఛత్రాధిపతికి నమోవాకములు’ చెల్లించని చోటును గాలించి మరీ చదును చేస్తారు. ఆత్మహననానికి పురస్కారాలు ప్రకటిస్తారు. ‘ఎదురు నిలిచిన గతాన్ని’ గుర్తు చేసే సంకేత స్థలాలను వేలంపాటలో విక్రయిస్తారు. అందమైన స్మృతి వనాలను, పచ్చదనంతో ఆకర్షించే స్మశానాలను నిర్మిస్తారు. సామాన్యుడి వెతలు వినాల్సిన సచివాలయం శ్వేతసౌధంగా మారి జనాన్ని వెక్కిరిస్తుంది. ఆశల రెక్కలు విరిచి కట్టి, కలల లోకానికి కంచెలు నాటిన తర్వాత రెండు పడకలగది ఇల్లంటే అది ఇంద్రభవనంతో సమానమవుతుంది. విధి తప్ప గతిలేని కాలంలో వృద్ధాప్య ఫించనే ఆదరువు అవుతుంది. నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ నిరుపేదల పాలిట గగన కుసుమంగా మారుతుంది. దాతృత్వం పాలనా స్వభావంగా మారిన తర్వాత విదిలింపుల కోసం పడిగాపులు కాయడం పరిపాటి అవుతుంది. సామాన్యుల మేలు కోరే సమూహాలు ఒక్కొక్కటిగా అంతరించిపోతాయి. పీడితజనం కోసం పుట్టిన పార్టీలు కూడా అధికారపు దాహర్తిలో బేరాల కోసం బేల చూపులు చూస్తాయి.
తెలంగాణలో జరుగుతున్నది ఇదే! చైతన్యం వెల్లివిరిసిన నేలపై పాలకులకు గులాము చేయాల్సిరావడం ఆత్మహత్యాసదృశం కాదా? అచేతనంగా అయినా సరే... అధికారం ముందు సాగిలబడటం నేరం కాదా? అధికార క్రీడగా మారిన ఎన్నికల్లో సామాన్యుడి స్వరం వినిపించాలని భావించడం అమాయకత్వమే అవుతుంది. బధిరమైపోయిన పాలన ముందు నినాదం ఎవరికీ పట్టని గావుకేక అవుతుంది. ఆక్రందన వినకూడదని భీష్మించుకున్న ప్రభువుకు అంత్యక్రియలు కూడా విధిరాతలే అవుతాయి.
అధికారాన్ని వ్యసనంగా చేసుకున్న పాలకుల రాజకీయాల్లో పాలితులుగా మనం కూడా అదే అధికారాన్ని అలవాటుగా మార్చుకుంటున్నామా? మనుగడను ప్రశ్నార్థకంగా మార్చుతున్న వర్తమానంలో నిశ్చేష్టులమవుతున్నామా? తస్మాత్ జాగ్రత్త!
భార్గవ్ కేశరాజు (జర్నలిస్ట్)
Updated Date - 2023-09-01T03:24:07+05:30 IST