ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉపకులం వేరైనందుకే ఇంత ఉక్రోషమా?

ABN, First Publish Date - 2023-10-17T01:34:47+05:30

ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో ఈ ‘‘‘అందరి వాడు’ అంబేడ్కరైట్ ఎలా అవుతాడు?’’ శీర్షికన ప్రజాయుద్ధనౌక గద్దర్‌పై కృపాకర్ మాదిగ రాసిన వ్యాసం (సెప్టెంబర్‌ 13) చదివిన తర్వాత ఆవేదనతో ఇలా...

ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో ఈ ‘‘‘అందరి వాడు’ అంబేడ్కరైట్ ఎలా అవుతాడు?’’ శీర్షికన ప్రజాయుద్ధనౌక గద్దర్‌పై కృపాకర్ మాదిగ రాసిన వ్యాసం (సెప్టెంబర్‌ 13) చదివిన తర్వాత ఆవేదనతో ఇలా స్పందించాలనిపించింది. ఈ భూమిపై ఉద్భవించిన సమస్త జీవకోటి కాలానుగుణంగా మరణించక తప్పదు. ఎంతో శాస్త్ర సాంకేతికను అభివృద్ధి చేసిన మానవుడు సైతం చావును తప్పించుకోలేడు. మరణానికి కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ, లింగ భేదాలు ఉండవు. యుద్ధాల్లో కూడా మరణించిన వ్యక్తులపై ద్వేషం చిమ్మిన సందర్భాలు మనకు చరిత్రలో కనపడవు.

రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల గద్దర్ సమన్యాయం పాటించలేదనే నెపం మోపుతూ కృపాకర్ వ్యాసం మొత్తం కొనసాగింది. మాల ద్వేషం, ఈర్ష్య, చంచల స్వభావం వ్యాసంలో కొట్టొచ్చినట్లు కనబడింది. మొదటిపేరాలో గద్దర్‌ను సాంస్కృతిక రంగంలో గొప్పవారి సరసన చేర్చుతూనే, రెండవ పేరా నుండి ద్వేషపూరిత దాడి సాగింది. మాల కులస్తుడైన గద్దర్ వర్గీకరణ అంశంలో మందకృష్ణ, వంగపల్లితో కలసి నడిచిన విషయం, ప్రతిఫలంగా మాల కులం నుండి వెలివేతకు గురైన విషయం కృపాకర్‌కు తెలియదనుకోవడం లేదు. ఎందుకంటే ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుల్లో కృపాకర్ ఒకడు.

వర్గీకరణ విషయంలో సమధర్మం పాటించడానికి గద్దర్‌ వడ్డించే స్థానంలో లేడనే విషయం కూడా కృపాకర్‌కు తెలుసు. ఇతరులు రాసిన పాటలు గద్దర్‌ తన ఖాతాలో వేసుకున్నాడన్నాడన్నది సరికాదు. గద్దర్ పాడడం వల్లనే ఆ పాటలకు గుర్తింపు వచ్చింది. ఎర్రజెండా గద్దర్‌కు ఉతకర్రయ్యింది అనడం కన్నా ఊపిరిగా చేసుకున్నాడనేది నిజం. పీపుల్స్‌వార్‌లో గద్దర్‌కే ఎక్కువ కీర్తి రావడంలో, కోట్లాది మంది హృదయలలో చోటు సంపాదించుకోవడంలో ఆయన అంకితభావం, శ్రమ లేదనుకోవడం ఓర్వలేనితనమే. గద్దర్, తాను పీపుల్స్‌వార్ పార్టీలో లేనంటే అతని కీర్తి పోతుందనేది ఒక అపోహ. అండర్‌గ్రౌండ్‌లో పనిచేసే పార్టీలు, వ్యక్తులు ఎలా మెసలుకోవాలో కృపాకర్‌కు తెలియకపోదు. గద్దర్ మరణంతో మావోయిస్టు పార్టీ ఒక మాజీ సహచరుణ్ణి కోల్పోయామన్నది కానీ, ఒక విప్లవ ద్రోహి మరణించాడని అనలేదు. విప్లవ సిద్ధాంతాన్ని గద్దర్‌ తన వ్యక్తిగత ఇమేజ్ కోసం వాడుకున్న సందర్భం లేదు. ఎర్రజెండాను, బులుగు జెండాలను అనేకమంది ఎత్తుకుంటారు వదిలేస్తారు. గద్దర్ ఎర్రజెండాను వదిలేసాడా లేక ఎర్రజెండా బహిష్కరించిందా అనేది కాదు ఇక్కడ, మాలవాడికి మరణంలో అంతటి జనాదరణ చూసి ఓర్వలేకనే కృపాకర్ మాదిగ ఆక్రోశమంతా. గద్దర్‌ను చంపివేయాలని రాజ్యం బుల్లెట్ల వర్షం కురిపిస్తే, ఒక బుల్లెట్టును శరీరంలో దాచుకొని బతికి, మరణానంతరం అదే రాజ్యం, అవే బుల్లెట్లు గాలిలోకి పేల్చి మోకరిల్లిన అరుదైన సన్నివేశం కేవలం గద్దర్ జీవితంలోనే చూడగలం. అందుకే మాదిగలకు ఇంత ఈర్ష్య.

గద్దర్‌–పీపుల్స్‌వార్ పరస్పరం ఆరోపణలు చేసుకోనపుడు ఎవరికెందుకు క్షమాపణలు చెప్పాలి? ఎర్రజెండా, బులుగు జెండాలలో దేనిలోనూ లేడని అన్నప్పుడు ఆయన గుడులకో మరెక్కడికో తిరిగితే మీకేం నొప్పి? జై బహుజన అంటూనే గుళ్ళు తిరిగే మాదిగ నేతలు మీకు కనపడరు. అతివాద, వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిన చాలామంది రాజ్యహింస నుండి రక్షణ కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో చేరిన విషయం కాదనలేని సత్యం. ఎందరో ఎనలేని సంపద కూడా పోగేసుకున్నారు. కానీ గద్దర్ అలా కాదు. ఉద్యమం పేరుతో చిల్లిగవ్వ కూడా కూడబెట్టుకోలేదని విషయం దగ్గరగా చూసినవారికి తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఆయన అందరికంటే ముందువరసలో ఉన్నాడు. హన్మకొండలో 1997లో తెలంగాణ జనసభ నిర్వహించిన సభలోనూ ముందే ఉన్నాడు, తర్వాతనే తెలంగాణ కోసం అనేక సంఘాలు, పార్టీలు పుట్టుకొచ్చినాయి. గద్దర్ సంస్మరణ సభలపై కూడా ఈర్ష్యేనా? మాలలు అధిక సంఖ్యలో ఉంటే తప్పా, ఇదెక్కడి వాదన? వర్గీకరణను స్వాగతించిన మాలలున్నారు, వ్యతిరేకించిన మాదిగలు కూడా ఉన్నారనే విషయపరిజ్ఞానం లేని అవివేకుడనుకోవాలా కృపాకర్‌ను?


గద్దర్‌పైనే కాదు, తెలంగాణ యువకవి, గాయకుడు వేద సాయిచంద్ విషయంలోనూ మాదిగలు రాసిన వ్యాసాలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చూసి మరణంలో కూడా మాదిగలు మాలలపై ఎంత ద్వేషపూరితంగా ఉంటారనేది సమాజమంతా గమనించింది. సాయిచంద్‌ది వామపక్ష ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం. తన గానంతో తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిమందిని ఉర్రూతలూగించాడు. రాష్ట్రం ఏర్పాటైన తదుపరి కేసీఆర్ అనేకమంది ఉద్యమకారులకు ప్రభుత్వంలో స్థానం కల్పించాడు. ఎనిమిదేళ్ళ తరవాతే సాయిచంద్‌ను గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అలా నామినేట్ చేసిన 50 మందిలో ఆయనొకరు. అది ఉద్యమ సమయంలో సాయిచంద్‌ కృషికి ప్రతిఫలమే. 39 ఏళ్ళ వయసులోనే సాయిచంద్ అకాలమరణం చెందడం తెలుగువారినందరినీ కలచివేసింది. రెండు రాష్ట్రాల్లోని పార్టీలు, సంస్థలు, సంఘాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. కానీ మాదిగ శ్రేణులు మాత్రం సాయిచంద్, గద్దర్ అకాలమరణ సందర్భంలోనూ ఇద్దరిపైనా విద్వేషపూరితంతో రాసిన వ్యాసాలు, ట్రోల్స్ చేశాయి. గద్దర్ తన పాటలతో అనేకమందిని అడవులకు పంపి తన పిల్లలను మాత్రం అమెరికా పంపినాడని ట్రోల్‌ చేశారు. సాయిచంద్ దొరలబానిస అని, గడీల కావలికాడు అని, అక్షరాలు అమ్ముకుని పదవి పొందాడని, బహుజన సమాజానికి ఉపకరించనివాడంటూ వ్యాసాలు రాశారు, ట్రోల్స్ చేశారు.

కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ పొంది, రెండు పర్యాయాలు ఎస్సీ కార్పొరేషన్ పదవి అనుభవించి, గడువు ముగియగానే మరో పార్టీలోకి జంప్ అయిన తమవాడి గురించి మాదిగలు మాట్లాడరు. కులానికి మూలమైన హిందూమత పునాదిగా నడుస్తున్న బీజేపీ అగ్రనేతకు లక్షలాదిమంది ప్రజలముందు కాళ్లుమొక్కి మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి, కర్ణాటక ఎన్నికల్లో బహిరంగంగా మద్దతు తెలిపిన తమ నాయకుడి అనైతిక కార్యకలాపాలు వీరికి కనబడవు. గ్రేహౌండ్స్ అధికారిగా తెలంగాణలో కోవర్టు ఆపరేషన్లతో బూటకపు ఎన్‌కౌంటర్లు చేసి మావోయిస్టు అగ్రనేతలను మట్టుపెట్టినాడని పౌరహక్కుల సంఘాలు గగ్గోలుపెట్టిన ఓ మాజీ పోలీసు అధికారి, ఎనిమిదేళ్లు కేసీఆర్ సేవలో తరించడం మాదిగలకు పట్టదు. ఆ మాజీ పోలీసు అధికారితో వేదికలు పంచుకొంటూ, చీకటి కౌగిలింతలతో పరవశం పొందే విరసం మేధావి కూడా వీరి కళ్లకు కనపడడు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర పేరుతో ప్రజాసంఘాలను మట్టుపెట్టిండు అని కాలికి గజ్జెకట్టుకొని పాటలు పాడి ఊరూరా ప్రచారం చేసి, చివరకు కాసులకు కక్కుర్తిపడి వైస్ షర్మిల పంచన చేరి, ఇటీవలే పదవుల కోసం మళ్ళీ పార్టీ మార్చిన ఓ పాటగాడిని వీరేమీ అనరు. ఉస్మానియా దరువు ఒకటి కాషాయ పార్టీ కండువా కప్పుకున్నా వీరికి పట్టదు. ఎందుకంటే వీరంతా తమ వర్గంవారు కాబట్టి. బిళ్ల బంట్రోత్ డ్రెస్సు వేసుకొని అట్టకిరీటాలు ధరించి థర్మాకోల్ గద పట్టుకొని పాత షిఫాన్ చీర నెత్తికి చుట్టుకొని రాష్ట్రమంతా తిరుగుతూ, లేని రాజ్యాన్ని పాలించిన రాజులు మా పూర్వీకులనీ, మేము మహారాజులమని బీరాలు పలికే వ్యక్తి కూడా సాయిచంద్ మరణంపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మాదిగ నాయకులూ, మేధావులు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కేంద్రప్రభుత్వం వర్గీకరణకు కంకణం కట్టుకుంటే ఆపే శక్తి ఎవరికీ లేదనే విషయం గ్రహించనంత అవివేకులా వీరు? ఇలా ఒక కులం వ్యక్తుల మరణంపై విద్వేషం చిమ్ముతూ తమ కుల ఉద్యమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నించడం పైశాచికానందమే. ‘కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని నిర్మించలేరు’ అన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలు ఇక్కడ ఉటంకించవలసిన సందర్భమే!

మామిడి నారాయణ

Updated Date - 2023-10-17T01:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising