ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇథనాల్ విషానికి ఖాకీ క్రౌర్యం తోడైంది!

ABN, First Publish Date - 2023-10-31T03:13:31+05:30

మానవ హక్కుల వేదిక పేరుగల మా స్వచ్ఛంద సంస్థ గత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల రక్షణ దిశగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది...

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసాయి సౌందర్ రాజన్ గారికి,

మానవ హక్కుల వేదిక పేరుగల మా స్వచ్ఛంద సంస్థ గత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల రక్షణ దిశగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట్ జిల్లా, మరికల్ మండలంలోని నాలుగు గ్రామాలైన ఎక్లాస్‌పూర్, చిత్తనూరు, జిన్నారం, కన్మనూరు గ్రామాలకు చెందిన ప్రజల హక్కులకు ఇప్పుడు తీవ్ర భంగం వాటిల్లిన సందర్భంలో వాటి రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ హోదాలో, రాజ్యాంగ పరిరక్షకురాలిగా మీ జోక్యాన్ని అర్థిస్తూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం.

నారాయణపేట జిల్లా, మరికల్ మండలం, చిత్తనూర్ గ్రామంలో జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనే సంస్థ ఇథనాల్ అనే రసాయనిక పదార్థాన్ని ఉత్పత్తి చేసే కార్మాగారాన్ని నెలకొలిపింది. ఈ కంపెనీ స్థాపన పారదర్శకంగా జరగలేదు. దీనికై ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. ఈ కర్మాగారానికి సంబంధించి వ్యర్థ పదార్థాల నిర్వహణ, జల వాయు కాలుష్యం తదితర అంశాలను చర్చకు పెట్టకుండానే, నివారణ చర్యలు, జాగ్రత్తల వంటి అంశాలను వివరించకుండానే, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అవినీతి పద్ధతిలో ఈ సంస్థ అనుమతులను తెచ్చుకుంది. ప్రజలు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పకుండా ప్రజలను బెదిరించి వాళ్ళ నోరు మూయించే నిర్బంధ పద్ధతులు చేపట్టడంతో గత ఎనిమిది నెలలుగా దాదాపు తొమ్మిది ప్రభావిత గ్రామాల రైతులు, ప్రజలు ప్రజాస్వామిక పద్ధతిలో ధర్నాలు, ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. అన్ని అంశాలపై సంబంధిత ప్రభుత్వ శాఖలు ప్రజలతో చర్చలు జరపాలని, అప్పటివరకూ ఫ్యాక్టరీలో ఇథనాల్ ఉత్పత్తిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయిదు గ్రామాల ప్రతినిధులు చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ వ్యతిరేక కమిటీగా ఏర్పడి ప్రజాస్వామికంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీ గేటు ముందు నిరసన ప్రదర్శనలతోపాటు హైదరాబాద్ నగరంతో సహా పలు జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించారు. గత నెలలో 54 గ్రామాల గుండా 11 రోజులపాటు పాదయాత్రలు చేశారు.

ఈ నెల 22వ తేదీన వ్యర్థాలను తరలిస్తున్న కంపెనీ లారీని ఎక్లాస్‌పూర్ గేటు వద్ద ప్రజలు ఆపివేసి అందులో ఏముందో చూపెట్టాలని డిమాండ్ చేస్తూ లారీ ముందు కూర్చున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మరికల్ డీఎస్పీ పెద్ద ఎత్తున పోలీసు బలగంతో వచ్చాడు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో, ప్రజలతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేసే ప్రయత్నం ఏమీ చేయకుండా ధర్నా చేస్తున్న ప్రజలపై లాఠీచార్జి చేయమని పోలీసులను ఆదేశించాడు. పోలీసులు విచక్షణారహితంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు అని చూడకుండా అందరినీ లాఠీలతో కొట్టారు. దాదాపు వందమందికి పైగా గాయాలయ్యాయి. దీనికి స్పందనగా ప్రజలు ఆగ్రహంతో కంపెనీ లారీని తగులబెట్టే ప్రయత్నం చేసారు. లారీ పక్కనే ఉన్న పోలీసు వాహనానికి కూడా నిప్పంటుకుంది. కోపగించుకున్న పోలీసులు ఇంకా తీవ్రంగా ప్రజలపై విరుచుకు పడి లాఠీచార్జి చేసారు. కనిపించినవారందరినీ అదుపులోకి తీసుకొని మరికల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ రాత్రి మరికల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు ఎక్లాస్‌పూర్, చిత్తనూర్, జిన్నారం, కన్మనూర్, లంకల గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల ఇండ్లపై దాడి చేసి, తలుపులు పగులగొట్టి, మహిళలను, వృద్ధులను విపరీతంగా కొట్టారు. పోలీసులు వస్తున్న వార్త తెలిసి యువ రైతులు, పురుషులు గ్రామాలను విడిచి పారిపోయారు. అదుపులోకి తీసుకున్నవారిని ఎక్కడ ఉంచిందీ పోలీసులు తెలుపలేదు. రెండవ రోజు (మంగళవారం) కొందరిని మెజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టారు. ఇప్పుడు 35 మంది జ్యుడీషియల్ రిమాండులో జైలులో ఉన్నారు. ఇంకా చాలామంది వేరు వేరు గ్రామాలకు పారిపోయారు. వారం రోజుల తర్వాత కూడా కొందరి ఆచూకీ దొరకలేదు. అక్టోబరు 29వ తేదీన ఇరవై రెండు మంది యువకులను పోలీసులు ఎక్లాస్‌పూర్ గ్రామం నుంచి తీసుకు వెళ్ళారని తెలిసింది. గ్రామాలలో ప్రజలు భయంతో ఉన్నారు. పోలీసు జీపులు రాగానే ప్రజలు ఇంకా భయంతో గ్రామాల పొలిమేరలకు పారిపోతున్నారు.


పోలీసులు అరెస్టు చేసిన నాయకులను పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని మా సంస్థకు సమాచారం లభించింది. ఇంతకాలం ప్రజలను సమీకరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన బాధ్యులను ఎంచుకొని పోలీసులు చిత్రహింసలకు గురిచేసినట్టు వాళ్ళ బంధువులు మా సంస్థకు చెలిపారు. చిత్తనూరు గ్రామానికి చెందిన భండారు లక్ష్మయ్యను (కళాశాల అధ్యాపకుడు – ఒ.పి.డి.ఆర్ సంస్థ సభ్యుడు) పోలీసులు కసితో, విపరీతంగా కొట్టారని ఆయన భార్య మాకు తెలిపింది.

పరిస్థితి ఇట్లా ఉంటే జిల్లా అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోవడం లేదు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులను అదుపు చేసే ప్రయత్నాలేవీ పోలీసు శాఖ ఉన్నతాధికారులు చేపట్టడం లేదు. ప్రజలు వెళ్ళి జిల్లా అధికారులను కలిసే ప్రయత్నం చేస్తే ఎన్నికల పనుల్లో ఉన్నామని సమాధానం చెబుతున్నారు. గ్రామాల్లోని ప్రజల జీవించే హక్కుకే భంగం ఏర్పడింది.

ఇటువంటి పరిస్థితిలో, రాష్ట్ర గవర్నర్‌గా, రాజ్యాంగ పరిరక్షకురాలుగా మీరు వెంటనే జోక్యం చేసుకొని చిత్తనూర్‌, ఎక్లాస్‌పూర్, జిన్నారం, కన్ననూర్ గ్రామాల ప్రజలకు భద్రత కల్పించే దిశగా ఆదేశాలు జారీ చేయాలని మా సంస్థ వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తుంది.

తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కె. బాబురావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

యస్. జీవన్ కుమార్, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు

మానవ హక్కుల వేదిక

Updated Date - 2023-10-31T03:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising