ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాలంలో నిలిచిన దీపస్తంభం

ABN, First Publish Date - 2023-09-12T02:37:21+05:30

‘పుటక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది...’’ అంటూ త్యాగానికి దర్బణం పడుతూ– బిందువులో భావసింధువును చూపించారు ప్రజాకవి కాళోజీ. అటువంటి కాళోజీతో నిరంతరం వరంగల్లులో...

‘పుటక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది...’’ అంటూ త్యాగానికి దర్బణం పడుతూ– బిందువులో భావసింధువును చూపించారు ప్రజాకవి కాళోజీ. అటువంటి కాళోజీతో నిరంతరం వరంగల్లులో (నక్కలగుట్ట) కరచాలనం చేస్తూ, కలిసినడుస్తూ క్రాంతదర్శిగా పురోగమించిన గొప్పవక్త లోలభట్టు సోమశేఖరరాజు (ఎల్‌.ఎస్‌. రాజు). వీరి ఉభయుల స్నేహం అక్కడున్న మైత్రీబృందానికి నిత్య చైతన్యస్ఫూర్తి. రాజుగారి భార్య సత్యవతి సాహితీ మనస్విని ఎవరెప్పుడు వచ్చినా ఆతిథ్యానికి ఆమె ఆనందంతో ముందు నిలబడేవారు.

ఎల్‌.ఎస్‌. రాజు రాజకీయమార్గంలో అడుగుపెట్టినా అపశ్రుతికి చోటివ్వని శీలధురీణుడు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాలో ఎనిమిది జిల్లాలకు సంబంధించి శాసనమండలికి పట్టభద్రుల కోటానుండి ‘ఎమ్‌.ఎల్‌.సి’గా ఎన్నికై (1975–1977) జనసంఘ్‌నేతగా గుర్తింపు తెచ్చుకొన్నారు. జూపూడి యజ్ఞ నారాయణ ఫ్లోర్‌లీడర్‌గా ఉంటే – ఎల్‌.ఎస్‌. రాజు డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా ఉంటూ ఎమర్జెన్సీకాలంలో పనితనానికి పట్టుకొమ్మగా నిలిచారు. తత్త్వదర్శకులు శివానందమూర్తి వీరికి అదర్శప్రాయులు.

ఎల్‌.ఎస్‌.రాజు 1937 జూలై 1926లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డలో జన్మించారు. పాఠశాల విద్య అక్కడే అభ్యసించి, సిక్కిం గవర్నర్‌గా పనిచేసిన వి. రామారావుతో కలసి మచిలీపట్టణం హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసారు. ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో బి.ఏ పూర్తిచేసి హైదరాబాదులో ఎల్‌.ఎల్‌.బి చదివారు. కరీంనగర్‌ ములకనూరులో ప్రయివేట్‌ టీచర్‌గా ఎందరినో తీర్చిదిద్దారు. ఆ తరువాత వరంగల్‌లో రామకృష్ణ ట్యుటోరియల్‌ కాలేజీ నడిపారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా దానిని తోసిపుచ్చారు. ఆర్‌.యస్‌.యస్‌. భావాలు కలిగిన వీరు శ్రమజీవులకేదో మేలుచేయాలన్న తలంపుతో వరంగల్లులోని అజంజాహి స్పిన్నింగ్‌మిల్‌, హైదరాబాదులోని డి.బి.ఆర్‌ మిల్స్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లోని పేపర్‌మిల్లులలో ట్రేడ్‌యూనియన్‌ అధ్యక్షునిగా ఉంటూ విలువలెరిగిన నాయకమణిగా మన్ననలందుకొన్నారు. కాళోజీ భావసింధువులో భాగమైనారు. ఎమ్‌.ఎల్‌.సిగా ఉన్న కాలంలో ప్రజాసమస్యలపై అనునిత్యం పోరాడుతూ వచ్చారు. ఎల్‌.ఎస్‌ రాజులో ఉన్న ఆ శ్రేయోదాయకమైన ప్రతిభని కాళోజీ మెచ్చుకొంటూ ఉండేవారు. ‘అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు, ఏపాటివాడో చూడు. ఎన్నుకొంటే వెలగబెట్టటం కాదు, ఇప్పటిదాకా ఏంచేశాడో చూడు. పెట్టుకొనే టోపీ కాదు. పెట్టిన టోపీ చూడు...’ అనేవారు ప్రజాకవి కాళోజీ.

ఆనాడు శాసనమండలిలో ఎక్కువగా సి.వి.కె.రావు, ఎల్‌.ఎస్‌.రాజు గొంతులు వినిపించేవి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో వీరి ప్రావీణ్యతకు, పలుకుబడికి ముగ్ధులు కాని శ్రోతలుండేవారుకాదు. పూర్వప్రధానమంత్రి వాజ్‌పేయికి వీరు సహచరులు. తెలుగు రాష్ట్రంలో వాజ్‌పేయి పర్యటించిన సందర్భాల్లో ఎల్‌.ఎస్‌.రాజు అనువాదకులుగా ఉండేవారు. సి.జంగారెడ్డి, ఆలె నరేంద్ర, ఇంద్రసేనారెడ్డి, పన్నాల శ్రీరాములు, ఈనాటి హర్యానా రాష్ట్రగవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర గవర్నరుగా పనిచేసిన విద్యాసాగర్‌రావు ప్రభృతులు రాజుగారిని పెద్దలుగా గౌరవించేవారు. బహుముఖీనంగా అనేక విషయాలపై ఈయనకు సమగ్రమైన అవగాహన ఉండటంతో – విద్యారంగానికి సంబంధించి భారతదేశమంతటా పర్యటించి తమ వాణిని వినిపించారు.

ఈ నెల రెండవతేదీ ఎల్‌.ఎస్‌.రాజు అమెరికాలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన శీలవంతమైన ఆదర్శ రాజకీయజీవితం తెలిసినవారికీ, వారి ప్రసంగధారలలో తడిసినవారికీ, ఎల్‌.ఎస్‌. రాజు ఎప్పుడూ స్మృతిపథంలో ఒక దీపస్తంభంలా వెలుగులు చిమ్ముతూనే ఉంటారు.

రసరాజు

(రేపు హైదరాబాద్‌ నిజాంక్లబ్‌లో

ఎల్‌.ఎస్‌.రాజు సంస్మరణసభ)

Updated Date - 2023-09-12T02:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising