ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్గిల్‌ కుట్రదారు

ABN, First Publish Date - 2023-02-07T02:09:42+05:30

అరుదైన వ్యాధితో ఐదేళ్ళుగా బాధపడుతున్న పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌, దుబాయ్‌లోని అమెరికన్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరుదైన వ్యాధితో ఐదేళ్ళుగా బాధపడుతున్న పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌, దుబాయ్‌లోని అమెరికన్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ ‘మొహజిర్‌’ మరణవార్త వినగానే, కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ ఒక ట్వీట్‌లో, భారతదేశానికి ప్రబల శత్రువుగా వ్యవహరించిన ముషార్రఫ్‌, ఆ తరువాత 2002–2007 మధ్యకాలంలో శాంతికోసం బలంగా పాటుపడ్డారు అన్న అర్థంలో ఓ వ్యాఖ్యచేయడంతో, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆగ్రహించారు. భారత్‌ను వెన్నుపోటుపొడిచి, ఉగ్రదాడులు చేయించి, కయ్యానికి కాలుదువ్విన ఒక సైనిక నియంత కాంగ్రెస్‌ నాయకులకు శాంతిదూతలాగా కనిపిస్తున్నాడనీ, ఈ ట్వీట్‌ కాంగ్రెస్‌ అసలు స్వరూపానికి నిలువెత్తు నిదర్శనమనీ అన్నారాయన. బీజేపీ నాయకులంతా వరుసపెట్టి విరుచుకుపడటంతో, ‘దేశభక్తులందరికీ ముషార్రఫ్‌ అంత గిట్టనివాడైనప్పుడు, 2003లో బీజేపీ ప్రభుత్వం ఆయనతో కాల్పులవిరమణ చర్చలు ఎందుకు జరిపింది, 2004లో ముషార్రఫ్‌–వాజపేయి సంయుక్తప్రకటనపై సంతకాలు ఎందుకు చేశారు? అని ప్రశ్నించారు. అప్పుడాయన విలన్‌ కాదా, లేక, వాజపేయిని ఇప్పటి బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారా? అన్నది థరూర్‌ ప్రశ్నల సారాంశం.

ముషార్రఫ్‌ అంతుచిక్కని మనిషి. ఎవరికి నచ్చినరీతిలో వారు విశ్లేషించుకోవచ్చు. కార్గిల్‌ యుద్ధ సృష్టికర్తగా, ఐదువందల పైచిలుకు భారత సైనికుల మరణానికి కారకుడిగా ఆయన కచ్చితంగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ భారతదేశంతో 1999 ఫిబ్రవరిలో అద్భుతమైన శాంతి ఒప్పందాన్ని సాధించినందుకు ఆగ్రహించి, ప్రధానికి తెలియకుండా, కార్గిల్‌ చిచ్చురేపి ఎదురుదెబ్బతిన్నారు ముషార్రఫ్‌. షరీఫ్‌ అమెరికా ఒత్తిడికి లొంగిపోయి తనకు సహకరించనందువల్లనే కార్గిల్‌ విషయంలో దెబ్బతిన్నామని ఆయన ప్రచారం చేసుకున్నప్పుడు అత్యధికశాతం పాకిస్తానీయులు నమ్మారు. అవినీతిలో కూరుకుపోయిన తమ రాజకీయ నాయకులకు బదులుగా ఒక సైనిక నియంత గద్దెమీద ఉంటే దేశం బాగుపడుతుందన్న సగటు పాకిస్తానీ ఆలోచనా ధోరణి, షరీఫ్‌ను వెన్నుపోటుపొడిచి ఆయన గద్దెనెక్కడాన్ని మరింత సులభతరం చేసింది.

టర్కీలో చదువుకున్నందువల్ల, అటా టుర్క్‌ ప్రభావంతోనూ అధికారంలోకి వచ్చిన కొత్తలో ముషార్రఫ్‌ దేశాన్ని ఛాందసత్వం నుంచి బయటపడవేయాలన్న కృషి విశేషంగా చేసినట్టు చెబుతారు. అన్ని రంగాల్లోనూ సంస్కరణలు ఆరంభించడం, మీడియాకు ఎంతో స్వేచ్ఛనివ్వడం వంటివి అటుంచితే, చేజేతులా చేసిన పాపాలు, అనూహ్యంగా వచ్చిపడిన కష్టాలు కలసికట్టుగా ఆయన పతనానికి దారితీశాయి. రెండుసార్లు దేశంలో ఎమర్జెన్సీ విధించి అధికారాన్ని స్థిరంగా నిలబెట్టుకోవాలని చూసినా చీఫ్‌ జస్టిస్‌ ఇఫ్తికార్‌ చౌదరి వంటివారు ఇరకాటంలో పెడుతూవచ్చారు. ఆయనను సస్పెండ్‌ చేయడం ఒక మహోద్యమాన్నే సృష్టించింది. ఇక, బెనజీర్‌ భుట్టో హత్యలో ముషార్రఫ్‌ చేయివున్నదని సామాన్యుడు కూడా విశ్వసించాడు. వీటికితోడుగా, సెప్టెంబరు 11 ఘటన తరువాత, అమెరికా హెచ్చరికలకు లొంగి, ఉగ్రవాదంపై పోరులో దానితో చేతులు కలపడం ఆయన పతనానికి దారితీసిన కారణాల్లో మరొకటి. అందులో భాగంగా, అఫ్ఘానిస్థాన్‌లో సోవియట్‌ సేనలను తరిమికొట్టడానికి ముజాహిదీన్‌లను సరఫరా చేసిన 1965ల నాటి ఇస్లామాబాద్‌లోని లాల్‌ మస్జిద్‌ మీదకు కూడా సైన్యాన్ని పంపించారాయన. వందలాదిమంది మరణానికి దారితీసిన ఈ ఘటన మతసంస్థలకు, మతఛాందసులకే కాదు, ప్రజలకు కూడా ముషార్రఫ్‌ను శత్రువుగా మార్చింది.

కార్గిల్, కాంధహార్‌ ఘటనలు, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీపైనా, ఆ తరువాత పార్లమెంటుపైనా ఉగ్రదాడులు జరగడం వంటివనేకం భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ప్రత్యక్షయుద్ధ వాతావరణం కల్పించినదశలో, భారత్‌తో సయోధ్య మాత్రమే తనకు రాజకీయంగా ఉపకరిస్తుందని ముషార్రఫ్‌ నమ్మారు. ఎలాగూ అమెరికా తనపక్షానే ఉన్నందున, దాని ప్రోద్బలంతో కూడా 2004 వాజపేయి పర్యటన సందర్భంగా భారత్‌కు వ్యతిరేకంగా తన భూభాగంనుంచి ఉగ్రవాద చర్యలను అనుమతించబోమనడం సహా అనేక లిఖితపూర్వక హామీలు ఇచ్చారు. ఆ తరువాత, అధీనరేఖవద్ద శాంతినెలకొల్పడం, సరిహద్దువాణిజ్యాన్ని పునరుద్ధరించడం వంటివి ముషార్రఫ్‌ హయాంలోనే జరిగాయి. భారత్‌తో సత్సంబంధాల విషయంలో గత పాకిస్థాన్‌ నాయకులెవ్వరూ ధైర్యం చేయని అంశాల్లో ముషార్రఫ్‌ ముందడుగువేశారని అంటారు. అయితే, తొమ్మిదేళ్ళకాలంలోనే ఆయన సగటుపాకిస్తానీతో అందరికీ శత్రువుగా మారిపోయి, న్యాయస్థానాల్లో మరణశిక్ష ఎదుర్కొని, విదేశాలకు పారిపోయి, అక్కడే కన్నుమూయాల్సి వచ్చింది.

Updated Date - 2023-02-07T02:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising