కవితా వనమాలి దేవులపల్లి
ABN, First Publish Date - 2023-10-31T03:21:42+05:30
భావకవిత్వాన్ని ఒక ఉద్యమంలాగా మలచి సామాన్య లోకపు సరిహద్దులను దాటించి, మధురమైన ఆవేశాన్ని రగిలించి, లలితమైన ఉద్వేగాన్ని రేకెత్తించి, క్షణికమైన అనుభూతిని శాశ్వత రమణీయ వాహినిగా...
భావకవిత్వాన్ని ఒక ఉద్యమంలాగా మలచి సామాన్య లోకపు సరిహద్దులను దాటించి, మధురమైన ఆవేశాన్ని రగిలించి, లలితమైన ఉద్వేగాన్ని రేకెత్తించి, క్షణికమైన అనుభూతిని శాశ్వత రమణీయ వాహినిగా మార్చి ఉజ్వల కవిత్వాన్ని అందించినవారు కృష్ణశాస్త్రి. గురజాడకూ, శ్రీశ్రీకి మధ్య భావకవిత్వంగా జయకేతనంగా ఎగురవేసిన కృష్ణశాస్త్రి కవి పండిత గాయక కుటుంబంలో, పిఠాపురం సంస్థాన ఆస్థాన కవుల కుటుంబంలో 1897 నవంబర్ 1న పిఠాపురం సమీప గ్రామం చంద్రంపాలెంలో జన్మించారు. దేవులపల్లి సోదర కవులలోని తమ్మన శాస్త్రి తనయుడు ఈ మహాకవి. ‘దిగిరాను దిగిరాను దివినుండి భువికి’ అని ఆయన సాహిత్య సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించారు. వారి ‘కృష్ణపక్షం’ కావ్యం తెలుగు సాహిత్య రంగంలో ఒక మైలురాయి. ఆ కావ్యం వెలువడిన నాటినుంచి అర్ధ శతాబ్దికి పైగా కృష్ణశాస్త్రి కవితా ప్రవాహం నిరంతరాయంగా సాగింది. ‘ప్రవాసము’, ‘ఊర్వశి’ ప్రేమ సామ్రాజ్యపు చరమసీమల్ని తాకితే ‘తిరుప్పావై’ అనునాదంతో ఆధ్యాత్మిక కైవల్యపు అంచుల్ని తాకారు. ‘అమృతవీణ’ గేయ సంపుటి వీనులవిందొనర్చింది. ఆ కాలమంతా అతని పాట కీర్తన అయింది.
ఈ భావ కవితా చక్రవర్తి పుట్టి పెరిగింది రాచరిక వ్యవస్థలోనైనా, భాగమై జీవించింది మాత్రం జాతీయోద్యమకాలంలోనే. పిఠాపురం మహారాజా స్థాపించిన హరిజన హాస్టల్లో ఉపాధ్యాయునిగా పాఠాలు చెప్పడమే గాకుండా అనేక విధాలుగా ఆ బాలలకు సేవలు చేసి ఇంటిని మరపించే ఆత్మీయతను చూపేవారు. పిఠాపురం హైస్కూల్, కాకినాడ పిఠాపురం రాజా (పి.ఆర్.) హైస్కూల్లోనూ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈ సందర్భంలోనే పిఠాపురం రాజాను కీర్తిస్తూ ‘కోయిల కొలముది కరుణ శృంగార మధుర మాధవుడవు’ అంటూ కీర్తించారు. రాచరిక వ్యవస్థలోని వెలుగు పార్శ్వాన్ని అనుభవించినా, ప్రజల హృదయాల్లోనికి చొచ్చుకుపోయారు. ఆకాశవాణి ద్వారా తన గళాన్ని తెలుగు ప్రజల ముందుంచారు. ‘కోటిమంది వచ్చినా చోటున్నది మదిలోన’ అంటూ తన హృదయ వైశాల్యాన్ని తెలుపుతారు. ‘సమభోగం సమభాగ్యం, సమసంస్కృతి నాటి కొత్త కాంతి, కొత్త శాంతి భరతావనినిండ’ వంటి గీతాల్లో గురజాడ అడుగుజాడల్లో, శ్రీశ్రీకి బాసటగా నిలుస్తారు దేవులపల్లి. ‘ప్రపంచం బాధ శ్రీశ్రీదైతే, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అన్న చలం మాట అక్షర సత్యం!
తెలుగు సినిమా ప్రపంచానికీ, తెలుగు పాటకూ ఒక నూతనత్వాన్ని, మర్యాదను తెచ్చిపెట్టిన ‘మల్లేశ్వరి’ చిత్రానికి కథ, మాటలు, పాటలు సమకూర్చి తెలుగు సినిమా స్థాయిని సాహిత్య చరిత్రలో నిలిపారు. ‘ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఎటులైనా ఇచటనే దాగిపోనా’, ‘మేడంటే మేడా కాదూ, గూడంటే గూడూ కాదూ, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది’ అనే పాటల్లో ప్రకృతి పరవశిస్తుంది. ‘చిత్తమానందమయ మరీచికల సోల హృదయమానంద భంగ మాలికల దేల కనుల నానంద జనితాశ్రు కణములూర జగమునిండ స్వేచ్ఛగాన ఝరులు నింతు’ అంటూ కవిత్వంలో సౌందర్యలాలస, హృదయ లాలిత్యం, మేధస్సుకు ఆనందగుణమూ ఉందని చూపుతారు. వస్తుసిద్ధి కన్న రససిద్ధి మిన్న అన్న తపస్వి కృష్ణశాస్త్రి. తెలుగు శ్రోతలకు అమృత కవితాగానాన్ని అందించిన కృష్ణశాస్త్రి భౌతికంగా మరణించినపుడు మహాకవి శ్రీశ్రీ ‘షెల్లీ మళ్ళీ మరణించాడు, ఆంధ్రదేశపు నిలువుటద్దం పగిలిపోయింది’ అని విచారించారు.
ర్యాలి ప్రసాద్
కవి, చారిత్రక పరిశోధకులు
(నవంబర్ 1 దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి)
Updated Date - 2023-10-31T03:21:42+05:30 IST