ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ కథ అడ్డం తిరిగె

ABN, First Publish Date - 2023-01-01T00:07:26+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోటి నుంచి తరచుగా ఒక సామెత వినపడుతుంది. ‘పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట’ అనేది ఆ సామెత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోటి నుంచి తరచుగా ఒక సామెత వినపడుతుంది. ‘పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట’ అనేది ఆ సామెత. అదేమిటోగానీ ఆ సామెత ఇప్పుడు కేసీఆర్‌కే వర్తిస్తోంది. స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా కొన్నేళ్ల క్రితం ఓటుకు నోటు కేసులో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఇరికించి పైచేయి సాధించిన కేసీఆర్‌... ఇప్పుడు అదే స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ పెద్దలను ఇరికించాలని చూశారు. అయితే కథ అడ్డం తిరిగింది. ‘అనుకున్నది ఒక్కటి.. అయిందొకటి! బోల్తా పడ్డావులే బుల్‌ బుల్‌ పిట్టా’ అన్నట్టుగా కేసీఆర్‌ పరిస్థితి ఇప్పుడు మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేయడంతో చంద్రబాబును, రేవంత్‌ రెడ్డిని దొరకపుచ్చుకున్నట్టుగా బీజేపీ కేంద్ర పెద్దలను కూడా దొరకపుచ్చుకోవాలని అనుకున్న కేసీఆర్‌ ఇప్పుడు తానే ఇరుక్కుపోయారు. కేసీఆర్‌ ప్రదర్శించిన అత్యుత్సాహం ఆయనకు శాపంగా మారబోతోంది. ఓటుకు నోటు కేసులో నామినేటెడ్‌ సభ్యుడు స్టీఫెన్సన్‌ ఇంట్లో రేవంత్‌ రెడ్డి ఉండగానే ఏసీబీ అధికారుల స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోలను మీడియాకు లీక్‌ చేసినట్టుగా ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా నిందితులు ఫామ్‌ హౌస్‌లో ఉన్నప్పుడే వీడియోలు కొన్నింటిని లీక్‌ చేశారు. ఈ అత్యుత్సాహం వల్ల కేసీఆర్‌ జుట్టు ఇప్పుడు సీబీఐ చేతికి చిక్కింది. ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు ఫామ్‌ హౌస్‌లో తాము స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్టు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సంఘటన జరిగినప్పుడు మీడియాకు చెప్పారు. దీన్నిబట్టి ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలు దర్యాప్తు అధికారుల వద్ద మాత్రమే ఉండాలి. ఆ తర్వాత దర్యాప్తు అధికారులు సదరు సాక్ష్యాలను న్యాయమూర్తికి మాత్రమే అందజేయాలి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇందుకు విరుద్ధంగా సదరు వీడియో ఫుటేజ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, జాతీయ నాయకులకు, మీడియాకు అందజేయడమే కాకుండా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆ విషయం ప్రకటించారు. ఇదే విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ముఖ్యమంత్రికి ఎలా చేరాయి? ఎవరు అందజేశారు? అన్నది మిస్టరీగా మారిందని తీర్పులో వ్యాఖ్యానించారు. దీంతో ఈ మిస్టరీని ఛేదించే అధికారం, అవకాశం సీబీఐకి లభించింది. హైకోర్టు తీర్పు కారణంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగాయా లేదా అన్నది తేలడానికి ముందే సాక్ష్యాధారాలు ముఖ్యమంత్రికి ఎలా చేరాయి? అన్నది తేలాల్సి ఉంటుంది. ఇందుకోసం సీబీఐ అధికారుల ముందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్‌ యుద్ధం చేస్తున్నందున సీబీఐని అడ్డుపెట్టుకొని కేంద్ర పెద్దలు ఇప్పుడు కేసీఆర్‌తో ఆడుకొనే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సీబీఐ అధికారులు త్వరలోనే కేసీఆర్‌కు సమన్లు జారీ చేస్తారు. ఈ కేసులో సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, సిట్‌కు నేతృత్వం వహించిన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను కూడా సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. తనపై అవాస్తవ ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు అనుభవించక తప్పదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ అగ్రనేత బీఎల్‌ సంతోష్‌ రెండు రోజుల క్రితం బాహాటంగానే హెచ్చరించారు. దీన్నిబట్టి జరగబోయే పరిణామాలను ఊహించవచ్చు.

మారిన చిత్రాలు...

‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేంద్ర పెద్దలతో పెట్టుకోవడం ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతో ఆడుకున్నట్టుగా ఉండదు’ అని నేను గతంలోనే హెచ్చరించాను. ఇప్పుడు అలాగే జరుగుతోంది. చంద్రబాబుకు వెరపు ఎక్కువ కనుక కేసీఆర్‌కు లొంగిపోయారు. ఇప్పుడు కేసీఆర్‌ పెట్టుకున్నది అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌ వంటి వారితో! రాజకీయంగా తాను గండరగండడని భావించే కేసీఆర్‌... కేంద్ర పెద్దలు తనకంటే గండరగండులని అంచనా వేయలేకపోయారు. అందుకే ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌ది పైచేయి కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆయనే ఆత్మరక్షణలో పడిపోయారు. అంతేనా! కేసీఆర్‌తో పాటు పోలీసు అధికారులు కూడా ఇరుక్కుపోయారు. దీంతోపాటు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కూడా బయటపడుతుంది. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించుకున్నదిగానీ ఈ వ్యవహారంలో కేసీఆర్‌కు ఊరట లభించే అవకాశం ఉండకపోవచ్చునని న్యాయనిపుణులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు పూర్తి కాకముందే సాక్ష్యాధారాలను లీక్‌ చేయడం నిందితుల హక్కులను హరించడమే అవుతుంది. ఓటుకు నోటు విషయంలో ఈ పాయింట్‌పై చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి ఎదురుదాడి చేసి ఉంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్‌ అండ్‌ కో జాగ్రత్తలు తీసుకొని ఉండేవారు. నిజానికి ఇలాంటి కొనుగోళ్లకు ఏ ఒక్క పార్టీ కూడా అతీతం కాదు. అందుకే ప్రజలు కూడా ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్‌ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బయట పెట్టడం ద్వారా కేసీఆర్‌కు అదనంగా ఒనగూరే రాజకీయ ప్రయోజనం కూడా కనిపించడం లేదు. ప్రత్యర్థుల బలాన్ని అంచనా వేసుకోకుండా కేసీఆర్‌ తప్పిదం చేశారు. అందుకే అసలు పోయి కొసరు ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్ష్యాధారాలు లీక్‌ కావడం మిస్టరీగా ఉందని హైకోర్టు తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించినందున సీబీఐ అధికారులు ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. బీఎల్‌ సంతోష్‌లాంటి వారిని కేసీఆర్‌ ఇప్పుడు ఏమీ చేయలేరుగానీ కేసీఆర్‌మాత్రం సీబీఐ విచారణను ఎదుర్కోవలసి రావడం పొట్టోడు, పొడుగోడు, పోచమ్మ సామెతను గుర్తు చేస్తోంది. రాజశేఖర రెడ్డి హయాంను మినహాయిస్తే తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి నేటివరకు కేసీఆర్‌ రాజకీయంగా అన్ని విషయాలలో పైచేయి సాధిస్తూ వచ్చారు. ఇప్పుడు మొదటిసారిగా ‘డామిట్‌ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా ఆయన పరిస్థితి మారింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఇప్పటికే కుమార్తె కవిత ఇరుక్కున్నారు. ఇప్పుడు సాక్ష్యాధారాల లీకేజీ వ్యవహారంలో కేసీఆర్‌ కూడా సీబీఐ చేతికి, అంటే కేంద్రం చేతికి చిక్కారు. ఈ వ్యవహారంలో కేసీఆర్‌ను ఏ మేరకు ఇబ్బంది పెడతారో తెలియదుగానీ సంబంధిత పోలీసు అధికారులందరూ ఇబ్బందులపాలు కావడం తథ్యం. ప్రత్యర్థుల శక్తిసామర్థ్యాలను సరిగా అంచనా వేసుకోకుండా యుద్ధం ప్రకటిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అన్ని రోజులూ మనవి కావు – మనం ఎంత పొడవున్నప్పటికీ మనల్ని కొట్టే పోచమ్మలు ఉంటారని కేసీఆర్‌వంటి వారు గుర్తుంచుకోవాలి!

జగన్‌ ‘ముందస్తు’ ముచ్చట

ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలకు వద్దాం! ‘ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉంది. మీ ఆశీస్సులు కావాలి’... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేసిన విజ్ఞప్తి ఇది. ‘మీరే ఆలోచించుకోండి’ అని ఈ విజ్ఞప్తికి ప్రధాని బదులిచ్చారు. మూడు రోజుల క్రితం ప్రధానమంత్రిని ఢిల్లీలో కలుసుకున్న ముఖ్యమంత్రి ఈ ముందస్తు ప్రస్తావన తెచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తుండటంతో పథకాల అమలుకు అప్పులు కూడా పుట్టని దుస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రస్తుతానికి నెట్టుకొస్తున్న జగన్మోహన్‌ రెడ్డికి మరో ఏడాది పాటు బండి నడిచే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏప్రిల్‌ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి చేయిదాటి పోతుందని కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా గిరీశ్‌ చంద్ర ముర్ము కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలలో కోత విధిస్తే ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కూడా ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలన్న ఆలోచనకు జగన్మోహన్‌ రెడ్డి వచ్చినట్టు చెబుతున్నారు. షెడ్యూల్‌కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశముందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ప్రధానమంత్రిని కలుసుకున్నప్పుడు ముందస్తు ఎన్నికల ప్రస్తావనను జగన్మోహన్‌ రెడ్డి తెచ్చినట్టు తెలిసింది. అయితే, ప్రధాని తన అభిప్రాయం చెప్పకుండా ‘మీరే ఆలోచించుకోండి’ అని మాత్రమే సూచించారట!

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే ఎన్నికల కమిషన్‌ సహకరించాలి. ఈ కారణంగానే జగన్మోహన్‌ రెడ్డి ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులు కావాలని కోరి ఉంటారు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికల కమిషన్‌ సహకరించలేదు. దాంతో చంద్రబాబు నిర్ణయించుకున్న ముహూర్తానికి ఎన్నికలు జరగలేదు. ఈ కారణంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకొనే ముఖ్యమంత్రులు అప్పటి నుంచి ముందుగా ఎన్నికల కమిషన్‌ క్లియరెన్స్‌ పొందుతున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ముందుగా కేంద్ర పెద్దల ఆశీర్వాదం పొందారు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి కూడా అదే బాటలో కేంద్ర పెద్దల ఆశీస్సులకోసం ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరగడానికి ఇంకా పదహారు మాసాల వ్యవధి ఉంది. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలి పోతుండటంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అనివార్యత జగన్మోహన్‌ రెడ్డికి ఏర్పడిందని చెబుతున్నారు. గడువు ప్రకారం ఎన్నికలకు వెళితే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగి మొదటికే మోసం వస్తుందని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నట్టు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎలాగోలా అధికారంలోకి రాగలిగితే ఐదేళ్లవరకు ఢోకా ఉండదని, ఆ తర్వాత రాజకీయంగా చంద్రబాబు బెడద కూడా ఉండదన్నది జగన్‌ అండ్‌ కో ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అయితే, జగన్‌ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. బటన్లు నొక్కడానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవడం తలకు మించిన భారంగా తయారైంది. మరోవైపు పార్టీలో అసంతృప్త స్వరాలు పెరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వంటి వారు ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మిగతా వారు బయటపడటం లేదుగానీ పక్క చూపులు చూస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నలుగురైదుగురు ఎంపీలు, దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని సంప్రదించే పనిలో ఉన్నారు. వీరిలో కొందరు ఇదివరకే తెలుగుదేశం ముఖ్యులను రహస్యంగా కలుసుకొని మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్‌పై నిఘా పెరిగింది. ఈ ఇరువురిని ఎవరు కలసినా ముఖ్యమంత్రి జగన్‌కు క్షణాల్లో తెలిసిపోతోంది. వ్యాపార, పారిశ్రామికవేత్తలు కలిసినా జగన్‌కు ఆ సమాచారం చేరిపోతోంది. చంద్రబాబును కలిసిన ఒక పారిశ్రామికవేత్త ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ‘చంద్రబాబును ఎందుకు కలిశారు?’ అని జగన్‌ ప్రశ్నించడంతో సదరు పారిశ్రామికవేత్త కంగుతిన్నారు. ఇక టెలిఫోన్‌ ట్యాపింగ్‌ గురించి చెప్పే పనే లేదు. అయితే, కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఈ నిఘాకు కూడా వెరవడంలేదు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ టికెట్‌ ఇచ్చినా తాము గెలిచే పరిస్థితులు లేవు కనుక తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం బెటర్‌ అని భావిస్తున్నారు. తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు ఖాయం అని నమ్మేవాళ్లు అటు వైపు నుంచి కూడా ప్రయత్నాలు మొదలెట్టారు. తెలుగుదేశం పార్టీలో అవకాశం లేదనుకొనే వాళ్లే జనసేన పార్టీలో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నవారిలో మంత్రులు కూడా ఉండటం విశేషం. ‘మా పని అయిపోయినట్టే. కాకపోతే మా ముఖ్యమంత్రికి ఆ విషయం తెలియడంలేదు’ అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరిట డబ్బు పంచుతున్నాము కనుక లబ్ధిదారులంతా తమకే ఓటేస్తారన్న గుడ్డి నమ్మకంతో ముఖ్యమంత్రి ఉన్నారని ఒక సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొంటున్న తమకు తెలుస్తుందిగానీ తాడేపల్లి ప్యాలెస్‌ దాటి కాలు బయటపెట్టని జగన్‌కు ఎలా తెలుస్తుందని పలువురు ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధినీ మిళితం చేయాలన్న తమ అభిప్రాయాన్ని జగన్‌రెడ్డి ఖాతరు చేయకపోవడం వల్లనే మూడున్నరేళ్లలోనే ఇంతటి వ్యతిరేకత ఏర్పడిందని వారు విశ్లేషిస్తున్నారు. అభివృద్ధి మోడల్‌ ఓట్లు తెచ్చి పెట్టదు అని జగన్‌ బలంగా నమ్ముతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో అభివృద్ధి పథకాల గురించి ఒక సీనియర్‌ అధికారి వివరించగా, ‘అభివృద్ధి చేస్తే ప్రజలు ఓటు వేస్తారా? అలా అయితే చంద్రబాబు ఎందుకు ఓడిపోయారు?’ అని జగన్మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ముఖ్యమంత్రి ఆలోచనా విధానం తెలిసిన అధికారులు కూడా అభివృద్ధి పథకాల గురించి ఆలోచించడం మానేశారు. నిజానికి అభివృద్ధి ప్రాతిపదికన ప్రపంచ దేశాలలో ఎక్కడా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఎన్నికల్లో గెలవలేదు. అందుకే అభివృద్ధి–సంక్షేమం మధ్య సమతుల్యం పాటించేవారు. అయితే జగన్మోహన్‌ రెడ్డి ఆలోచనా విధానంలో ఈ సమతుల్యత లోపించింది. డబ్బులు పంచిపెడితే చాలు అని ఆయన నమ్ముతున్నారు.

మారుతున్న సీఎం స్వరం...

క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆశాజనకంగా లేవన్న సమాచారం ఈ మధ్య కాలంలో జగన్మోహన్‌ రెడ్డిని కలవరపరుస్తోంది. దీంతో ఆయనలో ఇటీవల అసహనం చోటు చేసుకుంటోంది. ఎంతమంది ఏకమైనా నా వెంట్రుక కూడా పీకలేరు అని కొంత కాలం క్రితం గంభీరంగా ప్రకటించిన జగన్‌ ఆ తర్వాత ‘నన్ను నమ్మండి’ అంటూ గొంతు సవరించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇంకొంతతగ్గి ‘నేను మిమ్మల్నే నమ్ముకున్నాను’ అని ప్రజలను వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఖరిలో వచ్చిన ఈ మార్పు ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పడానికి నిదర్శనం. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభలకు జనం విరగబడి వస్తున్నారు. అయితే వాస్తవాలను గ్రహించడానికి నిరాకరిస్తున్న జగన్‌ అండ్‌ కో మాత్రం ఇరుకు సందులలో సభలు పెట్టుకొని జనం వస్తున్నారని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. వాస్తవాలు మాత్రం జగన్మోహన్‌ రెడ్డిని కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ కారణంగానే ఇటీవలి కాలంలో ఆయనలో అసహనం ఆగ్రహంగా మారి అదుపు తప్పుతోంది. జిల్లా కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ మీడియాలో తప్పుడు కథనాలు వస్తే గట్టిగా తిట్టాలని ఆదేశించారు. అఖిల భారత సర్వీసు అధికారులకు కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ అంటూ ఒకటి ఉంటుంది. అందుకు భిన్నంగా పొలిటికల్‌ బాస్‌లకోసం అఖిల భారత సర్వీసు అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్‌ అధికారులు నిబంధనలను అతిక్రమించలేరు. నిజానికి గతంతో పోలిస్తే ఐఏఎస్‌ అధికారులు నైతికంగా దిగజారిపోయారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం అడ్డమైన పనులూ చేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఈ పరిస్థితులలో జిల్లా కలెక్టర్లు రాజకీయ నాయకుల పాత్ర పోషించాలని జగన్మోహన్‌ రెడ్డి కోరుకుంటున్నారు. అనర్హులు అందలం ఎక్కితే ఇలాంటి ఆలోచనలే చేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా మేళ్లు చేయాలని ఐఏఎస్‌ అధికారులకు చెప్పడానికి ఒకప్పుడు ముఖ్యమంత్రులు సైతం జంకేవారు. ముఖ్యమంత్రి ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటి అమలుకు ఐఏఎస్‌ అధికారులు తిరస్కరించే వారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి ఏదో పని చేసి పెట్టాలని కోరారు. అయితే, సదరు అధికారి ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించుకొని ఆ కలెక్టర్‌కు నచ్చచెప్పవలసిందిగా కోరారు. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో జైఆంధ్రా ఉద్యమం కారణంగా అల్లర్లు చెలరేగాయి. అప్పుడు విజయవాడకు కారులో వెళ్లడానికి పీవీ నరసింహారావు నిర్ణయించుకున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున ముఖ్యమంత్రి విజయవాడ వెళ్లకూడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వల్లూరి కామేశ్వరరావు భావించారు. అదే విషయాన్ని పీవీకి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ముఖ్యమంత్రి కారులో కూర్చున్న తర్వాత డ్రైవర్‌ను కారు దిగి పోవలసిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీనిపై పీవీ ఆగ్రహించగా, ‘నేను మీ కింద పని చేస్తున్నాను. డ్రైవర్‌ నా కింద పని చేస్తున్నాడు. నా ఆదేశాలను డ్రైవర్‌ పాటించాల్సిందే!’ అని సదరు ప్రధాన కార్యదర్శి చెప్పారట! ఇలాంటి అధికారులు గుర్తుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అనేకమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల దిగజారుడుతనం బాధించకుండా ఉండదు కదా! ముఖ్యమంత్రి చెప్పారని జిల్లా కలెక్టర్లు మీడియాను గట్టిగా తిడితే వారే ఫలితం కూడా అనుభవించాల్సి ఉంటుంది.

జగన్‌ కూడా ఇటీవలి కాలంలో మీడియాపై దాడిని పెంచారు. స్వయంగా సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి ఇలా మీడియాపై తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారంటేనే ఆయన ఎంత అభద్రతలో ఉన్నారో తెలుస్తుంది. వ్యవస్థలు చెడిపోయాయని, విష సంస్కృతితో తాను పోరాటం చేస్తున్నానని చెప్పుకొంటూ ప్రజలను నమ్మించడానికి కూడా జగన్‌ తాజాగా ప్రయత్నాలు మొదలెట్టారు. రాష్ట్రంలో వ్యవస్థలు పతనం కావడానికి జగన్‌రెడ్డే కారణమన్న వాస్తవం పసిపిల్లలకు కూడా తెలుసు. రాజకీయాలలో విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నది కూడా ఆయనే కదా! బలమైన నాయకుడు ఎవరూ నోరు పారేసుకోరు. ప్రజల్లో తన పట్టు సడలుతోందని గుర్తించినప్పుడు నాయకుల్లో అసహనం బయటపడుతుంది. జగన్‌ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లోనే ఉన్నారు.

ఆర్కే

Updated Date - 2023-01-01T09:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising