ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Weekend comment by RK; కారు–కమలం... రాజకీయ కలకలం!

ABN, First Publish Date - 2023-06-25T01:22:54+05:30

ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి ఉంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ కేంద్ర పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ మధ్య ఎటువంటి అవగాహన ఏర్పడిందోగానీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి ఉంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ కేంద్ర పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ మధ్య ఎటువంటి అవగాహన ఏర్పడిందోగానీ... ఇప్పటివరకు తెలంగాణలో అధికారంలోకి రావాలని సమరోత్సాహంతో పనిచేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఆత్మరక్షణలో పడిపోయారు. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణానికి సంబంధించి కవిత విషయమై హడావిడి చేసిన కేంద్ర ఏజెన్సీలు ఇప్పుడు మౌనం వహించడంతో ఢిల్లీలో ఏం జరిగిందో అర్థంకాక బీజేపీ రాష్ట్ర నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో శుక్రవారం పట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందకపోవడం, కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్‌ షాను కలిసే ప్రయత్నం చేయడం, పట్నా సమావేశాన్ని ప్రతిపక్షాల హడావిడిగా తేల్చేస్తూ కేసీఆర్‌ పత్రికలో వార్తలు రావడంతో ‘దాల్‌ మే కుచ్‌ కాలా హై’ అన్న అనుమానాలు బలపడ్డాయి. తమ పార్టీతో బీజేపీ లోపాయికారీ అవగాహన కుదుర్చుకుందని భారత రాష్ట్ర సమితి నాయకుల్లో కూడా గుసగుసలు మొదలయ్యాయి. తన నాయకత్వంలో ప్రతిపక్షాలను ఏకం చేద్దామనుకున్న కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన కాడి పారేసి గమ్మునుండిపోయారు. మరోవైపు బీజేపీ వ్యతిరేక వైఖరి విషయంలో కేసీఆర్‌ చిత్తశుద్ధిని ప్రతిపక్ష ప్రముఖులు శంకించారు. ఫలితంగా తమ చుట్టూ తిరిగిన కేసీఆర్‌కు పట్నా సమావేశానికి కనీసం ఆహ్వానం కూడా పంపలేదు. వెరసి ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపబోతున్నాయి. కాంగ్రెస్‌–బీజేపీలకు సమ దూరం పాటిస్తామని కేటీఆర్‌ ఢిల్లీలో చెప్పుకొన్నప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మడం లేదు. కుమార్తె కోసం కేసీఆర్‌ బీజేపీతో లాలూచీ పడిపోయారని ప్రజల్లో బలంగా వ్యాపించింది. ఈ పరిస్థితిని గమనించిన బీజేపీ రాష్ట్ర నాయకులు సైతం తమ వ్యధను పార్టీ అధిష్ఠానం వద్ద వెళ్లబోసుకున్నారు. లిక్కర్‌ స్కాంలో కవితపై చర్యలు తీసుకోని పక్షంలో ప్రజలు తమను ప్రత్యామ్నాయంగా నమ్మబోరని పార్టీ పెద్దల వద్ద తేల్చి చెప్పారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న బీజేపీ పెద్దలు తమ మనసులో ఏముందో చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నారు. కవితపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి బలంగా రావాలన్న ఉద్దేశంతో వేచి చూస్తున్నామని, ఈ విషయంలో తొందరపడితే పరిస్థితులను కేసీఆర్‌ తనకు అనుకూలంగా మలచుకుంటారని బీజేపీ పెద్దలు వివరణ ఇస్తున్నారు. శుక్రవారంనాడు హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర ముఖ్యుల సమావేశంలో కూడా కవిత వ్యవహారమే ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా పర్వాలేదుగానీ, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదనీ, కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదన్న ధోరణితో తమ పార్టీ పెద్దలు ఉండటాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే బీజేపీలో ఉండేదెవరు? పోయేదెవరు? అన్న పరిస్థితి ఏర్పడింది. ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చి చేరిన నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. ఈటల రాజేందర్‌ వ్యవహార శైలి కూడా సందేహాస్పదంగా ఉంది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో బీజేపీ పొంగు చల్లబడింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటోంది. కర్ణాటక ఫలితాల తర్వాత ఆ పార్టీలో నూతనోత్సాహం ఏర్పడింది. ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారు కాంగ్రెస్‌లో చేరడానికే మొగ్గు చూపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా సొంత గూటికే చేరడానికి సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అలకలు వీడి పార్టీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.

మారుతున్న మైనారిటీలు...

ఆయా రాం గయా రాంల వ్యవహారాలను పక్కనపెడితే తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. అదే ముస్లింల వైఖరిలో వస్తున్న మార్పు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముస్లింలు కేసీఆర్‌కు అండగా ఉంటూ వచ్చారు. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి ప్రగతి భవన్‌ తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉండేవి. అయితే ఇప్పుడు ముస్లింల వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం, కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు హిందుత్వను పెంచి పోషించడానికి బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలే! హిందుత్వ వ్యాప్తికి కర్ణాటకను ఒక ప్రయోగశాలగా మార్చారు. అక్కడ విజయవంతమైతే దక్షిణాది అంతటా విస్తరించవచ్చునని కమలనాథులు లెక్కలు వేసుకున్నారు. దీంతో కర్ణాటకలోని ముస్లింలు అంతా ఏకతాటిపైకి వచ్చారు. గంపగుత్తగా కాంగ్రెస్‌ పార్టీ వైపు నిలబడ్డారు. ఫలితంగా జేడీఎస్‌కు పరాభవం ఎదురైంది. మిగతా రాష్ర్టాలలో మాదిరి కర్ణాటకలో కూడా ముస్లింల ఓట్ల ఆధారంగా పోటీ చేయాలనుకున్న మజ్లిస్‌ అధినేత ఒవైసీని కర్ణాటకలోని ముస్లిం మత పెద్దలు ప్రతిఘటించారు. ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నాలను సహించబోమని తేల్చి చెప్పారు. దీంతో కర్ణాటక ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ పోటీ చేయకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనించిన తెలంగాణలోని ముస్లింలు కూడా జాతీయ స్థాయిలోగానీ, రాష్ట్ర స్థాయిలోగానీ కాంగ్రెస్‌కు అండగా నిలవాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు వివిధ పరిశీలనల్లో వెల్లడైంది. దీనికితోడు బీజేపీతో భారత రాష్ట్ర సమితి లోపాయికారీ అవగాహన కుదుర్చుకుందన్న అభిప్రాయం నానాటికీ బలపడుతుండటంతో ముస్లిం మైనారిటీలు మరింత స్థిర నిర్ణయం తీసుకుంటున్నారు. ముస్లిం మైనారిటీల్లో వస్తున్న ఈ మార్పును బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు కూడా గమనిస్తున్నారు. తమ సర్వేలలో కూడా ఈ విషయం స్పష్టమవుతోందని వారు అంగీకరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదిరిందన్న ప్రచారం తమ కొంప ముంచబోతోందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ముస్లింలలో వస్తున్న ఈ మార్పు అక్కడితో ఆగకుండా క్రైస్తవులకు కూడా విస్తరిస్తుందని బీఆర్‌ఎస్‌ ముఖ్యులు భయపడుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో తమకు అండగా ఉన్న ఈ రెండు వర్గాలూ దూరమైతే వచ్చే ఎన్నికల్లో తమకు అపజయం తప్పదని అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత అంగీకరించారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లోకి చేరికలు మొదలవడంతోపాటు బీజేపీ నుంచి వలసలు ప్రారంభమయ్యే సూచనలు ఉండటంతో ఆ పార్టీలో టికెట్ల కోసం పోటీ మొదలైంది.

కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు...

ప్రస్తుతానికి ఊపు మీద ఉన్న కాంగ్రెస్‌ పార్టీని అదను చూసి దెబ్బకొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొన్ని అస్ర్తాలను సిద్థం చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో పొసగని కారణంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సొంత నియోజకవర్గంలో తన వ్యతిరేకులను రేవంత్‌ రెడ్డి ప్రోత్సహించడాన్ని ఉత్తమ్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్‌ ప్రోద్బలంతోనే సోషల్‌ మీడియాలో తనపై వ్యతిరేక ప్రచారం మొదలైందని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పది పేజీల లేఖను సోనియాగాంధీకి రాశారు. ఈ పరిస్థితులలో నేను కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడం అవసరమా? అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. అయితే, బీఆర్‌ఎస్‌లో చేరడానికే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి వర్గం చెబుతోంది. అదే సమయంలో ఉత్తమ్‌ కుమార్‌, జగ్గారెడ్డి వంటి వారు పార్టీలో చేరబోతున్నారని కేటీఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటోందని ఆందోళన చెందవద్దని, అదను చూసి దెబ్బకొట్టడానికి కేసీఆర్‌ వద్ద బ్రహ్మాస్త్రం ఉందని ఆయన నచ్చచెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రజల్లో వస్తున్న మార్పును గమనిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం భరోసాగా ఉండలేకపోతున్నారు. గ్రామాల్లో తమ పార్టీ బలంగా ఉందని ఇప్పటిదాకా భావించామని, ఇప్పుడు తాము చేయించుకుంటున్న సర్వేలలో ఆ పరిస్థితి లేదని, గ్రామాలలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నట్టు స్పష్టమవుతోందని వారు చెబుతున్నారు. కారణాలు ఏమైనా కేసీఆర్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నదన్న మాట నిజమని ఒక మంత్రి కూడా అంగీకరించారు. ఈ విషయం అలా ఉంచితే, రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్‌లో గొడవలు ఏర్పడటానికి కారణాలపై సోనియాగాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు రాహుల్‌ గాంధీ–ప్రియాంకా గాంధీలకు తగిన సూచనలు చేస్తున్నారు. పార్టీ వ్యూహకర్తగా నియమితుడైన సునీల్‌ కనుగోలు కూడా పార్టీలో విభేదాలకు కొంత వరకు కారణమని తెలుసుకున్న సోనియాగాంధీ ఆయనను మందలించినట్టు తెలిసింది. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కూడా వైఖరి మార్చుకోవాలని సూచించారు. నిజానికి రేవంత్‌ రెడ్డికి ఇదొక మంచి అవకాశం. తెలంగాణలో పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారుతున్నందున అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకు వెళ్లగలిగితే ముఖ్యమంత్రి అయ్యే చాన్స్‌ ఆయనకు ఉంటుంది. అలా కాకుండా ఒంటెత్తు పోకడలకు పోతే ఆయనకే నష్టం. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఇదే విధంగా వ్యవహరించేవారు. ఆనాటి సీనియర్‌ నాయకులతో తగవులు పెట్టుకొనేవారు. ఫలితంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి పాతిక సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. కర్ణాటకలో డీకె శివకుమార్‌ది కూడా ఇదే పరిస్థితి. ఆయన కారణంగా పార్టీ టిక్కెట్లు పొందినవారు కూడా గెలిచాక సిద్ధరామయ్య నాయకత్వానికే జై కొట్టారు. ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రేవంత్‌ రెడ్డి కూడా తన వైఖరి మార్చుకోవడం ఆయనకే మంచిది. అవసరమైనప్పుడు ఒక అడుగు వెనక్కు తగ్గినా అంతిమ లక్ష్యం చేరుకోవడం ముఖ్యం. నెగ్గాలనుకున్న వాడికి తగ్గడం కూడా తెలియాలి. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంటుంది. చివరి రోజుల్లోని రాజశేఖర రెడ్డితో పోల్చుకోకూడదు. రాజశేఖర రెడ్డి తొలినాళ్ళలో సీనియర్లుగా ఉన్నవారెవరూ ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి జీవించిలేరు. ఇపుడు తెలంగాణలో దశాబ్దాలుగా కాంగ్రెస్‌నే నమ్ముకున్న అనేక మంది సీనియర్లు ఉన్నారు. చేరికల వల్ల కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపిస్తుండవచ్చు గానీ కేసీఆర్‌ను తక్కువ అంచనా వేస్తే బొక్కబోర్లా పడతారు. కేసీఆర్‌ వ్యూహం ఫలించి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు బీఆర్‌ఎస్‌లో చేరితే కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో కొంత నష్టం కలగకుండా ఉండదు. నల్లగొండ జిల్లాకే చెందిన మరో సీనియర్‌ నేత కె.జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌తో కూడా కేసీఆర్‌ టచ్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ విషయం తెలిసి కాంగ్రెస్‌ అధిష్ఠానం వారిని ఢిల్లీకి పిలిపించుకున్నట్టు చెబుతున్నారు.

ఆత్మరక్షణలో రాష్ట్ర బీజేపీ నేతలు

మొత్తమ్మీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు ప్రధాన పార్టీలలోనూ ఎంతో కొంత గందరగోళం నెలకొంది. కేసీఆర్‌ కుటుంబాన్ని అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రకటిస్తూ వచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పుడు కవిత విషయంలో అవకాశం ఉండి కూడా చర్యలు లేకపోవడంతో ఆత్మరక్షణలో పడిపోయారు. బీఆర్‌ఎస్‌తో తమకు ఎటువంటి అవగాహనా లేదని సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో వారున్నారు. బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటేనని నిన్నటి వరకు విమర్శించగలిగిన బీజేపీ నాయకులు ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. పట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి కేసీఆర్‌కు ఆహ్వానం లేకపోవడం, వివిధ రాష్ర్టాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు సైతం కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి సిద్ధపడటంతో బీజేపీ నాయకుల విమర్శలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీకి తప్పింది. అయితే ఆ పార్టీలో అంతర్గత పోరు సమసిపోతుందో లేదో వేచిచూడాలి. ఇక అధికార భారత రాష్ట్ర సమితి విషయానికి వస్తే, ఆ పార్టీకి బలమూ బలహీనతా కేసీఆర్‌ మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిన్నటిదాకా రంకెలు వేసిన కేసీఆర్‌ ఉన్నట్టుండి నోటికి తాళం వేసుకోవడంతో ప్రజలు ఆయనను శంకిస్తున్నారు. కేంద్ర పెద్దలతో కేసీఆర్‌కు ఏదో అవగాహన కుదిరిందని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే. బీజేపీ–కాంగ్రెస్‌ పార్టీలలో కేసీఆర్‌ను ఢీకొట్టే ప్రధాన పక్షం ఏది? అన్నది స్పష్టం కావాలి. ఈ రెండు పార్టీలలో ప్రధాన ప్రత్యర్థిగా ఎవరిని ప్రజలు గుర్తిస్తారో వారికే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ విషయంలో నెలకొన్న అయోమయం ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నది. కేసీఆర్‌తో చేతులు కలిపారన్న అపవాదును తొలగించుకోని పక్షంలో బీజేపీ మూడవ స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుంది. అదే జరిగితే అది ఆ పార్టీకి ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ మరింత పుంజుకొంటుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. బీజేపీతో తమకు లాలూచీ లేదని రుజువు చేసుకోవాల్సిన అవసరం భారత రాష్ట్ర సమితికి కూడా ఉంది. ముస్లిం మైనారిటీలలో మార్పు వస్తున్న వేళ కేసీఆర్‌ బీజేపీతో కలసిపోయారని ప్రచారం బలపడితే రాజకీయంగా ఆయన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎన్నికలకు ఇంకా ఐదు మాసాల వ్యవధి మాత్రమే ఉంది. ఈ మధ్య కాలంలో ఆయా పార్టీలు అనుసరించబోయే ఎత్తుగడలను బట్టి ముందు వరుసలో ఎవరుంటారు? ఎవరు వెనక్కి నెట్టబడతారు? అన్నది స్పష్టమవుతుంది. ప్రస్తుతానికైతే బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. అధికారంలోకి వస్తామని ఆశపడుతున్న వేళ ఇలా జరగడం ఏమిటని వారు ఆవేదన చెందుతున్నారు. అదే సమయంలో రేవంత్‌ రెడ్డితో విభేదాల కారణంగా కానీ, మరో కారణంగా కానీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన కొంత మంది సీనియర్‌ నాయకులు ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారుతుండటంతో కుచ్చిళ్లు సర్దుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఈ పరిణామం పట్ల భారత రాష్ట్ర సమితి శ్రేణులు కలత చెందుతున్నాయి. కాంగ్రెస్‌–బీజేపీ సమాన స్థాయిలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తాము లాభపడవచ్చునన్న వారి ఆశలు ఆవిరవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేలా కాంగ్రెస్‌ నుంచి వలసలను ప్రోత్సహించడానికి కేసీఆర్‌ ప్రయత్నం చేయకుండా ఉండరు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తమ పార్టీలోకి వస్తే ఆయన సూచించిన ఏడుగురు అభ్యర్థులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వడానికి కూడా కేసీఆర్‌ అంగీకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాను పార్టీ మారే విషయమై వస్తున్న వార్తలను ఉత్తమ్‌ శుక్రవారం నాడు ఖండించారు. అయితే రాజకీయాలలో ఖండనలతో నిమిత్తం లేకుండా అంతిమ నిర్ణయాలు ఉంటాయి.

విపక్షాల ఐక్యతకు కారణం ఎవరు?

బీఆర్‌ఎస్‌లో చేరే విషయమై తాను తుది నిర్ణయం తీసుకోలేదని జగ్గారెడ్డి చెబుతున్నారు. ఇలా ఇద్దరు ముగ్గురు నాయకులు మినహా కాంగ్రెస్‌లో కొంత ఐక్యతా రాగం వినిపిస్తోంది. ఇందుకు కూడా కేసీఆరే కారణం. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే మరింత నిరంకుశంగా వ్యవహరించి తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారన్న భయంతో కాంగ్రెస్‌ నాయకులు ఐక్యతా రాగం అందుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలా కారణమో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ నాయకులు ఏకం కావడానికి కేసీఆర్‌ కారణం అవుతున్నారు. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన ముఖ్య అంశం ఒకటి ఉంది! కేసీఆర్‌ చాలా ముందుచూపుతో సీమాంధ్రులను తనవైపు తిప్పుకొన్నారు. ఒకవైపు వ్యాపారస్తుల ప్రయోజనాలను కాపాడుతూ మరోవైపు సామాన్య ప్రజానీకం సమస్యలను పరిష్కరించేందుకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురికి టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేశారు. సీమాంధ్రులు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు దాదాపు పాతిక స్థానాలలో గెలుపోటములను ప్రభావితం చేయగలరని గుర్తించిన కేసీఆర్‌ వారికి సముచిత స్థానం కల్పించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ వెనుకబడి ఉన్నాయి. ఈ వర్గంపై ఆ రెండు పార్టీలూ దృష్టి సారించకపోవడం కేసీఆర్‌కు కలసి వచ్చే అంశం. కాంగ్రెస్‌, బీజేపీలకు బలమైన కమ్మ అభ్యర్థులు కూడా లేరు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఆ వర్గం ఏ వైఖరి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మారిన పరిస్థితులలో కమ్యూనిస్టులు కూడా పునరాలోచనలో పడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక నాటి నుంచి కమ్యూనిస్టులను కేసీఆర్‌ చేరదీశారు. బీజేపీని ఓడించే లక్ష్యం పేరిట అప్పటి వరకు ఎదురైన అవమానాలను దిగమింగుకొని కమ్యూనిస్టులు కూడా కేసీఆర్‌తో చేతులు కలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేస్తామని ఉమ్మడిగా ప్రకటించాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్‌ తన సహజ ధోరణికి తగ్గట్టుగా కమ్యూనిస్టులను కలిసిందీ లేదు, మాట్లాడిందీ లేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో బీఆర్‌ఎస్‌ లోపాయికారీ అవగాహన కుదుర్చుకుందన్న వార్తలు కమ్యూనిస్టులకు మింగుడు పడటంలేదు. పట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కమ్యూనిస్టులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తనకు బీజేపీతో ఎటువంటి అవగాహనా లేదని కమ్యూనిస్టులను నమ్మించే బాధ్యత కేసీఆర్‌ పైన ఉంటుంది. అలా కాని పక్షంలో జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు అనుకూలంగా తెలంగాణలో కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో జతకట్టవచ్చు. తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతున్నది? కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తారా? లేక ఇంటికి పోతారా? రేవంత్‌ రెడ్డి జాతకం ఎలా ఉండబోతోంది? అనేది రానున్న రెండు మూడు మాసాలలో ఆయా పార్టీలలో చోటు చేసుకోబోయే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

ఆర్కే

Updated Date - 2023-06-25T03:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising