RK Kothapaluku: రాష్ట్రంలో హీరోలు.. కేంద్రం ముందు జీరోలు
ABN, First Publish Date - 2023-06-11T00:38:46+05:30
ప్రజాక్షేత్రంలో బలంగా కనిపిస్తున్న రాజకీయ నాయకులు నైతిక బలాన్ని మాత్రం కోల్పోతున్నారా? తెలుగు రాష్ర్టాల విషయానికొస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఒకప్పుడు ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండిన తెలుగునాట ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే లేదనే చెప్పవచ్చు...
ప్రజాక్షేత్రంలో బలంగా కనిపిస్తున్న రాజకీయ నాయకులు నైతిక బలాన్ని మాత్రం కోల్పోతున్నారా? తెలుగు రాష్ర్టాల విషయానికొస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఒకప్పుడు ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండిన తెలుగునాట ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే లేదనే చెప్పవచ్చు. ఒకప్పుడు జాతీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా సవాళ్లు విసిరిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు వివిధ రకాల బలహీనతలతో సతమతమవడం ఏమిటి? నాయకులలో అధికార కాంక్ష పెరిగిపోవడమే ఇందుకు కారణమా? ఉమ్మడి రాష్ట్రంలో 1982లో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేది. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ విధానాలపై అలుపెరగని పోరాటం చేసింది. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. మరిప్పుడు? రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని ప్రారంభించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో ప్రాంతీయ పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఈ ముగ్గురు నాయకులూ వివిధ కారణాల రీత్యా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదిరించలేని పరిస్థితిలో ఉన్నారు. నైతికంగా బలహీనపడటం వల్లనే కేంద్ర అధికారానికి దాసోహం అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాక్షేత్రంలో మాత్రం ఈ ముగ్గురూ బలమైన నాయకులే. నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంపై కాలు దువ్విన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హఠాత్తుగా చల్లబడిపోయారు. ఆయన ఇప్పుడు రూటు మార్చి కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాల్సిందేనని గర్జించిన కేసీఆర్, ఉన్నట్టుండి మౌన మునిగా మారిపోయారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటూ వివిధ రాష్ర్టాలలో పర్యటించిన ఆయన ఇప్పుడు అదంతా గతమంటున్నారు. గతాన్ని మరిచిపోయినట్టు వ్యవహరిస్తున్నారు. దేశంలో సర్వ అనర్థాలకు బీజేపీనే కారణమని నిందించిన పెద్దమనిషి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే అనర్థమని కొత్త పల్లవి అందుకున్నారు. కేసీఆర్ రూటు మార్చగానే కొడుకు కేటీఆర్, కూతురు కవిత కూడా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్‌గా చేసుకున్నారు. 9 ఏళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇప్పుడెందుకు టార్గెట్ చేసుకుంటున్నారు.. అంటే కారణం లేకపోలేదు. రెండేళ్ల కిందటి వరకు భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్న కేసీఆర్, ఆ తరువాత ఆ పార్టీపై ఒంటి కాలిపై లేచారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలను దున్నేస్తానని ప్రకటించారు. నిజమే కాబోలు అనుకున్నాం. ఇంతలోనే సారుతో పాటు కారు కూడా రివర్స్ గేర్ తీసుకున్నాయి. ఇంత హఠాత్తుగా బీజేపీ తియ్యగా, కాంగ్రెస్ చేదుగా ఎలా మారిపోయాయి? పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కూడా చేతులు కలిపి నిరసన వ్యక్తంచేసిన పెద్దమనిషి ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వానికి భయపడి దాసోహమంటున్నారా? అంటే అవుననే చెప్పవచ్చు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బిడ్డ కవిత ఇరుక్కున్నారు. దీంతో కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చింది. ‘యూ టర్న్’ తీసుకున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేవరకు బీజేపీపై రంకెలు వేసిన కేసీఆర్ ఇప్పుడు శరత్ అప్రూవర్‌గా మారగానే అప్పటివరకు చేసిన ప్రతిజ్ఞలను మరిచిపోయారు. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకుండా కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేసీఆర్ కుటుంబం నైతికంగా పతనమవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది. నిజానికి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని కేసీఆర్ ప్రకటించినప్పుడు కూడా ఆయనను ఇతర పార్టీల నాయకులు పెద్దగా విశ్వసించలేదు. అందుకే కేసీఆర్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నప్పటికీ దాని ప్రభావం ప్రతిపక్షాల ఐక్యతపై కనిపించడం లేదు. నైతికంగా కేసీఆర్ బలహీనపడిపోయారు. రాష్ట్రంలో ఆయన బలమైన నాయకుడే. అయితే ఆ బలం జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదగడానికి ఉపయోగడటం లేదు. నైతిక పతనమే ఇందుకు కారణం. తెలంగాణలో తానేం చేసినా చెల్లుబాటవుతుందని నమ్మడం వల్లనే ఆయన ఎప్పటికప్పుడు నాలుక మడతేస్తుంటారు. నిన్నటి వరకు భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రిని తిట్టిపోసిన మీరు ఇప్పుడు అది మరిచిపోయి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిడుతున్నారని బహిరంగ సభలలో ఎవరూ ప్రశ్నించకపోవచ్చును గానీ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం వెనుక జగన్మోహన్‌రెడ్డి పాత్ర ఉందని, జగన్ ద్వారా తన బిడ్డ కవిత జోలికి రావద్దని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని గత వారమే నేను చెప్పాను. ఇప్పుడదే రుజువవుతోంది. జగన్‌కు కావాల్సిన అవినాశ్ రెడ్డి, కేసీఆర్‌కు కావాల్సిన కవిత క్షేమంగా ఉన్నారు, ఉంటారు. చట్టం మాత్రం తన పని తాను చేయదు.
రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా?
ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడేవారు. ఇప్పుడు స్వప్రయోజనాల కోసం దేబిరించే పరిస్థితికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముందు మోకరిల్లితే చాలు స్వరాష్ర్టాలలో ఎన్ని తప్పులైనా చేయవచ్చు, ఎంత నిరంకుశంగానైనా పాలించవచ్చు అన్న ధోరణి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రబలుతోంది. కేసీఆర్ ఇందుకు మినహాయింపు అని నిన్నటివరకు అమాయకంగా నమ్మినవాళ్లు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఉద్యమ పార్టీలు నైతికంగా పతనం కావడం కొత్త కాదు. బిహార్ నుంచి ఝార్ఖండ్ రాష్ట్రం విడివడటానికి కారణమైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా గురించి తెలిసిందే. ఇప్పుడు బీఆర్‌ఎస్ వంతు వచ్చింది. ఇక మీదట జాతీయ రాజకీయాలలో అది చేద్దాం, ఇది చేద్దాం అని కేసీఆర్ అన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవచ్చు. కేసీఆర్ బలహీనతల గురించి తెలియని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ప్రతిపక్ష ఐక్యతకు రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తానని ఆ మధ్య ప్రకటించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలలో ప్రతిపక్షాల ఐక్యత అని పర్యటించిన కేసీఆర్, ఇకపై ప్రగతి భవన్ నుంచి కాలు బయట పెట్టకపోవచ్చు. ఎవరెవరినో రప్పించుకుని బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటనలు మాత్రం చేస్తుండవచ్చు. మొత్తంమీద కేసీఆర్ అనే పుష్పం జాతీయ రాజకీయాలలో పరిమళించకుండానే వాడిపోయింది. బిడ్డ కంటే దేశం, రాష్ట్రం ముఖ్యం అనుకోవడానికి ఆయనేమైనా తొలి తరం నాయకుడా? ప్రస్తుత రాజకీయాలను, ప్రజల బలహీనతలను ఒడిసిపట్టుకున్న ఫక్తు రాజకీయ నాయకుడు.
ఇదీ చంద్రబాబు పరిస్థితి..
ఇప్పుడు చంద్రబాబునాయుడు విషయానికొద్దాం. ఒకప్పుడు ప్రతిపక్ష రాజకీయాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏలో కూడా కీలక భాగస్వామిగా ఉండి, వాజపేయి ఏడేళ్లపాటు ప్రధానిగా కొనసాగడానికి దోహదపడ్డారు. 2019 ఎన్నికల ముందు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదిర్చేందుకు శ్రమించారు. అదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విరోధం తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో ఘోరంగా ఓడిపోయారు. జాతీయ స్థాయిలో కూడా ప్రతిపక్షాలు చతికిలపడ్డాయి. మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. అంతే.. చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ చర్యల నుంచి తనను, తన వాళ్లను కాపాడుకోవటమే ఆయనకు ప్రధానమైంది. దీంతో బీజేపీ పెద్దలతో రాజీ ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. ప్రధానమంత్రి తమపై ఆగ్రహంగా ఉన్నారని తెలిసి ఆయనను చల్లబరిచేందుకు తనవంతు ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డితో తలపడుతూనే కేంద్రంలో నరేంద్ర మోదీతో కూడా తలపడే పరిస్థితిలో చంద్రబాబు లేరు. ఈ కారణంగా బీజేపీకి స్నేహ హస్తం చాస్తూ, ప్రతిపక్షాలకు దూరం జరిగారు. జగన్‌కు కేంద్ర బలం తోడైతే తాను తట్టుకోలేనన్నది చంద్రబాబు అభిప్రాయం కావచ్చును కానీ.. ప్రతిపక్ష రాజకీయాలలో ఆయన కూడా విశ్వసనీయత కోల్పోయారు. స్థానిక పరిస్థితులను బట్టి కాంగ్రెస్ – బీజేపీతో సర్దుబాటు చేసుకోవడం ప్రాంతీయ పార్టీలకు కొత్త కాదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక్కరే ప్రతిపక్షాలకు, జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అందుకే ఆయన కడుపులో చల్ల కదలకుండా స్వరాష్ట్రంలో రాజకీయం చేసుకుంటూ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు కేంద్ర పెద్దల ముందు రాజీ కోసం సాగిలపడుతున్నారని జగన్ అండ్ కో విమర్శించారు. ఐదేళ్ల గ్యాప్ తరువాత అమిత్ షాతో చంద్రబాబు సమావేశమైనందున దానికి ప్రాధాన్యం లభించింది. ఇద్దరు కీలక నేతలతో పాటు జేపీ నడ్డా కూడా పాల్గొన్న ఈ సమావేశంలో రాజకీయాలు, పొత్తుల గురించి చర్చకు రాకుండా ఉంటుందా? ఆరెస్సెస్ ఒత్తిడి కారణంగా ఈ సమావేశం ఏర్పాటైందన్న అభిప్రాయం కూడా ఉంది. చంద్రబాబుతో చేతులు కలిపి జగన్మోహన్‌రెడ్డిని అధికారం నుంచి తప్పించని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ మతవ్యాప్తికి అడ్డుకట్టవేయలేమన్నది ఆరెస్సెస్ భావనగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఏ మాత్రం బలం లేకపోయినా అటు జగన్, ఇటు చంద్రబాబు బలహీనతల కారణంగా కేంద్ర పెద్దలు రాష్ట్ర రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్నారు. చంద్రబాబు– జగన్ మధ్య ఉన్న శతృత్వాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు కూడా పోటీలు పడి మరీ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. ఈ కారణంగానే ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించిన విషయాలలో ఈ ఇరువురు నాయకులకు చోటు ఉండటం లేదు. ఆహ్వానం కూడా అందడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం వల్ల రానున్న ఎన్నికలలో లాభమా, నష్టమా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పొత్తు విషయమై తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో బీజేపీతో శత్రుత్వం పెట్టుకుని నష్టపోయాం. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మళ్లీ నష్టపోతామని తెలుగుదేశం పార్టీలోని మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే అమిత్ షాతో జరిగిన సమావేశంలో పొత్తు పెట్టుకోవడమా? లేదా? తరువాత చర్చించి నిర్ణయించుకుందామని అనుకున్నారట! అలాగని బీజేపీని దూరం చేసుకునే పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ లేదు. ఓట్లపరంగా బీజేపీతో ఉపయోగం లేకపోయినప్పటికీ పొత్తు లేదా అవగాహన వల్ల ఎన్నికల్లో జగన్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నిరోధించవచ్చన్నది తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం అభిప్రాయం. బీజేపీతో పొత్తును రాయలసీమకు చెందిన నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ముస్లింల సంఖ్య గణనీయంగా ఉన్నందున బీజేపీతో కలిసి వెళితే దెబ్బతింటామని తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకుడొకరు చెప్పుకొచ్చారు. అంతేకాదు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ విషయంలో నడుస్తున్న డ్రామాతోపాటు అనేక ఇతర విషయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిస్థితులలో బీజేపీతో కలిసి వెళ్లడమా, లేదా అన్నది తేల్చుకోలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. నిజానికి తెలుగుదేశం – జనసేన – బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తే మైనార్టీ ఓట్లపరంగా నష్టం జరిగినా మొత్తంగా మాత్రం సానుకూల వాతావరణమైతే ఏర్పడుతుందన్నది ఒక అభిప్రాయం.
కేంద్రంలో ఎవరు?
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా బండి నడవదు. ఎన్నికల తరువాత ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రానికి మద్దతు ఇవ్వక తప్పదు. జాతీయ రాజకీయాలకు సంబంధించి ప్రస్తుత అంచనాల ప్రకారం 2024లో కూడా మోదీనే మళ్లీ అధికారంలోకి వస్తారనే అంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటోంది. కర్ణాటకలో మంచి మెజార్టీతో అధికారంలోకి రావడం ఆ పార్టీకి టానిక్‌గా మారింది. కర్ణాటకలో అధికారంలో ఉండి కూడా ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్నికల ప్రచారం చేసినా కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా నిరోధించలేకపోయారు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి అండగా ఉన్నప్పటికీ డీఎంకే అధికారంలోకి రాకుండా ఆపలేకపోయారు. తెలంగాణలోని మునుగోడులో పార్టీ అభ్యర్థికి నిధులు సరఫరా చేయలేకపోయారు. ప్రజాభిప్రాయాన్ని కాదని మోదీ, షాలు కూడా ఎన్నికల్లో గెలవలేరని ఈ సంఘటనలు చెబుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వేరు. జగన్, చంద్రబాబు పరస్పరం కత్తులు దూసుకుంటూ కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తే రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికార దుర్వినియోగాన్ని తట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఈ కారణంగానే ఓట్లపరంగా ఉపయోగం లేకపోయినా బీజేపీ విషయంలో తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉంటోంది. ఈ వినయ విధేయతలు రానున్న ఎన్నికల్లో పొత్తులకు దారి తీస్తాయా? పొత్తు కుదిరితే లాభమా? నష్టమా? అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కారణమేదైనా ప్రతిపక్ష రాజకీయాల నుంచి చంద్రబాబు కూడా అవుటయ్యారు.
ఆది నుంచీ బీజేపీ చేతిలోనే జగన్..
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయానికొద్దాం! 2019 ఎన్నికల ముందు నుంచి ఆయన బీజేపీతో అవగాహనతో పనిచేస్తున్నారు. తనపై సీబీఐ కేసులు పెట్టడానికి, తాను జైలుకు వెళ్లడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని ఆయన ప్రధాన శత్రువుగా పరిగణిస్తున్నారు. ఈ కారణంగా బీజేపీతో 2019 ఎన్నికలకు ముందు నుంచి రహస్య ప్రేమాయణం నడుపుతున్నారు. అయితే ఆ పార్టీతో బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే తనకు అండగా ఉంటున్న ముస్లింలు, క్రైస్తవులు దూరమవుతారు కనుక పొత్తుల కోసం తనపై ఒత్తిడి తేవద్దని ఆయన బీజేపీ పెద్దలకు చెప్పి ఒప్పించారట! 2019కు ముందు బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ దూరమయ్యే పరిస్థితులను కూడా జగన్‌రెడ్డి ఒక వ్యూహం ప్రకారం కల్పించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే 2019 తరువాత పార్లమెంట్ ఉభయ సభలలో మోదీ ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా మద్దతు ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ కూడా ఎన్డీఏ భాగస్వామిగానే మెలుగుతోంది. రాష్ర్టానికి సంబంధించిన విషయాలలో ఆయన ప్రధానమంత్రిని చికాకు పెట్టడం లేదు. ప్రతిఫలంగా జగన్మోహన్‌రెడ్డి అడుగుతున్నది ఒక్కటే! కేవలం తనను కేసుల నుంచి కాపాడాలని మాత్రమే అడుగుతున్నారు. మోదీ – షా ద్వయానికి ఇంతకంటే ఏం కావాలి? చంద్రబాబులా జగన్ ఎదురుతిరిగే పరిస్థితిలో లేనందున వారు కూడా మహదానందంగా ఈ ప్రతిపాదనకు ఒప్పుకొన్నారు. దీంతో బీజేపీ – వైసీపీ మధ్య మొదలైన యుగళగీతం నిరాటంకంగా సాగుతోంది. ఫలితంగా జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లకు అతీగతీ లేకుండా పోయింది. ముఖ్యమంత్రికి ఇంతకంటే ఏం కావాలి? అయితే అనుకోకుండా వివేకానంద రెడ్డి హత్య కేసు వచ్చి పడింది. ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని సీబీఐ భీష్మించుకోవడంతో జగన్ మళ్లీ కేంద్ర పెద్దలను ఆశ్రయించారు. అదే సమయంలో లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఇరికించే అవకాశం కేంద్ర పెద్దలకు లభించింది. అయితే.. అందుకు బలమైన సాక్ష్యం కావాలి. ఇంకేముందీ, కేంద్ర పెద్దలు పావులు కదిపారు. శరత్‌చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చాలని జగన్‌కు సూచించారు. అంతకంటే ముందు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను అప్రూవర్‌గా మార్చాలని ప్రతిపాదించారు. అయితే జీవితమంతా జైలులో గడపాల్సి వచ్చినా ఫర్వాలేదు కానీ తాను మాత్రం అప్రూవర్‌గా మారబోనని రాఘవ తెగేసి చెప్పారు. దీంతో శరత్‌చంద్రారెడ్డిని ఒప్పించాల్సిన బాధ్యత జగన్‌పై పడింది. కొడుకు శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేందుకు ఆయన తండ్రి, అరబిందో ఫార్మా అధిపతి రామ్‌ప్రసాద్ రెడ్డి తొలుత అంగీకరించకపోయినా చివరకు తప్పలేదు. అంతే తెర వెనుక జరగాల్సినవి జరిగిపోయాయి. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరతామని ప్రకటించిన సీబీఐ పంజరంలో చిలుకలా మారిపోయింది. అవినాశ్ రెడ్డిని ఏ8గా చేర్చి చేతులు దులుపుకొంది. ప్రజా క్షేత్రంలో జగన్మోహన్‌రెడ్డికి కూడా బలం ఉంది. అయితే కేసుల కారణంగా కేంద్ర పెద్దల ముందు ఆయన బలం తెల్లబోతోంది. రాష్ట్రం చిన్నబోతోంది. ‘కానూన్ కా హాత్ బహుత్ లంబా హై’ అంటారు కానీ పై స్థాయిలో చోటుచేసుకుంటున్న ఒప్పందాల వల్ల చట్టాలు చేతులు ముడుచుకుంటున్నాయి. ఈ పరిస్థితులలో ప్రతిపక్ష రాజకీయాల గురించి ఆలోచించే సాహసం కూడా జగన్ చేయలేరు. అయితే అధికారంలో ఉన్న నాయకుల మధ్య అవగాహన కుదిరితే నేరం నేరం కాకుండా పోతుందా? కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమేర జరిగింది. అయితే మోదీ, షా ద్వయం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ఏజెన్సీలు అన్నీ ప్రైవేటు సంస్థల్లా మారిపోయాయి. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖల అధికారులు స్వతంత్రంగా పనిచేయవచ్చునని మరిచిపోయారు. పైనుంచి ఆదేశాలు వస్తే చాలు.. కేసుల్లోని మెరిట్‌తో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు. కేంద్ర పెద్దలను ఎదిరించే వారిపైకి వేటకుక్కల్లా ఎగబడుతున్నారు. కావాల్సిన వాళ్ల విషయంలో మాత్రం పెంపుడు కుక్కల్లా తోకాడిస్తున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితులను ఇప్పుడే చూస్తున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం చూస్తున్నవారికి ఆయా వ్యవస్థల పట్ల రోత పుడుతోంది. ముంబైలో తనతో సహజీవనం చేస్తున్న మహిళను ముక్కలుగా నరికి, కుక్కర్‌లో ఉడికించి వీధికుక్కలకు ఆహారంగా వేసిన వ్యక్తిని రోజులు తిరగకుండానే సాధారణ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ప్రియురాలిని చంపి మ్యాన్‌హోల్లో కప్పిపెట్టిన పూజారిని కూడా 24 గంటలు గడవక ముందే పట్టుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మాత్రం ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ సీబీఐ నాలుగేళ్లయినా నిందితులందరినీ అరెస్ట్ చేయకపోవడమేమిటి? ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీల గురించి నిత్యం మాట్లాడే ప్రధానమంత్రి మోదీకి నైతిక బాధ్యత లేదా? ఒక ఆడకూతురు అలుపెరగని పోరాటం చేస్తున్నప్పటికీ పాపం అని ఎవరికీ అనిపించకపోవడమేమిటి? అధికారంలో ఉన్నవారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైతే దేశం ఏం బాగుపడుతుంది? పళ్లు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంటి అన్నట్టుగా పరిస్థితి మారింది. వ్యవస్థలను కుప్పకూల్చితే జాతి మనుగడ ఎలా? ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారం అంతిమం. ఆ అధికారం దేశం హితవు కోసం ఉపయోగపడాలే కానీ, అనర్హులు అధికారంలో కొనసాగడానికి, నేరస్తులు స్వేచ్ఛగా తిరగడానికి కాదు కదా? హిందూ ధర్మం చెప్పిందేమిటి? వీళ్లు చేస్తున్నదేమిటి? రాజకీయ వ్యవస్థ జుగుప్సాకరంగా మారితే పరిస్థితులు ఇలానే ఉంటాయి. ఈ పరిస్థితులలో ప్రతిపక్ష రాజకీయాలలో మనవాళ్ల పాత్ర లేకుండా పోయిందే అని వగచి ప్రయోజనం లేదు. తాము తమ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కోరుకుంటూనే ఉంటారు. అధికారంలోకి రావాలని చంద్రబాబు తపన పడుతూనే ఉంటారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పార్టీని విస్తరించాలని మోదీ, షా ద్వయం పావులు కదుపుతూనే ఉంటుంది. మేరా భారత్ మహాన్!
ఆర్కే
Updated Date - 2023-06-11T08:25:19+05:30 IST