kothapaluku: తెలంగాణలో బీజేపీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతుంది..
ABN, First Publish Date - 2023-07-09T01:30:07+05:30
టైమ్‌బాగోలేనప్పుడు ఆలోచనల్లో పదును తగ్గుతుంది. వ్యూహాలు, ఎత్తుగడలు వికటిస్తాయి. తెలివితేటలు మసకబారతాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇదే అభిప్రాయం...
టైమ్‌బాగోలేనప్పుడు ఆలోచనల్లో పదును తగ్గుతుంది. వ్యూహాలు, ఎత్తుగడలు వికటిస్తాయి. తెలివితేటలు మసకబారతాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండా మాత్రమే ఎగరాలనే పట్టుదలతో పదునైన వ్యూహాలతో పార్టీని విస్తరిస్తూ వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణ విషయంలో మాత్రం లెక్క తప్పారు. ఎన్నికల వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మాత్రమే కొనసాగుతారని ప్రకటించిన విషయాన్ని మరువకముందే హఠాత్తుగా ఆయనను తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు. దీంతో బీజేపీలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. తెలంగాణలో గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగురవేస్తామని ప్రతిజ్ఞ చేసిన కమలనాథులు అంతర్గత సమస్యల ఊబిలో కూరుకుపోయారు.
తెలంగాణలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ పెద్దలు తప్పటడుగులు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజును నియమించడం తొలి తప్పిదం కాగా, ఆయనను ఇంతకాలం కొనసాగించడం రెండో తప్పిదం. నీవు ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వ మార్పులో జాప్యం చేసిన పార్టీ అధిష్ఠానం తెలంగాణ విషయంలో అసందర్భంగా నాయకత్వాన్ని మార్చి చేతులు కాల్చుకుంది. ఈ పరిణామాలతో తెలుగునాట బీజేపీ శ్రేణులు నైరాశ్యానికి గురవుతున్నాయి. తెలంగాణలో బండి సంజయ్‌ని తొలగించడం వెనుక ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్‌లో వీర్రాజు స్థానంలో పురందేశ్వరిని నియమించడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది అన్నదే ఇప్పుడు తెలుగునాట చర్చనీయాంశంగా ఉంది.
తెలుగునాట తడబాటు...
మోదీ–షాల రాజకీయ దూకుడును తట్టుకోలేక దేశవ్యాప్తంగా అనేక పార్టీల నాయకులు రాజీ పడిపోగా, మరికొందరు రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో మోదీ, షాల రాజసూయ యాగానికి తిరుగులేకుండా పోయింది. అయితే, తెలుగునాట మాత్రం ఎక్కడో తేడా కొడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సొంత బలం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్నందున వైసీపీ తెలుగుదేశం పార్టీలపై పరోక్షంగా పెత్తనం చెలాయిస్తూ వచ్చారు. బీజేపీ పెద్దల వ్యూహం ఏమిటో తెలియదు కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రహస్య ప్రేమాయణం సాగిస్తూనే తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు స్నేహ హస్తం చాస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించి ఫాం హౌస్‌కే పరిమితం చేస్తామన్న స్థానిక నాయకుల ప్రకటనలకు తోడు మోదీ–షాల చాణక్యంపై నమ్మకం ఉండటంతో కేసీఆర్‌ను వ్యతిరేకించే వారందరూ బీజేపీ వైపు ఆశగా చూశారు. ఇందుకు తగ్గట్టుగా పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కలిగించారు.
కేసీఆర్ అండ్ కోకు వారి భాషలోనే బదులివ్వడం, కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని నమ్మబలకడంతో బీజేపీ పుంజుకుంది. జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో ఆ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఈ తరుణంలో తెరవెనుక కుదిరిన అవగాహనతో బీజేపీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాల్పుల విరమణ ప్రకటించారు. అదే సమయంలో బండి సంజయ్‌ని పార్టీ నాయకత్వం నుంచి హడావుడిగా తొలగించారు. దీంతో భారత రాష్ట్ర సమితి – భారతీయ జనతా పార్టీ మధ్య అవగాహన ఏర్పడిందన్న భావన సామాన్య ప్రజలలోనే కాకుండా, ఆ రెండు పార్టీల కార్యకర్తల్లో కూడా ఏర్పడింది. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులను కూడా కకావికలం చేస్తున్న మోదీ – షా ద్వయం కేసీఆర్ విషయంలో మాత్రం బోల్తా పడ్డారన్న అభిప్రాయం ఏర్పడింది. కుటుంబ సభ్యుల క్షేమం దృష్ట్యా కేంద్రంతో కేసీఆర్ రాజీపడ్డారన్న అభిప్రాయం బలంగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో సందర్భం లేకుండా నాయకత్వాన్ని మార్చడం ద్వారా బీజేపీ పెద్దలు చేజేతులా పార్టీని చంపేసుకునేలా చేసుకున్నారు. బండి సంజయ్‌ని తొలగించి మృదుస్వభావి కిషన్ రెడ్డిని నియమించడం ఆత్మహత్యా సదృశమని సోషల్ మీడియా హోరెత్తించింది.
అదే సమయంలో కేంద్రప్రభుత్వ ఏజెన్సీల దూకుడు తగ్గింది. నిన్నమొన్నటివరకు ఈడీ, ఐటీ దాడులతో వ్యాపారులను, బీఆర్‌ఎస్ నాయకులను ఉక్కిరిబిక్కిరిచేసిన ఏజెన్సీలు ఇప్పుడు శాంతించాయి. ఈ ఏజెన్సీలు ఇప్పటివరకూ నిర్వహించిన సోదాల్లో కేసీఆర్ కుటంబ సభ్యులను ఇరికించడానికి అవసరమైన ఆధారాలు లభించక పోయినప్పటికీ కేంద్రం వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం నెలకొనడంతోపాటు రాష్ట్ర బీజేపీలో అయోమయం ఏర్పడింది. ఈ పరిస్థితికి కేసీఆరే కారణమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రగతి భవన్ నుంచి కాలు కదపకుండానే మోదీ, షాల తంత్రానికి బ్రేకులు వేశారన్న భావన కూడా ఉంది. కేవలం తన నోటికి తాళం వేయడం ద్వారా మాత్రమే బీజేపీ పెద్దలను ఆయన శాంతింపజేశారంటే నమ్మశక్యంగా లేదు. నిజానికి రాష్ట్రంలో బీజేపీ బలహీనపడటం బీఆర్‌ఎస్‌కు మంచిది కాదు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందన్న అభిప్రాయం వేగంగా వ్యాపిస్తోంది. ఇది కేసీఆర్‌కు రాజకీయంగా మేలు చేయదు. అయితే... రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఒక వ్యూహాన్ని, ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి మరో వ్యూహాన్ని ఎంచుకుంటాయి.
ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో ద్విముఖ పోటీ జరిగితే బీఆర్‌ఎస్‌కు సొంతంగా మెజారిటీ లభించడం అంత తేలిక కాదు. అదే జరిగితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీ మద్దతు కేసీఆర్‌కు అవసరం కావొచ్చు. మోదీ–షా ద్వయం మాత్రం తెలంగాణలో ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకూడదని కోరుకుంటున్నారు. ఈ పాయింట్ ఆధారంగానే అవసరాన్ని బట్టి ఎన్నికల తర్వాత బీజేపీతో కలుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచడానికే ఈ రెండు పార్టీలూ రాజీపడి పోతాయా? అంటే చెప్పలేని పరిస్థితి. గత అనుభవాలను బట్టి కేసీఆర్ ఎవరినైనా మాయచేయగలరు. మోదీ–షాలను కూడా అలాగే మాయ చేశారా? అన్న అనుమానం కలుగకమానదు. ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర బీజేపీ నాయకులు నిమిత్తమాత్రులుగా మారిపోయారు.
కమలానికి ఏమిటీ దుస్థితి!
క్రమశిక్షణకు మారు పేరైన భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్‌ను మరపించే పరిస్థితులు నెలకొనడం ఆశ్చర్యంగానే ఉంది. పార్టీని సిద్ధాంత ప్రాతిపదికన విస్తరించే పని చేయకుండా అరువు తెచ్చుకున్న నాయకులతో బలం పెంచుకోవాలని అనుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది నిర్వివాదాంశం. ఉత్తరాదిన పార్టీని విస్తరించుకోగలిగిన మోదీ–షాలు ఇతర రాష్ర్టాలలో మాత్రం ప్రత్యర్థి పార్టీలను చీల్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేయించారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉదంతాలే ఇందుకు నిదర్శనం. స్టెరాయిడ్స్ వాడి కండలు పెంచుకున్నట్టుగా అరువు తెచ్చుకున్న నాయకులపై ఆధారపడటానికి అలవాటు పడిన మోదీ–షాలు తెలంగాణలో కూడా అదే ప్రయోగాన్ని అమలు చేశారు.
స్టెరాయిడ్స్ ప్రభావం తగ్గగానే కండలు కరిగిపోతాయి. తెలంగాణలో కూడా అరువు తెచ్చుకున్న నాయకులు అలకబూనడంతో బీజేపీ పొంగు చల్లబడిపోయింది. ఉత్తరాదిన అమలుచేసిన ఎత్తుగడలు దక్షిణాదిన చెల్లవని నేను పలు సందర్భాలలో చెప్పాను. ఇప్పుడు తెలంగాణలో పరిణామాలు అది నిజమని రుజువు చేస్తున్నాయి. బీజేపీ కేంద్ర పెద్దలు కేసీఆర్‌ను ఏ మేరకు నమ్ముతున్నారోగానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మాత్రం పూర్తిగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే రెండు రాష్ర్టాలలో రెండు పడవలపై ప్రయాణం చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకం కోల్పోతున్నందునే కేసీఆర్‌తో అవగాహన కుదుర్చుకొని ఉంటారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబైనా తమ జేబులోని మనుషులే అన్న ధీమాతో కమలనాథులు ఉన్నారు. తెలంగాణలో ఎన్నికలు జరగడానికి మరో నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఎన్నికలు సమీపించిన వేళ బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారీ అవగాహన ఏర్పడిందన్న అభిప్రాయం విస్తరించడం ఆ రెండు పార్టీలకూ మంచిది కాదు.
మోదీ–షాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లొంగదీసుకున్నారా? ఆ ఇద్దరినీ కేసీఆరే మాయ చేశారా? అన్నది పక్కన పెడితే ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో బీసీలు, ముఖ్యంగా బలమైన వర్గం మున్నూరు కాపులు బీజేపీ వైపు సానుకూల దృక్పథంతో ఉంటున్న వేళ బండి సంజయ్‌ని మార్చడంతో ఈ వర్గం పార్టీకి దూరమవుతోంది. కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ సమాజాన్ని కూడా కులపరంగా విడదీశారు. అదే ఆయనకు ఇప్పుడు శాపంగా మారబోతోంది. మున్నూరు కాపులు, ముదిరాజ్‌లు కేసీఆర్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు వారు కాంగ్రెస్ వైపు చూస్తే మాత్రం బీఆర్‌ఎస్– బీజేపీలకు ఇబ్బందే.
మార్పు... ఏ దిశగా?
తెలంగాణలో ఓటర్ల ఆలోచనల్లో మార్పు వస్తోంది. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వ్యవహార శైలి పట్ల ఆయా వర్గాలలో వ్యతిరేకత ఉంది. సీమాంధ్రులు మొదటి నుంచి కేసీఆర్‌కు అండగా ఉంటున్నారు. అయితే, ఇప్పుడు వారి ఆలోచనల్లో కూడా మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారం కోల్పోవడానికి, ఆ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమన్న భావన వారిలో ఏర్పడింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అండగా నిలవడాన్ని సీమాంధ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో మరోసారి జగన్‌కు మేలు చేస్తారని, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీలో తమకు ఉన్న ఆస్తిపాస్తుల గురించి మర్చిపోవాల్సి వస్తుందని సీమాంధ్రులలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల వరకు సీమాంధ్రులు ఇదే అభిప్రాయంతో ఉంటే కేసీఆర్‌కు రాజకీయంగా దెబ్బే. 2014 నుంచి కేసీఆర్‌కు అండగా ఉంటున్న ముస్లింలలో కూడా గణనీయంగా మార్పు వస్తోంది. బీజేపీతో కేసీఆర్‌కు అవగాహన కుదిరిందన్న ప్రచారం ప్రభావం ముస్లింలపై బలంగా ఉంది. ఈ కారణంగా ముస్లింలు ఈ పర్యాయం గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీలకు మేలు చేయకపోగా కీడు చేయబోతున్నాయి. అందుకే టైం బాగోలేనప్పుడు అపర చాణక్యులు కూడా బొక్క బోర్లా పడతారని చెబుతారు.
మూస పద్ధతితో ఘోషే...
దక్షిణాది రాష్ర్టాలలో పట్టు పెంచుకోవాలంటే తమ మూస విధానాన్ని మార్చుకోవాలని మోదీ–షాలు ముందుగా గుర్తించాలి. పార్టీ బాధ్యతలు పర్యవేక్షించే నాయకులకు హిందీ పేర్లే ఉంటాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా హిందీలోనే పేర్లుంటాయి. దీంతో దక్షిణాది రాష్ర్టాల ప్రజలకు హిందీలో ఉంటున్న పేర్లు కూడా అర్థం కావడంలేదు. ఫలితంగా బీజేపీని ఇప్పటికీ ఉత్తరాది పార్టీగానే పరిగణిస్తున్నారు. అదే సమయంలో స్థానిక నాయకులపై భరోసా ఏర్పడినప్పుడే జాతీయ పార్టీలకు ఆదరణ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న తెలుగు నాట భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బలపడాలంటే బలమైన నాయకుడ్ని ముందు పెట్టాలి. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చినట్టుగానే బండి సంజయ్ రాష్ట్ర నాయకత్వం స్వీకరించాకే బీజేపీ కార్యకర్తల్లోనూ నూతనోత్సాహం ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ అగ్ర నాయకత్వం తమ చర్య ద్వారా సొంత కార్యకర్తలనే నైరాశ్యంలో ముంచేసింది. ఇక కేసీఆర్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీతో తనకు ఎటువంటి లాలూచీ లేదని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు బీఆర్‌ఎస్ నాయకులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితిని కేసీఆర్ ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.
ఏపీలో కమలం వింత వ్యూహాలు
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే భారతీయ జనతా పార్టీ ఎత్తుగడలు వింతగా ఉంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తలుపు చాటున, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును మంచం చాటున దాచి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. రాష్ర్టాన్ని అప్పులపాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి శక్తి వంచన లేకుండా సహకరిస్తూనే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొనే విషయమై మంత్రాంగం నడుపుతోంది. అమిత్ షా– చంద్రబాబు మధ్య సమావేశం జరగగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవరానికి గురవుతున్నారు. తనకు స్నేహ హస్తం చాచిన బీజేపీని కాదనలేని స్థితిలో ఉన్న చంద్రబాబు కేంద్రం జగన్మోహన్ రెడ్డికి సహకరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఇరువురి బలహీనతల్ని ఆసరాగా చేసుకొని బీజేపీ పెద్దలు చిద్విలాసంగా ఉంటున్నారు. తెలుగుదేశం–బీజేపీ మధ్య పొత్తు ఏర్పడకూడదు అని జగన్మోహన్ రెడ్డి సహజంగానే కోరుకుంటారు. కొద్ది రోజుల క్రితం అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం కావడం జగన్ అండ్ కోలో ఆందోళన కలిగించింది.
తనపై ఉన్న కేసుల నుంచి రక్షణ కావాలంటే కేంద్రం అండదండలు జగన్‌కు కావాలి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో జట్టు కడితే ఆ రక్షణ కవచం తొలగిపోతుందన్నది జగన్ భయం. ఇంతకు మించి రాజకీయంగా ఆయనకు కలిగే నష్టం ఏమీ ఉండదు. నిజానికి తెలుగుదేశం–బీజేపీ మధ్య పొత్తు కుదిరితే వైసీపీకే ప్రయోజనం. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. రాజధాని అమరావతి మూలన పడ్డానికీ, పోలవరానికి అతీగతీ లేకపోవడానికీ, రాష్ట్రం దివాలా అంచుకు చేరడానికీ కారణమైన జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఆశీస్సులు అందిస్తూనే ఉండటాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ జట్టు కడితే సంతోషించాల్సింది పోయి జగన్ అండ్ కో ఆందోళన చెందడం ఎందుకు? అంటే, కేసుల భయమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి విషయంలో కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. సీబీఐ రూపొందించిన కౌంటర్ అఫిడవిట్‌లను కూడా న్యాయస్థానానికి సమర్పించని దుస్థితి. కేంద్ర పెద్దల అండ లేకుండా సీబీఐ తరఫు న్యాయవాదులు ఇలా సహాయ నిరాకరణ చేయగలరా? జగన్‌కు సంబంధించిన అవినీతి కేసులలో పురోగతి ఉండటం లేదంటే, దానికి కారణమెవరై ఉంటారో తెలుసుకోలేనంత అమాయకులా ప్రజలు? ప్రధానమంత్రితో తాజాగా జరిగిన సమావేశం గంటా ఇరవై నిమిషాలపాటు సాగిందని గొప్పగా చెప్పుకొన్న జగన్ అండ్ కో రాష్ర్టానికి ఏమి సాధించుకొచ్చారో మాత్రం చెప్పరు.
అంతేకాదు, దీని ద్వారా ప్రధాని ప్రాపకం కోసం వారు ఎంతగా అర్రులు చాస్తున్నారో తెలుస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇవ్వాలని కోరడానికే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తే ముస్లింల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఒక్కరే సభ్యుడు ఉన్నందున ఆ పార్టీ మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఒక్కటే. బీజేపీ పెద్దల చల్లని చూపుకోసం జగన్మోహన్ రెడ్డి ఆరాటపడుతున్నట్టుగానే సఖ్యతకోసం చంద్రబాబు ఉత్సుకతతో ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష సహకారం వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు అవసరమే. కేసుల నుంచి రక్షణకు జగన్‌కు, ఎన్నికల్లో జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కేంద్రం సహకారం అవసరం. అలా అని బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోవడానికి ఈ రెండు పార్టీలు కూడా సుముఖంగా లేవు. ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీతో చేతులు కలిపితే తెలుగుదేశం పార్టీ నష్టపోతుందన్నది విస్తృత అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు నుంచి తెర వెనుక మద్దతే ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఇదే మార్గాన్ని ఎంచుకుంటుందా? లేదా? అన్నది వేచి చూడాలి. అమిత్ షా, జేపీ నడ్డా–చంద్రబాబు మధ్య కొంత కాలం క్రితం జరిగిన సమావేశంలో పొత్తు విషయం చర్చకు వచ్చిందని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే పొత్తు విషయమై ముందుకు వెళ్లాలని స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చారని తెలిసింది. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడం వల్ల లాభమా? లేక ఎన్నికల్లో అవగాహనతో పనిచేసి, ఎన్నికల తర్వాత పరస్పరం సహకరించుకోవడమా? అన్నది నిదానంగా నిర్ణయించుకుందామని సదరు సమావేశంలో ఉభయులూ అభిప్రాయపడ్డారట.
జనం చేతిలో ఏపీ భవిత...
నిజానికి ఇప్పుడు ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారన్న దాని కంటే రాష్ట్రాన్ని ఒడ్డున వేయడం ఎలా? అన్నది ప్రజల ముందున్న అతి పెద్ద సవాల్. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారా? జగన్ గెలుస్తారా? అన్నది ప్రధానం కాకూడదు. రాష్ట్రం గెలవాలి. అధోగతి పాలైన రాష్ట్రం తిరిగి అభివృద్ధి పట్టాలపైకి ఎక్కాలి. అది ఎవరి వల్ల సాధ్యమో వారే గెలవాలి. సంక్షేమం పేరిట పోటీపడి హామీలు ఇవ్వడం కాదు– తమకు అవకాశం ఇస్తే రాష్ర్టాన్ని ఎలా బాగుచేస్తారో చెప్పాలి. నాయకులు గెలిచి రాష్ట్రం, ప్రజలు ఓడిపోకూడదు. దేశంలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎలా కాపాడతారో చెప్పాల్సిన బాధ్యత బీజేపీపై కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు తమ జేబులో ఉన్నారన్న ధీమాతో కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం పాకులాడితే తాము దేశ భక్తులమని చెప్పుకొనే అర్హత నరేంద్ర మోదీ కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రం హితం కోరేవారు చచ్చుబడిపోయారు. పౌర సమాజం నిట్ట నిలువునా చీలిపోయింది. మీడియాతో పాటు మేధావులు అనబడేవారు కూడా చీలిపోయారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు భిన్నంగా ఎన్నికలు జరిగితే 25 లోక్‌సభ స్థానాలకుగానూ 24 స్థానాలను అధికార పార్టీయే గెలుచుకుంటుందని సర్వే రిపోర్టులు వండి వార్చుతున్న మీడియాను కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలనే నిజమైన ప్రగతికి చిహ్నమని ప్రధాని మోదీ నమ్మితే అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. కాదని భావిస్తే జగన్‌ను అడ్డగోలుగా సమర్థించే వైఖరికి స్వస్తి చెప్పాలి.
రానున్న ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలన్నదే ప్రధాన ఎజెండా కావాలి. కేసీఆర్ వంటి వాళ్లు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో తమకు ఎవరు కావాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించుకోవాలి. రాజకీయ నాయకులకు వారి ఎజెండాలు వారికి ఉంటాయి. ప్రజలకు మాత్రం తమ భవిష్యత్తు మాత్రమే ఎజెండాగా ఉండాలి. గ్లోబల్ లీడర్‌గా ఎదిగానని భావిస్తున్న మోదీ రాజనీతిజ్ఞుడుగా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉండబోతున్నది అన్నదాన్ని బట్టి రెండు తెలుగు రాష్ర్టాల్లో ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించినంత మాత్రాన ప్రజల్లో మార్పు రాదు. బీజేపీపై ఆంధ్రప్రదేశ్ ప్రజల కోపతాపాలు చల్లబడాలంటే ఆ పార్టీ పెద్దల వైఖరిలో మార్పు రావాలి. ఎవరి వైఖరి ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో మాత్రం రాష్ట్రం గెలవాలి. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ తల ఎత్తుకొని నిలబడగలదు.
ఆర్కే
Updated Date - 2023-07-09T08:55:44+05:30 IST