Kotha Paluku : ‘న్యాయం’ కావాలి!
ABN, First Publish Date - 2023-10-29T05:33:59+05:30
‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అని అంటారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో ఇదే జరుగుతోందన్న భావన విస్తృతంగా వ్యాపించింది. న్యాయం ఆయనతో దాగుడు మూతలు...
‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అని అంటారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో ఇదే జరుగుతోందన్న భావన విస్తృతంగా వ్యాపించింది. న్యాయం ఆయనతో దాగుడు మూతలు ఆడుతోంది. స్కిల్ కేసులో అరెస్ట్ కాబడిన చంద్రబాబు జైలుకు వెళ్లి 50 రోజులు పూర్తయింది. అయినా ఇటు మధ్యంతర బెయిల్, అటు క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానాల నిర్ణయానికి అతీగతీ కనిపించడం లేదు. ఆయన పెట్టుకున్న పిటిషన్ల విచారణలో అసాధారణ జాప్యం జరుగుతోంది. న్యాయం ఆయనకు ఎండమావిలా మారింది. మిగతా వ్యవస్థలలో అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తారు. అలాంటి న్యాయస్థానాలలోనే చంద్రబాబు స్థాయి వ్యక్తికి కూడా న్యాయం సకాలంలో లభించకపోవడం విపరీతం కాదా? ఏ స్కిల్ కేసులో అయితే సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారో అదే కేసులో ప్రధాన నిందితుడికి కూడా 33 రోజులకే బెయిల్ లభించింది. ప్రధాన నిందితుడు కన్విల్కర్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ అధికారులు చెబుతున్నప్పటికీ ఆయనకు బెయిల్ లభించింది. చంద్రబాబు విషయంలో ఇటు సీఐడీగానీ, అటు ఈడీగానీ మనీ ట్రెయిల్ జరిగినట్టు ఇంతవరకు నిరూపించలేదు. ఆయనకు డబ్బు ముట్టిందని కూడా చెప్పలేక పోతున్నారు. అయినా 50 రోజులుగా ఆయన జైలుకే పరిమితం కావడం ఏమిటి? చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు ఈ 50 రోజులలో ఆయనకు వ్యతిరేకంగా కనీసం ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయారు. అయినా ఆయన ఇంకెన్ని రోజులు జైల్లో ఉండాలి? వివేకానంద రెడ్డి హత్యతో సంబంధం ఉందని బల్లగుద్ది మరీ చెబుతున్న సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయలేకపోయారు. న్యాయస్థానం కూడా ఆయనకు ఉపశమనం కల్పించింది. ఇదే హత్య కేసులో ముద్దాయిగా ఉన్న అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డికి కూడా అనారోగ్య కారణాలపై బెయిల్ లభించింది. చంద్రబాబు అనారోగ్య కారణాలపై పెట్టుకున్న బెయిల్ దరఖాస్తు మాత్రం సాంకేతిక కారణాలతో విచారణకు కూడా రాకుండా పోయింది. ఇలాంటి కేసులను విచారణ కోసం లిస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు పిటిషన్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు.
కేసు కేసుకూ... కోర్టు కోర్టుకూ!
లిక్కర్ కేసులో ఆరు నెలల క్రితం అరెస్టు కాబడిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ కూడా కోల్డ్ స్టోరేజీకి వెళ్లింది. సిసోడియాపై దర్యాప్తు సంస్థలు మోపిన అభియోగాలు న్యాయ పరిశీలనలో ఐదు నిమిషాలపాటు కూడా నిలవబోవని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించినప్పటికీ ఆయనకు బెయిల్ మాత్రం మంజూరు కావడం లేదు. పది నిమిషాల తర్వాత ఉత్తర్వులు ఇస్తామన్న ధర్మాసనం రెండు వారాలు గడచినా పలకడం లేదు. కోడి కత్తి కేసులో కుట్ర కోణం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. అయినా నిందితుడు శ్రీనివాస్ ఐదేళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్నారు. నేర నిరూపణ జరిగినా ఆయనకు అంతకాలం శిక్ష పడుతుందో లేదో తెలియదు. ఈ కేసులో దాడికి గురైన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఐఏ దర్యాప్తు సహజంగానే సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో లోతైన విచారణ జరగాలంటూ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును వెంటనే విచారణకు స్వీకరించిన హైకోర్టు కింది కోర్టులో విచారణను రెండు నెలలపాటు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులను పరిశీలిస్తే అవినాశ్ రెడ్డికీ, జగన్మోహన్ రెడ్డికీ ఒక న్యాయం... చంద్రబాబు, మనీశ్ సిసోడియా, ‘కోడికత్తి’ శ్రీనివాస్ విషయంలో మరో న్యాయం కనిపించడంలేదా!? చంద్రబాబు ముఖ్యమంత్రికి రాజకీయ ప్రత్యర్థి. ఢిల్లీలో సిసోడియా అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర పెద్దలకు రాజకీయ ప్రత్యర్థిగానే ఉన్నారు. అవినాశ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాత్రం కావాల్సిన వారయ్యారు. ఇందులో న్యాయం, అన్యాయం అనే పదాలకు తావు లేకుండా పోయింది. నేరం చేసిన వాళ్లు మనవాళ్లయితే వారిని న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేవన్నది ప్రజల భావన. మనవాళ్లు కాకుంటే నేరం చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి వస్తున్నది. ఈ భావన ప్రజలందరిలోనూ ఏర్పడుతోంది. సామాన్య ప్రజలకు న్యాయస్థానాలు మాత్రమే దిక్కు. ఇప్పుడు ఆ న్యాయస్థానాలలో కూడా న్యాయం ఎండమావిగా మారిపోయింది. ఏ కేసులలో నిర్ణయాలు, తీర్పులు వేగంగా వెలువడుతాయో, ఏ కేసులలో విచారణకు కూడా అతీగతీ ఉండదో తెలియని పరిస్థితి. చంద్రబాబు అండ్ కో వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా నేరాలు చేసి కూడా తప్పించుకుంటున్నారని జగన్ అండ్ కో ఎప్పటి నుంచో అంటున్నారు. అదే నిజమైతే అనేక అవినీతి కేసులలో ప్రథమ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం విచారణకు కూడా హాజరు కాకుండా మినహాయింపు ఎలా పొందగలిగారు? ఆయనపై దాఖలైన కేసులు పుష్కర కాలం అవుతున్నా కనీసం విచారణకు కూడా నోచుకోకపోవడం ఏమిటి? దీన్ని బట్టి వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారో అర్థం కావడంలేదా? జగన్ అండ్ కో చెబుతున్న వ్యవస్థలలో న్యాయ వ్యవస్థ కూడా ఉందనుకోవాలి. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయవచ్చునని ఆయన భావించడం సహజం. ఎందుకంటే ఆయన ఎలా కోరుకుంటున్నారో న్యాయస్థానాలలో అలాగే జరుగుతోంది. పలు అవినీతి కేసులలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితిలో ఉండటం దౌర్భాగ్యం కాదా? ప్రజాస్వామ్యానికి ఇంతకు మించిన ముప్పు ఏమి ఉంటుంది?.
జవాబుదారీతనం ఏదీ?
‘తాను నిర్దోషినని రుజువు చేసుకున్న మీదటే చంద్రబాబు బయటకు వస్తే మంచిది. బెయిల్ కోసం దరఖాస్తు ఎందుకు?’ అని సజ్జల వంటి వారు సుద్దులు చెబుతున్నారు. ఈ మాటలు గురివింద సామెతకు కచ్చితంగా సరిపోతాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో తన పాత్ర లేదని రుజువు చేసుకోకుండా అవినాశ్ రెడ్డి బెయిల్ కోసం ఎందుకు వ్యవస్థలను మేనేజ్ చేశారో సజ్జల అండ్ కో చెబుతారా? తాను అవినీతికి పాల్పడలేదని రుజువు చేసుకోకుండా దశాబ్ద కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై ఎందుకుంటున్నారో చెబుతారా? అధికారంలో ఉంటే నీతిమాలిన వ్యాఖ్యలు చేయవచ్చునని సజ్జల అండ్ కో భావిస్తున్నట్టు ఉంది. జగన్ వంటి వారిని చూశాక ఈ దేశంలో ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయవచ్చునన్న భావన దేశ ప్రజలలో ఏర్పడిన మాట నిజం కాదా? న్యాయ వ్యవస్థ కూడా మిగతా వ్యవస్థల జాబితాలో చేరిపోవడం నిజం కాదా? న్యాయ వ్యవస్థపై ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి. అయితే, న్యాయ వ్యవస్థలో కొంత మంది పుణ్యమా అని ఆ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పూర్తిగా పోలేదు. అయితే, అనేక కేసులలో నిందితులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వంటి వారు కూడా వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతున్నారంటే అంతకంటే విషాదం ఏముంటుంది? ఏ వ్యవస్థను ఎవరు మేనేజ్ చేయగలిగినా చివరికి న్యాయ వ్యవస్థ ఉంది కదా, అక్కడ న్యాయం దక్కకపోదు అనే నమ్మకం ఇప్పటివరకు ప్రజల్లో ఉంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే ఆ విశ్వాసం కూడా సడలుతోంది. చంద్రబాబు విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యం దేనికి సంకేతం? జగన్ వంటి వారు న్యాయ వ్యవస్థను కూడా చెరబట్టారని ఎవరైనా విమర్శిస్తే తప్పు పట్టాల్సింది ఏముంది? క్వాష్ పిటిషన్‌లోగానీ, బెయిల్ పిటిషన్‌లోగానీ రోజుల తరబడి వాదనలు జరగడం, నిర్ణయాలకు అతీగతీ లేకుండా పోవడం, ఆరోగ్య కారణాలపై పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణకు కూడా నోచుకోకపోవడం దేనికి సంకేతం? అవినీతి ఆరోపణలు ఉన్న ప్రజాప్రతినిధుల కేసుల విచారణను ఏడాది లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్వయంగా ప్రకటించినా జగన్ కేసులలో కనీసం విచారణ కూడా జరగకపోవడంలో ఆంతర్యం ఏమిటి? ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు? అత్యున్నత పదవులలో ఉన్న వారి ప్రభావం న్యాయ వ్యవస్థపై ఉంటుందన్న అభిప్రాయం న్యాయ వ్యవస్థలోనే ఉన్న విషయం వాస్తవం కాదా? ఈ దేశ ప్రధాని ఎన్నిక చెల్లదని సంచలన తీర్పు ఇచ్చిన న్యాయాధికారిని చూశాం. ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల మనోభీష్టానికి అనుగుణంగా నడుచుకుంటున్న అత్యున్నత న్యాయ వ్యవస్థలోని వ్యక్తులను చూస్తున్నాం. ఈ కారణంగానే న్యాయమూర్తుల నియామక ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. ఈ మహా పతనాన్ని చూసిన తర్వాత న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలన్న వాదనకు బలం చేకూరుతోంది. ఫలానా న్యాయాధికారి లేదా న్యాయమూర్తి తప్పు చేశారని తెలిసినా బహిరంగంగా విమర్శించకుండా ఒక సదుద్దేశంతో రక్షణ కల్పించారు. ఇప్పుడు ఈ రక్షణ కవచాన్ని న్యాయ వ్యవస్థ దుర్వినియోగం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పలు కేసులలో న్యాయాధికారులు, న్యాయమూర్తులు అడ్డగోలు తీర్పులు ఇవ్వడం బహిరంగ రహస్యమే. తప్పు చేసిన న్యాయాధికారులను అడపాదడపా శిక్షిస్తున్నారనుకున్నా న్యాయమూర్తులకు మాత్రం రాజ్యాంగపరమైన రక్షణ ఉంటోంది. ఎవరైనా న్యాయమూర్తి అవినీతికి పాల్పడినా ఆయనను తొలగించాలంటే చాంతాడంత ప్రొసీజర్ ఉంటోంది. ఏ న్యాయమూర్తి ఏ న్యాయవాదికి సన్నిహితం అని చూసుకున్న మీదటే కక్షిదారులు సదరు న్యాయవాదుల వద్దకు వెళుతున్న విషయం నిజం కాదా? ఫలానా కోర్టులో అనుకూల తీర్పు రావాలంటే ఫలానా న్యాయవాదిని సంప్రదించాలనుకోవడం బహిరంగ రహస్యం కాదా? న్యాయ వ్యవస్థలో బలహీనతలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇప్పటిలా న్యాయ వ్యవస్థ మునుపెన్నడూ ఇంత బలహీనంగా, బేలతనంతో లేదు.
ఏం తేల్చినట్లు?
ఇంతకూ స్కిల్ కేసులో చంద్రబాబు చేసిన నేరం ఏమిటి? ఆయన అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉన్నాయా? చంద్రబాబుకు కమీషన్లు ముట్టాయని సీఐడీ అధికారులుగానీ, ఫోరెన్సిక్ ఆడిట్‌లోగానీ, ఈడీ అధికారుల విచారణలోగానీ రుజువు కాలేదు. కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించలేక పోయారు. అయినా ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మనీ ట్రెయిల్ జరగలేదని ఇవాళ కాకపోయినా రేపైనా స్పష్టం అవుతుంది. అప్పుడు కనీస ఆధారాలు కూడా లేని ఒక కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపిన న్యాయాధికారి ఏ బాధ్యత తీసుకుంటారు? సదరు న్యాయాధికారి తప్పు చేసి ఉంటే ఆమెపై చర్యలు తీసుకొనే పరిస్థితి ఉంటుందా? ఇవాళ అధికారులు అంతో ఇంతో ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉంటున్నారంటే న్యాయ స్థానాలను చూసి భయంతోనే కదా? భయం లేనప్పుడు మరింత విచ్చలవిడితనం వచ్చి ఉండేది. న్యాయ వ్యవస్థలో కూడా ఇలాంటి భయం ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అన్నదానిపై చర్చ జరగాలి. ‘మేం ఏ నిర్ణయాలు తీసుకున్నా, అపసవ్య తీర్పులు ఇచ్చినా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అన్న భావన న్యాయ వ్యవస్థలో ఉండటం వల్లనే కదా జవాబుదారీతనం లోపిస్తున్నది. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పటిష్ఠమైన సాక్ష్యాధారాలు లేకపోయినా 50 రోజులుగా జైల్లో నిర్బంధించడం అనేక ప్రశ్నలను మన అందరి ముందూ ఉంచుతున్నది. ఒకే తరహా కేసుల్లో ఒక్కో రకంగా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం అన్యాయం కాదా? న్యాయం చేయమని తమ తలుపు తట్టే వారికి అన్యాయం చేయడం న్యాయ వ్యవస్థకు శోభనివ్వదు. ఇదే ఒరవడి కొనసాగితే న్యాయస్థానాల పేరు మార్చాలన్న డిమాండ్ కూడా రావొచ్చు. న్యాయమూర్తుల పట్ల ఒకప్పుడు ప్రజల్లో అపార గౌరవం ఉండేది. ఇప్పుడు ఏ కేసు ఎవరి దగ్గరకు వస్తే తీర్పు ఎలా ఉండబోయేదీ ముందుగానే ఊహించుకుంటున్నారు. న్యాయం మాత్రమే జరగాలని కోరుకునేవారు నిక్కచ్చిగా వ్యవహరించే న్యాయమూర్తుల వద్ద తమ కేసుల విచారణ జరగాలని కోరుకోవడం నిజం కాదా? చంద్రబాబు ఇవాళ కాకపోతే రేపైనా విడుదలవుతారు. న్యాయ వ్యవస్థ మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రజలు అమాయకత్వం వల్లనో లేక ఆశపడో ముద్దాయిలకు అధికారం అప్పగించినంత మాత్రాన... అత్యున్నత స్థాయిలో ఉన్న న్యాయమూర్తులు వారిని వ్యక్తిగతంగా కలుసుకోవచ్చా? అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెలువడవా? కేసుల్లో చిక్కుకున్న వ్యక్తులు అధికారంలోకి వచ్చినప్పటికీ అలాంటి వారితో ఎలాంటి ఒప్పందాలూ చేసుకోకూడదన్న నిబంధన అనేక దేశాలలో ఉంది. జగన్ విషయమే తీసుకుందాం! ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రధానమంత్రిని, ప్రధాన న్యాయమూర్తులను కలుసుకున్నారు. దీని ప్రభావం కింది స్థాయి వ్యవస్థలపై ఉండదా? న్యాయమూర్తులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్రపతి సైతం ఈ దేశపు అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడలేదా? అవినీతి కేసులో ఈ దేశ ప్రధాని సైతం కింది స్థాయి కోర్టులో విచారణకు హాజరు కాలేదా? ప్రధానమంత్రి కంటే బిజీగా ముఖ్యమంత్రి ఉంటారా? అలాంటప్పుడు కేసు విచారణకు హాజరు కాకుండా జగన్‌కు మినహాయింపు సబబా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. జగన్ కేసుల విచారణను ఏడాది లోపు పూర్తి చేయలేరా? ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బెయిల్‌పై ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటమే విచిత్రం. విదేశాలకు వెళ్లాలన్నా ఆయన కోర్టు అనుమతి పొందాలి. ఇది మన ప్రజాస్వామ్యానికే కాదు– ముఖ్యమంత్రిగా ఆయనను ఎన్నుకొన్న ప్రజలకు కూడా అవమానం కాదా? అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు తప్పులు చేస్తే సరి చేయడానికి న్యాయ వ్యవస్థ ఉంది. అలాంటి న్యాయ వ్యవస్థలో ఉన్న వారు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల అభీష్టానానికి అనుగుణంగా నడుచుకుంటున్నారన్న భావన ఏర్పడినంత కాలం న్యాయ వ్యవస్థ ఔన్నత్యం మసకబారుతూనే ఉంటుంది.
చంచల్‌గూడ విలాసాలు...
జైలులో తన ప్రాణాలకు ముప్పు ఉందని రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయాధికారికి లేఖ ద్వారా మొరపెట్టుకున్నారు. ఈ లేఖపై న్యాయాధికారి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కారాగారంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసిందే. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లోని చంచల్ గూడ జైలులో రెండు నెలల పాటు గడిపిన ఒక రాజకీయ ప్రముఖుడిని అక్కడి పరిస్థితుల గురించి నేను అడిగాను. ఆయన చెప్పిన మాటలు విన్నాక నేను నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది. ఆయన చెప్పిన దాని ప్రకారం.. చంచల్‌గూడ జైల్లో సకల సౌకర్యాలూ లభిస్తాయి. మాంసాహారంతోపాటు ఏం కావాలన్నా వండిపెట్టేవారు సిద్ధంగా ఉంటారు. కాళ్లూ, ఒళ్లూ మర్దన చేసే వాళ్లు కూడా ఉంటారు. రాత్రి వేళల్లో మందు కావాలన్నా సరఫరా చేస్తారు. ఇవన్నీ చేయడానికి చంచల్‌గూడ జైల్లో ఒక ముఠా ఎప్పుడూ రెడీగా ఉంటుందట. దాదాపు ఇరవై మంది విచారణ ఖైదీలు ఈ సేవలకోసం ఉంటారు. వాళ్లు బెయిల్‌పై వెళ్లిపోతే వెంటనే మరో ముఠా విచారణ ఖైదీలుగా వస్తారట. జగన్ అండ్ కో చంచల్‌గూడ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఏర్పాట్లు ఉండేవి. అప్పుడు అధికారంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జగన్ అండ్ కోపై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. దీంతో జగన్ అండ్ కో ఆడుతూ పాడుతూ జైలు జీవితం గడిపేశారు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి వేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన పట్ల ఎంత కక్ష ఉందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ప్రతి కదలికనూ ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. దీంతో జైలు అధికారులు కూడా చంద్రబాబుకు ఎటువంటి వెసులుబాటు ఇవ్వడం లేదు. చంచల్‌గూడ జైల్లో లభించే భోగాలు చంద్రబాబుకు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాసిన లేఖలోని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు–చంద్రబాబు చస్తారు’ అని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదుగానీ ఈ వ్యాఖ్యలు చంద్రబాబు వ్యక్తం చేసిన ఆందోళనకు బలం చేకూరుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి నైజం గురించి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు. ఇటీవల జగన్ తల్లి విజయలక్ష్మి ఒంగోలు వెళ్లి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు, పెట్టిన శాపనార్థాలు జగన్ ఎటువంటి వారో చెప్పకనే చెబుతున్నాయి. రక్తం పంచుకుపుట్టిన సోదరి షర్మిల ఆర్థిక కష్టాల్లో ఉన్నందున ఆస్తుల పంపకం చేయాలని తాను కోరినా జగన్ నుంచి స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను, షర్మిల ప్రస్తుతం ఉన్న దుస్థితికి జగన్ భార్య భారతి ప్రధాన కారణం అని ఆమె నిందించారు కూడా! సొంత సోదరికి అన్యాయం చేస్తున్న జగన్‌రెడ్డి బాగుపడడు అని కూడా విజయలక్ష్మి శాపనార్థాలు పెట్టారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, బాలినేని కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి రాజ మహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబును ఇబ్బంది పెట్టకుండా ఉంటారా? రాజకీయాలలో ఈ స్థాయి కక్షలు, కార్పణ్యాలను ఇప్పుడే చూస్తున్నాం. ఒకప్పుడు తమిళనాడులో కరుణానిధి, జయలలిత మధ్య నెలకొన్న వైరం గురించి కథలు కథలుగా విన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. చంద్రబాబును జైలులో బంధించి జగన్మోహన్ రెడ్డి ఏమి సాధించారో తెలియదుగానీ చంద్రబాబు ఏమిటో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అందరూ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఐటీని ప్రోత్సహించడం వల్ల మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న ఐటీ ఉద్యోగులు ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాకుండా పలు ఇతర రాష్ర్టాలలో, విదేశాలలో సంఘీభావ ర్యాలీలు చేస్తున్నారు. ఆయన వల్ల సైబరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకొనే అవకాశం ఈ తరానికి వచ్చింది. Blessing in disguise అంటే ఇదేనేమో!
ఆర్కే
Updated Date - 2023-10-29T06:01:22+05:30 IST