ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూస్వాముల స్వీట్ రివెంజ్ : రైతు బంధు

ABN, First Publish Date - 2023-06-07T01:36:07+05:30

ఈ వ్యాసం రాష్ట్రంలోనే అత్యధిక జనమైన రైతులకు వారికి ఇతర సహాయాలని నిలిపివేసి రైతుబంధు పేరిట రెండు విడతల్లో ఏటా పదివేల సహాయాన్ని అందిస్తూ స్వయంగా సాగు చేయని భూస్వాములకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ వ్యాసం రాష్ట్రంలోనే అత్యధిక జనమైన రైతులకు వారికి ఇతర సహాయాలని నిలిపివేసి రైతుబంధు పేరిట రెండు విడతల్లో ఏటా పదివేల సహాయాన్ని అందిస్తూ స్వయంగా సాగు చేయని భూస్వాములకు కోట్లాది రూపాయలు పంపిణీ చేయడం గురించి, వారి పేరిట భూములను స్థిరీకరించడం గురించి, తద్వారా అసమానతల సమాజాన్ని పెంచి పోషించడం గురించి. అవును. సకల జనుల పోరాట ఫలితంగా సాధించిన స్వరాష్ట్రంలో ‘రైతు బంధు’ పేరిట ‘భూస్వామ్య’ బంధు కేసిఆర్ గారి ఆధ్వర్యంలో సజావుగా అమలవుతున్నది.

నిజాం పాలనకు, అలాగే ఇక్కడి భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన మహత్తర రైతాంగ పోరాట తరుణంలో, దాన్ని అణచివేయడానికి జరిగిన సైనిక చర్య తరువాత, భూస్వామ్యులు ఎలా కాంగ్రెస్‌లో చేరి తమ పట్టును బిగించారో మనకు తెలుసు. విచారకరమైనది ఏమిటంటే, అంతకన్నా అధికంగా భూస్వాములకు తమ భూములపై సంపూర్ణ అధికారం అందించేందుకు గాను ఈ ‘రైతు బంధు’ పథకాన్ని ప్రభుత్వం రాజమార్గంగా ఎంచి అందివ్వడం! ఒక్క మాటలో చెప్పాలంటే రైతుల పేరిట అమలవుతున్న ఈ పథకం ఒకప్పుడు కోల్పోయిన భూస్వామ్య వ్యవస్థను తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నది. అది ఇక్కడి పోరాటాల స్ఫూర్తికి ఎంత వ్యతిరేకమో ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా చర్చకు రావాలి.

రైతు బంధు – ‘ధరణి’ల సమన్వయం భూస్వాముల పాలిట వరం. ఈ పద్ధతిలో ఏక కాలంలో అటు వెలమ, ఇటు రెడ్డి కులస్థుల ఆధ్వర్యంలో ఉన్న లక్షలాది ఎకరాల భూమికి చట్టపరంగా ఉన్న లొసుగులను పరిష్కరించి వారిని యజమానులను చేసింది. అదే సమయంలో ఆయా భూములను సాగు చేస్తున్న కౌలుదారులను, రైతు కూలీలను ఇక ఎన్నటికీ యజమానులుగా మారడానికి వీలు లేకుండా కట్టడి చేసింది. అంతేకాదు, ఈ ఒక్క పథకం ద్వారా ఆయా కులాలను రాష్ట్రంలో తమకు బలమైన ఓటు బ్యాంకుగా కేసీఆర్ ప్రభుత్వం సునాయాసంగా మార్చుకున్నది.

దీన్ని మరో రకంగా చెబితే– దశాబ్దాలుగా పీడితులు, నిరుపేదలు, అణచివేతకు గురైన పేద జనం విప్లవ పార్టీల పేరిటనో, లేదా తమంతట తామో ఆర్గనైజ్ అయి కొంతకాలం పాటైనా భూస్యాముల ఆగడాలను అడ్డుకున్నారు. వారి అన్యాయాలను నిగ్గదీశారు. వారి మాటలను ఖాతరు చేయలేదు. వారి ఆటలను సాగనివ్వలేదు. ‘దున్నేవాడిదే భూమి’ అంటూ వారి భూములను అక్రమించుకుని ఆ స్థలంలో ఎర్ర జెండాలు కూడా పాతారు. తమ మనుగడ కోసం అనివార్యంగా పోరాట బాట పట్టి దొరలను, భూస్వాములను కొన్నిచోట్ల అయినా కొద్ది మందినైనా ముప్పు తిప్పలు పెట్టారు. అది భూస్వామ్య బలగానికి దశాబ్దాలుగా కునుకు లేకుండా చేసింది. దానివల్ల వారు పట్నాలకు వలస వచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుని లబ్ధి పొందిన ఉదాహరణలు ఉన్నప్పటికీ ఈ పేదజనంపై వారి కోపతాపాలు అలాగే ఉన్నాయి. వారి ఆగ్రహావేశాలు బాహాటంగా వ్యక్తం కాకుండా అణచిపెట్టబడి ఉన్నాయి. తమ భూములను ఏలిన ఆ మట్టి మనుషులపై నాటి నుంచి ఎర్ర జేసిన ఆ కన్నులు నేడు తెలంగాణా రాష్ట్రం సాకరమయ్యాక చల్లబడ్డాయి. కేసీఆర్ అమలు చేసిన ఈ పథకంతో అవి ఆనందబాష్పాలు రాల్చాయి. అదే స్వీట్ రివెంజ్! రైతు బంధు తాలూకు అసలు రహస్య ఎజెండా!

నిజానికి రైతు బంధు పథకం రైతాంగాన్ని అణచి వేసే భూస్వామ్య పథకం. అసలు ఇందుకోసమే తెలంగాణా రాష్ట్రం సాకారమైందా అన్న విషయం కూడా కొంతకాలమైతే గానీ అందరికీ స్పష్టం కాకపోవచ్చు. ఏమైనా, గొప్ప ఆదర్శం పేరిట అమలైన ఈ పథకం దున్నేవారి హక్కును పొలాలపై నుంచి, భూములపై నుంచి శాశ్వతంగా దూరం చేసింది. కౌలుదారులను, రైతు కూలీలను శాశ్వతంగా వ్యవసాయంపై ఆధారపడేలా, వట్టి కూలీలుగా చేస్తుంది. అంతేకాదు, ప్రతి ఏటా శ్రమను దోచుకునేందుకు గాను ఈ భూస్వాములను కూర్చోబెట్టి పెంచి పోషిస్తున్నది. చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం యజమానులుగా మారి తిరిగి సగర్వంగా గ్రామాలకు తరలడానికి స్వరాష్ట్రం భూస్యాములకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఈ పథకం. విషాదం ఏమిటంటే, తిరిగి ఏ జనమైతే ఆ భూములను సాగు చేసుకుంటున్నారో వారినే కావలిస్తే కొనుక్కోమని ఒత్తిడి తెచ్చేలా చేసింది ఈ పథకం. లేదంటే ఎప్పటికీ కూలీలుగా పడి ఉండండి అని హేళన చేసేలా చేస్తోంది. ఏటా పది వేల చొప్పున లక్షలాది ఎకరాల నుంచి కోట్లాది రూపాయలను తమ ఖాతాల్లో వేసుకోగలిగేలా అధికారాన్ని, డబ్బును, హోదాను స్థిరపరిచిన ఈ పథకం భూస్వాములకు కొండంత అండగా నిలుస్తున్నది. ఆర్థిక సహాయం పేరిట సాగులో ఉన్నా లేకున్నా వెలమ రెడ్డి కులస్థుల భూములకు శాశ్వతంగా లబ్ధి చేకూర్చి పెడుతున్నది.

మీరు అడగవచ్చు, పాతిక ఎకరాలకు పైగా ఉన్న రైతు బంధు లబ్ధిదారులు కేవలం ఆరు వేలకు పైగానే ఉన్నారు కదా! మొత్తం 58 లక్షల రైతులకు మేలు జరుగుతున్న ఈ పథకాన్ని ఈ కొద్దిమందిని చూపి అది భూస్వాముల పథకం అనడం పొరబాటు కదా అని! వాస్తవానికి లబ్ధిదారుల్లో ప్రధానంగా ఉన్నది చిన్న సన్నకారు రైతులే కదా అని కూడా మీరు అడగవచ్చు. కానీ స్థూలంగా జరిగిన మేలు ఎవరికీ అన్నది మనం గమనించాలి! పెద్ద ఎత్తున మార్పు జరుగుతున్నది ఏ వర్గానికీ అన్నది పరిశీలించాలి!

నిజంగా రెక్కాడితే గాని డొక్కాడని రైతులకే గనుక ప్రభుత్వం మేలు చేయాలని గనుక భావిస్తే, మొదట ఇవ్వవలసింది భూమిని సాగు చేస్తున్న కౌలుదారులకే. ద్వితీయంగా రైతు కూలీలకు భూ పంపిణీ చేయడం ఎట్లా అన్న ఆలోచన కలగాలి. కానీ ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం కౌలుదారులకు ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయనని బీష్మించుకొని కూర్చున్న సంగతి మీకు తెలిసిందే. అంతెందుకు, ఆత్మహతలు చేసుకుంటున్న రైతుల్లో అత్యధికులు ఈ కౌలుదారులు, రైతు కూలీలే అని తెలిసినా వారికి కనీసం రైతుబంధు కాదు కదా, రైతు బీమా పథకాన్ని కూడా వర్తింపజేయడం లేదన్న సంగతిని అందరం గ్రహించాలి. సరే, ఈ కౌలు రైతులను, రైతు కూలీలను వదిలేస్తే, కనీసం తర్వాత పట్టించుకోవలసిన అంశం – ప్రభుత్వం ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో ఏర్పాటు చేసిన సీలింగ్, ఆ వెంటనే దాని ప్రకారంగా అత్యధిక భూములున్న రైతులను లబ్ధిదారులుగా గుర్తించకుండా ఈ పథకం నుంచి మినహాయించడం. కానీ ఆ దిశలో పునరాలోచన చేసే ప్రసక్తే లేదని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి స్పష్టం చేయడం మనం ఎన్నోసార్లు విన్నాం.

ఈ రెండు విషయాలే కాదు, ప్రభుత్వం ‘రైతులంతా సమానం’ అనడాన్ని కూడా చర్చలోకి తీసుకోవాలి. వాస్తవానికి భూస్వాములను రైతులుగా చూపుతూ, అసలు సాగు చేసుకుంటున్న కౌలు రైతులను అనర్హులని చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారంటేనే దీని ఉద్దేశం ఆచరణలో అసమానతల స్థిరీకరణ అని గ్రహించాలి. వాస్తవానికి ప్రభుత్వ పథకాలు దీర్ఘకాలికంగా ప్రజల సమానత్వానికి బాటలు వేయాలే గాని ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ భూస్వామ్య వ్యవస్థకు కాపలా కాయరాదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో సాగిస్తున్న పరిపాలన నిరుపేదల అభ్యున్నతి పేరుతో భూస్వామ్యాన్ని బలోపేతం చేయడంగా స్పష్టమవుతూ ఉంది. కనుకే ఈ పథకాన్ని ‘భూస్వామ్య బంధు’గా చెప్పాల్సి వస్తుంది. అలాగే ఇది తెలంగాణాలో ఇదివరకు జరిగిన రైతాంగ పోరాటాల ద్వారా ఒసిగిన ఫలితాలకు, స్ఫూర్తికి శాశ్వతంగా గండి కొట్టే కుట్రగానూ ఎంచవలసి ఉన్నది.

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ దిశగా లోతైన విశ్లేషణలు జరగాలి. ఈ పథకంపై వ్యవసాయరంగ నిపుణులు, ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు, కవులు, కళాకారులు, మేధావులు తమ కలాలను, గళాలను ఎత్తవలసి ఉన్నది. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ పెడితే గానీ ప్రభుత్వ పాలనలోని ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులు వెల్లడి కావు. అప్పుడే కౌలు రైతులకు కూడా ఈ పథకం అందివ్వాలి అన్న డిమాండ్ స్థానంలో ‘భూస్వాములకు అసలే ఇవ్వద్దు’ అన్న డిమాండ్ మొదటి స్థానంలోకి వస్తుంది. అంతేకాదు, అసమానతలకు మారుపేరుగా నిలిచిన భూస్వామ్యాన్ని ఎదిరిస్తూ దశాబ్దాల కాలం పోరాడిన తెలంగాణ ప్రజానీకం స్వరాష్ట్రంలో కూడా అదే యథాస్థితిలో కొట్టుమిట్టాడకుండా ఉండాలి. మెలుకువతో ఉంటూ రాష్ట్రం పురోగామి దిశలో నడవకపొయినా సరేగానీ తిరోగమించకుండా చూసుకోవాలి. అదే నేటి ప్రథమ కర్తవ్యం కావలసిరావడం ఈ దశాబ్ది విషాదం. నిస్సందేహంగా ఇది మెజారిటీ ప్రజలకు తావులేని ఉత్సవ సందర్భం.

కందుకూరి రమేష్ బాబు

ఇండిపెండెంట్ జర్నలిస్ట్

Updated Date - 2023-06-07T01:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising