ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వక్రీకరణలను దాటి బుద్ధుడిని తెలుసుకుందాం!

ABN, First Publish Date - 2023-10-11T03:32:27+05:30

‘బుద్ధుడు వైదిక మత వ్యతిరేకా?’ అన్న నా వ్యాసానికి (13.08.2023) స్పందిస్తూ, బొర్రా గోవర్ధన్ ‘బుద్ధునిపై ఇన్ని అబద్ధాలా..!?’ (30.08.2023) అంటూ వ్యాసం రాశారు. ‘‘బుద్ధుణ్ణి లాక్కొచ్చి అమానవీయ భావజాల పంకిలంలో...

‘బుద్ధుడు వైదిక మత వ్యతిరేకా?’ అన్న నా వ్యాసానికి (13.08.2023) స్పందిస్తూ, బొర్రా గోవర్ధన్ ‘బుద్ధునిపై ఇన్ని అబద్ధాలా..!?’ (30.08.2023) అంటూ వ్యాసం రాశారు. ‘‘బుద్ధుణ్ణి లాక్కొచ్చి అమానవీయ భావజాల పంకిలంలో పడెయ్యడానికి శతవిధాలా ప్రయత్నించారు’’ అని ఆరోపణ చేశారు. తన ప్రతిస్పందనలో ఆయన ‘‘శతాబ్దాలుగా బౌద్ధాన్ని, బుద్ధుణ్ణి తిరిగి తమవాడిగా ప్రకటించుకోవడానికి వైదిక మతాలు వెనుకాడడం లేదు’’ అనడం అవాస్తవం. ‘The Usborne Encyclopedia of World Religions’ వంటి అంతర్జాతీయ ఆకర గ్రంథాలు బుద్ధుడు హిందువుగా పుట్టాడని, బుద్ధుడు హిందువేనని విశ్వవ్యాప్తంగా ఉద్ఘాటిస్తున్నాయి. సనాతన ధర్మమే హిందూమతం అని Geoffrey Parrinder వంటి అంతర్జాతీయ పరిశోధకులు తెలియచెప్పారు. వేదాలు, మనుస్మృతి, ఉపనిషత్తులు బుద్ధుడికన్నా పూర్వమే ఉన్నాయని నిగ్గుతేల్చారు. బుద్ధుడు సనాతనుడు అన్నది జగమెరిగిన సత్యం.

‘‘వైదికమత విరోధి అయిన బుద్ధుడు...’’ అని వ్యాసకర్త అబద్ధం చెప్పారు. తాను వైదిక మతానికి విరోధినని బుద్ధుడు ఎక్కడా చెప్పలేదు. బుద్ధుడి వేద నిరసన అనేది విద్వేషవాదులు సృష్టించిన అబద్ధం. దశావతారాల్లోని బుద్ధుడి ప్రస్తావన త్రిపురాసుర వధ సందర్భంలో ఉంది. గౌతమ బుద్ధుడు ఏ రాక్షస వధా చెయ్యలేదు. దశావతారాల్లోని బుద్ధుడు, ఈ గౌతమ బుద్ధుడు వేర్వేరు. ‘‘క్రీ.శ. 8వ శతాబ్దంలో శంకరాచార్యులవారు’’ అనడం కాలక్రమంలో ఆవిష్కృతమౌతున్న చారిత్రక సత్యాల అవగాహన వ్యాసకర్తకు లేకపోవడాన్ని తెలియజేస్తోంది. ఇటీవలి పరిశోధనలు ఆదిశంకరుల జననం సామాన్య శకానికి పూర్వం 509వ సంవత్సరం అని తెలియజేస్తున్నాయి. అలాగే ఆదిశంకరులు దశావతార స్తోత్రం రాశారని వ్యాసకర్త అనటం పరిహాసాస్పదం. ‘‘విష్ణుసహస్రనామాల్లోని శ్లోకాల్లో 783 నుంచి 806 వరకు పేర్లు బుద్ధునికి సంబంధించినవే’’ అంటున్నారు గోవర్థన్‌. కానీ ఆ పేర్లు ఏవీ బుద్ధునికి సంబంధించినవి కావు. వేద ప్రమాణాన్ని అంగీకరించడం మాత్రమే కాదు, వేద చింతనను సరిగ్గా గ్రహించడం, సనాతన జీవనం చెయ్యడం వైదికమే అని వ్యాసకర్త తెలుసుకోవాలి. ‘‘బౌద్ధ పద్యాల్ని ‘గాథలు’ అంటారు. ‘శ్లోకాలు’ అనరు’’ అని చెప్తున్నారు వ్యాసకర్త. తేరవాద బౌద్ధంలో చలామణిలో ఉన్న రెండు గేయ సంకలనాల్ని గాథలు అంటారు, వాటిని ‘తేరగాథా’ అనీ అంటారు. కానీ దమ్మపదంలోని ‘శ్లోకాలు’ లేదా ‘పద్యాల్ని’ ‘గాథలు’ అనరు.

‘ఆర్య’ అన్నది విదేశపు తెగ కాదని అంబేడ్కర్ చెప్పారు. ‘‘ఆర్య అనే తెగ ఉనికి ప్రాయికంగా తిరస్కరించబడింది’’ అని Oxford English Reference Dictionary తెలియజెబుతోంది. ఆర్య అనేది తెగ లేదా జాతి సూచకం అవదు. ‘‘బుద్ధుడు విదేశీ ఆర్యుడు కాదు’’ అంటూ వ్యాసకర్త అవగాహనా రాహిత్యాన్ని చాటుకున్నారు. దమ్మపదంలో ‘‘ఆర్యులు చూపిన మార్గం’’, ‘‘ఆర్యులు చెప్పిన ధర్మం’’, ‘‘ఆర్య బోధలు’’, ‘‘ఆర్య సత్యాలు’’, ‘‘ఆర్య సందర్శనం శుభం’’, ‘‘ఆర్య భూమి’’ అంటూ బుద్ధుడు స్వయంగా చెప్పాడు. బుద్ధుడి మాటలకు విరుద్ధంగా, అనైతికంగా కొందరు బుద్ధుడికి తమ బురదను పూస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.


బుద్ధుడి చివరి దశ మాటలుగా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ‘‘అప్పొ దీపో భవ’’ కూడా ఉంది. ‘‘అత్త దీపో...! అత్త సరణో...! అనణ్ణ సరణో...!’’ అంటూ వ్యాసకర్త చెప్పింది తప్పు. ‘‘దమ్మ దీపా, దమ్మ సరణా, అనన్న సరణా’’ అన్నది సరైంది. ‘ధర్మ’ పదం సంస్కృత పదం, పాలీ పదం కాదు (‘పాళీ’ అనటం తప్పు). Geoffrey Parrinder ‘A Dictionary of Non–Christian Religions’ గ్రంథంలో ధర్మ పదం సంస్కృతపదం అని తెలియజెబుతూ ఆ పదానికి ‘ధృ’ ధాతువు అని చెప్పాడు. ఆపై ‘దమ్మ’ అన్న పదం ‘ధర్మ’ అన్న సంస్కృతపదానికి పాలీ రూపం అని కూడా తెలివిడినిచ్చాడు. ధర్మ పదానికి పాలీ రూపం దమ్మ కాబట్టి, ధర్మ పదానికున్న అర్థాలే దమ్మ పదానికి కూడా అన్వయమౌతాయి. ధర్మం దీపం వంటిది, ధర్మమే శరణం, మరొకటి శరణం కాదు అని బోధిస్తూ బుద్ధుడు ‘‘దమ్మ దీపా, దమ్మ సరణా, అనన్న సరణా’’ అనడమూ సనాతనమే. ‘‘ఆర్యులు చెప్పిన ధర్మం’’ అని బుద్ధుడు చెప్పిందాన్ని మరిచిపోకూడదు; మరుగుపరచకూడదు. ‘‘బుద్ధుడి మూల బోధలు వైదిక లేదా సనాతనత్వానికి వ్యతిరేకమైనవి కావు’’ అని అంతర్జాతీయ బౌద్ధ పరిశోధకుడు, పండితుడు ఎకె. కుమారస్వామి 1943లోనే విశ్వవ్యాప్తంగా ఘోషించాడు.

పామరులు సంస్కృతాన్ని అర్థం చేసుకోలేరని బుద్ధుడు తన మాటల్ని సంస్కృతంలోకి తీసుకురావద్దన్నాడు కానీ మరొకందుకు కాదు. ఆ సంస్కృతం ద్వారానే బుద్ధుడి మాటలు ఇండోనేషియా, చైనా, జపాన్ వంటి పలుదేశాలకు వెళ్లి బుద్ధుడికి ఖ్యాతిని, వ్యాప్తిని తెచ్చాయి. శ్రీలంక, బర్మా దేశాలకు మాత్రమే పాలీ ద్వారా బుద్ధుడి మాటలు చేరాయి. బుద్ధుడి మాటల్ని ముందుగా సంస్కృతంలోకి తీసుకెళ్లి విశ్వవ్యాప్తం చేసింది కాశ్మీరీ పండిత్‌లు. పుట్టుకతో బ్రాహ్మణత్వం రాదని వేద కాలం, మనువు కాలం నుంచీ చెప్పబడుతోంది. దమ్మపదంలో బ్రాహ్మణుల గురించి బుద్ధుడు 166 పంక్తుల్లో చెప్పింది ఆ వేద చింతననే. బుద్ధుడు సనాతనుడు కాబట్టే ‘‘బ్రహ్మణ్ణతా’’ అంటూ బ్రహ్మన్ స్థితిని దమ్మపదం, అధ్యాయం 23, శ్లోకం 13లో ఇలా తెలియజేస్తున్నాడు: ‘‘లోకంలో‌ మాతృత్వం‌ సుఖం; ఆపై పితృత్వం సుఖం; లోకంలో సన్యాసం (సామణ్ణతా) సుఖం; ఆపై బ్రహ్మత్వం (బ్రహ్మణ్ణతా) సుఖం’’ (పాలీ: ‘‘సుఖా మత్తెయ్యతా లోకె/ అథో పెత్తెయ్యతా సుఖా/ సుఖా సామణ్ణతా లోకె/ అథో బ్రహ్మణ్ణతా సుఖా’’). ‘‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్’’ అన్న తైత్తిరీయ ఉపనిషత్ మాటనే తన మాటగానూ బుద్ధుడు ‘‘బ్రహ్మణ్ణతా సుఖం’’ అని చెప్పాడు (ఇక్కడ బ్రహ్మణ్ణతా అన్నది బ్రాహ్మణత్వాన్ని సూచించదు).

ప్రపంచానికి విరుద్ధంగా, జనబాహుళ్యానికి కంటకంగా మన దేశంలో లోపాయకారీ కారణాలవల్ల జరుగుతున్న విద్వేషవాదుల వక్రీకరణలకు, విధ్వంసక శక్తుల కుట్రలకు అతీతంగా మన బుద్ధుణ్ణి మనం సరిగ్గా ఆకళింపు చేసుకుందాం; బుద్ధుణ్ణి యథాతథంగా అందుకుందాం.

రోచిష్మాన్

Updated Date - 2023-10-11T03:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising