ఈజిప్ట్‌లో మోదీ దౌత్య విజయం
ABN, First Publish Date - 2023-06-28T01:59:48+05:30
ప్రధాని మోదీ ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన పురోగమనం ఏ విధంగా ఉన్నా విదేశీ వ్యవహారాలలో దాని మార్గం విలక్షణమైనది. గతంలో ఏ ప్రభుత్వమూ అవలంబించని విధంగా నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య నీతి ఆసక్తికరమైనది...
ప్రధాని మోదీ ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన పురోగమనం ఏ విధంగా ఉన్నా విదేశీ వ్యవహారాలలో దాని మార్గం విలక్షణమైనది. గతంలో ఏ ప్రభుత్వమూ అవలంబించని విధంగా నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య నీతి ఆసక్తికరమైనది. అంతకంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది భారత్ ప్రయోజనాలకు విశేషంగా దోహదం చేస్తున్న దౌత్య ప్రజ్ఞ అది.
గల్ఫ్ అరబ్ రాజ్యాలతో భారత్ పటిష్ఠ సంబంధాలను కలిగివుండడాన్ని మన దేశ ఆర్థిక ప్రయోజనాలు అనివార్యం చేస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ వైపే భారత్ మొగ్గు ఉండేది. భారత్ ఆనాడు అలీనోద్యమ అధినేతగా ఉండేది. ఈ కారణంగా అమెరికా మిత్ర రాజ్యాలైన రాచరిక గల్ఫ్ దేశాలతో న్యూ ఢిల్లీ సంబంధాలు ఒక సాధారణ స్థాయిలో మాత్రమే ఉండేవి. అమెరికాకు అటు పాకిస్థాన్‌తో పాటు గల్ఫ్ దేశాలన్నీ విశ్వసనీయమైన మిత్ర దేశాలుగా ఉండేవి. భారత్‌తో పోల్చితే రాజకీయంగా, వ్యూహాత్మకంగా పాకిస్థాన్‌కు గల్ఫ్ అరబ్బులలో పట్టు ఉండేది. దీంతో గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు అప్పట్లో అంతగా అభివృద్ధి చెందలేదు. లక్షల సంఖ్యలో కార్మికులను, ఉద్యోగులను పంపించడం, చమురు దిగుమతి చేసుకోవడం వరకు మాత్రమే ఆ సంబంధాలు పరిమితమయి ఉండేవి. అంతకు మించి ఒక్క అడుగు ముందుకు పడలేదు.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. గల్ఫ్‌తో సహా మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలతోనూ భారత్ ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా పెంపొందాయి. ఆర్థిక ప్రయోజనాలను మరింత మెరుగ్గా సాధించుకోవడానికి ఆ దేశాలతో వ్యూహాత్మక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకోవల్సిన అవసరముందని మోదీ గుర్తించారు. ఆ దిశగా ఆయన చురుగ్గా ముందుకు కదులుతున్నారు. అబుధాబి రాజు శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన మైత్రి క్రమేణా వృద్ధి పొందుతూ సత్ఫలితాలను ఇస్తోంది.
శీఘ్ర ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న భారత్ చమురు అవసరాలూ ఇతోధికంగా పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు స్వదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా సమకూరుస్తున్నారు. ఇవి అవిస్మరణీయమైన వాస్తవాలు. కనుకనే అరబ్ దేశాలతో షావుకారు తరహా సంబంధాలు కాకుండా భాగస్వామ్య దిశగా వాటిని అభివృద్ధిపరచుకోవాలని ప్రధాని మోదీ సంకల్పించారు. సైనిక, రాజకీయ, వ్యూహాత్మక సంబంధాల దిశగా కూడా ఆ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక కృషి చేస్తున్నారు.
అరబ్బు దేశాలలో ఈజిప్ట్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ఇస్లామిక్ మత, దార్శనిక, సాహిత్య అధ్యయనాల పరంగా ఈజిప్టే కేంద్రబిందువు. హైదరాబాద్ నగరంలోని శాలీబండ ప్రాంతంలో ఉన్న మిస్రీ గంజ్ అనేది ఈజిప్టు చారిత్రక నేపథ్యంతో ఆ కాలంలో వెలిసిన వీథి. అరబ్ లీగ్ వ్యవస్ధాపక దేశమైన ఈజిప్ట్, ఏ అరబ్ దేశంలో లేని విధంగా ఇస్లామిక్ మతతత్వ శక్తులు, ఉగ్రవాదంతో అలుపెరగని పోరాటం చేస్తోంది. అరబ్ దేశాలలో అధిక జనాభా కలిగిన దేశం ఈజిప్టే. ఆర్థిక అసమానతలు, మతతత్వ ఉగ్రవాదంతో సతమతమవుతున్నప్పటికీ గల్ఫ్ దేశాలలో ఈజిప్టు ఒక ప్రభావశాలిగా ఉన్నది. గల్ఫ్ దేశాల రాజకీయ, సైనిక, వ్యూహాత్మక సంబంధాలలో ఈజిప్టు పాత్ర చెప్పుకోదగ్గది. అదే విధంగా, ఈజిప్టులో కూడ గల్ఫ్ దేశాల ప్రభావం గణనీయం. ఈజిప్టుతో కలిసి వస్తే, గల్ప్‌లో భారత స్థానం మరింత బలపడుతుంది. ఇరాన్ –సౌదీ అరేబియా మధ్య సంబంధాలను పునరుద్ధరించడం ద్వారా చైనా తాను కూడ అరబ్ ప్రపంచంలో ఒక పాత్రధారినంటూ అనూహ్యంగా ముందుకు వచ్చింది. అరబ్ ప్రపంచంతో పాటు ఆఫ్రికా యూనియన్‌లో కూడ ఈజిప్టుకు అసాధారణ పలుకుబడి ఉన్నది. ఇప్పటికే ఆఫ్రికాలో చైనా ఆర్థికంగా పాగా వేసింది. ఈ పరిస్థితులలో భారత్ మౌనమునిగా ఉండడం భావ్యం కాదు.
గల్ఫ్ దేశాలతో సంబంధాలకు అతీతంగా తన వాణిజ్య అవసరాల దృష్ట్యా కూడ భారత్ ఈజిప్టుకు స్నేహ హస్తం చాచింది. ఆసియా, ఐరోపా ఖండాల మధ్య సముద్రయానానికి ఈజిప్టులోని సూయజ్ కాలువ కీలక వారధి. తమ పారిశ్రామికాభివృద్ధికి భారత్ సహకారం తీసుకునేందుకు ఈజిప్ట్ ఆసక్తి చూపుతోంది. ఉభయ దేశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ ఏడాది మన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దూ ఫత్తా అల్ సిసును ఆహ్వానించడం జరిగింది. జి–20 సదస్సుకు కూడ ఆయనను ఆహ్వానించారు. ఇక్కడ గమనించవల్సిన విషయం ఏమిటంటే సూయజ్ కాలువపై తమ ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంలో 1950 దశకంలో బ్రిటన్, ఫ్రాన్స్‌లు సంయుక్తంగా ఈజిప్టుపై యుద్ధం చేశాయి. అగ్ర రాజ్యాల అఘాయిత్యానికి ఈజిప్టు అల్లాడిపోతుండగా జవహర్ లాల్ నెహ్రూ ముందుకు వచ్చి ఆ పాశ్చాత్య దేశాల సామ్రాజ్యవాదాన్ని ఖండించారు. అనేక విధాలుగా ఈజిప్టుకు అండగా నిలిచారు. వలస పాలన నుంచి విముక్తి చెందిన వివిధ దేశాల మద్దతును కూడగట్టి ఈజిప్టుకు సహాయపడడంతో అలీనోద్యమానికి అడుగు ముందుకుపడింది. నెహ్రూ చేసిన సహాయాన్ని ఇప్పటికీ ఈజిప్టు ప్రజలు కృతజ్ఞతాపూర్వకంగా గుర్తు చేసుకుంటారు. యావత్ అరబ్ ప్రపంచంలో తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్న నాటి ఈజిప్టు అధ్యక్షుడు జమాల్ అబ్దుల్ నాసర్ వయస్సులో తన కంటె పెద్దవాడయిన నెహ్రు తనకు తండ్రి సమానుడని అనేక సందర్భాలలో చెప్పుకొనేవాడు. ఈజిప్టు, అరబ్ దేశాలు మినహా తనకు ఇతర దేశాల గురించి పెద్దగా తెలియదని, నెహ్రూ మార్గదర్శకత్వంలో తాను ప్రపంచాన్ని చూస్తున్నానని కూడ నాసర్ చెప్పేవాడు. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన ఈజిప్టు– భారత్ సంబంధాలు నెహ్రూ అనంతరం పూర్తిగా చల్లబడ్డాయి. ఇన్నాళ్ళకు మళ్ళీ ఈజిప్టుకు భారత్ తన స్నేహ హస్తాన్ని అందించడానికి మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానమే ప్రధాన కారణం. ఇందుకు ప్రధాని మోదీని అభినందించి తీరాలి.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
Updated Date - 2023-06-28T01:59:48+05:30 IST