ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉద్యమాలకు మారుపేరు ‘బోవెరా’

ABN, First Publish Date - 2023-09-01T03:28:35+05:30

కరీంనగర్ గాంధీ ఆనగానే తెలంగాణలో ప్రతి ఎదలో మెదలాడే నిలువెత్తు మూర్తి బోవెరా (బోయినపల్లి వెంకట రామారావు). ఆయన తుది శ్వాస వరకు దేశ సేవ కోసం...

కరీంనగర్ గాంధీ ఆనగానే తెలంగాణలో ప్రతి ఎదలో మెదలాడే నిలువెత్తు మూర్తి బోవెరా (బోయినపల్లి వెంకట రామారావు). ఆయన తుది శ్వాస వరకు దేశ సేవ కోసం ఆరాటపడ్డ నిస్వార్థ జీవి. హైదరాబాదు రాష్ట్రంలో సాగిన జాతీయ ఉద్యమంలో, గాంధేయవాద భావజాలాన్ని పాదుకొల్పడంలో, మరీ ముఖ్యంగా గ్రామ గ్రామాన గ్రంథాలయాల, రీడింగ్ రూములు స్థాపనలో అవిరళమైన కృషి చేశారు.

1945లో వరంగల్‌లో కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద జరిగిన సభ తరువాత బోవెరా మహాత్మా గాంధీ అనుచరరుడిగా మారారు. గాంధీ ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడై, శాంతిని ఆయుధంగా చేసుకొని జాతీయ ఉద్యమంలోను, నిజాం వ్యతిరేక ఉద్యమాల్లోను పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన శాంతియుత పోరాటాలు, ధర్నాల వల్ల ప్రజలు ఆయనను ‘కరీంనగర్ గాంధీ’, ‘తోటపల్లి గాంధీ’, ‘తెలంగాణ గాంధీ’ అని ప్రేమగా ప్రస్తావించుకొనేవారు.

కరీంనగర్ జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన స్వతంత్ర ఉద్యమానికి చుక్కానిలా నిలిచారు బోవెరా. నలభై మంది జాతీయవాదులతో కూడిన ఆయన గురించి అప్పటి బ్రిటిష్‌వారు ఎన్నోసార్లు వెతికారట. దొరికితే కఠిన శిక్షలు విధించాలనే పట్టుతో ఉండేవారట. కానీ ఎప్పుడూ ఆయన వారికి చిక్కలేదు. నాటి ఉద్యమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు గెరిల్లా తరహా పథకాలు వేసేవారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న తన అనుచరుల సహాయంతో ప్రజల్లో ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. పేదవారికి సహాయం చేయడానికి దాచి ఉంచిన ధాన్యం గిడ్డంగులపై దాడి చేసి ప్రజలకు ఊరూరా బియ్యం పంపిణీ చేసేవారు.


బాల భటోద్యమం, పన్నుల నిరాకణోద్యమం, హరిజన ఉద్యమం, మద్యపాన వ్యతిరేక ఉద్యమం, భూదానోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, గ్రామ స్వరాజ్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, గ్రంథాలయోద్యమాల్లోను, ఇంకా తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమాల్లోను కీలక పాత్ర పోషించారు బోవెరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోదయ మండలి అధ్యక్షులుగా, స్వాతంత్ర్య సమరయోధుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంఘ కార్యవర్గ సభ్యులుగా, అఖిల భారత సర్వ సేవా సంఘ సభ్యులుగా, కరీంనగర్ జిల్లా రచయితల సంఘం, సారస్వత జ్యోతి మిత్ర మండలి సంస్థాపక అధ్యక్షులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, హిందీ ప్రేమ మండలి, మద్యపాన నిషేధ సంఘం అధ్యక్షులుగా అనేక బాధ్యతలను నిర్వహించారు. గ్రంథాలయ ఉద్యమానికి అందించిన సేవలు చిరస్మరణీయం. 1939లో 19 సంవత్సరాల వయసు అప్పుడు ఆంధ్ర విజ్ఞానవర్థిని పేరుతో తన సొంత గ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించారు. నాటకాలను, బుర్రకథలు, హరికథలు ఏర్పాటు చేసి ఆ డబ్బుతో పుస్తకాలు ఇతర సామగ్రి కొనేవారు. శాంతి యువసేన సహాయంతో అనేక వందల పుస్తకాలను సేకరించి ఉచితంగా ప్రజలకు అందించేవారు. హైదరాబాద్ రాష్ట్రంలో సాగిన జాతీయ ఉద్యమంలో ఉత్తర తెలంగాణలోని ఎంతోమంది యువకులను చేరదీసి గ్రంథాలయోద్యమంలో భాగస్వాములను చేశారు. గ్రామ గ్రామాన గ్రంథాలయాన్ని స్థాపించి, దాదాపు వందకి పైగా గ్రంథాలయాలు నడిపారు. 1953లో జిల్లా సారస్వత సమితిని ఏర్పాటు చేసి దీని ద్వారా సంచార గ్రంథాలయాలను నడిపారు. కోదాటి నారాయణతో గ్రంథాలయోద్యమంలో, సర్వోదయ, గాంధేయ కార్యక్రమాలలో కలిసి పనిచేశారు. 30 సంవత్సరాలు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ పాలక మండలి సభ్యులుగా, 11 సంవత్సరాలు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేశారు. జిల్లా గ్రంథాలయ సంఘం అధ్యక్షుడుగా గ్రామాలలో చాలా గ్రంథాలయాలను స్థాపించారు. 1976లో ప్రభుత్వ భూమిని సేకరించి జిల్లా గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంతో ఆయనకు 60 సంవత్సరాల అనుబంధం ఉన్నది.

గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కండ సార, బెల్లం, చక్కెర, బిస్కెట్ పరిశ్రమలు స్థాపించి ఎంతోమందికి జీవనోపాధి కల్పించారు. 2014 ఆగష్టు 9న జరిగిన క్విట్ ఇండియా వేడుకల్లో పాల్గొనేందుకు ఒంటరిగా ఢిల్లీకి వెళ్లి తిరుగు ప్రయాణంలో రైలులో జారిపడ్డారు. తుంటి ఎముక విరిగింది. అయినా కూడా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బంధువుల, డాక్టర్ల సమక్షంలో జాతీయ జెండా ఎగురవేసిన నికార్సయిన దేశభక్తుడు బోవెరా. అనారోగ్యం కారణంగా 27 అక్టోబర్ 2014లో కన్నుమూశారు. భారత జాతీయ ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును బహుకరించి గౌరవించాలి. బోవెరా జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. వారికి స్మారకంగా అన్ని హంగులతో కూడిన రాష్ట్రస్థాయి ప్రజా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి.

డా. రవి కుమార్ చేగొని

ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం

(సెప్టెంబరు 2న బోవెరా 103వ జయంతిని పురస్కరించుకొని

కరీంనగర్‌ బీట్‌ రోడ్డులోని బోవెరా భవన్‌లో జరిగే కార్యక్రమంలో

సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌ స్మారకోపన్యాసం చేస్తారు,

కవితా పురస్కారాన్ని విమలక్క స్వీకరిస్తారు. సిరికొండ మధుసూదనాచారి, కొప్పుల ఈశ్వర్‌ తదితరులు పాల్గొంటారు)

Updated Date - 2023-09-01T03:28:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising