నాడు ప్రజాగ్రహం.. నేడు ప్రజాస్పందన
ABN, First Publish Date - 2023-10-13T00:59:34+05:30
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దిశ, దశ మారింది. ఈ సంఘటన ఎన్నో మౌలిక మార్పులకు నాంది పలికింది...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దిశ, దశ మారింది. ఈ సంఘటన ఎన్నో మౌలిక మార్పులకు నాంది పలికింది. రాజకీయాలకు అతీతంగా తెలుగుజాతి స్పందించింది. ఒక రాజకీయ నాయకునికి మద్దతుగా ఇంతపెద్ద స్థాయిలో ప్రజాస్పందన వ్యక్తం కావటం ఇటీవలికాలంలో ఎన్నడూ జరుగలేదు. 1984లో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి అన్యాయంగా దించివేసినపుడు రాజకీయాలకు అతీతంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. ఆ పరిణామాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం ముందు గా పసిగట్టలేకపోయింది. చివరకు ప్రజాఉద్యమ ధాటికి తలొగ్గి కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం గాడి తప్పకుండా దిద్దుబాటు చేసింది. తాజాగా చంద్రబాబు అరెస్ట్ సైతం 1984 నాటి పరిణామాల్ని తలపిస్తోంది.
దార్శనికునిగా చంద్రబాబుకు ఉన్న ప్రతిష్ఠను తాజా పరిణామాలు మరింత ఇనుమడింప చేశాయి. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యావత్ తెలుగుజాతి పునశ్చరణ చేసుకున్నది. నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా ఎంతమంది యువతకు ప్రయోజనం చేకూరింది అన్న విషయంపై ఇప్పటివరకు టీడీపీ వర్గాలకే సరైన అవగాహన లేదు. తాజా పరిణామంతో సామాన్య ప్రజలు సైతం దానిపై చర్చించుకోసాగారు. చంద్రబాబు ఉంటేనే తమ బిడ్డలకు ఉజ్వల భవిష్యత్ సాధ్యపడుతుందని అన్ని వర్గాల ప్రజలలో భరోసా ఏర్పడింది.
శాఖమూరు శ్రీనివాస ప్రసాద్
Updated Date - 2023-10-13T00:59:34+05:30 IST