నవనీతుని చెరగని ముద్ర
ABN, First Publish Date - 2023-09-05T02:49:45+05:30
వాయుకాలుష్య ప్రధానకారక వాయువు సల్ఫర్ డై ఆక్సైడ్. దీనిపై కాంతి ప్రభావం, పరిశోధన అత్యంత కీలకం. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జెర్నల్...
వాయుకాలుష్య ప్రధానకారక వాయువు సల్ఫర్ డై ఆక్సైడ్. దీనిపై కాంతి ప్రభావం, పరిశోధన అత్యంత కీలకం. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జెర్నల్ ‘Journal of the American Chemical Society – JACS’లో 1968లో ఈ పరిశోధన ప్రచురితమైంది. కాంతి రసాయన శాస్త్రంలో దిగ్గజమైన జాక్ కాల్వెర్ట్ పర్యవేక్షణలో ఈ పరిశోధన జరిపిన మహోన్నత వ్యక్తి ఆచార్య తంగెడ నవనీతరావు. ఈ అంతర్జాతీయ సైన్స్ జర్నల్‌లో ఒక పరిశోధనాపత్రం ప్రచురితం కావడం అత్యంత అరుదైనది, గర్వించదగ్గది. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారిగా ఆ కీర్తి ఇటీవల దివంగతులైన నవనీతరావుకే దక్కింది. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో పరిశోధన పూర్తి చేసిన తరువాత అమెరికాలో స్థిరపడకుండా, మాతృదేశానికి విచ్చేయడం వారి దేశభక్తికి తార్కాణం. ఆయన జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో 220 పరిశోధన పత్రాలను ప్రచురించారు, 160 సదస్సులలో పరిశోధన పత్రాలను సమర్పించారు, 15 పాఠ్యపుస్తకాలు రాశారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం స్వీకరించారు. వారి పర్యవేక్షణలో 24 మంది విద్యార్థులు పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. ఆ అదృష్టవంతుల్లో నేను కూడా ఒకడిని కావడం నా పూర్వజన్మ సుకృతం. బోధన, పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించి, అనేకమంది విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత పదవులలో స్థిరపడడానికి ఆయన దోహదపడ్డారు.
బోధన–పరిశోధనకే వీరి సేవలు పరిమితం కాలేదు. యూనివర్సిటి నిర్వహణ, పాలనలో పలు ఉన్నతపదవులు చేపట్టి, వాటికి వన్నెతెచ్చిన గొప్ప పరిపాలనాదక్షుడు. రెండు పర్యాయాలు ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ప్రహారీ నిర్మించారు. అవసరాలకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బందిని మెరిట్ ప్రాతిపదికగా నియమించారు. వీరి చొరవతో ప్రభుత్వం నుండి తగినన్ని నిధులు సమకూరడంతో యూనివర్సిటీ అభివృద్ధి తారాస్థాయికి చేరుకొంది. నవనీతరావు దూరదృష్టి, పరిపాలన దక్షతల కారణంగా ఉస్మానియా కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరింది. విద్యార్థులను, సిబ్బందిని పేరు పెట్టి పిలిచే గొప్ప జ్ఞాపకశక్తి ఆయనది. యూనిర్సిటీ చరిత్రలో ఇటువంటి సమర్థవంతమైన పరిపాలనదక్షుని చూడలేము.
పైకి కఠినంగా కనిపించినా ఆయన హృదయం నవనీతం. విద్యార్థులపై ఆయన చూపిన ప్రేమానురాగాలు మరిచిపోలేనివి. ఎంతోమంది విద్యార్థి నాయకుల చేత కొత్త కాలేజీలను స్థాపింపచేసి, ఉద్యోగాలిచ్చేస్థాయికి తీర్చిదిద్దిన గొప్ప మానవతావాది. నవనీతరావు మార్గదర్శకత్వంతో స్ఫూర్తిచెందిన ఉస్మానియన్‌లు యూనివర్సిటీ ప్రతిష్ఠను ఇనుమడింపచేయాలి. ఆయన వేసిన పునాదులపై యూనివర్సిటీని అంతర్జాతీయస్థాయి విద్యావేదికగా తీర్చిదిద్దడమే మనం అందించగల నివాళి.
ప్రొ. పార్థసారథి తీగుళ్ళ
ఉస్మానియా యూనివర్సిటి
Updated Date - 2023-09-05T02:49:45+05:30 IST