నవనీతం
ABN, First Publish Date - 2023-08-30T04:23:27+05:30
‘మనిషి’ స్ఫురద్రూపం, ‘మనసు’ నవనీతం ‘మమత’, మానవీయతా స్వరూపం ‘మర్యాద’ మామిడి చిగుళ్ల మార్దవం ‘స్నేహం’, నిస్వార్థ, నిష్కల్మష,...
‘మనిషి’ స్ఫురద్రూపం, ‘మనసు’ నవనీతం
‘మమత’, మానవీయతా స్వరూపం
‘మర్యాద’ మామిడి చిగుళ్ల మార్దవం
‘స్నేహం’, నిస్వార్థ, నిష్కల్మష,
నిర్మల, ప్రసన్నతా పరీమళం
‘కృషి’, సుశిక్షిత, సురక్షిత సేవాభిమతం
‘ప్రేమ’, సహజసౌందర్యాభి వ్యక్తం
‘వాక్కు’, మృదు మధుర దరహాస అభివ్యక్తం
‘విద్య’ అపారం, విశేషార్జితం
‘అనుభవం’, దేశ విదేశ పర్యటనా పర్యవసానం
‘ధైర్యం’, హద్దులెరుగని అలల ఉద్వేగం
‘నిబ్బరం’, భూమాతా సహన సమానం
‘అభిరుచి’, అందని ఆనంద అన్వేషణం
‘సంస్కృతి’, అపార సాగరం
‘సరసం’, సమయోచితం
‘విరసానికి’, వీలయినంత దూరం
‘పాలన’, ప్రగతిశీలం, పరినిష్ఠితం
‘విరామం’, వికాస పూరిత సరిగమల సంగమం.
పేరుకు తగిన శైలి, శైలికి తగిన సంస్కారం
నీతి, రీతి, క్రమశిక్షణ, విధి నిర్వహణా వైనం.
కాలం నిండయింది, నిప్పులాంటిది.
మంచి వారిని చెడ్డవారి నుండి కాపాడుతుంది.
దానికి ప్రజావాణియే సాక్షి, పర్యవేక్షి.
అందుకో ‘నవనీతమా’,
నా ఈ పుష్పాక్షర మాల
డా. వెల్చాల కొండలరావు
పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమి
(తంగెడ నవనీతరావుకు నివాళిగా)
Updated Date - 2023-08-30T04:23:27+05:30 IST