ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేపాల్‌ విషాదం

ABN, First Publish Date - 2023-01-18T23:25:01+05:30

నేపాల్‌ విమానప్రమాదం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆశ్చర్యానికీ, ఆవేదనకూ గురిచేసింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు అనేకం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేపాల్‌ విమానప్రమాదం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆశ్చర్యానికీ, ఆవేదనకూ గురిచేసింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు అనేకం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైనందున ఆ దృశ్యాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ప్రమాదంలో కన్నుమూసిన ఐదుగురు భారతీయుల్లో ఒకరు తీసిన వీడియోలో ఆ విమానం కూలి అగ్నికి ఆహుతయిన చివరిక్షణాలున్నాయి. నవ్వులూ కేరింతలతో సాగుతున్న ప్రయాణం కాస్తా క్షణాల్లో ఆహాకారాలతో ముగిసిన హృదయవిదారకమైన దృశ్యం అది.

నూటపాతిక కిలోమీటర్ల దూరం, ఇరవైఐదునిముషాల ప్రయాణం ఇలా ముగిసిపోవడం అత్యంత విషాదం. అనేకులు కాఠ్మాండూ నుంచి పోఖరాకు బస్సులో పోవాలనుకొని చివరి నిముషంలో మనసుమార్చుకున్నవారు. ప్రమాదంలో మరణించిన ఐదుగురు భారతీయులూ పోఖరాలో పారాగ్లైడింగ్‌ అనుభవాన్ని ఆస్వాదించాలని బయలుదేరినవారు. పర్యాటకులకు ఆనందాన్ని ఉత్సాహాన్ని అందించే ఎత్తయిన పర్వతాలకు, లోయలకు నేపాల్‌లో లోటేమీలేదు. మంచుపర్వతాలు మనసు దోచేస్తాయి. ప్రపంచంలో అతి ఎత్తయిన 14 పర్వతశిఖరాల్లో సగం ఈ దేశంలోనే ఉన్నందున పర్వతారోహకుల తాకిడి నేపాల్‌కు ఎక్కువే. పర్యాటకంతో పాటుగా అవసరార్థం పెరిగిన విమానరంగం ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే విషాదం. మూడుదశాబ్దాల క్రితమే ప్రైవేటురంగానికి తలుపులు తెరిచినందున ఇబ్బడిముబ్బడిగా పెరిగిన అనేక ప్రైవేటు విమానయాన సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అతిచిన్న రన్‌వేలు, అటూఇటూ కొండలు లోయల మధ్య విమానాన్ని దించడం పైలట్లకు నిత్య సంకటం. పదిహేనేళ్ళనాటి ఈ ఎఆర్టీ–72 విమానం ఫ్రాన్స్‌ ఇటలీ సంయుక్తభాగస్వామ్యంతో తయారైంది. పోఖరా వంటి పర్యాటక ప్రాంతాల్లోనూ అక్కడ నిర్మించిన రన్‌వేలమీదా జెట్‌ ఇంజన్‌ విమానాలను వాడే అవకాశం లేనందున, ఈ తరహా రెండు ఇంజన్ల షార్ట్‌టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (స్టోల్‌) రకం విమానాలమీద ఆధారపడే నేపాల్‌ తన పర్యాటకరంగాన్ని వృద్ధిచేసుకుంటోంది. ఎత్తయిన పర్వతాలు, సంక్లిష్టమైన రన్‌వేలు, క్షణాల్లో మారిపోయే వాతావరణ పరిస్థితులు కలగలిసినందున విమాన ప్రమాదాల్లో నేపాల్‌ అగ్రస్థానంలో ఉండటం సహజం. ఈ ప్రమాదానికి వాతావరణపరిస్థితులు కారణంకాదన్నది స్పష్టంగానే తెలుస్తున్నది. విమానాన్ని నడిపిన అనుభవం ఎన్నివందల గంటలున్నా, ప్రతీ ప్రయాణం పైలట్లకు అగ్నిపరీక్షే కనుక మానవ తప్పిదాన్ని కాదనలేం. నేపాల్‌ విమానరంగం ఎంత అస్తవ్యస్థంగా ఉన్నదో ఈ ఘటన మరోమారు వెలికితెచ్చింది. ఈ విమానం నేపాల్‌లో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ ‘యతి’కి చెందింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు కూడా గతంలో విమానప్రమాదంలోనే మరణించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు విచారణ కమిటీలు నివేదికలు ఇస్తుంటాయి కానీ, వాటిని అమలు చేయడంమీద పాలకులు శ్రద్ధ లేకపోయింది. సంక్లిష్టమైన భౌగోళిక వాతావరణ పరిస్థితులున్నప్పుడు, తరచు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వాటికి ఎదురొడ్డి విమానాలను నడపాలంటే ప్రమాణాల మీద ప్రత్యేక దృష్టిపెట్టాలి. నిర్వహణ, శిక్షణలో లోపాలు, పెరిగిన పైలట్ల పనిభారం ఇత్యాది సమస్యలను పరిష్కరించాలి. ఈ ఘటన జరిగిన వెంటనే ఒక కంపెనీ సీఈవో తనకు గతంలో నేపాల్‌లో ఎదురైన ఒక అనుభవాన్నసామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. విమానంలో విండోసీట్లో కూచుని ఉన్న తనకు సన్నగా గాలి తగులుతూంటే భయమేసి ఎయిర్‌హోస్టేస్‌ను పిలిచారట. ఆమె వచ్చిచూసి, ఓ టిష్యూపేపర్‌ తెచ్చి ఆ కిటికీ మూలన గుచ్చి అభయహస్తమిచ్చారట. నేపాల్‌ భౌగోళిక వాతావరణ పరిస్థితులకంటే నిర్వహణ లోపాలు, నిర్లక్ష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఉదంతం తెలియచెబుతోంది. పర్యాటకాన్ని పెంచుకోవాలన్న నేపాల్‌ కోరికను అర్థం చేసుకోవచ్చు కానీ, అత్యంత కఠినమైన ప్రాంతాల్లో సైతం చిన్నచిన్న విమానాశ్రయాలు కట్టేస్తూ, నామమాత్రపు రన్‌వేలు సృష్టిస్తూ, ప్రజలప్రాణాలను ప్రమాదంలో పడవేయడం సరికాదు. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ ఇప్పటికైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగి అక్కడి వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించి, తన సలహాలు సూచనలు అమలయ్యేట్టు చేయడం ముఖ్యం.

Updated Date - 2023-01-18T23:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising