RK Kothapaluku: అపార్థం కాదు.. అర్థం చేసుకోవాలి!
ABN, First Publish Date - 2023-02-26T00:52:03+05:30
‘యథార్థవాది లోక విరోధి’ అని అంటారు. ఆకాంక్షలు, ఆశలు అధికంగా ఉన్నప్పుడు అపోహలు, అపార్థాలు, అసహనం కూడా అధికంగానే ఉంటాయి. గత ఆదివారం నేను ‘కొత్త పలుకు’లో...
‘యథార్థవాది లోక విరోధి’ అని అంటారు. ఆకాంక్షలు, ఆశలు అధికంగా ఉన్నప్పుడు అపోహలు, అపార్థాలు, అసహనం కూడా అధికంగానే ఉంటాయి. గత ఆదివారం నేను ‘కొత్త పలుకు’లో చెప్పిన అంశాలను అర్థం చేసుకున్నవారి కంటే అపార్థం చేసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. అపార్థం చేసుకున్న వారిలో అత్యధికులు పవన్ కల్యాణ్ అభిమానులే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులే అందుకు కారణం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అదే సమయంలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు జనసేన మోహరించి ఉన్నాయి. 2024లో జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఓడించాలంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోకూడదన్నది ఒక అభిప్రాయం. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వివిధ సందర్భాలలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అయితే వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని ఆ పార్టీలో ఓ వర్గం బలంగా కోరుకుంటున్నది. తెలుగుదేశం పార్టీతో జత కడితే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాలేరన్నది ఈ వర్గం అభిప్రాయం. తెలుగుదేశంలో కూడా ఒక వర్గంవారు జనసేనతో పొత్తు లేకుండా పోటీ చేసినా అధికారంలోకి వస్తామనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ పరిస్థితులలో అధికార వైసీపీ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా ఆ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను రెచ్చగొట్టే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహం గురించి నేను ‘కొత్త పలుకు’లో పేర్కొన్న అంశాలను వైసీపీ వాళ్లు ముడిసరుకుగా వాడుకుని పవన్ కల్యాణ్ అభిమానులను రెచ్చగొట్టాలని చూశారు. పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ ఆఫర్ చేశారని కానీ, అందుకు ఆయన అంగీకరించారని కానీ నేను నా కాలమ్‌లో ఎక్కడా రాయలేదు. కేవలం కేసీఆర్ వ్యూహాలు మాత్రమే వివరించాను. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటే కేసీఆర్‌కు పొసగదు అన్న విషయం బహిరంగ రహస్యమే. చంద్రబాబు బలపడితే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని విస్తరింపజేయడానికి ఆయన ప్రయత్నిస్తారు. కనుక చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని కేసీఆర్ సహజంగానే కోరుకుంటారు.
ఈ కారణంగానే తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు కుదరకుండా అడ్డుకోవడం కోసం ఆయన వ్యూహరచన చేస్తున్నారని నేను చెప్పాను. ఇందులో పవన్ కల్యాణ్‌కు పాత్ర ఉందని కానీ, కేసీఆర్ ప్రతిపాదనలకు ఆయన అంగీకరించారని కానీ నేను ఎక్కడా ప్రస్తావించలేదు. కేసీఆర్ వ్యూహాలు కేంద్రంగా మాత్రమే నేను గత వారం ‘కొత్త పలుకు’లో రాశాను. కేసీఆర్ మాత్రమే కాదు.. జగన్మోహన్‌రెడ్డికి పరోక్షంగా సహకరిస్తున్న అనేక మంది కూడా వివిధ మార్గాలలో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదరకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నది నిజం. ఈ క్రమంలో అటువంటివారు జనసేనాని పవన్ కల్యాణ్ బుర్ర తింటున్నారట కూడా. ఆయన ఒకరిద్దరి వద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు కూడా. జరిగిన, జరుగుతున్న పరిణామాలపై కాలమిస్ట్‌లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. విశ్లేషణ చేస్తారు. నేను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను మాత్రమే ప్రస్తావించాను. మొత్తం వ్యవహారంలో పవన్ కల్యాణ్ పాత్ర గురించి ఎక్కడా చర్చించలేదు. వాస్తవానికి ఆయనను దృష్టిలో పెట్టుకుని నేనే అభిప్రాయమూ వ్యక్తంచేయలేదు. కేవలం పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ పన్నుతున్న రాజకీయ వ్యూహాలను మాత్రమే చెప్పాను. తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు కుదరకూడదని ఇప్పుడే కాదు, గత ఎన్నికలలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో తన అభిప్రాయానికి విరుద్ధంగా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై ఆగ్రహం చెందిన కేసీఆర్, అప్పట్లోనే ‘కాంగ్రెస్‌తో చేతులు కలిపితే ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగే ఎన్నికల్లో జగన్ – పవన్ కల్యాణ్ చేతులు కలిపేలా చేస్తాను’ అని హెచ్చరికలు చేశారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు కూడా సబ్జెక్టివ్‌గానే ఉంటున్నాయన్న అభిప్రాయం ఉంది. వార్తల రూపంలో బయటకురాని విషయాలను తెలుసుకుని వాటికి అంతర్గత సంభాషణలను జోడించి కాలమ్ రాయడం మా సీనియర్ల నుంచి మాబోటివాళ్లం నేర్చుకున్నాం. అప్పట్లో ఇలాంటి సమాచారం కోసం రాజకీయ నాయకులు కూడా వేచి చూస్తుండేవాళ్లు. ఇప్పుడు అంతర్గత వ్యవహారాల గురించి చెబితే బెడ్రూమ్‌లో దాక్కున్నావా? బాత్‌రూమ్‌లో నక్కి విన్నావా? అంటూ లేకి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకప్పుడు గౌరవించగా, ఇప్పుడు కించపరుస్తున్నారు. ఇందుకు కారణం ఆయా పార్టీల అభిమానుల మధ్య విభజన రేఖ ఏర్పడి, ఎదుటివారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం. జనసేన అభిమానులు కూడా ఇదేబాటలో గత వారం నేను రాసిన అంశాలను అపార్థం చేసుకున్నారు. కేసీఆర్ ఎత్తుగడలు గురించి చెబితే వాటిని పవన్ కల్యాణ్‌కు ఆపాదించుకుని విమర్శలకు దిగారు.
ఆలోచనకు పనిచెప్పకుండా ఆవేశపడడం రాజకీయ పార్టీలకు శోభనివ్వదు అని మరిచారు. తెలుగుదేశం నుంచి పవన్ కల్యాణ్‌ను దూరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారంటే పవన్ కల్యాణ్ అంగీకరించారని అర్థం కాదు కదా! తమ భారతీయ రాష్ట్ర సమితితో చేతులు కలిపితే ఎన్నికల వ్యయం కోసం వెయ్యి కోట్లైనా సమకూరుస్తానని కేసీఆర్ ప్రతిపాదనలు పంపారంటే పవన్ కల్యాణ్ అంగీకరించారని కాదు కదా! కర్ణాటకలో జేడీఎస్ నాయకుడు కుమారస్వామి పాత్ర పోషించవలసినదిగా సూచిస్తున్నారంటే అందుకు పవన్ కల్యాణ్ సిద్ధపడ్డారని కాదు కదా! కేసీఆర్ మాత్రమే కాదు, కాపు సామాజికవర్గానికి చెందిన కొంతమంది ముఖ్యులు కూడా జనసేన ఒంటరిగా పోటీ చేసి 25 నుంచి 30 స్థానాలు గెలుచుకుంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, ఆయన చెవిన ఇల్లు కట్టుకుని పోరుతున్నది నిజం కాదా? ఇందులో నిజం ఉందో లేదో పవన్ కల్యాణ్ చెబితే బాగుంటుంది. తాను చెప్పినట్టే చేస్తే కర్ణాటకలో కుమారస్వామిలాగా ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, కాపు సామాజికవర్గానికి చెందిన, తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారుల వద్ద కేసీఆర్ చెప్పడం నిజం కాదా? కేసీఆర్ వ్యూహాలు ఎవరి కోసమంటే జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమేనని నేను చెప్పాను. దూతల వద్ద కేసీఆర్ ప్రస్తావించిన అంశాలన్నింటికీ, పవన్ కల్యాణ్ తలూపారని నేను చెప్పలేదే? దేశంలోని వివిధ రాష్ర్టాలకు విస్తరించాలనుకుంటున్న కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా బలపడాలనుకుంటున్నారు. అందుకోసం పవన్ కల్యాణ్ సహకారం తీసుకోవాలనుకుంటున్నారని మాత్రమే గత వారం నేను పేర్కొన్నాను. జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడానికి మాత్రమే ఈ ఎత్తుగడ అని నా అభిప్రాయంగా చెప్పాను. అది నిజం కాకపోతే ఆ విషయం కేసీఆర్ చెప్పాలి. మధ్యలో జనసేన అభిమానులు ఎందుకు నొచ్చుకున్నారో, అపార్థం చేసుకున్నారో తెలియదు. ఎవరి విమర్శలకో, దూషణలకో భయపడి నేను ఈ వివరణ ఇవ్వడం లేదు. అపార్థాలు, అపోహలు చోటుచేసుకున్నప్పుడు వివరణ ఇవ్వడం సమంజసమని నమ్ముతున్నాను. ఒంటరిగా పోటీ చేయాలా? పొత్తులు పెట్టుకోవాలా? అన్నది పవన్ కల్యాణ్ ఇష్టం. ఆ విషయంలో ఆయనను ప్రభావితం చేయడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఆయనను ప్రభావితం చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. గత వారం రోజుల్లో నాకు తెలిసిన కొత్త విషయాలు మాత్రమే నేను ‘కొత్త పలుకు’లో ప్రస్తావిస్తాను. రాజకీయాలలో తెరపైకొచ్చే ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చవు. కేసీఆర్ వ్యూహాలు కూడా ఫలించవచ్చు– లేదా ఫలించకపోవచ్చు. నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను ‘కొత్త పలుకు’లో ప్రస్తావిస్తాను. వాటివల్ల ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అన్నది నాకు అనవసరం. ఒక జర్నలిస్టుగా మాత్రమే నేను ఆ సమయంలో స్పందిస్తాను. విషయాలు చెప్పడంలో ఒకొక్కరిది ఒక్కో శైలి. నేను నసుగుడు, నాన్చుడు లేకుండా నాకు తెలిసిన విషయాలు చెబుతాను. ఎవరో చెబితేనో, ఎవరి ప్రయోజనాల కోసమో కాలమ్ రాసే అంత అర్భకుడిని కాదు నేను. తెలుగుదేశం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నేను రాస్తాననీ, చంద్రబాబు చెప్పినట్టు వింటాననీ ఎవరైనా అనుకుంటే అది వారిష్టం. మేం నమ్మిన విషయంలో నిక్కచ్చిగా ముందుకు వెళ్లడం మా లక్ష్యం. ఇందులో నన్ను ఎవరూ ప్రభావితం చేయలేరు. ఈ కారణంగా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్లు కూడా అనేక సందర్భాలలో ‘బ్యాన్ ఏబీఎన్’ అని ప్రచారం చేశారు. ఎవరికో కోపం వస్తుందని నేను నాకు తెలిసిన విషయాలను చెప్పకుండా ఉండలేను. వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పినప్పుడు, షర్మిలకు, ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని చెప్పినప్పుడు, వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో డాక్టర్ సునీతకు నచ్చజెప్పాలని విజయమ్మను, భారతీరెడ్డి తల్లి సుగుణమ్మ అభ్యర్థించిన విషయం చెప్పినప్పుడు కూడా కొందరు అవాకులు చెవాకులు మాట్లాడారు. రాజకీయ నాయకుల మధ్య అంతర్గతంగా చోటుచేసుకునే అవగాహనలు, అభిప్రాయ భేదాలను తెలుసుకుని రాయడమే జర్నలిజమవుతుంది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మీడియాకు రంగు పూయడం మొదలుపెట్టారు. తాము చేస్తున్న తప్పులను ప్రజలు తెలుసుకోకుండా చేయడం కోసం మీడియాకు ఇలా రంగు పూసే కార్యక్రమం మొదలెట్టారు. ఇప్పుడది మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రభుత్వాల తప్పులను ఎత్తి చూపితే చాలు సొంత మీడియాలో తిట్టిపోస్తుంటారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే ఆంధ్ర మీడియా అని ఆడిపోసుకోవడం ఆయన మీడియాకు అలవాటుగా మారింది. ఇప్పుడదే కేసీఆర్ ఆంధ్రపదేశ్‌లో కూడా సొంత పత్రిక ప్రారంభించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌పై కేసీఆర్ కన్ను పడకుండా ఉండకపోతే ఆయన అక్కడ పత్రిక ఎందుకు ప్రారంభిస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆయన పత్రిక పాటుపడదు కదా! కేసీఆర్‌కు నిజంగా ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ ఉంటే, అక్కడి రాజకీయాలలో వేలు పెట్టకపోతే అదే పదివేలు! జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నది విస్తృత అభిప్రాయం. నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా? పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా అన్నది మాకు అప్రస్తుతం. జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ గురించి మరిచిపోవచ్చు అని అందరూ అనుకుంటున్నట్టుగానే మేం కూడా భావిస్తున్నాం. అయితే ఈ ఉపద్రవం నుంచి రాష్ర్టాన్ని తప్పించడం కోసం తెలుగుదేశం– జనసేన మధ్య పొత్తు కుదర్చడం మా పని కాదు. అది ఆ రెండు పార్టీల నిర్ణయం. గత వారం నేను చెప్పిన అంశాలపై ఆవేశపడుతున్న పవన్ కల్యాణ్ అభిమానులు మళ్లీ ఒకసారి ఆ విషయాలను చదవడం మంచిది. పవన్ కల్యాణ్ అభిమానులు ఆవేశపడగానే ఆయన సోదరుడు నాగబాబు కూడా స్వరం కలుపుతున్నారు. చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా టైమ్‌లో మా సిబ్బందిలో ఎవరో ఏదో రాశారని ఎవరో ఆవేశపెడితే నాగబాబు కూడా దూకుడుగా మాట్లాడారు. చిరంజీవికి తమ్ముడు, పవన్ కల్యాణ్‌కు అన్న కాకపోతే నాగబాబు విమర్శలకు నేను స్పందించి ఉండేవాడిని కాదు. గత వారం నేను రాసిన దానిపై కూడా నాగబాబు ఇదేవిధంగా స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా, తొందరపాటుతో స్పందించడం ఆ పార్టీకి మేలు చేస్తుందో లేదో జనసేన అభిమానులు, నాగబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఏ తప్పులు జరిగాయో, ఇప్పుడు కూడా అవే తప్పులు చేస్తున్నారు. తమ చర్యలు, ప్రకటనల ద్వారా జనసేనను ఒక సామాజిక పరిధికి మాత్రమే పరిమితం చేసుకుంటున్నారు. వివిధ సందర్భాలలో నాగబాబు చేస్తున్న ప్రకటనలు ఇతర వర్గాలను జనసేనకు దూరం చేస్తున్నాయన్నది ఒక అభిప్రాయం. ఇందులో నిజం ఉందో లేదో వారే ఆత్మపరిశీలన చేసుకోవాలి. తన అభిమానులు, అనుచరులు పరిణతితో ఆలోచించాలని పవన్ కల్యాణ్ కోరుకుంటారని ఆశిస్తాను. పవన్ కల్యాణ్ గానీ, మరొకరు గానీ ఆ కుటుంబం నుంచి సినిమా రంగంలో రాణిస్తున్నారంటే మెగాస్టార్ చిరంజీవి వేసిన పునాదే కారణం. అయితే చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడానికి, గుర్తింపు పొందడానికి ముందు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో అభిమానులకు తెలుసా? అవమానాలు ఎదురైనపుడు చిరంజీవి వాటిని సహనంతో అధిగమించారే కానీ, అతిగా ఆవేశపడలేదు. ఫలితంగా ఆయన ఇవాళ మెగాస్టార్ అయ్యారు. ఈ విషయం పవన్ కల్యాణ్ అభిమానులు తెలుసుకుంటే మంచిది. గాలిలో యుద్ధం చేయడం వల్ల అనవసరంగా అలసిపోతారు. ఇప్పటికైనా జన సైనికులు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. అలాకాకుండా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాత్రమే నేను గత వారం రాశాను అని ఇంకా భావిస్తే అది వారిష్టం.
అవినాశ్‌కు జగన్ అండదండలు!
ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై జగన్ అండ్ కో తీసుకున్న వైఖరి గురించి చర్చించుకుందాం. ఈ హత్యకు ప్రధాన సూత్రధారులలో ఒకరైన వైఎస్ అవినాశ్‌రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం రెండో పర్యాయం విచారించిన తర్వాత జగన్ అండ్ కో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. విచారణ ముగిసిన తర్వాత అవినాశ్‌రెడ్డి హైదరాబాద్‌లో ఏం చెప్పారో తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాదాపుగా అదే చెప్పారు. దీన్నిబట్టి అవినాశ్‌కు జగన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనది రాజకీయాలకు అతీతమైన బంధమని జగన్‌రెడ్డి ఒకవైపు చెప్పుకొంటూనే మరోవైపు చంద్రబాబు చెప్పినట్టుగా సీబీఐ వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించడం హాస్యాస్పదంగా ఉంది. వివేకా హత్యతో అవినాశ్‌కు, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి సంబంధం ఉందని తేలిపోయినా సీబీఐ కొంతకాలం పాటు అడుగు ముందుకు వేయలేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ముఖ్యమంత్రి జగన్‌పై మొహం మొత్తిందేమో తెలియదు కానీ, ఇటీవల ఆ కేసులో సీబీఐ చురుకుగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మలుగా కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా జగన్ అండ్ కో మాత్రమే చంద్రబాబు చెప్పినట్టు సీబీఐ ఆడుతోందని అనడం హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చంద్రబాబు అంత శక్తిమంతుడు అయి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని అరాచకాలు జరిగి ఉండేవా? గన్నవరం సంఘటన జరిగేదా? అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు ఇలాగే రెచ్చిపోగలరా? బడితె ఉన్నవాడిదే రాజ్యం అన్నట్టుగా జగన్ పాలించగలడా? వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరగకూడదని జగన్మోహన్ రెడ్డి మాత్రమే కోరుకున్నారు. విచారణ సీబీఐ చేతుల్లోకి వెళితే తన జుట్టును ఢిల్లీ పెద్దల చేతికి అందించినట్టేనని జగన్ భావించి ఉంటారు. ఇప్పుడదే జరుగుతోంది. రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపించి ఉంటే వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిని ఇరికించి శత్రుశేషం లేకుండా చేసుకుని ఉండేవారు కాబోలు. డాక్టర్ సునీత అకుంఠిత పోరాట పటిమ వల్లసీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం, అసలు నిందితులు వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడే అందరి కళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులకు అంతా తెలుసు అని స్పష్టమైపోయింది. దీంతో కలుగులోంచి బయటకు వచ్చిన సజ్జల వితండవాదానికి తెర తీశారు. ఈ హత్యకేసులో ముద్దాయిలలో ఒకరైన దస్తగిరిని అప్రూవర్‌గా తీసుకోవడం చట్టవిరుద్ధమని తొండాటకు దిగారు. న్యాయస్థానం అనుమతితోనే దస్తగిరి అప్రూవర్‌గా మారారు. న్యాయమూర్తికి తెలియని చట్టం, సజ్జలకు మాత్రమే తెలిసిన చట్టమేమిటో ఆయనే చెప్పాలి. అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేస్తే అది దుర్మార్గమవుతుందని సజ్జల అంటున్నారంటే వివేకా హత్యకేసులో అవినాశ్‌కు సంబంధం ఉందని సజ్జల అంగీకరిస్తున్నారన్న మాట. నిజానికి అవినాశ్‌ను అరెస్ట్ చేస్తామని సీబీఐ అధికారులు ఇంతవరకు ప్రకటించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీతో విభేదించి రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టకుండా జీవో జారీ చేసినప్పుడు ఆక్షేపించిన జగన్ అండ్ కో, ఇప్పుడు వివేకా కేసులో మాత్రం సీబీఐ విచారణను తప్పు పట్టడం ఆశ్చర్యంగా ఉంది. తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే సీబీఐ విచారణ జరపాలని సజ్జల కోరుతున్నారంటే సీబీఐ రంగంలోకి వస్తుందని ఊహించని జగన్ అండ్ కో వివేకా హత్య కేసును మరెవరి మెడకో చుట్టే ప్రయత్నం అప్పటికే పూర్తిచేశారని భావించవచ్చు. ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్న డాక్టర్ సునీత కన్నతండ్రినే చంపుతారని జగన్ అండ్ కో చెబితే నమ్మగలమా? జగన్‌కు ఈ కేసులో పక్షపాతం ఉండి ఉండకపోతే ఆయన సొంత పత్రికలో సీబీఐ అఫిడవిట్స్ గానీ, డాక్టర్ సునీత పోరాటం గురించి గానీ, ఒక్క ముక్క కూడా ఎందుకు ప్రచురించడం లేదో చెప్పాలి. ఆ పని చేయకపోగా అవినాశ్‌రెడ్డి అండ్ కోను కాపాడటానికి జగన్ మీడియా శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. దీనినిబట్టి వివేకా హత్యకేసులో జగన్‌రెడ్డి దంపతులు వాస్తవాలను మరుగుపరిచారని స్పష్టమవుతోంది. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా మరింత ముందుకు సాగితే జగన్ దంపతులు కూడా ఈ కేసులో నిందితులుగా నిలబడాల్సి రావచ్చు. ఈ కారణంగానే సజ్జల శుక్రవారం మాట్లాడుతూ జగన్‌రెడ్డి వైపు కేసు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందుగానే చెప్పుకొచ్చారు. వివేకా హత్యకేసులో అంతిమంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ, డాక్టర్ సునీత పోరాట పటిమ మాత్రం మహిళా జాతికే స్ఫూర్తి. తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని భయపడకుండా, ఆమె ఎక్కడా వెనకడుగు వేయకుండా తన తండ్రి హత్యతో సంబంధం ఉన్నవారందరినీ ముద్దాయిలుగా చట్టం ముందు నిలబెట్టగలిగింది. ఇందుకు ఆమెకు అభినందనలు!
ఆర్కే
Updated Date - 2023-02-26T08:04:46+05:30 IST