RK KOTHAPALAKU : ఇప్పుడు పాపం పండిందా!
ABN, First Publish Date - 2023-02-05T01:07:29+05:30
ట్రిపుల్ ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినందుకు మనమంతా తెలుగువారిగా గర్వించాం. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి...
ట్రిపుల్ ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినందుకు మనమంతా తెలుగువారిగా గర్వించాం. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి విస్తరించినందుకు పొంగిపోయాం. భారతీయ నటీనటులకు ఇంతవరకు ఆస్కార్ అవార్డు దక్కలేదన్న వెలితి అయితే మనకు అలాగే ఉండిపోయింది. అయితే ఇప్పటివరకు ఆస్కార్ అవార్డు పొందిన నటీనటులను మించిన నటనా కౌశలాన్ని రాజకీయాల్లో ప్రదర్శిస్తున్న ఒక మహానటుణ్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆయన మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అంటే ఆశ్చర్యం కలగవచ్చు గానీ, ఆయనలోని నటనాచాతుర్యం అనితర సాధ్యం. ఈ అభిప్రాయంతో విభేదించేవారు ఉండవచ్చు గానీ జగన్మోహన్ రెడ్డి నటనా చాతుర్యాన్ని గమనించినవాళ్లు మాత్రం నిజమేనని అంటారు. ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో తీవ్ర అసంతృప్తితో వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజుల క్రితం పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన నటన చూసినవారెవరికైనా ఇకపై ఆయనను ఆస్కార్ అవార్డుకు ప్రతిపాదించాలని అనిపించక మానదు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం! తనను కలసిన ఎమ్మెల్యేను ఉద్దేశించి ‘‘నా అనుకున్నవాళ్లు కూడా ఇలా వ్యవహరించడం చాలా బాధగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా? అని ఆవేదన కలుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చి కోట్ల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుదామనుకున్నా. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనిపిస్తోంది’’ అని జగన్మోహన్ రెడ్డి తెగ బాధపడ్డారట! జగన్ నోట హిమాలయాలు–రాజకీయ సన్యాసం వంటి మాటలు విన్న సదరు ఎమ్మెల్యేకు మూర్ఛ వచ్చినంత పనైంది. అయితే ఎలాగోలా నిభాయించుకుని ఆయన అక్కడి నుంచి బయటపడి పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తండ్రి రాజశేఖర రెడ్డి భౌతికకాయం కూడా లభించకముందే.. చితి మంటలు పూర్తిగా ఆరకుండానే ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చాచిన జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ‘రాజకీయాలు అంటే విరక్తి కలుగుతోంది.. హిమాలయాలకు వెళ్లిపోతాను’ వంటి మాటలు వింటే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి. ముఖ్యమంత్రి పదవిని అప్పగించడానికి నిరాకరించిన కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్మోహన్ రెడ్డి, ఆ సందర్భంగా ప్రదర్శించిన నటనా చాతుర్యాన్ని చూసి అదంతా నిజమని జనం నమ్మారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత జనాన్ని కలుసుకోకుండా పరదాల మాటున తిరగడాన్ని చూసి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. అలిపిరిలో రోడ్డు పక్కన ఉన్న చెట్లను ఆసరాగా చేసుకొని మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్ అమర్చి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును హత్య చేయాలనుకున్నందున ఇప్పుడు తన పర్యటన సాగే ప్రాంతాలలో పచ్చని చెట్లను కొట్టివేయిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి జనానికి నోట మాట రావడంలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టులో తనను కోడికత్తితో గీసినప్పుడు భీతావహం చెందినట్టుగా జగన్ ప్రదర్శించిన నటనను అప్పుడు తెలుసుకోలేకపోయారు. సొంత ఇంటిలోనే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు ఆయన ప్రదర్శించిన నటన అనితర సాధ్యం కాదా? గొడ్డలితో నరకడం వల్ల వివేకానంద రెడ్డి తల ఛిద్రమై చనిపోయినప్పటికీ, ఆయన గుండెపోటుతో చనిపోయారని కొన్ని గంటలపాటు రాష్ట్ర ప్రజలను నమ్మించగలిగిన జగన్ అండ్ కో నటనా చాతుర్యాన్ని తక్కువగా అంచనా వేయగలమా? వివేకాను చంపినవాళ్లు, చంపించినవాళ్లను చుట్టూ పెట్టుకొని తన బాబాయ్‌ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే చంపించాడని చెబితే జగన్‌లోని నటుడిని గుర్తించలేని జనం అది నిజమేనని నమ్మి ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చాక వివేకాను చంపింది మరెవరో కాదు.. ఆయన ఏకైక కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తన సొంత మీడియా ద్వారా ప్రచారం చేయించినా జగన్‌లోని నటుడిని ప్రజలు తెలుసుకోలేకపోయారు. వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వడం, ఆ సందర్భంగా వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగా ముఖ్యమంత్రి దంపతుల వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌లను విచారించినప్పటికీ ‘అబ్బే ఇందులో కుట్ర ఏమీ లేదు’ అని జగన్ అనుంగు సహచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి బుకాయిస్తుండటంతో ఏది నటనో, ఏది నిజమో జనం తెలుసుకోలేక సతమతమవుతున్నారు. సీబీఐ అధికారుల వద్దకు వెళ్లే ముందు అవినాశ్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మను ఎందుకు కలిశారో చెప్పమంటే మాత్రం చెప్పరు. విజయమ్మను అవినాశ్ రెడ్డి కలిసిన సమయంలోనే ముఖ్యమంత్రి సతీమణి భారతి తల్లి ప్రత్యేకంగా విజయమ్మకు ఫోన్ చేయడం నిజం కాదని చెప్పగలరా? జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా అవినాశ్ రెడ్డిని వదిలేయమని డాక్టర్ సునీతారెడ్డికి నచ్చజెప్పవలసిందిగా విజయమ్మకు ఫోన్ చేసిన భారతీరెడ్డి తల్లి అభ్యర్థించారంటే కాదనగలరా? హత్యకు గురైన వివేకానంద రెడ్డి కంటే హత్య వెనుక ప్రధాన సూత్రధారుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డిని వెనుకేసుకు రావడంలోని మర్మాన్ని జనం గుర్తించలేనంతగా అద్భుత నటనను ప్రదర్శిస్తున్న జగన్‌ను ఆస్కార్ అవార్డుకు ప్రతిపాదించాలనుకోవడం తప్పా? వివేకానంద రెడ్డి హత్యకు గురైన నాటి నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్న నటనను మించి నటనా ప్రతిభను ప్రదర్శించిన నటుడు మరొకరు ఉన్నారా? పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి అవినీతి కేసులలో తనతో పాటు సహ నిందితులుగా ఉన్న వారందరికీ ప్రభుత్వంలో పెద్ద పీట వేయడం, తాను అధికారంలోకి రావడానికి మారీచుడు, సుబాహుడిలా మారువేషాల్లో సహకరించిన వారందరికీ ప్రభుత్వంలో పదవులు కట్టబెడుతూ వచ్చిన జగన్‌లోని మహానటుడిని గుర్తించలేకపోవడం ఆయనను అవమానించడం కాదా? దళితులు, బడుగుల కోసమే తన జీవితం అని చెప్పుకొంటున్న జగన్మోహన్ రెడ్డి ఏలుబడిని తరచి చూస్తే.. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం మాస్కులు కూడా అందివ్వడం లేదని ఆక్షేపించిన పాపానికి దళితుడైన డాక్టర్ సుధాకర్‌ను ఆత్మహత్య చేసుకునే వరకు వేధించడం చూశాక, జగన్ ప్రభుత్వం రసవత్తరంగా నటిస్తోందని భావించకుండా ఉండడం మన తప్పు కాదా? దళితుడైన డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేయించిన వాళ్లను ఇప్పటికీ వెనుకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి తాను దళితుల కోసమే జీవిస్తున్నానని నమ్మించగలుగుతున్నారంటే ఆయన నటనా శక్తి అనితర సాధ్యం కాదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారికి ఆ అవకాశం ఇవ్వకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికే జీవో నం.1 అని చెప్పగలగడం ఆషామాషీ నటన కాదు కదా! తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకుడైన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిని నాలుక కోస్తానంటూ మీసం మెలేసి విరుచుకుపడిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోరంట్ల మాధవ్‌కు ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించిన మనిషే ఇప్పుడు తనను విమర్శించిన ఒక కానిస్టేబుల్ తన్నేరు వెంకటేశ్వరరావును జైలుకు పంపడం కూడా లోకకళ్యాణం కోసమేనని నమ్మించడం మామూలు నటన కాదు కదా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టును కూడా ఆశ్రయించినవాళ్లు ఇప్పుడు అధికారంలో కూర్చొని తర తమ భేదం లేకుండా అందరి ఫోన్లను దొంగతనంగా వింటూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? మాకు ఇంకేం పని లేదా? అని బుకాయించగలగడం అంటే ఆషామాషీ నటన కాదు కదా? ‘జగన్‌కు నమ్మకం తప్ప అనుమానాలు ఉండవు, మా పిచ్చి మారాజు జగన్ అందరినీ నమ్ముతాడు’ అని తానే తొలగించిన ఇద్దరు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో చెప్పించగల ఘటనాఘటన సమర్థుడు జగన్మోహన్ రెడ్డి అంటే కాదనగలరా? నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు సాక్షీ భూతాలుగా ఉంటున్న వారితోనే తాను అమాయకుడినని చెప్పించుకోవడం జగన్ గడసరితనం కాదా? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లను కేసులలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్పప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అసహనంతో రగిలిపోతూ కూడా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించడం మామూలు విషయం కాదు కదా? కొంత కాలం క్రితం పదవీ విరమణ చేసిన ఒక అధికారిని పిలిపించుకొని చంద్రబాబు, లోకేశ్‌లను కేసులలో ఇరికించడానికి క్లూస్ ఇస్తే మీకు మంచి పోస్టింగ్ ఇస్తామని ఆఫర్ చేసి కూడా ప్రస్తుత రాజకీయాలు చూస్తోంటే విరక్తి కలుగుతోందని జగన్ చెప్పగలుగుతున్నారంటే ఆయనను ఆస్కార్‌కు మించిన అవార్డు ఉంటే దానికి నామినేట్ చేయాలని అనిపించకుండా ఉంటుందా? ప్రజాస్వామ్యం అంటే ‘ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్’ అంటారు. ఆ లైన్‌లోనే తన ప్రభుత్వం దళితులు, బడుగుల కోసమే అని నమ్మించగలగడం గొప్ప విషయమే కదా?
అపర కుబేరుడి క్లాస్ వార్!
ప్రజలు తాను చెప్పిన మాటలను నమ్మడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా ‘క్లాస్ వార్’ నినాదం ఎత్తుకున్నారు. రాష్ట్రంలో పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఆయన దృష్టిలో పెత్తందార్లుగా ఉన్న ఎవరూ అత్యంత ధనిక ముఖ్యమంత్రి జాబితాలో ఉన్నవారు కాదు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కిన జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారంటే ఆయనలో ఎంత గొప్ప నటుడు ఉన్నారో అర్థం కావడం లేదా? 2004లో తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జీరోగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎలా అయ్యారో చెప్పగలరా? కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని చెబుతున్న ముఖ్యమంత్రి, తన వ్యక్తిగత ఆదాయం మాత్రం ఏటా పెరగడంలోని మర్మం ఏమిటో చెప్పాలి కదా? ఆ కిటుకు తెలిస్తే సంక్షేమ పథకాల అవసరం లేకుండానే ప్రతి ఒక్కరూ జగన్‌లాగే ధనికుల జాబితాలో చోటు సంపాదించుకుంటారు కదా? ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్రం విడిపోయిన తర్వాత పలువురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కుమారులు ఎవరూ జగన్మోహన్ రెడ్డి వలె ఇప్పుడు అపర కుబేరులు కారు కదా? జగన్ స్థాయిలో నటనా కౌశలం లేనందువల్లే బహుశా వారంతా తెరమరుగై ఉంటారు. ఒకప్పుడు కమ్యూనిస్టుల నోటి నుంచి బూర్జువా, పెట్టుబడిదారీ వ్యవస్థ వంటి పదాలు వెలువడితే వినసొంపుగా ఉండేది. ఇప్పుడు అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి వర్గ పోరు అనే పదాన్ని వినవలసి రావడం కలికాలం మహిమ అని సరిపెట్టుకుందాం. చరిత్రలో క్లాస్ వార్‌కు నాయకత్వం వహించిన వారెవరూ అత్యంత ధనికులుగా రికార్డులకు ఎక్కిన దాఖలాలు లేవు. ఈ రికార్డు కూడా జగన్‌కే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించిన రావి నారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య వంటి ఎందరో మహానుభావులు భూస్వాముల కుటుంబాల నుంచి వచ్చినవారే. అయితే వారంతా తమ భూములను పేదలకు పంచిన తర్వాతే కమ్యూనిస్టు జెండాకు నాయకత్వం వహించారు. అభినవ కామ్రేడ్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉత్త చేతులతో రాజకీయాల్లోకి వచ్చి అపర కుబేరుడిగా అవతరించారు. అయినప్పటికీ క్లాస్ వార్‌కు నాయకత్వం వహించే అర్హత తనకు ఒక్కడికే ఉందని జగన్ నమ్మించగలుగుతున్నారంటే ఆయనలోని నటుడిని తక్కువ అంచనా వేయగలమా? తనను తాను గొప్ప సంఘసంస్కర్తగా ప్రచారం చేసుకొనే సాహసాన్ని జగన్‌రెడ్డి ప్రదర్శించడాన్ని చూస్తే ముచ్చట వేయకుండా ఉంటుందా? 1984 సంక్షోభం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఒక సందర్భంలో వ్యక్తిగతంగా మాట్లాడుతూ.. ‘మేమేం నటులం బ్రదర్. రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలను మించిన నటులు ఎవరుంటారు?’ అని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిలోని నటుడిని చూసిన తర్వాత ఎన్టీఆర్ చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజం అనిపించకుండా ఉంటాయా? ఒకే సమయంలో తన ముఖంలో జాలి గుణాన్ని, క్రౌర్యాన్ని, విచారాన్ని ప్రదర్శించగల నటుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అందుకే ఆయనను భవిష్యత్తులోనైనా ఆస్కార్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకగ్రీవంగా ప్రతిపాదించాలని విజ్ఞప్తి.
అదానీకి దాసోహం!
క్లాస్ వార్‌కు నాయకత్వం వహిస్తున్నానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న గౌతం అదానీకి దాసోహం అవడం కూడా క్లాస్ వార్‌లో భాగమే అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు సంపదను అదానీకి ధారాదత్తం చేయాలనుకున్న జగన్‌రెడ్డి తన చర్యలను ఎలా సమర్థించుకుంటారు? హిండెన్ బర్గ్ నివేదిక పుణ్యమా అని అదానీ వ్యాపార సామ్రాజ్యం పునాదులు కదులుతున్నాయి. అధికారంలో ఉన్న వారి ప్రాపకంతో పటిష్ఠ పునాదులు లేకుండా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న ఎంతో మంది ఆ తర్వాత పతనమవడాన్ని చూశాం. బహుశా ఇప్పుడు గౌతం అదానీ వంతు వచ్చినట్టుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకు తగ్గట్టుగానే అధికారంలో ఉన్నవారిని అడ్డుపెట్టుకొని పలు ప్రైవేటు పోర్టులను, ఎయిర్‌పోర్టులను అదానీ హస్తగతం చేసుకున్నారు. పుదుచ్చేరిలోని కరైకల్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన జీఆర్‌కే రెడ్డి అనే ఆయన నిర్మించిన పోర్టును అదానీ గుంజుకున్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో జీవీ కృష్ణారెడ్డి ముంబైలో నిర్మించిన ఎయిర్ పోర్టుపై అదానీ కన్నుపడింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులు ఈ జాబితాలో చేరిపోయాయి. గంగవరం పోర్టును ప్రమోటర్ల నుంచి అయినకాడికి సొంతం చేసుకున్న అదానీ, ఆ తర్వాత ప్రభుత్వ వాటాను కూడా నామమాత్రపు ధరకు కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ సహకారంతోనే ఇది సాధ్యమైంది. రాత్రికి రాత్రే అధికారం అండతో నిర్మితమయ్యే ఏ వ్యాపారం కూడా ఎంతో కాలం మనజాలదు. ఇప్పుడు గౌతం అదానీ పాపం పండింది. ఎంతోమంది జీవిత కాలంపాటు శ్రమించి నిర్మించుకున్న వ్యాపార సంస్థలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల పేరు చెప్పి గుంజుకున్న అదానీకి వారి ఉసురు తగలకుండా ఉంటుందా? ఉన్నపళంగా ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానానికి ఎగబాకిన అదానీ.. హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత వైకుంఠపాళిలో పాము నోట చిక్కారు. ఇప్పుడు ఆయన ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి చేరినా ఆశ్చర్యంలేదు. అయితే అదానీ వ్యాపార సామ్రాజ్యం పతనం అవడం వల్ల నష్టపోయేది ప్రజలు, ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే. వ్యాపార సామ్రాజ్యాలు కుప్పకూలిన సందర్భాలలో వాటి స్థాపకులు ఎవరూ బికారులుగా మిగలలేదు. అనిల్ అంబానీ ఇందుకు నిదర్శనం. అదానీ విషయంలో కూడా ఆయన కంపెనీల్లో షేర్లు కొన్న కోట్లాది మంది ప్రజలు మునిగిపోతారు. స్టాక్ మార్కెట్ల షేర్ల ధరల ఆధారంగా వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చిన బ్యాంకులు నష్టపోతాయి. ఒక అంచనా ప్రకారం బ్యాంకుల నుంచి అదానీ గ్రూపు తీసుకున్న అప్పు రెండు లక్షల కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తామే నంబర్ 1 అంటూ ప్రభుత్వాలు గొప్పలకు పోతుంటాయి. అదే నిజమైతే అందరికీ సమాన అవకాశాలు లభించాలి కదా? వివిధ ప్రభుత్వాలు పిలిచే టెండర్లలో పోటీపడే అవకాశం ఇప్పుడు దేశంలో ఉందా? పాలకులు లేదా వారి నామినీలు నిర్దేశించిన వాళ్లే టెండర్లు వేయాలి. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గౌతం అదానీ వంటివారు మాత్రమే ఎనిమిదేళ్ల వ్యవధిలోనే ప్రపంచ కుబేరులలో ఒకరిగా ఎలా ఎదుగుతారు? కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుజరాత్‌కు చెందిన అహ్మద్ పటేల్ సహకారంతో వ్యాపారంలో ఎదగడం మొదలుపెట్టిన అదానీ, ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రభుత్వ విధానాలలో పారదర్శకత లేనందువల్ల అధికారంలో ఉన్న వారి ప్రాపకంతో అదానీ వంటి వారు అనైతికంగా తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోగలుగుతున్నారు. తమ గ్రూపుపై జరిగిన దాడి దేశంపై జరిగిన సర్జికల్ దాడిగా అదానీ అభివర్ణించడం హాస్యాస్పదంగా ఉంది. కేవలం నాలుగైదేళ్లలోనే ప్రపంచ కుబేరుల్లో రెండవ స్థానాన్ని దక్కించుకున్న అదానీ ఈ దేశానికి చేసింది ఏమిటి? అప్పటికే నిర్మితమైన పోర్టులను, ఎయిర్‌పోర్టులను గుంజుకున్నారే గానీ కొత్తవి నిర్మించలేదే? అంతెందుకు, ఆయన కడుతున్న మొత్తం పన్ను ఎంతో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి కదా? అదానీ వ్యవహారం రెండు రోజులుగా పార్లమెంటును కుదిపేస్తోంది. అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌనం వీడటం లేదు. కోట్లాది మంది మదుపరుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు అప్పులు ఇచ్చిన బ్యాంకులను కాపాడటానికి ఏమి చేయబోతున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది.
అయ్యో.. కళాతపస్వీ!
ఇక గురువారం రాత్రి శివైక్యం చెందిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు ఘన నివాళి అర్పించే తీరిక కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం. ఇటీవలి కాలంలో మరణించిన సినీ ప్రముఖులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన కేసీఆర్ ప్రభుత్వం, కాశీనాథుని విశ్వనాథ్ అందుకు అర్హుడు కారని భావించిందా? విశ్వనాథ్ నిర్మించిన కళాఖండాలను విస్మరించడం సాధ్యమా? ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడానికి ఆయనకు అర్హత లేదా? ప్రభుత్వమే చెప్పాలి. సినీ పరిశ్రమలో విశ్వనాథ్‌కు వారసులు లేరు. ఉండి ఉంటే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగి ఉండేవేమో!
ఆర్కే
Updated Date - 2023-02-05T03:51:12+05:30 IST