ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గాజా గాయాలపై మీడియా కారాలు

ABN, First Publish Date - 2023-11-01T01:09:59+05:30

పాత్రికేయ రంగంలో వృత్తిపరమైన విలువలు శరవేగంగా క్షీణిస్తున్నాయి. ఇజ్రాయిల్– హమాస్ యుద్ధం ఈ శోచనీయ పరిస్థితిని స్పష్టంగా ఎత్తి చూపుతోంది; మీడియా పాత్రపై అనేక ప్రశ్నలు సంధిస్తోంది...

పాత్రికేయ రంగంలో వృత్తిపరమైన విలువలు శరవేగంగా క్షీణిస్తున్నాయి. ఇజ్రాయిల్– హమాస్ యుద్ధం ఈ శోచనీయ పరిస్థితిని స్పష్టంగా ఎత్తి చూపుతోంది; మీడియా పాత్రపై అనేక ప్రశ్నలు సంధిస్తోంది.

యుద్ధ భూమిలో ప్రవేశించేందుకు విదేశీ పాత్రికేయులకు అనుమతి ఇవ్వడం లేదు. దీనివల్ల క్షేత్రస్ధాయిలో నిజానిజాలను నిర్ధారించుకోవడం కష్టమైపోతోంది. ఫలితంగా యుద్ధ ఘటనలపై తప్పుడు సమాచారం వెల్లడవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పెరిగిపోతున్న సామాజిక మాధ్యమాల ప్రభావశీలతను సమర్థంగా అధిగమించేందుకు ఘటనల తక్షణమే వార్తలను అందించే క్రమంలో తాము క్షేత్రస్ధాయిలో వాస్తవాలను నిశితంగా పరిశీలించలేకపోతున్నట్టు రాయిటర్, ఎ.యఫ్.పి, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, బిబిసి, సి.యన్.యన్, లా ముండే, గార్డియన్ మొదలైన అంతర్జాతీయ మీడియా దిగ్గజాలు అంగీకరించాయి. ఆ పరిస్థితి కొన్నిసార్లు వార్తలలో గందరగోళం నెలకొనడానికి కారణమవుతోందని అవి పేర్కొన్నాయి. ఇజ్రాయిల్ చిన్నారులను హమాస్ వధించినట్లుగా, ఫలస్తీనా ఆసుపత్రిపై ఇజ్రాయిల్ సైనిక దళాల దాడులు చేసినట్లుగా వచ్చిన వార్తలను ఈ సందర్భంగా ఆ మీడియా సంస్ధలు ఉదహరించాయి.

తమ వార్తా కథనాలలో ఉగ్రవాదం లేదా ఉగ్రవాదులు అనే పదం వాడకం వృత్తిపరమైన నిర్ద్టిష్ట సూత్రాలకు లోబడి ఉన్నట్టుగా బిబిసి, రాయిటర్, ఎ.యఫ్.పి, వాషింగ్టన్ పోస్ట్ చెప్పాయి. గాజాపై దాడులను, నెతన్యాహు ప్రభుత్వ విధానాన్ని ఇజ్రాయిల్ ప్రముఖ దినపత్రిక ‘హార్టేజ్’ గట్టిగా ప్రశ్నించింది, అదే విధంగా మరో ప్రముఖ దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్’ కూడా అనేకసార్లు ఇజ్రాయిల్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది.

అక్టోబర్ 7న హమాస్ దాడులతో ప్రారంభమమైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 24 మంది పాత్రికేయులు మరణించారు. వారిలో 20 మంది ఫలస్తీనియులు, ముగ్గురు ఇజ్రాయిలీలు కాగా మరొకరు లెబనాన్ జాతీయుడు. రాయిటర్స్ విలేఖరి మరణించగా ‘అల్ జజీరా’ న్యూస్ ఛానెల్ బ్యూరో చీఫ్ భార్యాబిడ్డలు ఇజ్రాయిల్ సేనల దాడులలో చనిపోయారు. యుద్ధ అత్యవసర స్ధితిలో విదేశీ మీడియా ప్రవేశాన్ని ఇజ్రాయిల్ నిషేధించింది. అరబ్బుల గొంతుక అయిన అల్ జజీరా’తో పాటు బిబిసి కార్యాలయాలనూ మూసివేసింది.

భద్రత, నిఘా రంగాలలో ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక విశిష్ట గుర్తింపు ఉన్న ఇజ్రాయిల్ హమాస్ దాడులపై తన నిఘా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ తన ప్రతిష్ఠను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తన వాదనను ప్రపంచానికి తెలియజేస్తోంది. యుద్ధ వార్తల సేకరణకై అంతర్జాతీయ మీడియాకు చెందిన 2 వేల మందిని అనుమతించినట్లుగా ఇజ్రాయిల్ వెల్లడించింది. అయితే వీరెవరూ నేరుగా, స్వతంత్రంగా గాజాకు వెళ్ళి వార్తలు సేకరించడం మాత్రం నిషిద్ధం! ఇజ్రాయిల్ అధికారులు స్వయంగా తీసుకువెళ్లే ప్రదేశాల నుంచి మాత్రమే వారు వార్తలు సేకరించవల్సి ఉంటుంది.

ఈ పరిస్ధితులలో భారతదేశం నుంచి ప్రత్యేకంగా కొన్ని మీడియా సంస్ధలు తమ విలేఖరులను గాజాపై దాడుల కవరేజి నిమిత్తం పంపించాయి. వీరిలో పలువురు జాతీయ పాలక పార్టీ పక్షపాతులు అని పేరుబడినవారే. హమాస్– ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమైన 24 గంటలలోపే ఇజ్రాయిల్ వీసాకు ఈ భారతీయ విలేఖరులు దరఖాస్తులు చేసుకున్నారు. వారి సౌకర్యార్థం, మరీ ఆదివారం రోజున సైతం న్యూ ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయాన్ని ప్రత్యేకంగా తెరిపించడానికి మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చొరవ తీసుకున్నది. తత్ఫలితంగానే వారికి వెన్వెంటనే వీసాలు జారీ అయ్యాయి.

ఇజ్రాయిల్ నుంచి ఇటు భారతదేశ పాలక పక్ష విధానాలకు మద్దతుగా భావోద్వేగాలను రగిలించడమే లక్ష్యంగా ఆ విలేఖరులు పంపిన యుద్ధ వార్తలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. విమర్శలు, ప్రతివిమర్శలు ఎలా ఉన్నా మొత్తానికి ఒక యుద్ధ ఘటనల కవరేజికి మాత్రం భారతీయ పాత్రికేయులు వెళ్ళారు కదా. అయితే ఇక్కడ ఒక వాస్తవాన్ని ప్రస్తావించవలసి ఉంది. సుదూర పశ్చిమాసియాలో అరబ్బు నాట ఇజ్రాయిల్ – హమాస్ యుద్ధం జరిగిన వెన్వెంటనే 48 గంటలలోపు అక్కడ వాలిపోయిన భారతీయ పాత్రికేయ బృందం స్వంత గడ్డలో మణిపూర్ అయిదు నెలలుగా మండుతున్నా మాత్రం ఆ ఈశాన్య భారత రాష్ట్రానికి వెళ్ళడానికి ఎందుకు ఆసక్తి చూపలేదు? మణిపూర్‌ను కాదని ఇజ్రాయిల్‌ను వ్యూహాత్మకంగా ఎంచుకోవడంలో ఆంతర్యమేమిటి? ఈ వివక్షా వైఖరే భారతీయ మీడియా విశ్వసనీయతను దెబ్బతీయడం లేదూ?

బాలలు, మహిళలు, వృద్ధులు ఏ దేశం వారైనా సరే యుద్ధ బీభత్సానికి బలవడం బాధాకరమే. అమాయక ప్రజలను బలిగొనడం అత్యంత గర్హనీయం. అయితే ఇజ్రాయిల్ ప్రజలను మాత్రమే యుద్ధ బీభత్స బాధితులుగా చిత్రిస్తూ అంతకు పదింతలు ఎక్కువగా ఉన్న ఫలస్తీనియన్ నిస్సహాయులను విస్మరిస్తూ వెలువడుతున్న వార్తా కథనాలు పాత్రికేయ నిజాయితీని ప్రతిబింబించడం లేదు. ఇజ్రాయిల్ దాడులలో మరణించిన వారిని యుద్ధ క్షతగాత్రులుగానూ, అదే హమాస్ దాడులలో చనిపోయిన వారిని ఉగ్రవాద బాధితులుగానూ వర్ణించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇజ్రాయిల్ – ఫలస్తీనా ఘర్షణలు ఈ నాటివా? అవేమీ వర్తమాన పరిణామాలు మాత్రమే కావు. అయితే నవీన సామాజిక మాధ్యమాలు వాడకం పెరిగిన నేటి కాలంలో ఆ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం మాత్రం ఇదే ప్రప్రథమమని చెప్పవచ్చు. ఇజ్రాయిల్‌కు మద్దతుగా సామాజిక మధ్యమాలలో కనిపిస్తున్న సందేశాలలో అత్యధికం భారతావని నుంచే పోటెత్తుతున్నాయి. అసలు మొత్తం రక్తపాతానికి కారణం ఫలస్తీనాను దురాక్రమించుకోవడమే కాదూ? మరి ఈ మూలకారణాన్ని పూర్తిగా విస్మరించి వ్యూహాత్మకంగా వెలువడుతున్న వార్తలకు ప్రపంచంలోకెల్లా యూదులు ఎక్కువగా ఉన్న అమెరికా కంటే భారత్‌లో అధిక ప్రాధాన్యం లభించడాన్ని ఏమనుకోవాలి?

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-11-01T01:09:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising