ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓనాటి తిరుమల.. నీరు, ప్రసాదం!

ABN, First Publish Date - 2023-08-29T04:00:19+05:30

మనఆలయాల చరిత్రను నిష్పక్షపాతంగా చర్చించుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజకీయాల కోసం ఆలయాల కేంద్రంగా రేకెత్తిస్తున్న వివాదాలతో అసలు చరిత్ర మరుగున పడిపోతోంది...

మనఆలయాల చరిత్రను నిష్పక్షపాతంగా చర్చించుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజకీయాల కోసం ఆలయాల కేంద్రంగా రేకెత్తిస్తున్న వివాదాలతో అసలు చరిత్ర మరుగున పడిపోతోంది. ఈ వివాదాలకు భిన్నంగా చరిత్ర లోతుల్లోకి వెళితే ఆలయాలకు సంబంధించిన విశేషాలెన్నో తెలుస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాధాన్యత మనందరికీ తెలుసు. భక్తకోటిలో దానికున్న స్థానాన్ని దేనితోనూ పోల్చలేం. కొన్ని దశాబ్దాల నిర్వహణ సామర్థ్యాన్ని పరిశీలిస్తే దీనికి సాటైనది దేశంలో మరొకటి ఉందని చెప్పుకోలేం. వనరులు, ఆదాయం వారీగా కూడా తిరుమల దరిదాపుల్లోకి వచ్చే ఆలయాల్లేవు. ప్రజా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేసిన తర్వాత దేవాలయాల నిర్వహణలో సమర్థత పెరిగింది. దీన్ని కాదనలేం. బ్రిటిషు పాలనలోనూ కొన్ని పద్ధతులు, విధానాలు వచ్చాయి. అవి కూడా ఎంతో కొంత ఆలయాల నిర్వహణలో జవాబుదారీతనాన్ని తీసుకువచ్చాయి. కానీ మన చరిత్ర ఎంతో సుదీర్ఘమైంది. ఇంతటి సుదీర్ఘ చరిత్రలో వ్యవస్థల నిర్వహణకూ స్పష్టమైన విధివిధానాలు ఉండకుండా ఉండవు. వాటిని వెలికి తీయటం చరిత్రకారుల పని. ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో వాటి మంచిచెడ్డలను హేతుబద్ధంగా అంచనా వేయటం వారు చేయాలి. బ్రిటిషు పాలనకు ముందు ఆలయాల పరిస్థితులేమిటి? వాటి నిర్వహణ సామర్థ్యం ఎంత? ఆ సామర్థ్యంలో తేడాలొస్తే ఆనాటి ప్రభుత్వాలు ఎంతమేరకు జోక్యం చేసుకునేవి? ఆలయాలకు వచ్చే నిధులను దేనికి ఉపయోగించేవారు? ఆలయాలు వాటిని సక్రమంగా వినియోగిస్తాయన్న భరోసా దాతలకు ఎవరు కల్పించేవారు? వివాదాలను ఎలా పరిష్కరించేవారు? వీటికి జవాబులు అన్వేషించకుండా ఆలయాల చరిత్రను అర్థం చేసుకోలేం. దక్షిణాది ఆలయాల చరిత్రను ఈ కోణాల్లో అర్థంచేసుకోవాలంటే నిష్పక్షపాతంగా అధ్యయనం చేయాలి. అట్లా చేసిన వాళ్లల్లో అమెరికాకు చెందిన చరిత్రకారుడు బటన్‌ స్టెయిన్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తిరుమల దేవస్థానం ఆర్థిక నిర్వహణ మీద ఎంతో పరిశోధన చేసి 1957లో సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి పీహెచ్‌డీని పొందారు. ఆ తర్వాత రాసిన వ్యాసాలు, పుస్తకాలు కూడా విశ్లేషణ పరంగా ఎంతో లోతైనవి. అందులోనూ తిరుమలపై రాసింది మరింత ప్రత్యేకమైంది.

సంప్రదాయ గాథల ద్వారా మనకు తెలిసే తిరుమల చరిత్రకు ఎన్నో పరిమితులు ఉంటాయి. కల్పనలు, విశ్వాసాల మీద అది ఆధారపడింది. వాస్తవ చరిత్ర దృష్ట్యా చూస్తే తిరుమల ప్రస్తావనలు 9వ శతాబ్దం తర్వాతే ప్రముఖంగా కనపడతాయి. తిరుపతి ప్రస్తావనలు కూడా అంతే. చారిత్రకంగా తిరుమల విశేషాలను తెలుసుకోటానికి రాతి శాసనాలే ప్రధాన ఆధారం. దాదాపు వేయి శాసనాలు వెలుగులోకి వచ్చాయి. 9 నుంచి 16వ శతాబ్దం వరకూ తిరుమల ఆర్థిక వ్యవహారాలను ఈ శాసనాల ఆధారంగానే స్టెయిన్‌ అధ్యయనం చేశారు. ఇన్ని శాసనాలు ఉండటం తిరుమల విశిష్టత. ఇతర విశేషాలు ఉన్నప్పటికీ ఈ శాసనాలు ముఖ్యంగా తిరుమలకు ఇచ్చిన భూదానాలు, నగదు సమర్పణల గురించే ఎక్కువగా చెబుతాయి. మొదట్లో పరిమితంగా ఉన్న దానాలు విజయనగర రాజుల కాలంలో బాగా పెరిగాయి. విజయనగర కాలానికి ముందు దక్షిణాదిలో చాలా రాజవంశాలు పరిపాలన చేసినప్పటికీ వైష్ణవ మతానికి పెద్ద ప్రాధాన్యం దక్కలేదు. దాదాపు మూడు వందలేళ్ల పాటు విజయనగర ప్రభావం దక్షిణాది అంతటా ఉండేది. ఆర్థికంగానూ మెరుగైన పరిస్థితులు ఉండేవి. పాలక వర్గాల ఆదరణతో తిరుమలకు ఆర్థికంగా అంతకు ముందెన్నడూ లేనంత చేదోడు లభించింది. 1456–1570ల మధ్య 115 గ్రామాలను తిరుమలకు దానంగా ఇచ్చారు. నగదు సమర్పణలు భారీగానే వచ్చాయి. మూడువందలకు పైగా ఉన్న దానకర్తల కోసం ప్రత్యేక పూజలు, అర్చనలు చేసేవారు. గ్రామాలను ఇచ్చిన వారిలో విజయనగర రాజులతో పాటు సేనానాయకులు, సామంతులూ ఉన్నారు. ఒకవైపు నుంచి గ్రామాలు, మరోవైపు నుంచి నగదు విరాళాలు... వీటిని ఏం చేసేవారు? ఎవరికైనా వచ్చే సందేహమే ఇది. 1380ల్లో తిరుమలకు సంబంధించి ఒక ముఖ్య పరిణామం జరిగింది. 12 మందితో కూడిన ధర్మకర్తల (ట్రస్టీలు) నిర్వహణ కిందకు ఆలయం వచ్చింది. 1380ల కంటే రెండు వందలేళ్ల ముందు నుంచీ తిరుమల ప్రతిష్ఠ క్రమేపీ ఇనుమడించింది. దక్షిణాదిలో ప్రముఖ ఆలయంగా గుర్తింపు పొందటం మొదలైంది. చోళ రాజుల కాలంలో జరిగిన వేధింపుల వల్ల వైష్ణవులకు తిరుమలే శరణ్యంగా మారింది. 1450ల తర్వాత ధర్మకర్తల ఆలయ ఆర్థిక నిర్వహణ కొత్త పుంతలు తొక్కింది. దానంగా వచ్చిన గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేయటం ఇందులో కీలకమైంది. దానకర్తల పేరిట అర్చనలు, పూజలు క్రమపద్ధతిలో జరగాలంటే వచ్చిన నగదు విరాళాలను లాభదాయకంగా పెట్టుబడి పెట్టాలి. ఆనాటి కొన్ని ఆలయాలు నగదును వ్యాపారులకు వడ్డీకి ఇచ్చేవి. ప్రజలకు ప్రాతినిధ్యం ఉండి విస్తృత అధికారాలతో కూడిన గ్రామ సభలు ఉన్న చోట్ల వాటికి అప్పులు ఇచ్చేవారు. కానీ తిరుమల మాత్రం ప్రధానంగా నీటిపారుదల సౌకర్యాలపైనే వచ్చిన నగదును వెచ్చించింది. ముఖ్యంగా తిరుపతి–చంద్రగిరి ప్రాంతంలోని దాన గ్రామాల్లో అనేక విధాలుగా నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరచారు. ఆ గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తి పెరగటానికి ఇది దోహదం చేసింది. ఆలయానికి వచ్చే ఆదాయమూ పెరిగింది. భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా వచ్చిన నగదుని పూజలు, కైంకర్యాలకు ఖర్చుపెట్టేయటం చాలా తేలిక. కానీ దాతలు కూడా తమ పేరిట దీర్ఘకాలం పూజలు, అర్చనలు జరగాలని కోరుకునేవారు. అది జరగాలంటే ఏటా ఆదాయం వచ్చేలా నగదుని పెట్టుబడిగా పెట్టాలి. అందుకే సగటున ఏటా 10–15 శాతం ఆదాయం వచ్చేలా పెట్టుబడులు పెట్టారు. దాతలు కూడా తమ విరాళాల్లో ఎంత మొత్తం పెట్టుబడులుగా పెట్టాలో నిర్దేశించేవారు. పెట్టుబడులు పెట్టాలంటే గ్రామాల నేల స్వభావం, అక్కడి నైసర్గిక పరిస్థితులు, పంటల సరళి, మార్కెటింగ్‌ సౌకర్యం లాంటి చాలా విషయాలను తెలుసుకోవాలి. అందుకు నేర్పరితనం ఉండాలి. ఆలయ పాలనాధికారులు దీన్ని సాధించటానికి బాగా కృషి చేశారు.


గ్రామాలను ఆలయాలకు దానాలుగా ఇవ్వటం దేశమంతా జరిగింది. తరాలుగా ఎంతో శ్రమతో సాగు చేసుకుంటున్న భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయాలకు అర్పించటానికి రైతులు ఎక్కడా సిద్ధంగా ఉండరు. దైవానికి సైతం ఆదాయంలో తృణమో పణమో స్వచ్ఛందంగా ఇవ్వటానికి మాత్రమే రైతులు ముందుకు వస్తారు తప్ప, ఆదాయంలో సింహభాగాన్ని ఇవ్వటానికి ఇష్టపడరు. కానీ ప్రాచీన, మధ్య యుగాల్లో రైతుల అభీష్టంతో పెద్దగా పనిలేదు. పాలకులు ఏర్పరచిన పద్ధతులే చెల్లుబాటు అయ్యేవి. గ్రామాలను దానంగా ఇచ్చినంత మాత్రాన భూములపై సర్వహక్కులూ ఆలయాలకు దఖలు పడలేదు. ఆ భూముల నుంచి గతంలో ప్రభుత్వానికి వాటాగా వెళ్లే పంట.. దానం అనంతరం ఆలయానికి వెళ్లేది. తేడా ప్రధానంగా అదే. పంటలో కొన్ని చోట్ల 50 శాతం, మరికొన్ని చోట్ల 75 శాతం వాటా ఆలయానికి వెళ్లేది. అజమాయిషీ పరంగా భూములు ఆనాడు నాలుగు రకాలుగా ఉండేవి. 1) భాండారు వాడ భూములు. అంటే పైనున్న రాజు అజమాయిషీలో ప్రత్యక్షంగా ఉండేవి. 2) అమరం భూములు. అంటే సేనానాయకుల కింద ఉండే గ్రామాలకు చెందినవి. పైనున్న రాజు కోసం కొంత సైన్యాన్ని పోషించటం సేనానాయకుల విధి. అందుకోసం వసూలు చేసే శిస్తులో ఎక్కువ భాగం తమ దగ్గరే ఉంచుకుని మిగిలినది రాజుకు పంపించేవారు. 3) అగ్రహారాలు, దేవాలయాలు, మఠాలు కింద ఉండే భూములు. ఇవి కూడా మొదట్లో పాలకుల నుంచి దానాలుగా వచ్చినవే. 4) రైతులకు నేరుగా వ్యక్తిగత హక్కులు ఎక్కువగా ఉండే భూములు. ఈ నాలుగో రకం భూముల ప్రస్తావనలు శాసనాల్లో మూడు చోట్ల మాత్రమే కనపడ్డాయి. ఈ సంగతులన్నీ చెప్పే ముఖ్య విషయం ఒకటే. రైతుల శ్రమ సృష్టించిన ఆదాయంతోనే దేవాలయాలకు వైభోగం సమకూరేది.

నగదు దానాలను పణాలు అని పిలిచే బంగారు నాణేల రూపంలో చెల్లించేవారు. 1509 నుంచి 1568 వరకూ 8,12,113 పణాలను దానంగా ఇచ్చారు. ఇందులో సగభాగం ఆలయ పూజారి వర్గం, తిరుపతి స్థానికులు, అక్కడి వ్యాపారుల నుంచి వచ్చింది. మిగతా భాగంలో సగం వాటా ఆలయ పూజారి వర్గం నుంచి దానరూపేణా సంక్రమించింది. ఇంత నగదు వీళ్లకు ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించుకుంటే తిరుమల ప్రసాదానికి సంబంధించి బోలెడు విశేషాలు తెలుస్తాయి. దాతల సంఖ్య హెచ్చిన కొద్దీ ప్రత్యేక పూజలు, అర్చనల సంఖ్య కూడా కాలక్రమేణా పెరిగింది. వాటితో పాటే ప్రసాదాలూ పెరిగాయి. తయారైన ప్రసాదాల్లో ముప్పాతిక వంతు పూజారులకు వెళ్లేది. మిగతాది దాతలకు వాటాగా వెళ్లేది. వాటా ప్రసాదాన్ని పూజారులు వ్యాపారులకు అప్పగించేవారు. దాతలు కూడా తమ వాటా విషయంలో అదే చేసేవారు. సేకరించిన ప్రసాదాన్ని వ్యాపారులు భక్తులకు విక్రయించేవారు. ప్రసాదాల అమ్మకం ద్వారా పూజారులకు నగదు లభించేది. బటన్‌ స్టెయిన్‌ అధ్యయనం ప్రకారం ప్రసాద విక్రయాన్ని ఆనాడు ఎవరూ తప్పుగా భావించలేదు. ఇప్పటిలాగే అప్పుడూ తిరుమల ప్రసాదాలను స్వీకరించటానికి భక్తులు తహతహలాడేవారు. ఇక భక్తులను ఆకర్షించటానికి ఆనాడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. దక్షిణాదిలో తిరుమల గొప్పదనాన్ని ప్రచారం చేయటానికి ఆచార్య పురుషులను దేవస్థానం ఆనాడు పోషించేది. ఆలయ ఆదాయ, ఆస్తులను తనిఖీ చేయటానికి రాజ్యం తరఫున అధికారులు సైతం ఉండేవారు. విజయనగర కాలంలో పరుపాల్యగర్‌ అనే అధికారికి ఇలాంటి బాధ్యతలు ఉండేవి. ఒకటి మాత్రం స్పష్టం. రాజ్యం, రైతులతో ఆలయాలకున్న సంబంధాలను విడదీసి చూస్తే చాలా చరిత్రను కోల్పోతాం.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - 2023-08-29T04:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising