అసలు తెలంగాణలో బీజేపీ అధికారాన్ని ఆశిస్తున్నదా?
ABN, First Publish Date - 2023-09-08T00:58:25+05:30
‘ఈసారి తెలంగాణలో అధికారం మాదే’ అన్నమాట భారతీయ జనతా పార్టీ నాయకుల నోట తరచుగా వినిపిస్తుంది. సైద్ధాంతికంగా బీజేపీ వాదాన్ని విశ్వసించి ఆ పార్టీతో...
‘ఈసారి తెలంగాణలో అధికారం మాదే’ అన్నమాట భారతీయ జనతా పార్టీ నాయకుల నోట తరచుగా వినిపిస్తుంది. సైద్ధాంతికంగా బీజేపీ వాదాన్ని విశ్వసించి ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు ఇది నిజమని నమ్మి అడుగులేశారు. అధికారం అనే గమ్యం ఆమడ దూరంలో ఉందన్న ఉత్సాహం వారిని ఉరకలెత్తించింది. అయితే ఆ ఆమడ దూరాన్ని ఎప్పటికీ చేరుకోలేమన్న, ఇన్నాళ్ళూ తాము చేసింది అబద్ధపు ప్రయాణమన్న నిజాన్ని జీర్ణించుకోలేక, అదే అబద్ధంతో ముందుకు సాగలేక ఇబ్బంది పడుతున్నారు.
ముప్పై తొమ్మిదేళ్ల కిందట లోక్‍సభలో రెండు సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం 2019 ఎన్నికల నాటికి సొంతంగా 303 స్థానాలను గెలుచుకునే దాకా కొనసాగింది. దేశమంతా బీజేపీ ప్రభంజనం కొనసాగితే, ఒక్క తెలంగాణలో మాత్రం ఐదు నుంచి ఒక స్థానానికి దిగజారింది. ఈ 39 ఏళ్లలో తెలంగాణలో బీజేపీ కేవలం ఏడంటే ఏడుసార్లు మాత్రమే రూరల్ స్థానాల్లో గెలుపొందింది. భారతదేశ ఆత్మ పల్లెలలో ప్రతిబింబిస్తుందని నమ్ముతాం. అదేవిధంగా అచ్చమైన తెలంగాణ భాష యాస గోస కనిపించేది ఆ పల్లెలలోనే. తెలంగాణని అర్థం చేసుకోవాల్సింది అక్కడే. అది అర్థం చేసుకోకుండా మాట్లాడే మాటలు, చేసే పనులు అన్నీ నేల విడిచి చేసే సాము మాత్రమే. తెలంగాణ ఆత్మను, ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోవడంలో బీజేపీ ఆది నుంచి తడబడుతూనే ఉంది.
ఆత్మగౌరవ నినాదమే నాడు నిజాం మీద, రజాకార్ల దౌర్జన్యాల మీద, దొరల పెత్తనం మీద పోరాటానికి పునాదులు వేసింది. అదే ఆత్మగౌరవ నినాదం దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో లోలోన సాగిన గోల్‌మాల్ గారడీలన్నీ తెలిసినవాడిగాను, వాటిని ఎదుర్కోవడానికి స్థాయికి మించి పోరాడిన అనుభవంతోను నేను కొన్ని నిజాలు చెప్పదలుచుకున్నాను. సుష్మా స్వరాజ్, రాజ్‍నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ మినహా బీజేపీలో చాలామంది పెద్దలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రాజకీయ కోణంలో మాత్రమే చూసి అడ్డంపడదాం అనుకున్నారు. తెలంగాణ బిల్లుకు సవరణ కోరుతూ రాజ్యసభలో తీర్మానం చేసి తిరిగి లోక్‍సభకు పంపుదాం అనుకున్నారు. ఆంధ్ర నాయకులతో కలిసి చేసిన పన్నాగాన్ని నిర్భయంగా ప్రశ్నించడానికి నేను వెనుకాడలేదు. స్వయంగా అగ్రనేత వెంకయ్య నాయుడు పేరును ప్రస్తావించి మరీ నిలదీయడంతో తదుపరి ప్రక్రియ సజావుగా సాగడానికి దారులు పడ్డాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఇది కాదనలేని నిజం.
తెలంగాణ ఏర్పాటు దశలో అగ్రనేత ఆడ్వాణీ, రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఎన్నికల సభలో తల్లిని చంపి బిడ్డను వేరు చేశారన్న వ్యాఖ్యల మర్మమేంటి? ఆ వ్యాఖ్యలతో పాటు టీడీపీతో పొత్తు వల్ల అధికార పీఠానికి పోటీ పడాల్సిన బీజేపీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు సీట్లకే పరిమితమైంది. ఇక ప్రతిపక్షంగా పోరాడాల్సిన అవసరాన్ని గుర్తించకుండా 2014 నుంచి 2018 దాకా టీఆర్ఎస్‌తో చెట్టా పట్టాలు వేసుకున్న నాయకత్వం అసమర్థత వల్లే ఒంటి సీటుకు పడిపోయింది.
2019 ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల నేపథ్యంలో బీజేపీ మళ్లీ టీఆర్ఎస్‌తో సమరానికి సిద్ధమైందన్న సంకేతం బీజేపీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది. అయితే ఆ ఉత్సాహం మీద నీళ్లు చల్లుతూ మళ్లీ పాత నాయకుల్ని ముందుకు తెచ్చారు. మద్యం ముడుపుల కేసులో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు ఖాయమని ఘంటాపథంగా చెప్పిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మొహం చాటేస్తున్నారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు తెలంగాణలో అధికారం అవసరం లేదనుకుంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలి. బీజేపీవారు పైకి అధికారమే లక్ష్యం అంటూ లోలోన బీఆర్‌ఎస్‌తో అనైతిక మిత్రత్వాన్ని పాటిస్తున్నారని తెలంగాణ ప్రజానీకం బలంగా నమ్ముతోంది. అదే నిజమని బీజేపీ నాయకత్వం మౌనం పాటిస్తోందా లేక అధికారం సాధ్యం కాదని భావిస్తోందా?
పార్టీ నిర్ణయాలు, ప్రయోజనాల కన్నా నాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం. వారి ముందు నిజంగా, నిజాయితీగా ఉండటం అవసరం. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోని వాళ్లు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపలేని వాళ్ళ మీద పోరాటానికి ఎప్పుడూ సిద్ధమే. పదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో కేసీఆర్ పాలన ఆంధ్ర పాలకులకు మించి ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తోంది. కేసీఆర్ మోడల్ పాలన పనికిరాదన్నది తెలంగాణ నాడి, గోడు చెబుతున్నాయి.
అప్రజాస్వామిక వాదాన్ని, పెత్తనాన్ని మోస్తూ ‘నాయకుడు’ అనిపించుకోవడం కంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పోరాటంలో భాగం కావడానికి ఒక సేవకుడిగా మిగిలిపోవడమే నాకు ముఖ్యం. జాతీయ అవసరాల కోసం బీజేపీ, బీఆర్ఎస్ ఒకరికొకరు కన్నుగీటుతున్న విషయం ఇప్పటికే తెలంగాణ సమాజం దృష్టికి వచ్చింది. ఆ అక్రమ సంబంధాన్ని నిలదీస్తారని భావించిన నేతల్ని క్రమంగా బయటకు పంపే ప్రక్రియ ఊపందుకున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి మేలు చేయడమే ఈ ప్రక్రియ ఉద్దేశం. ఈ కుట్ర కోణాన్ని నిశితంగా పరిశీలించడమే కాదు దీటుగా ఎదుర్కోవడానికి తెలంగాణ ఉద్యమ కారులంతా సన్నద్ధం కావాలి. మూడోసారి కేసీఆర్ చేతిలో మోసపోకూడదు అన్న విషయాన్ని తెలంగాణ సమాజానికి ఎలుగెత్తి చాటాలి. ఈ పోరాటంలో భాగం అయ్యేందుకు ఎన్నిసార్లు సస్పెన్షన్‌కి గురైనా లెక్కచేయను. కేసీఆర్‌ని గద్దె దించడానికి ఏ పార్టీ జెండా కిందకు వెళ్లి అయినా పోరాడేందుకు సిద్ధం.
యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే
Updated Date - 2023-09-08T00:58:25+05:30 IST