ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సనాతన ధర్మం! అధునాతన ధర్మం! శ్రామిక ధర్మం!

ABN, First Publish Date - 2023-09-24T02:54:04+05:30

కులవ్యవస్త ద్వారా, సామాజిక న్యాయానికి హాని చేసే సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదు; దాన్ని పూర్తిగా నిర్మూలించాలి!– అని, తమిళనాడు మంత్రి ఒకరు అన్నారనే వార్త...

కులవ్యవస్త ద్వారా, సామాజిక న్యాయానికి హాని చేసే సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదు; దాన్ని పూర్తిగా నిర్మూలించాలి!– అని, తమిళనాడు మంత్రి ఒకరు అన్నారనే వార్త తెలిసిందే. అప్పటినుంచీ, ఆ విషయం మీద వ్యతిరేకులూ, అనుకూలురూ, వాదులాడుకుంటున్నారు. ఆ వాదనలు విన్నాక, సనాతన ధర్మంతో పాటు, మరో రెండు ధర్మాల గురించి కూడా చర్చించాలనిపించింది నాకు.

‘ధర్మం’ అనే పదానికి అర్ధం ఏమిటి? ఆ పదం, ఎన్ని సందర్భాలలో వస్తుందో, ఆ సందర్భాల అర్ధాల మొత్తమే ఆ పదానికి అర్ధం. అలా చూసినప్పుడు, సమాజంలో, ‘ధర్మం’ అంటే మనుషులు పాటించవలిసిన విధీ, నియమం, సూత్రం, న్యాయం, లక్షణం, స్వభావం, విధానం, పద్ధతీ –వగైరాలు! ఏ పేర్లతో చెప్పుకున్నా, ‘ధర్మం’ అనేది సమాజంలో మనుషులంతా ఒకరికొకరు ఆప్తులై, శాంతి సౌఖ్యాలతో జీవించడానికి కావలిసినదే! ఇప్పుడు జరుగుతున్న వివాదం, సమాజానికి సంబంధించిన ధర్మం ఎలా వుండాలి – అనే దాని గురించే! వివాదం అయితే, సనాతన ధర్మం మీద విమర్శతో మొదలైంది.

‘సనాతన’ అనే విశేషణానికి అర్ధాలు: శాశ్వతమైన, ప్రాచీనమైన, పవిత్రమైన, నిశ్చలమైన–అని! ‘సనాతన ధర్మాన్ని’ సమర్ధించే వారి ప్రకారం, సనాతన ధర్మం అనేది అతి ప్రాచీనమైనది! అందుకే అది పవిత్రమైనది! అదే శాశ్వితంగా అనుసరించదగ్గదీ! ప్రాచీనమైన ప్రతీది పవిత్రం కాదనీ; తర్కానికి నిలబడనిదీ, కొందరికే మేలు చేసేదీ అయిన ఏ ధర్మమూ, శాశ్వితంగా వుండిపోదనీ ఎవరైనా అంటే సనాతనులకు చాలా కోపం!

‘సనాతన’ అనే మాటా, దాని అర్ధమూ మొట్టమొదట ఏ ప్రాచీన గ్రంధంలో వచ్చిందీ–అనే దానిమీద వేరు వేరు అభిప్రాయాలున్నాయి. అది మొదటిసారి ‘భగవద్గీత’లో కనపడిందని కొందరు అంటే, వేదాలలో అసలు ఆ మాటేలేదని కొందరు అంటారు. నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడే ‘భగవద్గీత’ తెరిచి పరిశీలిస్తే, ఆ మాట, ‘భగవద్గీత’లో, రెండు చోట్ల కనపడింది. 1వ అధ్యాయంలో, 40వ శ్లోకంలో: ‘కుల క్షయం వల్ల సనాతన కుల ధర్మాలు నశిస్తాయి. కుల ధర్మాలు నశించడం వల్ల, వంశాన్నంతటినీ అధర్మం కమ్ముకుంటుంది’. కుల విధానం నశిస్తే అధర్మం కమ్ముకుంటుందట! ఈ శ్లోకంలో ధర్మం అనేది లేదు! (‘కుల’ అనే సంస్కృతం మాటకి: కుటుంబం, వంశం, సమూహం, తెగ, కులం, వర్ణం–ఇలా దాదాపు 40 అర్ధాలున్నాయి. ఇక్కడ నేను, ‘భగవద్గీత’కి, చలంగారు చేసిన తెలుగు అనువాదాన్ని ఆధారం చేసుకున్నాను.) 2వ అధ్యాయంలో, 24వ శ్లోకంలో : ‘ఇది (ఆత్మ) కోతపడదు, కాలదు, తడవదు, ఎండదు, ఇది నిత్యం, సర్వ వ్యాప్తం, నిశ్చలం, సనాతనం, అవ్యక్తం...’ ఈ శ్లోకంలో వున్నదంతా, సనాతన ఆత్మ శాస్త్రం!

‘వేదాలలో ‘సనాతన’ అనే మాట లేకపోయినా, వాటిల్లో వున్నదంతా సనాతన ధర్మమే’ అని వాదించేవారున్నారు. అసలు ప్రశ్న: సనాతన ధర్మం అనేది ఏగ్రంధంలో వున్నా, అది బోధించే భావాలు ఏమిటి? ‘కులాలు నాశనం కాకూడదు’ అని చెప్పే అభివృద్ధి వ్యతిరేక భావాలు! ‘ఆత్మ’ అనే అశాస్త్రీయ భావనలు! ఇవేనా? స్త్రీల గురించి ఎంత దారుణమైన అభిప్రాయాలో, ‘భగవద్గీత’లో, 1వ అధ్యాయం లోనే చూడొచ్చు: ‘అధర్మం పెరగడం వల్ల కుల స్త్రీలు చెడిపోతారు. స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరమౌతుంది.’ (41వ శ్లోకం). ‘వర్ణ సంకరం చేసే కులనాశకుల దోషాలవల్ల శాశ్వతమైన జాతి ధర్మాలూ, కుల ధర్మాలూ పాడై పోతాయి.’ (43వ శ్లోకం). ఇంకో విషయం చూడండి: సనాతన ధర్మం, అసమాన శ్రమ విభజనను సహజమైనదిగా, వాంఛనీయమైనదిగా భావిస్తుంది. అందుకే అగ్రవర్ణాలకు అవసరమైన సేవలు (‘పరిచర్యాత్మకం’ = పరిచర్య రూపమైనవి) శూద్రులు చేయడాన్ని ఒక సహజమైన ధర్మంగా, విధిగా చెప్పింది సనాతన ధర్మం. దీనికి ఆధారాలు నాలుగు వేదాలలోనే కాదు, ఐదవ వేదంగా పిలిచే ‘మహాభారతం’లో కూడా లెక్కలేనన్ని వున్నాయి.


ఈ చిట్టి వ్యాసంలో, సనాతన ధర్మం గురించి ఎంతసేపు చెప్పుకుంటాం? దానితో పాటు, అధునాతన ధర్మాన్నీ, శ్రామిక వర్గ ధర్మాన్నీ కూడా చెప్పుకోవాలి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే సిద్ధాంతాన్ని ‘అధునాతన ధర్మం’ అనవచ్చును. ఈ ధర్మం ప్రకారం, ‘కుల భేదాలు’ వుండకూడదు. ఎందుకంటే, ఇక్కడ వేరు వేరు కులాల వాళ్ళు, అనేక పనిస్తలాల్లో– ఫ్యాక్టరీల్లో, గనుల్లో, బస్సుల్లో, రైళ్ళల్లో, ఆస్పత్రుల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, ఇంకా అనేక చోట్ల కలిసి పని చేసి తీరాలి. లేకపోతే సమాజ జీవితమే స్తంభించి పోతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. సనాతనులలాగే, ఆధునికులు కూడా ఇప్పుడు వున్న ‘అసమాన శ్రమ విభజన’ను ఏమాత్రం వ్యతిరేకించరు! ‘అసమాన శ్రమ విభజన’ అంటే, (1) శ్రమలు చెయ్యడంలో, కొందరు ఏ శ్రమలూ చెయ్యరు; అధికులే అన్ని శ్రమలూ. (2) శ్రమలు చేసే వారిలో, కొందరు జీవితాంతమూ మేధా శ్రమలే. మిగతా వారు జీవితాంతమూ శారీరక శ్రమలే! శారీరక శ్రమలలోనే అట్టడుగున వుండేవి, మురికిని శుభ్రం చేసే శ్రమలు! ఈ అధర్మ శ్రమ విభజన, ప్రస్తుత సమాజంలో, అధునాతన ధర్మం! కాబట్టి ‘ధర్మం’ అనే విషయంలో, సనాతన భావాలకూ, అధునాతన భావాలకూ మధ్య పెద్ద తేడా లేదు! సనాతన ధర్మం అనేది మరీ ప్రాచీనమైన మొరటు రూపంలో(అస్పృశ్యత) వుంటే, అధునాతన ధర్మం అనేది, నాజూకు రూపంలో (‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’= శ్రమకి గౌరవం) వుంటుంది. సనాతన ధర్మం, పెట్టుబడిదారీ సమాజానికంటే ముందు వున్న సమాజాలకి సంబంధించిన భావజాలం. అధునాతన ధర్మం పెట్టుబడిదారీ సమాజానికి సంబంధించిన భావజాలం. అందుకే, ఇప్పుడు మనకు కావలిసింది, సనాతన ధర్మమూ కాదు, అధునాతన ధర్మమూ కాదు! శ్రామిక ధర్మం కావాలి! దీని ప్రకారం, కనీస ఆరోగ్యమూ, శక్తీ వున్న మానవులందరూ, తమ జీవిత కాలంలో కొన్ని వేరు వేరు రకాల శ్రమల్ని, కొన్ని నియమాల ప్రకారం చేసి తీరాలి. ఒక ప్రొఫెసరు, ‘నేను ఎప్పుడూ యూనివర్శిటీలోనే పాఠాలు చెపుతానూ, లారీలూ బస్సులూ తోలే పనిలోకి డ్యూటీల ప్రకారం వెళ్ళను. నేను లెట్రిన్లు వాడతాను, పోనీ వాటిని కడుక్కుంటాను గానీ, అవసరమైనప్పుడు డ్రైనేజీ మార్గాల్ని శుభ్రం చేసే పనిలోకి రాను’ – అని, అనడానికి లేదు. ‘నేను ఆవు పాలు తాగుతాను, ఆవు నెయ్యి వాడతాను, కానీ, ఆ ఆవు చచ్చిపోయినప్పుడు, దాన్ని శ్మశానానికి మోసుకెళ్ళే పనిలోకి రాను’– అంటే కుదరదు. సనాతన కాలంలోనూ, అధునాతన కాలంలోనూ ఉన్న అసమానత్వ శ్రమ విభజనను, సమానత్వ శ్రమ విభజనగా మార్చడమే శ్రామిక ధర్మం లక్ష్యం! ఇది, అటు సనాతన ధర్మానికీ, ఇటు అధునాతన ధర్మానికీ పూర్తిగా వ్యతిరేకమైనది.

ఈ నాడు సనాతన ధర్మాన్ని సమర్ధిస్తున్న రాజకీయ పార్టీలు గానీ, దాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలుగానీ ఈ శ్రామిక ధర్మాన్ని అంగీకరించవు. అవన్నీ సగం–సనాతన, సగం–అధునాతన పార్టీలే. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘శ్రమ దోపిడీ’నీ, అసమాన శ్రమ విభజననీ సమర్ధించే పార్టీలే. అన్ని పార్టీలూ కులాల్నీ, మతాల్నీ, ప్రాంతీయ భేదాల్నీ, తరతమ భేదాలతో ఓట్లకోసం ఉపయోగించుకునేవే. అన్ని కులాలకూ, మతాలకూ, ప్రాంతాలకూ చెందిన శ్రామికుల నించీ అదనపు విలువని–వడ్డీ, లాభాలూ, కౌళ్ళూ అనే ఆదాయాల రూపంలో–లాగడానికి వీలునిచ్చే ఆర్ధిక విధానాన్ని అనుసరించేవే! కాబట్టి, ఆ రెండు పక్షాలలో ఏదో ఒక దాని పక్షాన, శ్రామిక వర్గ దృక్పధం గలవారు నిలబడవలిసిన అవసరం లేదు.

చివరికి గ్రహించవలిసింది ఏమిటంటే, సనాతన ధర్మానికీ, అధునాతన ధర్మానికీ, శ్రామిక ధర్మానికీ వున్న తేడాల్ని!

రంగనాయకమ్మ

Updated Date - 2023-09-24T02:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising