ప్రగతి పూలు పూస్తున్న భారత వృక్షం
ABN, First Publish Date - 2023-05-31T01:48:03+05:30
భవ్యచైతన్య దేహళి భారత్. విస్తరిస్తోన్న నవ భారతావని ప్రభావసీమలో నేడు మనం నిలబడి ఉన్నాము. ప్రపంచంపై తన అద్భుత ముద్రను పునఃస్థాపించేందుకు మన పురా నవ నాగరికత...
భవ్యచైతన్య దేహళి భారత్. విస్తరిస్తోన్న నవ భారతావని ప్రభావసీమలో నేడు మనం నిలబడి ఉన్నాము. ప్రపంచంపై తన అద్భుత ముద్రను పునఃస్థాపించేందుకు మన పురా నవ నాగరికత ఆశ్చర్యం కలిగించే రీతిలో గంభీరంగా ముందడుగు వేస్తోంది. విశ్వవ్యాప్తంగా భారత్ ప్రస్తుతం పొందుతోన్న అపూర్వ గౌరవాదరాలకు ఒక కొత్త దార్శనికత మూలాధారంగా ఉన్నది. జాతి ఐశ్వర్యాభివృద్ధి, దేశ సర్వతోముఖ పెరుగుదల, పురోగమనం పైనే కాకుండా అంతే సమానంగా భారత్ విశిష్టత– మన ఆధ్యాత్మిక విలువలు– ను పునరుజ్జీవింప చేసి, ఎల్లెడలా పునఃస్థాపించడంపై కూడా ఆ వినూత్న దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. భారతీయ నాగరికతకు జీవశక్తిని సమకూర్చే ఈ విశిష్ట అంశాలలో జాతిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న దేశ నాయకులు, గౌరవనీయ ప్రధానమంత్రిని నేను మనసారా అభినందిస్తున్నాను.
యోగా భారత్‌కు గర్వకారణం. ప్రపంచానికి భారతదేశ మహోత్తమ, మహోన్నత ప్రదానం యోగ విద్య. సమున్నత ఆధ్యాత్మిక వారసత్వాలను యోగా భారత్ సమకూర్చింది. మతం, విశ్వాసాలు, తెగలు, సమాజాల ఎల్లలకు ఆ సంప్రదాయం పరిమితం కాదు. విశ్వమంత విశాల సంప్రదాయమది. మానవ అంతః సీమల లోతుపాతులను సమగ్రంగా శోధించిన ఋషులు, సాధువులు, మార్మిక చింతకులు అనేకమందిని ఈ యోగా సంస్కృతి ప్రభవింప చేసింది. యోగా తాత్త్వికత, విజ్ఞానం ద్వారా ప్రతీ వ్యక్తి తనలోని అత్యున్నత శక్తి సామర్థ్యాలను కనుగొనే పద్ధతులు, మార్గాలను మానవాళికి యోగా భారత్ అందించింది. యోగా ప్రాధాన్యాన్ని, ప్రభావాన్నీ ప్రపంచవ్యాప్తంగా మున్నెన్నడూ లేని విధంగా అర్థం చేసుకుంటున్నారు. యోగ విద్యకు జన్మస్థానం భారత్ అని గుర్తించి, గౌరవిస్తున్నారు. యోగా ప్రాధాన్యాన్ని ప్రపంచ ప్రజలకు మరింతగా తెలియజేసేందుకై అంతర్జాతీయంగా దానికొక స్పష్టమైన గుర్తింపునివ్వాలని 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించారు. ఆ సూచనను గౌరవిస్తూ ప్రతీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. 177 సభ్య దేశాలు ఆ నిర్ణయాన్ని అంగీకరించాయి. యోగా విద్యను మానవాళికి మరింతగా చేరువ చేయడంలో ఇదొక గొప్ప ముందడుగు అనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున యోగా విశిష్టతను, దానిని ఆచరించడం వల్ల సమకూరే లబ్ధిని ప్రపంచ ప్రజలకు తెలియజేయడం జరుగుతోంది. వ్యక్తులకు ఆరోగ్యం, సమాజాల మధ్య శాంతి సామరస్యాలను పెంపొందించేందుకై యోగా పద్ధతులను ఆచరించడాన్ని పలు విధాల ప్రోత్సహిస్తున్నారు.
యోగాకు అంతర్జాతీయంగా ఒక విశిష్ట గుర్తింపు, గౌరవాన్ని సాధించడంతో పాటు మన మహోజ్వల, మహోన్నత చారిత్రక వారసత్వ, సంస్కృతీ కేంద్రాలను పునరుద్ధరించి, వాటికి పురా వైభవాన్ని సరికొత్తగా సంతరింపచేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తోన్న ఎనలేని కృషి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పవిత్ర కాశీ నగరంలో కాశీ విశ్వనాథ్ నడవాను ఏర్పాటు చేయడం, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల అభివృద్ధి లక్ష్యంతో అమలుపరుస్తున్న బృహత్తర ఛార్‌ధామ్ ప్రాజెక్టు, గుజరాత్‌లో సోమనాథ్ కోవెల, ఉజ్జయినిలో మహాకాళ్ ఆలయ పునరుద్ధరణ మొదలైనవన్నీ ఆ ప్రయత్నాలకు తిరుగులేని తార్కాణాలు. అవన్నీ దేశ ప్రజలకు విశేష లబ్ధిని సమకూరుస్తాయి. ఆధ్యాత్మిక అధ్యయనాలకు ఒక చైతన్యశీల కేంద్రంగా భారత్ స్థానాన్ని సమున్నతం చేస్తాయి. అపూర్వ అభివృద్ధి చోదక శక్తిగా విశ్వ వేదికపై భారత్ వెలుగొందేలా చేస్తాయి. తద్వారా మానవాళి ఆధ్యాత్మిక సంప్రదాయాల పునర్వికాసానికి విశేషంగా తోడ్పడతాయి.
వ్యక్తి, విశ్వం మధ్య సంబంధంపై ఒక అద్వితీయ దృష్టి కోణాన్ని భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రతిపాదిస్తుంది. ఆ రెండిటిని వేర్వేరు అస్తిత్వాలుగా భారతీయ చింతన పరిగణించదు. సృష్టిలోని సకల జీవులు, వస్తువుల మధ్య పరస్పర సంబంధాలను అస్తిత్వ మౌలిక ఐక్యతను భారతీయ సంప్రదాయం నొక్కి చెపుతుంది. ఈ విలక్షణ భావన సకల జీవ రూపాలను గౌరవించేలా చేసి, నిరంతరాయ అభివృద్ధికి, పర్యావరణ సంరక్షణకు ప్రాతిపదిక అవుతోంది. ఈ స్ఫూర్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలను రూపొందించి అమలుపరుస్తోంది. ‘కావేరి కాలింగ్’ ఉద్యమ ప్రభావంతో దేశవ్యాప్తంగా 13 నదుల పునరుజ్జీవానికి రూ.19,000 కోట్లను కేటాయించారు. భారతదేశ ప్రజలకు సాగు, తాగు నీటి సమృద్ధి, భద్రతను సమకూర్చేందుకు ఈ ప్రయత్నాలు అత్యంతావశ్యకమైనవి. పవిత్ర గంగా నదిని కాలుష్యం భారి నుంచి విముక్తం చేసి నిర్మల ప్రవాహినిగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రశంసనీయమైనవి. భారతదేశ అత్యంత పవిత్ర నదిని సజీవంగా ఉంచేందుకు ఆ కృషి తోడ్పడుతుంది. మన పర్యావరణాన్ని సంరక్షించుకునేందుకు, భారత భూమికి హరిత భవిష్యత్తును సమకూర్చేందుకు మనమూ మన వంతు కృషి తప్పక చేయాలి. అది ప్రతీ ఒక్కరి విధ్యుక్త ధర్మం.
మన ప్రియమైన భారత్ ఒక విశాల దేశం. చెప్పలేనన్ని ప్రత్యేకతలు, విశిష్ట లక్షణాలు ఉన్న జాతి మనది. కనుక అభివృద్ధి అనేది బహు విధాలుగా ఉండడమేకాకుండా అది ఏకకాలంలో సమ్మిళితంగా, సుగమంగా, నిరంతరం కొనసాగేలా ఉండడం చాలా ముఖ్యం. అది తప్పనిసరి కూడా. దేశ సర్వతోముఖాభివృద్ధికి, అదే సమయంలో ప్రతీ ఒక్కరి శ్రేయస్సుకు గౌరవనీయ ప్రధానమంత్రి చూపుతున్న చొరవ, చేస్తున్న ప్రయత్నాలను సమస్త ప్రపంచమూ గుర్తించింది. ఆయన్ని అసాధారణ పాలకుడుగా గౌరవిస్తోంది. మోదీ మహాకృషి భారత్‌ను డిజిటల్ యుగంలోకి తీసుకువెళ్లింది. అత్యాధునిక సాంకేతికతలను సమ్మిళిత అభివృద్ధికి, పారదర్శక పాలనకు ఉపయోగిస్తోంది. సమాజంలోని అన్ని వర్గాలవారు ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ఆ ప్రయత్నాలు విశేషంగా దోహదం చేస్తున్నాయి. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతోనే మౌలిక సదుపాయాల, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడమూ, స్వచ్ఛ భారత్ ఉద్యమం లాంటి సామూహిక చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు అమలుపరచడమూ జరుగుతోంది.
ఇది మన స్వాతంత్ర్య వజ్రోత్సవ సంవత్సరం. ఈ శుభ తరుణాన ప్రపంచ వేదికపై మనం ఒక మహాశక్తిగా ఉండడం మనకు ఎంతో గర్వకారణమూ ఆనందదాయకమూ అయిన విషయం. అందునా జీ–20 దేశాల కూటమికి మనం నేతృత్వం వహిస్తున్న సంవత్సరమిది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడం మొదలైన కీలక ఎజెండాల అమలుపరచడంలో నాయకత్వం వహించడానికి జీ–20 నేతృత్వం మనకొక గొప్ప అవకాశం. ఈ వివిధ ప్రయత్నాలలో మనం పొందిన విజయాలే సాధించలేని విజయాలూ ఉన్నాయి. వాటి గురించి ఎంతైనా చర్చించవచ్చు. అయితే మన దేశం అప్రతిహతంగా పురోగమిస్తుందన్న మాట తిరుగులేనిది. ఎవరూ నిరాకరించలేని వాస్తవమది. ఒక కొత్త, చైతన్యశీల భారత్‌ను నిర్మించేందుకు ఉద్దేశించిన దార్శనికత ఆ పురోగతిని వేగవంతమూ, ఉద్వేగభరితమూ చేస్తోంది. శతాధిక కోట్ల ప్రజలను ఆ దార్శనికత ప్రభావితం చేస్తోందనడంలో సందేహం లేదు. అంతకంటే ముఖ్యంగా అది ప్రపంచ వ్యాప్తంగా సంఖ్యానేక ప్రజలకు స్ఫూర్తినిస్తోంది. ఒక ధరిత్రి, ఒకే కుటుంభం, ఒకే భవిష్యత్తు అన్న లక్ష్య సాధనకు వారిని ముందుకు నడిపిస్తోంది.
సద్గురు జగ్గీ వాసుదేవ్
Updated Date - 2023-05-31T01:48:03+05:30 IST