ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజల మనిషి చెన్నమనేని

ABN, First Publish Date - 2023-08-30T04:30:20+05:30

‘గొప్పవ్యక్తుల జీవితాలే చరిత్ర’ అంటారు కార్లైల్. కొందరి త్యాగాలు, పోరాటాలు, వారి సేవలు సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు...

‘గొప్పవ్యక్తుల జీవితాలే చరిత్ర’ అంటారు కార్లైల్. కొందరి త్యాగాలు, పోరాటాలు, వారి సేవలు సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు చెన్నమనేని రాజేశ్వరరావు.

పూర్వ కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం మానువాడ గ్రామంలో 1923లో ఆగస్టు 31న వీరు జన్మించారు. ప్రాథమిక విద్య అమ్మమ్మ ఊరు మానువాడలో, పాఠశాల విద్య కరీంనగర్‌లో పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర మహాసభ సమావేశాల్లో నాలుగవది 1936లో సిరిసిల్ల మానేరు తీరంలో భీమకవి ప్రాంగణంలో జరిగినప్పుడు పిన్నవయస్కుడైన రాజేశ్వరరావు వాలంటీరుగా సేవలందించి, అప్పటి నిజాం రాష్ట్రంలోని ప్రముఖ నాయకుల మెప్పు పొందారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చివరి ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చినప్పుడు అరుణ అసఫ్ అలీకి రాజేశ్వరరావు ఉత్తరం రాయడం, వారు ప్రత్యుత్తరం ఇవ్వడంతో ఉత్సాహంగా కరీంనగర్ జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమంలో ఈయన భాగస్వాములైనారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియేట్, డిగ్రీ పూర్తి చేశారు. యూనివర్సిటీ సి–హాస్టల్ వీరి కార్యకలాపాలకు కేంద్రం. అక్కడే ఉన్న ఇతర నాయకులతో రాజేశ్వరరావుకు గట్టి మైత్రి ఏర్పడింది. ఉస్మానియా నుంచే ప్రారంభమైన ఆయన విద్యార్థి రాజకీయాలు 1947నాటికి అఖిల భారత విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఎదిగేలా చేశాయి. 1944లో కాలేజీ విద్యార్థిగా ‘భగవద్గీతపై భౌతిక దృష్టి’ అనే ఆయన ప్రసంగం భారత కోకిల సరోజిని నాయుడి చేత ప్రశంసలను అందుకుంది.

1947 నుంచి 1948 వరకు సాగిన నిజాం వ్యతిరేక పోరాట ఉద్యమంలో యువ నాయకులుగా రాజేశ్వరరావు తనవంతు పాత్ర పోషిస్తూ వచ్చారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డున 1947 సెప్టెంబర్ 2న కేశవ మెమోరియల్ హైస్కూల్ ప్రాంగణంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, పోలీసులకు చిక్కకుండా రహస్య స్థలంలోకి వెళ్లిపోయారు. 1947 సెప్టెంబర్ నుంచి 1952 వరకు తెలంగాణ రైతాంగ సాయుధపోరాట నాయకులుగా అజ్ఞాత జీవితం గడిపారు. ఈ కాలంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసమంటూ తుపాకీ చేబూని ప్రజల తరఫున పోరాటం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, దాసరి నాగభూషణరావు వంటి కమ్యూనిస్టులతో కలిసి పనిచేశారు. 1951 నుంచి 1952 ఫిబ్రవరి వరకు ఒక సంవత్సర కాలం జైలు జీవితాన్ని అనుభవించారు.


జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత, 1952 నుంచి 2008 వరకు జిల్లా, రాష్ట్ర, అఖిల భారత స్థాయి రైతు సంఘం నాయకులుగా, 1944 నుంచి 1999 వరకు 55 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ సభ్యులుగా వివిధ హోదాలలో పనిచేశారు. ఆరు పర్యాయాలు శాసనసభ్యులుగా, ముప్పై సంవత్సరాలు శాసనసభలో ప్రతిపక్ష పార్టీ నాయకులుగా వ్యవహరించారు.‌ కమ్యూనిస్టు పార్టీలో క్రమశిక్షణాయుతమైన కార్యకర్తగా పేరు పొందారు. పార్టీ అప్పజెప్పిన ప్రతి పని కార్యరూపం దాల్చడానికి నిరంతరం శ్రమించారు. అందుకే ఆయన ‘పార్టీ యజ్ఞంలో నేను సమిధను/ పార్టీ చీకట్లో నేను ప్రమిదను/ పార్టీ పోరాటంలో నేను సైనికుడిని/ పార్టీ నిర్మాణంలో నేను కార్మికుడిని/ పార్టీ పాఠ్యాంశంలో నేనొక ముఖ్యాంశాన్నవుతాను/ అవును నా పాత్ర ఇంకా సశేషం/ నేనొక విశేషం’ అని గర్వంగా చెప్పుకున్నారు. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానాలకు విరుగుడు సంపూర్ణ సోషలిజమే అని విశ్వసించారు.

ప్రస్తుత సిరిసిల్ల జిల్లా ఒకప్పుడు కరువు ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ముప్పై ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించి వేలాది మంది రైతులకు కౌలుదారి, భూసంస్కరణల చట్టాల ద్వారా హక్కులను కల్పించారు. ప్రభుత్వాన్ని ఒప్పించి సిరిసిల్ల రాయిని చెరువులో ఉన్న 600 ఎకరాల భూమిని పదివేల మంది నేత కార్మికులకు ఇండ్ల స్థలాలుగా పట్టాలిప్పిచ్చారు. తాను అమితంగా ఇష్టపడే తన రాజకీయ గురువు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు బద్దం ఎల్లారెడ్డి పేరును ఆ ప్రాంతానికి పెట్టించారు.

1970లో అమెరికా ఫోర్డు ఫౌండేషన్ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ గ్రామీణ విద్యుదీకరణ సంస్థ అనుమతులతో అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలౌతున్న గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘానికి పునాదులు వేశారు. ఈ ‘సెస్‌’ ద్వారా సిరిసిల్ల జిల్లాలో నూరు శాతం విద్యుదీకరణతో పాటు వ్యవసాయానికి, పవర్ లూమ్ మగ్గాలకు ఇరవైనాలుగు గంటలూ కరెంట్ సరఫరా చేసి నేతన్నల జీవితాలకు వెలుగునిచ్చారు. అలాగే జర్మనీ సహకారంతో 1991లో సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్ వెల్ఫేర్ సొసైటీ (సెవ్స్) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లాలో చెన్నమనేని రాజేశ్వర రావు, కుమారుడు రమేష్ బాబుల నాయకత్వంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా తాగు నీటి కోసం 132ట్యాంకులు, లక్షలాది కిలోమీటర్ల పైపు లైన్లు, వెయ్యి బోర్లు, ఐదు జూనియర్ కళాశాలలతో పాటు 308 పాఠశాల భవనాలు, అన్ని స్కూళ్లకు సైన్సు పరికరాలు, 6 ఎత్తిపోతల పథకాలు, 9 కీలక చెరువుల పునరుద్ధరణ, చేతివృత్తులకు చేయూత వంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కరువు తీరి సస్యశ్యామలంగా ఉండాలంటే ఎత్తిపోతల పథకాలే శరణ్యమని 1957లో శాసనసభలో బల్లగుద్ది చెప్పారు. ఆయన దూరదృష్టితో రూపొందించిన ప్రణాళికలే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా సాకారమౌతున్నాయి. అరవై ఆరేళ్ళు క్రియాశీలక ప్రజా జీవితాన్ని గడిపిన రాజేశ్వరరావు 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు, 2016 మే 9న తుది శ్వాస విడిచారు. ఆయన ఆలోచనల్ని, ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి.

సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

(రేపు చెన్నమనేని రాజేశ్వరరావు శతజయంతి)

Updated Date - 2023-08-30T04:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising