రేసింగ్ హింస
ABN, First Publish Date - 2023-02-10T01:00:14+05:30
మనుషులు రానురాను సుఖంగా, స్వేచ్ఛగా, పరస్పరతతో బతకడమే అభివృద్ధి అనుకుంటే, ఇప్పుడు కళ్లముందర జరుగుతున్నది...
మనుషులు రానురాను సుఖంగా, స్వేచ్ఛగా, పరస్పరతతో బతకడమే అభివృద్ధి అనుకుంటే, ఇప్పుడు కళ్లముందర జరుగుతున్నది అటువంటి అభివృద్ధియేనా అన్న సందేహం కలగాలి. స్వచ్ఛమయిన గాలికి, కాలుష్యం లేని నీటికి మొహం వాచిపోయి, నాలుగుగోడల మధ్య వాయుయంత్రాల కింద సేదతీరుతూ, వడపోతల నీళ్లను తాగుతూ అదే మహాభాగ్యమని మురిసిపోతున్నాము. నిర్వాసితులను చేయని, నిండా ముంచని ప్రాజెక్టులు, ఆనకట్టలు లేవు. యూరియా ఎరువులూ పురుగుమందులూ దట్టించని అధిక దిగుబడులు కనిపించవు. విమానాలలో విహరిస్తున్నాము, అంతరిక్షాలను అంటుకుంటున్నాము కానీ, విషపూరితం కాని అన్నం మెతుకును మాత్రం పొందలేకపోతున్నాము.
ఇటువంటి భస్మాసుర అభివృద్ధిలో భాగమే అనేక వరసల ఆకాశ దారుల, మిరుమిట్ల వెలుగుల నగరాలు. విహంగవీక్షణంలో చూస్తే జిగేలుమనేమాట నిజమే కానీ, వర్షాకాలమున చూడవలయును ఈ నగర సౌభాగ్యముల్ అనిపిస్తుంది. ఎంతగా ముసుగువేసినా, దీపం కింద పేరుకుపోయిన చీకటి తొంగిచూస్తూనే ఉంటుంది. జీవనపోరాటంలో ఎవరి పరుగు వారిదైన జనసమ్మర్దంతో నగరం, ‘పసిడి కాదు తగరం‘ అనిపిస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాలకీ కలిపి ఒకే ఒక్క మహామహా నగరం. భాగ్యనగరం అని చెప్పడానికి, చెప్పుకోవడానికీ తగిన చరిత్ర ఉన్నది నిజమే కానీ, వర్తమానంలో వెలుగునీడలు రెండూ కనిపిస్తాయి. ఒకవైపు అంతరించిపోతున్న వారసత్వ సంపద, ఏ కళాభిరుచీ లేని ఆధునిక వాస్తువిన్యాసం, వారసత్వ సాంస్కృతిక పరిమళాన్ని ముంచెత్తుతున్న డొల్లతనపు రణగొణధ్వనులు, మరొకవైపు ఇప్పటికీ మిగిలిన జనసౌహార్దం, పచ్చదనం తరిగిపోయి ఉగ్రవేసవులు వేధిస్తున్నా, తక్కిన కాలాల్లో కొంత చల్లగానే చూస్తున్న వాతావరణం, కాంక్రీటు శిఖరాల నడుమనే అయినా తొంగిచూసే చారిత్రక వైభవం హైదరాబాద్‌ను ప్రత్యేకం చేశాయి. నేలవిడిచి సాము లాగా, జనసౌఖ్యానికి సంబంధం లేని అభివృద్ధి మాత్రం ఈ నగరాన్ని వెంటాడుతూనే ఉన్నది.
హైదరాబాద్ నడిబొడ్డులో ఫార్ములా రేస్ నిర్వహించాలన్న ఆలోచన ఏ మహానుభావుడికి వచ్చిందో కానీ, అసలే ట్రాఫిక్ రద్దీతో ఉక్కిరిబిక్కిరిగా ఉండే మహానగరం, హాహాకారాల నగరంగా మారిపోయింది. ఊరిబయట దూరంగా ఎక్కడో జరుపుకోవలసిన ఇటువంటి విన్యాసక్రీడలను నట్టనడి ఊరులో జరపడమేమిటి, అందుకోసం, రోడ్లన్నిటిని బంధించి దారి మళ్లించి హింసించడమేమిటి? ఈ మధ్య హైదరాబాద్ అభివృద్ధి అంతా శివార్లలో కేంద్రితమవుతోందని, నగరకేంద్రభాగాలు అప్రధానమవుతున్నాయని అనిపించి, ఇటువంటి ఆలోచన చేశారట. ఔరా, ఎంతటి బుద్ధి కుశలత?! ట్రాఫిక్‌ను సుగమం చేయడానికంటూ ఫ్లయి ఓవర్ల నిర్మాణాన్ని నగరంలోని కొన్ని ప్రాంతాలలోనే కేంద్రీకరిస్తున్నప్పుడు, ప్రాథమిక సదుపాయాల కల్పన కూడా ఆ ప్రాంతాలలోనే శీఘ్రంగా జరుపుతున్నప్పుడు, ఆ ప్రాంతాల మీదే అందరి దృష్టి ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు అకస్మాత్తుగా మధ్యనగరం గుర్తుకు వచ్చి హడావుడి చేస్తే, అక్కడి మౌలిక సదుపాయాల వసతి సరిపోవద్దూ?
వచ్చే శని, ఆది వారాలు (ఫిబ్రవరి 11, 12) ఈ రేసులు జరుపుతారట. అందుకు సన్నాహకాల కోసం ఏడో తారీకు నుంచే రహదారులను కట్టడి చేయడం మొదలుపెట్టారు. ట్యాంక్ బండ్ మినహా సాగరతీరం అంతటినీ సిద్ధం చేయడం కోసం విధించిన ఆంక్షల ప్రభావం నగరం అంతటా వ్యాపించింది. అంబులెన్సులు, అత్యవసర విధుల మీద వెళ్లేవారు, ఉద్యోగాలు వ్యాపారాలు చదువుల కోసం సంచరించేవారు అందరూ తలా రెండు మూడుగంటలు ఈ రేసింగ్ కోసం సమర్పించుకోవలసి వస్తోంది. కొన్ని స్పోర్ట్స్ కార్లు వేగాతివేగంగా పరుగులు తీసే క్రీడ కోసం నగరంలో వేలాది కార్లు, బస్సులు, ఇతర వాహనాలు నత్తనడకలోకి దిగిపోవలసి వచ్చింది. ప్రతి ఒక్క వాహనదారుడి నుంచి వ్యక్తమవుతున్న విసుగు, వేసటలో అభివృద్ధి ఉన్నదా? ఎవరి చాపల్యం కోసం ఇదంతా?
హైదరాబాద్‌లో ఫార్ములా రేసింగ్ జరిగితే గొప్పే. జరగవలసిందే. అందుకు తగిన స్థలకాలాల్ని ఎంచుకోవాలి. అవుటర్ రింగ్ రోడ్డును ఆ రేసింగ్ జరిగినంత సేపు ఉపయోగించుకున్నా, ఇంతకంటె తక్కువే అసౌకర్యం కలుగుతుంది. లేదూ, ఎక్కడైనా రేసింగ్ ట్రాక్ కట్టండి, నిర్మాణాలే కదా, పాలకులందరికీ అభిమాన కార్యక్రమాలు!
పౌరసదుపాయాలకు, ‘అభివృద్ధికారక’ వినోదక్రీడలకు నడుమ వైరుధ్యం ఉండనవసరం లేదు. సామాజిక ఉత్పాదకతలో పాలుపంచుకునే దినచర్యలో తలమునకలై ఉండే అసంఖ్యాక ప్రజలు, విలాసంగా భావించే ఒక క్రీడవల్ల బాధితులు కానవసరం లేదు. రెంటిని విడిగా సమర్థంగా నిర్వహించలేకపోతే అది నాగరిక ప్రణాళిక రచనే కాదు.
Updated Date - 2023-02-10T01:00:17+05:30 IST