ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పైకి చిక్కని ఆత్మబంధువులు బీఆర్‌ఎస్, కాంగ్రెస్!

ABN, First Publish Date - 2023-09-13T03:49:41+05:30

భారతీయ జనతా పార్టీ విలువలతో కూడిన సిద్ధాంతపరమైన భావాలతో దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఒక రాజకీయ పార్టీ. తాను విశ్వసించే సిద్ధాంతాలను...

భారతీయ జనతా పార్టీ విలువలతో కూడిన సిద్ధాంతపరమైన భావాలతో దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఒక రాజకీయ పార్టీ. తాను విశ్వసించే సిద్ధాంతాలను ఎక్కడా తప్పకుండా పాటిస్తూ దేశ రాజకీయాలలో ఒక విలక్షణమైన పార్టీగా నిలబడింది. ఆనాటి వాజ్‌పేయి, ఆడ్వాణీ నుంచి నేటి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల వరకు ఒక తాటిపై నడుస్తూ ఒకే ఆశయం కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీ ఒకే మాట మీద నిలబడి అటు ప్రజా ఉద్యమంలోనూ, ఇటు బిల్లు ప్రవేశపెట్టిన తరుణంలో పార్లమెంటులోనూ కీలక పాత్ర పోషించి తెలంగాణను తెచ్చిపెట్టింది అనడం అతిశయోక్తి కాదు.

తెలంగాణ సాధనకై ఏర్పడిన రాజకీయ పార్టీగా చెప్పుకునే టీఆర్‌ఎస్ (నేటి బీఆర్‌ఎస్) ఆది నుంచీ విలువలు లేని రాజకీయాలు చేస్తూనే వచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకొని రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటూ వచ్చింది. రాష్ట్ర సాధన తర్వాత అధికారంలోకి వచ్చి ఉద్యమ ఆకాంక్షలను అణచివేస్తూ, ప్రజా పాలనను భ్రష్టు పట్టించి, కుటుంబ పాలనే పరమావధిగా పాలన సాగిస్తున్నది.

తొలి మలి దశల తెలంగాణ ఉద్యమాలలో ఉద్యమకారులను అణచి వేస్తూ ఎంతోమంది మరణాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చక ఎంతోమంది మరణాలకు కారణమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి తల్లికీ బిడ్డకూ ఉండే దగ్గరికి సంబంధాలు ఉన్నాయి అనడం అతిశయోశక్తి కాదు. పార్టీల పేర్లు వేరైనా రాజకీయ, పరిపాలనా విధానాలు ఒకటే అని చెప్పవచ్చు. తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభించిన నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మధ్యలో పార్టీలు మారినా కాంగ్రెస్ పార్టీకి తన విశ్వాసాన్ని, విశ్వనీయతను ఎప్పుడూ చూపిస్తూనే ఉన్నాడు. దేశంలో ఏ ప్రాంతంలో ఎన్నికలు జరిగినా కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆర్థిక సహాయాన్ని చేస్తూ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అహర్నిశలు కలలుకంటున్నారు.


బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవినాభావ సంబంధం అనేక సందర్భాల్లో మనకు కనబడుతుంది. ముఖ్యంగా 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమికి కేసీఆర్ స్వయంగా మధ్యవర్తిగా ఉండి కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రతిపాదించటంతో పాటు, కుమారస్వామి స్వీకారానికి వివిధ కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలతో పాటు రాహుల్ గాంధీతో సభా వేదికపై కూర్చున్నారు. మొన్నటికి మొన్న 2019లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ, శరత్ పవార్‌లతో మాట్లాడి, శివసేనను బీజేపీ నుంచి దూరం చేసి, మహాగడ్బందన్ కూటమికి ఉద్దవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలన్న ఆలోచన కూడా కేసీఆర్ నుంచే వచ్చినట్లు ప్రచారంలో ఉంది. 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి, ఓడించడానికి అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీకి అనుకూలంగా కేసీఆర్ ప్రకటన చేశారు. అంతేగాక, ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్‌కు కేసీఆర్ ఆర్థికంగా అండదండగా నిలిచారని పత్రికలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కె. కేశవరావును కేసీఆర్ పంపారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల పత్రికా ప్రకటనలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉన్న సంబంధాన్ని సూచించేలా వచ్చే ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేస్తాయి అన్న విధంగా మాట్లాడారు. కేసీఆర్‌కు విశ్వాసపాత్రుడు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కాంగ్రెసులో ఉన్న లీడర్లు అందరూ మనవాళ్లే అనడం మరొకసారి కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని బట్టబయలు చేసింది. అదేవిధంగా గతంలో ఎన్డీటీవీ ప్రణయ్‌రాయ్ ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌తోనే పెట్టుకుంటా కానీ మతతత్వ పార్టీ అయిన బీజేపీతో పెట్టుకోను అని కేసీఆర్ కరాకండిగా చెప్పిన విషయాలు అందరికీ సుపరిచితమే.

తెలంగాణలో గత నాలుగేళ్ళుగా బీజేపీ అనేక ఎన్నికలలో విజయాలను సాధిస్తూ అంతకంతకూ బలపడుతూ కేసీఆర్‌కు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నది. వచ్చే ఎన్నికలలో అధికారం పొందాలంటే మళ్ళీ తన ఆత్మ అయిన కాంగ్రెస్ బలాన్ని పెంచి, ఎన్నికల తర్వాత అందులో గెలిచిన నాయకులను మళ్ళీ బీఆర్‌ఎస్‌లోకి తీసుకోవచ్చునన్న ఆలోచనతో 40కి పైగా ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నప్పటికీ ఏడుగురికి తప్ప మిగతావారందరికీ సీట్లు కేటాయించారు. దీని వెనక ప్రభుత్వ వ్యతిరేక ఓటుని బీజేపీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ వైపుకు మళ్ళించి మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచన ఉన్నది.

శరీరమూ, ఆత్మ లాంటి ఈ రెండు పార్టీలకు ఒక నీడలాగా పనిచేస్తున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అవి ఎంఐఎం, ఉభయ కమ్యూనిస్టు పార్టీలే. దేశంలో వివిధ రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలను ఏకం చేసి అభ్యర్థులను నిలబెట్టే ఎంఐఎం ఆ పార్టీకి పుట్టినిల్లయిన తెలంగాణలో మాత్రం పాతబస్తీకే పరిమితమై, రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలలో పోటీ చేయకుండా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ఒక నీడలాగా ఉంటున్నది. ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీలవారు పాపం వారు ఉనికిని కోల్పోవడంతో పాటు, సిద్ధాంతాలను మరిచి ఏ ఓడ ఎక్కుతున్నారో తెలియక సతమతమవుతూ, ప్రజా ప్రాబల్యాన్ని పెంచుకోలేక మేము బీజేపీని ఓడించడానికి పోరాడుతున్నామని చెప్పడం విడ్డూరం.

బీజేపీ నాయకులు ఎన్నో సందర్భాల్లో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ‘బి’ పార్టీగా పేర్కొన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు మాత్రం బీఆర్ఎస్‌ను బీజేపీ ‘బి’ పార్టీగా పేర్కొంటూ కాంగ్రెస్ – బీఆర్ఎస్‌ల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని బయటపడకుండా గోప్యత పాటిస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ పేర్కొన్న అనేక విషయాల ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య ఉన్న ఫెవికాల్ రాజకీయ బంధం ఈనాటిది కాదని తెలుసుకోవచ్చు. కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభం కావటమే కాంగ్రెస్ నుంచి అయింది. ఈ రోజు వివిధ సామాజిక మాధ్యమాలలో, రాజకీయ అవగాహన లేని వ్యక్తులు బీఆర్ఎస్ బీజేపీకి ‘బి’ టీమ్ అని రాస్తూ తమ అవగాహనా రాహిత్యాన్ని బైటపెట్టుకుంటున్నారు.

ఎన్. రామచంద్రరావు

మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ

Updated Date - 2023-09-13T03:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising