ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సదరం.. అక్రమాల మయం

ABN, First Publish Date - 2023-09-27T01:41:05+05:30

సదరం స్లాట్ బుకింగ్ కోసం బాధితులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఐదు నెలల నుంచి రెండు సంవత్సరాలుగా ఈ స్లాట్ బుకింగ్ కోసం మీ సేవ కేంద్రాల చుట్టూ దివ్యాంగులు...

సదరం స్లాట్ బుకింగ్ కోసం బాధితులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఐదు నెలల నుంచి రెండు సంవత్సరాలుగా ఈ స్లాట్ బుకింగ్ కోసం మీ సేవ కేంద్రాల చుట్టూ దివ్యాంగులు తిరుగుతున్నారు. సదరం సర్టిఫికెట్ కావాల్సిన బాధితులు రాష్ట్రంలో వేల మంది ఉన్నారు. జిల్లాకు నెలకు ఒకొక్క కేటగిరీకి 100 చొప్పున నాలుగు కేటగిరీలకు (ఆర్థో, మూగ–చెవుడు, మానసిక, కంటిచూపుకు) 400 స్లాట్స్ మాత్రమే కేటాయిస్తున్నారు. వీటిలో కూడా 20 రెన్యూవల్‌కు, 80 కొత్త వాటికి కేటాయిస్తున్నారు. జిల్లాల్లో సగటున 150 మీ సేవ కేంద్రాలున్నాయి. ప్రతి నెల స్లాట్ బుకింగ్‌కు నిర్దేశించిన రోజున వెబ్‌సైట్ ఓపెన్ అయిన ఐదు నుంచి పది నిమిషాల్లోపు స్లాట్స్ అయిపోతున్నాయి. ఒక్కో కేటగిరిలో ఒకటి లేదా రెండుకు మించి స్లాట్‌లు బుక్ కావడం లేదు.

సదరం స్లాట్ బుకింగ్ కోసం ఒకొక్క మీ సేవ కేంద్రానికి 20 నుంచి 50 మంది వస్తున్నారు. సహజంగానే లోకోమోటివ్/ఆర్థో బాధితులు వీరిలో 60 శాతం మంది ఉంటారు. ఆర్థో స్లాట్‌ బుకింగ్స్ 5, 10 సెకండ్లలోనే అయిపోతున్నాయి. దీంతో బాధితులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సహాయకులు లేకుండా కదలలేని వారు తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి, వేదనకు గురవుతున్నారు. మరోవైపు ప్రతి నెల మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగడానికి ఆటో చార్జీలకు వందల్లో ఖర్చు చేస్తున్నారు.

రాష్ట్రంలో 8,04,060 మంది సదరం సర్టిఫికెట్ పొందిన వారు ఉండగా, ఇందులో 60శాతం లోకోమోటివ్/ఆర్థోకు సంబంధించిన వారే ఉన్నారు. 5,11,656 మంది పెన్షన్ పొందుతుండగా 60 శాతం మంది లోకోమోటివ్/ఆర్థోకు సంబంధించిన వారే ఉన్నారు. ప్రభుత్వ ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవుతూ ఉండడం, 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం రిజర్వేషన్ ఐదు శాతం ఉండడం, పెన్షన్ రూ.3016 నుండి రూ.4016కు పెంచడం తదితర కారణాలవల్ల సదరం సర్టిఫికెట్ల అవసరం పెరిగింది. పరిస్థితిని ఆసరా చేసుకున్న కొంతమంది మీ సేవ కేంద్రాల నిర్వాహకులు రూ.500 నుంచి రూ.5,000 వరకు స్లాట్ బుకింగ్‌కు వసూలు చేస్తున్నారు. మీ సేవలో స్లాట్ బుక్ అయితే సంబంధిత వైద్యపత్రాలు, మీ సేవ రశీదుతో పాటు పాస్‌పోర్ట్‌ ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆర్థో, మూగ–చెవుడు, మానసిక, కంటిచూపు వంటి వాటికి కేటాయించిన తేదీల్లో నిర్వహించే సదరం శిబిరానికి హాజరు కావాలి.

స్లాట్ బుక్ అయినప్పటి నుంచి మధ్యదళారుల వేట మొదలవుతుంది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10, 15, 20 వేల వరకు తీసుకుంటున్నారు. దీంతో పాటు స్లాట్‌ బుక్‌ కాగానే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిలో కొందరు సర్టిఫికెట్‌ ఇప్పిస్తామని చెప్పి సంబంధిత గ్రామ అధికార పార్టీ నాయకులకు ఫోన్‌ చేసి, వివరాలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. శాశ్వత వికలాంగ సర్టిఫైడ్ కాపీనా, తాత్కాలిక కాలానికి సంబంధించినదా, అభ్యర్థి అర్హుడా, అనర్హుడా అన్నదాన్ని బట్టి ఈ రేటు ఉంటుంది. డైరెక్ట్‌గా వెళ్లిన వారికి అర్హత ఉన్నప్పటికీ తక్కువ పర్సంటేజీ ఇస్తున్నారు లేదా రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

సదరం సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్న వారందరి పేర్లు రిజిస్ట్రేషన్ చేయాలి. వచ్చిన సంఖ్యలు, క్యాటగిరీలను బట్టి ఆయా జిల్లాల్లో అవసరమైనన్ని రోజులు సదరం శిబిరాలు నిర్వహించాలి. నిర్దిష్ట కాలపరిమితిలో రిజిస్టర్ అయిన కేసులన్నీ పూర్తి చేయాలి. అనర్హులను పక్కనపెట్టి, అర్హులైన వారందరికీ సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలి.

గీట్ల ముకుంద రెడ్డి, కరీంనగర్

Updated Date - 2023-09-27T01:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising