విరామం, ఊరట
ABN, First Publish Date - 2023-11-01T01:01:45+05:30
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుకు మంగళవారం నాడు హైకోర్టులో లభించింది...
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుకు మంగళవారం నాడు హైకోర్టులో లభించింది తాత్కాలికమయిన ఊరటే అయినా, పార్టీ శ్రేణులకు, శ్రేయోభిలాషులకు ఎంతో ఆనందం కలిగించింది. దేశదేశాలలో, వివిధ రాష్ట్రాలలోని చంద్రబాబు అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక, కుటుంబసభ్యుల సంగతి చెప్పనక్కరలేదు. యాభై రెండు రోజులుగా వారు అనుభవించిన వేదన సామాన్యమైనది కాదు. ఎప్పటికయినా ఈ యాతనకు ముగింపు ఉంటుందా అన్న నిస్పృహ ఒకవైపు, నిస్సహాయ స్థితిలోనే ప్రజలకు పరిస్థితులను నివేదించవలసిన కర్తవ్యం ఒకవైపు వారిని చాలా కష్టపెట్టి ఉంటుంది. వైద్య కారణాల మీద నాలుగువారాల పాటు లభించిన తాత్కాలిక బెయిల్ చంద్రబాబు కుటుంబానికి కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. రాజమండ్రి కారాగారం వెలుపల, తనతోపాటు నిలచిన నాయకశ్రేణిని, స్వాగతం చెప్పడానికి వచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించడం ప్రజానాయకుడి సహజ సరళి. కుటుంబ సభ్యుల భావోద్వేగాల నడుమ, మనుమడు దేవాన్ష్‌ని చంద్రబాబు దగ్గరకు తీసుకున్న తీరు ఒక ఉద్విగ్న సన్నివేశం. బెయిల్‌తో పాటు, కొన్ని విధి నిషేధాలే లేకపోయివుంటే, రాజమండ్రి నుంచి అమరావతికి చంద్రబాబు రోడ్డు ప్రయాణం ఒక ఎడతెగని ఊరేగింపుగా జరిగి ఉండేది. రెండు తెలుగురాష్ట్రాలలోనూ వేడుకలు ఆర్భాటంగా జరిగేవి.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లభించిన ఈ ఊరట వల్ల, ఇతర కేసుల ఆధారంగా కూడా అరెస్టు చేయకుండా నాలుగు వారాల పాటు రక్షణ లభిస్తుంది. నేత్రచికిత్సతో పాటు, ఇతర ఆరోగ్యసమస్యలకు చంద్రబాబు ఈ విరామకాలంలో తాను ఎంచుకున్న అస్పత్రిలో చికిత్స తీసుకోవచ్చు. తాత్కాలిక బెయిల్ కాలంలో చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆస్కారం ఉండదు. కానీ, తమ నాయకుడు బందిఖానా నుంచి వెలుపలికి రావడమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కొండంత బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒకపక్క నాయకత్వం మీద కేసుల దాడి, మరో పక్క జనం దగ్గరకు వెళ్లడానికి జగన్ ప్రభుత్వం కల్పించే అవరోధాలు తెలుగుదేశం వారిని ఉక్కిరిబిక్కిరి చేసిన మాట నిజం. ఈ యాభై రెండు రోజుల కాలంలో ఒక్కొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో కనిపించిన పోరాటం, ఆంధ్రప్రదేశ్‌లో కనిపించకపోవడానికి కారణం జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ, నిరంకుశ విధానాలే. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా బలహీనపరచడానికే చంద్రబాబుమీద కేసులు బనాయించారని అనుకుంటున్నప్పుడు, ఇక రాజకీయ నిరసనలకు ప్రభుత్వం అవకాశం ఎందుకు ఇస్తుంది? చంద్రబాబుకు నిర్బంధం నుంచి దీర్ఘకాలిక విముక్తికి మంగళవారంనాటి బెయిల్ మొదటి మెట్టు అనుకుంటే, అది తెలుగుదేశం శ్రేణులకు కొత్త జవసత్వాలను అందిస్తుంది. నవంబర్ 10వ తారీకున విచారణకు వచ్చే పూర్తి బెయిల్ అభ్యర్థన చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందన్న ఆశ ఆయన అభిమానగణంలో ఉన్నది. మధ్యంతర బెయిల్ ఆ ఆశకు ఊతం ఇచ్చింది కూడా.
కేసుల మంచిచెడ్డలు, అభియోగాలలోని సత్యాసత్యాలు ఇప్పుడు చర్చించనక్కరలేదు కానీ, చంద్రబాబు మీద కేసులన్నీ రాజకీయ కక్షతో మోపినవేనని జనం నమ్ముతున్నారు. కొన్నిసార్లు నేరవిచారణలు సాంకేతికమైనవిగానే మిగిలిపోతాయి. ప్రజల మనస్సుల్లో ఏర్పడిన గాఢమైన అభిప్రాయమే పై చేయిగా ఉంటుంది. తమ ముందున్న ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం మీద కక్ష సాధింపు చేయడం ద్వారా లబ్ధిపొందేది జగన్ మాత్రమేనని జనం గ్రహించారు. ఆయన స్వభావం తెలిసినవారెవరైనా ఈ కార్పణ్యాన్ని గుర్తించగలరు. తన పాలన మీద ప్రజలలో పెరుగుతున్న విముఖతను, ప్రతిపక్షపార్టీ కార్యక్రమాలకు లభిస్తున్న ఆదరణను చూసిన తరువాతనే ఈ కేసులన్నీ ముందుకు వచ్చాయి. లేకపోతే, ఎన్నికలు తొందరలో పెట్టుకుని జగన్ ఈ దుస్సాహసానికి ఎందుకు పాల్పడతారు?
కేంద్రంలోనయినా, రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్నవారు, తమకు గిట్టనివారిని, ప్రత్యర్థులను వేధించడానికి అనైతికమైన, ద్వేషపూరితమైన పద్ధతులను అనుసరించడం తరచు చూస్తున్నాము. అందుకు చట్టాలే అనుమతిస్తున్నాయో, చట్టాలను అన్వయించడంలో న్యాయస్థానాలే పొరపాటు చేస్తున్నాయో తెలియదు కానీ, నేరం రుజువు కాకుండానే నిందితులు శిక్షలను అనుభవిస్తున్నారు. పూర్వ పాలకుల మీద కక్ష సాధించే అవకాశం అనంతర పాలకులకు ఉంటుంది కాబట్టే, అవినీతి నిరోధక చట్టంలో 17ఏ సవరణ చేశారు. ఆ చట్టం వర్తింపే ఇప్పుడు వివాదమై, కక్షసాధింపు ఆశయం మాత్రం నెరవేరుతోంది. సుదీర్ఘకాలం నిందితులను బందీలుగా ఉంచే అవకాశం లేని విధంగా తగిన చట్టబద్ధమైన కట్టుదిట్టాలు చేయాలి. ప్రస్తుతానికి, రాజకీయమైన పగలకు ప్రతీకారాలకు సమాధానం రాజకీయాలలోనే వెదుక్కోవాలి. కక్ష పూరిత ప్రభుత్వాల నుంచి అధికారాన్ని వెనక్కి తీసుకోవాలి. బహుశా, ప్రజలు ఆ దిశగా ఇప్పటికే ఆలోచించడం మొదలుపెట్టి ఉంటారు.
Updated Date - 2023-11-01T01:01:45+05:30 IST