ప్రమాదకరమైన మౌనం
ABN, First Publish Date - 2023-08-29T03:45:23+05:30
దక్షిణాఫ్రికాలో జరిగిన ‘బ్రిక్స్’ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతున్న దృశ్యం ఇటీవల చూశాం. ఇరువురి మధ్యా సంభాషణ జరిగిందనీ...
దక్షిణాఫ్రికాలో జరిగిన ‘బ్రిక్స్’ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతున్న దృశ్యం ఇటీవల చూశాం. ఇరువురి మధ్యా సంభాషణ జరిగిందనీ, సరిహద్దుల్లో శాంతిని కాపాడాలని అనుకున్నారని ఆగస్టు 24న భారతవిదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ క్వత్రా ప్రకటించారు. దీనిగురించి విదేశాంగమంత్రిత్వశాఖ అధికారికంగా ఏ ప్రకటనా చేయలేదు కానీ, ఈయన మాత్రం భారత్ చైనా సంబంధాలు సాధారణస్థితికి చేరాలంటే వాస్తవాధీనరేఖను గౌరవించడం, సరిహద్దులు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమని దేశాధినేతలు ఇద్దరూ ఏకమాటగా అనుకున్నారని మీడియాకు చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు వీలుగా సైనిక ఉపసంహరణలను వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ఈ నాయకులు నిర్ణయించినట్టు కూడా వినయ్ ప్రకటించారు. చైనా విదేశాంగశాఖ విడుదలచేసిన ప్రకటనలో ఇవేమీ లేవు. ఇరుదేశాలూ అన్ని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సరిహద్దు విషయంలో సరైనరీతిలో వ్యవహరించాలని జిన్‌పింగ్ అన్నట్టుగా మాత్రమే అది ప్రకటించింది. దీనికితోడు, భారత్ అభ్యర్థనమేరకే ఈ సంభాషణ జరిగిందని చైనా అనడంతో, కాదుకాదు, చైనాయే తొలిగా కోరిందని, నిజానికి ఉభయదేశాల మధ్యా మరింత నిర్మాణాత్మక, నిర్దిష్టమైన ద్వైపాక్షిక సమావేశం జరగాలని చైనా ప్రతిపాదిస్తే, దానికి తాము అంగీకరించలేదని కూడా భారత అధికారులు మీడియాకు చెప్పుకొచ్చారు.
ఈ మొత్తం వ్యవహారం గమనించినప్పుడు మోదీ–జిన్‌పింగ్ ఏమి మాట్లాడుకున్నారన్న నిజం ఎప్పటికీ తెలియదు. అనధికారిక సంభాషణ కదా అని సరిపెట్టుకున్నా, ప్రకటనల్లో తేడాలు ఈ స్థాయిలో ఉండటం ఆశ్చర్యం కలిగించకమానదు. ఎవరి చొరవతో ఈ సంభాషణ జరిగిందన్నది అప్రస్తుతం కానీ, చైనా అధ్యక్షుడితో నరేంద్రమోదీ ఏమి చెప్పారన్నది విదేశాంగశాఖ కార్యదర్శి నోటినుంచి మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ, ఉభయదేశాధినేతలు ఏకమాటగా అనుకున్నారంటూ ఆయన చెప్పిన చాలా విషయాలకు చైనా ప్రకటనకు మధ్య హస్తిమశకాంతరం ఉండటం విచిత్రం. చైనా విషయంలో మోదీ ప్రభుత్వం భయపడుతున్నదనీ, సరిహద్దు వివాదానికి సంబంధించి ప్రజలనుంచి చాలా దాస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఇటువంటివి మరిన్ని అనుమానాలకు తావిస్తాయి. భారతభూభాగాల్లోకి చైనా చొచ్చుకువచ్చి స్థావరాలు ఏర్పాటుచేసుకుంటున్నా, గతంలో మన గస్తీలో ఉన్న ప్రాంతాల్లోకి ఇప్పుడు మన సైనికులు అడుగుపెట్టలేని పరిస్థితులున్నా భారత ప్రభుత్వం దానిని కొట్టిపారేస్తూంటుంది. చొరబాట్లు లేవు, కోల్పోయిందీ లేదు, అంగుళం వదిలేదీ లేదు అంటూనే కాలం నెట్టుకొస్తోంది. మరోపక్క ఏ ఫలితం ఇవ్వకుండా కమాండర్ స్థాయి చర్చలు నిరంతరం జరిగిపోతుంటాయి. గల్వాన్ ఘాతుకంతో సరిహద్దుల్లో జరుగుతున్నదేమిటో దేశానికి తెలిసివచ్చింది కానీ, ప్రభుత్వం మాత్రం నిజాలు దాచడం తప్ప, తనకుతానుగా ప్రజలకు ఏమీ చెప్పదు.
ప్రతీ చిన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకొనే పాలకులు చైనా విషయంలో మాత్రం ప్రమాదకరమైన మౌనాన్ని పాటిస్తున్నారు. గత ఏడాది ఇండోనేషియాలోని బాలిలో జి20 సదస్సు సందర్భంగా మోదీ–జిన్‌పింగ్ కరచాలనం చేసుకున్నారు. ఆ చిన్నపాటి సంభాషణ సరిహద్దు వివాదానికి సంబంధించినదని మన విదేశాంగశాఖ ఎనిమిది నెలల తరువాత గానీ ప్రకటించలేదు. చైనా తనకు తానుగా మన సరిహద్దుల్లోకి చొరబడి, వాటిని వివాదాస్పదం చేసి, అక్కడ తిష్టవేసుకొని కూచున్న నేపథ్యంలో, సమస్య పరిష్కారం విషయంలో దానినుంచి ఎటువంటి చొరవనూ ఆశించలేం. అందువల్ల, బ్రిక్స్ సమావేశాలను ఉపయోగించుకొని భారతదేశం ఈ దిశగా అడుగుముందుకు వేయాలని, అనంతరం జి20 సదస్సులో నిర్దిష్టమైన కార్యాచరణ సాధించాలని రక్షణరంగ నిపుణులు ఎంతోకాలంగా చెబుతున్నారు. అధికారిక చర్చల వల్ల చైనాది పైచేయి అవుతుందన్న అనుమానం భారతప్రభుత్వానికి ఉండటం సహజం. కానీ, జిన్‌పింగ్‌కు తెలియకుండా ఈ చొరబాట్లు, గల్వాన్ ఘాతుకాలు జరగవన్నది ఎంత నిజమో, ఆయన ఆదేశాలతో తప్ప ఆ వివాదాలు సద్దుమణగవన్నదీ అంతే నిజం. సరిహద్దుల్లో నాలుగేళ్ళ క్రితం స్థితిని పునరుద్ధరించినప్పుడు మాత్రమే ఉభయదేశాల మధ్యా సత్సంబంధాలు నెలకొంటాయని అత్యున్నతస్థాయి సమావేశంలో స్పష్టం చేయగలిగినప్పుడు మాత్రమే వ్యవహారం ముందుకు కదులుతుంది. సమస్య పరిష్కారం కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అనుకుంటే, ఇప్పుడు చూసిన పరస్పర విరుద్ధమైన ప్రకటనలతోనే కాలం గడిచిపోతూంటుంది.
Updated Date - 2023-08-29T03:45:23+05:30 IST