ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగరలేని పైలట్‌

ABN, First Publish Date - 2023-04-12T01:05:31+05:30

పార్టీవ్యతిరేకచర్యగా పరిగణిస్తామన్న హెచ్చరికలను ఏమాత్రం ఖాతరుచేయకుండా రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ ఒకరోజు నిరాహారదీక్ష కానిచ్చేశారు. భారీ గాంధీ చిత్రంతో పాటు, వసుంధరారాజే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పార్టీవ్యతిరేకచర్యగా పరిగణిస్తామన్న హెచ్చరికలను ఏమాత్రం ఖాతరుచేయకుండా రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ ఒకరోజు నిరాహారదీక్ష కానిచ్చేశారు. భారీ గాంధీ చిత్రంతో పాటు, వసుంధరారాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా అని రాసివున్న బ్యానర్‌ కింద, ఎక్కడా కాంగ్రెస్‌ జెండా, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ఊసు లేకుండా ఆయన దీక్ష ముగిసింది. భారీ సంఖ్యలో మద్దతుదారులు జేజేలు పలుకుతూండగా, ఆయన ప్రసంగం కూడా ప్రధానంగా రాజే ఏలుబడిలో సాగిన అవినీతి కుంభకోణాల ప్రస్తావనతోనే సాగింది. బీజేపీ అవినీతిపేరిట ఆయన తుపాకీ గురిపెట్టింది గెహ్లోత్‌ పైనేనని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

గత ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ ఊసే ఎత్తకుండా వదిలివేసినందున మరో ఎనిమిదినెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఏ మొఖంతో ప్రజలముందుకు పోగలదని సచిన్‌ ప్రశ్న. ఈ విషయంలో కాంగ్రెస్‌–బీజేపీ మధ్య రహస్య ఒప్పందాలు, అవగాహనలు ఉన్నాయని ప్రజలు అనుకోకుండా ఉండాలంటే, సామాన్య కాంగ్రెస్‌ కార్యకర్త బాధపడకుండా ఉండాలంటే గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఆయన గెహ్లాట్‌ను రెచ్చగొడుతున్నారు. పలుమార్లు లేఖలు రాసినా గెహ్లాట్‌కు స్పందించడం లేదని అంటున్నారాయన. ఈ వాదనలు, దీక్షలతో గెహ్లోత్‌ ప్రభుత్వానికి రాజకీయంగా ఎంత నష్టం జరుగుతుందో తెలుసు కనుక దీక్షకు ఒకరోజు ముందు సచిన్‌ను కాంగ్రెస్‌ గట్టిగానే హెచ్చరించింది. ఏఐసిసి రాజస్థాన్‌ వ్యవహారాల ఇంచార్జి తన ప్రకటనలో పరోక్షంగా పైలట్‌ను విమర్శిస్తే, జైరామ్‌ రమేష్‌ గెహ్లోత్‌నాయకత్వాన్ని, ఆయన చేపట్టిన పథకాలను ప్రశంసిస్తూ, వాటి ఆధారంగానే ఎన్నికల్లో ప్రజలముందుకు వెళ్ళబోతున్నట్టు వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి అవినీతిపరులతో కుమ్మక్కవుతున్నారని అంటూ గెహ్లోత్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించడానికి సచిన్‌ తాపత్రయపడుతున్నారు. పైలట్‌– గెహ్లోత్‌ వైరం అనాదిగా ఉన్నదే. ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పైలట్‌ ప్రతీ సందర్భాన్నీ, సంక్షోభాన్నీ కూడా గెహ్లోత్‌ని దెబ్బతీయడానికి వాడుకున్నారు. ముఖ్యమంత్రి కావాలన్న పైలట్‌ ఆశనెరవేరకుండా, ఆయన ప్రతీ ప్రయత్నాన్నీ గెహ్లోత్‌ విజయవంతంగా తిప్పికొడుతూ వచ్చారు. మరీముఖ్యంగా గత ఏడాది కాంగ్రెస్‌ అధ్యక్షపదవి ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో పైలట్‌ సీఎం అయ్యే అవకాశాలు చివరి నిముషంలో ఎదురుదెబ్బ తిన్నాయి. గాంధీయేతర వ్యక్తిని పార్టీ అధ్యక్షపదవిలో కూచోబెట్టాలన్న నిర్ణయంలో భాగంగా గెహ్లాట్‌ను ఢిల్లీ తెచ్చి, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవిలో పైలట్‌ను ప్రతిష్ఠించాలని అధిష్ఠానం భావించింది. దీనికి అంగీకరిస్తున్నట్టుగా, సహకరిస్తున్నట్టుగా కనిపిస్తూనే, ఆఖరునిముషంలో గెహ్లోత్‌ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు సృష్టించారు. గాంధీలు లొంగక తప్పలేదు. సారీ చెబుతూనే గెహ్లోత్‌ నిక్షేపంగా పదవిలో కొనసాగారు. ధిక్కారానికి పాల్పడిన గెహ్లోత్‌వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పైలట్‌ డిమాండ్‌ కూడా నెరవేరలేదు.

కొద్దినెలల్లో ఎన్నికలు ఉండగా, రాజస్థాన్‌ వ్యవహారాల్లో కాంగ్రెస్‌ అధిష్ఠానం వేలుపెడుతుందన్నది భ్రమ. శక్తిమంతుడైన గెహ్లోత్‌ పక్షాన నిలబడకపోతే రాష్ట్రాన్ని కోల్పోవలసి వస్తుందని గాంధీలకు తెలుసు. మరోమారు గెహ్లోత్‌ సర్కార్‌ అంటూ ఆయన వర్గీయులు ధైర్యంగా చెప్పుకుంటున్నారు. సచిన్‌ పైలట్‌కు కాంగ్రెస్‌ను వీడి సొంతంగా నిలదొక్కుకోగలిగే శక్తిసామర్థ్యాలు లేవు. అనేక పెద్దతలకాయలున్న రాజస్థాన్‌ బీజేపీలో చేరి రాజకీయంగా ఎదగగలిగేదీ ఉండదు. పార్టీలోనే ఉంటూ, అవినీతిపై పోరాటం పేరిట ఇటువంటి దీక్షలు, ధర్నాలతో, గెహ్లోత్‌ వ్యతిరేక చర్యలతో పార్టీకి నష్టం చేకూర్చి, బీజేపికి పరోక్షంగా సహకరించడమే ఆయన లక్ష్యమని, 2020 తిరుగుబాటు సహా పైలట్‌ వెనుక ఉండి అమిత్‌ షా ఈ కథంతా నడిపిస్తున్నారన్నది కాంగ్రెస్‌ నాయకుల వాదన. ఘర్షణపడుతున్న ఉభయవర్గాల మధ్యా సత్వరమే సయోధ్య కుదరనిపక్షంలో పైలట్‌ పార్టీలో కొనసాగినా, ఆమ్‌ ఆద్మీ వంటి పార్టీలో చేరినా రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎంతోకొంత నష్టం తప్పకపోవచ్చు.

Updated Date - 2023-04-12T01:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising