ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రగులుతున్న ఇజ్రాయెల్‌

ABN, First Publish Date - 2023-03-28T03:06:35+05:30

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీ దౌత్యకార్యాలయాలు సోమవారం మూతబడ్డాయి. ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద కార్మిక సంఘం ఇచ్చిన పిలుపుమేరకు రాయబారులు, దౌత్యప్రతినిధులు సహా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీ దౌత్యకార్యాలయాలు సోమవారం మూతబడ్డాయి. ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద కార్మిక సంఘం ఇచ్చిన పిలుపుమేరకు రాయబారులు, దౌత్యప్రతినిధులు సహా సిబ్బంది అంతా సమ్మెలో పాల్గొంటున్నందున, సమ్మె ఉపసంహరణ నిర్ణయం వెలువడే వరకూ దౌత్యకార్యాలయాలు పనిచేయవు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తలపెట్టిన న్యాయసంస్కరణలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఇది. సోమవారం ఇజ్రాయెల్‌ ఇటీవలికాలంలో ఎన్నడూలేనంత స్థాయిలో ప్రజాందోళన చవిచూసింది. ప్రజలు అనేకవారాలుగా రోడ్లమీదకు వచ్చి నిరసనలు వ్యక్తంచేస్తున్నా నెతన్యాహూ తనపని తాను చేసుకుపోతున్నారు. ప్రజానిరసనను బేఖాతరుచేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు తన రక్షణమంత్రి ఎదురుతిరిగేసరికి సహించలేకపోయారు. న్యాయవ్యవస్థమీద ప్రభుత్వం పెత్తనం చేయబోవడాన్ని దేశరక్షణరంగం నిరసిస్తున్నదనీ, ప్రజాస్వామిక లక్షణాలను కోల్పోతున్న దేశానికి సేవలు అందించేందుకు తాము సిద్ధంగా లేమని ఆపత్సమయంలో దేశాన్ని ఆదుకోవాల్సిన రిజర్విస్టులు సైతం స్పష్టంచేస్తున్నారని, ఇది దేశభద్రతను ప్రమాదంలో పడవేస్తుందని రక్షణమంత్రి చేసిన హెచ్చరిక నెతన్యాహూకు నచ్చలేదు. ఈ వ్యాఖ్యలు మరింత అసమ్మతిని రాజేస్తాయన్న భయంతో వెంటనే ఆయనమీద వేటువేశారు. రక్షణమంత్రిని తొలగించిన అంశం ఇప్పుడు ఉప్పుకు నిప్పులాగా తయారై, ప్రభుత్వం మనుగడనే ప్రశ్నార్థకం చేసింది.

వైద్యం నుంచి విమానయానం వరకూ సమస్త రంగాలూ నిలిచిపోయి, దేశచరిత్రలోనే అతిపెద్ద సార్వత్రక సమ్మె ఇప్పుడు ఇజ్రాయెల్‌లో జరుగుతోంది. న్యాయసంస్కరణ బిల్లును ఉపసంహరించుకొనేవరకూ సమ్మె కొనసాగుతుందనీ, నెతన్యాహూ వెనక్కుతగ్గేవరకూ తాము తగ్గేదేలేదని అతిపెద్ద కార్మిక సంఘం ‘హిస్తాద్రుత్‌’ ప్రకటించింది. దేశాధ్యక్షుడు సైతం సంస్కరణల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించవద్దనీ, దేశక్షేమంకోసం, ప్రజల ఐక్యత దృష్ట్యా తక్షణం దానిని నిలిపివేయమంటూ నెతన్యాహూకు సూచించారు. అమెరికా వంటి మిత్రదేశాలు కూడా న్యాయవ్యవస్థ జోలికిపోవద్దని ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయినా, సొంతబలంతో పాటు, మితవాద, మతవాద, ఛాందసవాద పార్టీలన్నింటితో కూటమి కట్టి డిసెంబరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెతన్యాహూ నెలరోజుల్లోనే న్యాయవ్యవస్థమీద విరుచుకుపడ్డారు. అవినీతి ఆరోపణల్లో పీకలోతుల్లో ఇరుక్కున్న ఆయన సంస్కరణల పేరిట న్యాయవ్యవస్థను తనకు అనుకూలంగా తయారుచేసుకొనేందుకు ఉపక్రమించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెలీలు, యూదు సంఘాలు, ఇజ్రాయెల్‌లోని న్యాయనిపుణులు, మాజీ అటార్నీలు తీవ్రంగా నిరసిస్తున్నప్పటికీ, కూటమి బలంతో చట్టసభలో బిల్లును ఒక మెట్టు ఎక్కించగలిగారు. ప్రపంచంలో ఎక్కడా లేనిస్థాయిలో ఇజ్రాయెల్‌ న్యాయవ్యవస్థ బలపడివుందనీ, నియామకాలనుంచి ప్రభుత్వ నిర్ణయాల్లో అతిజోక్యం వరకూ సర్వోన్నతన్యాయస్థానం విస్తరించగలగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని నెతన్యాహూ వాదన. కూటమి ప్రభుత్వంలోని అతిమితవాదులకు, ఛాందసులకు ఆనందాన్నిచ్చే అరబ్‌ వ్యతిరేక చర్యలు చేపడుతూ, న్యాయసంస్కరణల బిల్లును మిగతాదశలు కూడా దాటించేయగలనని నెతన్యాహూ అనుకుంటున్నారు. న్యాయవ్యవస్థకు సంకెళ్ళు వేయడం అరబ్బులను, పాలస్తీనియన్లను మరింత హింసించాలని కోరుకుంటున్న ఆయన కూటమి పక్షాలకు కూడా అవసరమే. ఈ బిల్లుతో పాటు, గతంలో తాను ప్రధానిగా ఉన్నప్పుడు సమీపబంధువు ఇచ్చిన దాదాపు మూడులక్షల డాలర్లు జేబులో వేసుకోగలిగే ‘గిఫ్ట్‌బిల్‌’ విషయంలోనూ నెతన్యాహూ దూకుడు కనబరుస్తున్నారు.

దేశజనాభాలో సగం మంది నెతన్యాహూకు ఓటువేయలేదు. ఈ సంస్కరణల విషయంలో ప్రజానుకూలత ఇరవైశాతానికి మించి లేదని సర్వేలు కూడా చెబుతున్నాయి. అయినా, భారీ జనసేకరణతో ప్రజాభీష్టం తమపక్షాన ఉందని మితవాద ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. బిల్లు అనుకూల ర్యాలీలు, వ్యతిరేక ర్యాలీలతో, సమ్మెలు, నిరసనలతో దేశం అంతర్యుద్ధం తరహాపరిస్థితులను చవిచూస్తున్న ప్రస్తుత తరుణంలో తాను తలపెట్టిన ఈ సంస్కరణలను నెతన్యాహూ తాత్కాలికంగా వాయిదావేయవచ్చు. కానీ, వరుస ప్రభుత్వ పతనాలతో, ఏ పక్షానికీ స్పష్టమైన మెజారిటీ రాని స్థితిలో కూటమి కట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చిన నెతన్యాహూ వ్యక్తిగత స్వార్థంతో దేశాన్ని తీవ్ర సంక్షోభంలో పడవేశారు. ప్రజాభీష్టానికి తలొగ్గి న్యాయవ్యవస్థతో ఘర్షణకు స్వస్తిచెప్పడం ఇప్పటికైనా ఉత్తమం.

Updated Date - 2023-03-28T03:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising