ఎర్డొగాన్ ఎదురీత
ABN, First Publish Date - 2023-05-18T00:43:10+05:30
ఒకదేశంలో జరిగే ఎన్నికలకు మరోదేశంతో పోలిక ఉండదు కానీ, తుర్కియే (టర్కీ) ఎన్నికలకు, భారతదేశంలో వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రక ఎన్నికలకు మధ్య పాశ్చాత్య మీడియాకు...
ఒకదేశంలో జరిగే ఎన్నికలకు మరోదేశంతో పోలిక ఉండదు కానీ, తుర్కియే (టర్కీ) ఎన్నికలకు, భారతదేశంలో వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రక ఎన్నికలకు మధ్య పాశ్చాత్య మీడియాకు మాత్రం పోలిక కనిపిస్తున్నది. మతం, ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, మీడియా, విపక్షాలతో వ్యవహారం ఇత్యాది అంశాల్లో ఎర్డొగాన్, నరేంద్రమోదీ వైఖరి దాదాపు ఒకటేనని వాటి ఆరోపణ. ఒకేదేశం–ఒకే ఎన్నికతో దేశాన్ని అధ్యక్షతరహాపాలన వైపు నడపాలన్న బీజేపీ ఆలోచనకూడా ఈ పోలికకు ఓ కారణం కావచ్చు. 2017వరకూ టర్కీకి ప్రధానులున్నారు. ఇప్పుడు అధ్యక్షపదవికోసం మరోమారు పోటీపడుతున్న ఎర్డొగాన్ 2014వరకూ ఆ దేశానికి రెండుపర్యాయాలు ప్రధానిగా పనిచేసినవారే. ఆయన అధ్యక్షుడుగా ఉండగానే దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి అధ్యక్షతరహా పాలనకు మారింది. రెండు దశాబ్దాలపాటు వేర్వేరు హోదాల్లో దేశాన్ని ఏలిన ఆయన మొన్న మే 14న జరిగిన ఎన్నికల్లో అఖండవిజయం సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఆయన పార్టీ సగం ఓట్లు గెలుచుకోని కారణంగా టర్కీ మరో పక్షంరోజుల్లో మరోవిడత ఎన్నికలకు పోవాల్సివస్తున్నది.
ఎర్డొగాన్ వంటి మహాశక్తిమంతుడికి ఇది అవమానమే కావచ్చును కానీ, ఒక రకంగా ఉపశమనం కూడా. ఆయన 49శాతం ఓట్లుసాధించి విజయానికి కాస్తంత దూరంలో మాత్రమే ఉండిపోవాల్సివచ్చింది. మన గాంధీతో దగ్గరగా కనిపిస్తున్నందున టర్కీ గాంధీ అని పత్రికలు తరచుగా ప్రస్తావించే కెమల్ కిలిజ్దరో ఈ ఎన్నికల్లో ఎర్డోగాన్‌ను తొలివిడతలోనే ఓడిస్తారని వార్తలు వచ్చాయి. సర్వేలన్నీ కూడా ఆయన పార్టీకి భారీ మెజారిటీ ఖాయమని చెప్పాయి. ఎర్డొగాన్ కంటే ఐదేళ్లు పెద్దవాడైన కెమల్ మాజీ ఉన్నతాధికారికావడం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకపోవడం, ఆధునిక టర్కీకి పునాదులు వేసిన అటాటుర్క్ ఆలోచనాస్రవంతిని జీర్ణించుకున్నవాడు కావడం, మిగతాపార్టీల్లోనూ ఆయనపట్ల గౌరవం ఉండటం వంటివి ఈ అంచనాలకు కారణం కావచ్చు. కానీ, అనూహ్యంగా ఆయన 45శాతం ఓట్లతో రెండోస్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. మరో అభ్యర్థి ఐదుశాతం ఓట్లతో సుదూరంగా ఉండిపోవడం ఎన్నికలు ఎంత పోటాపోటీగా జరిగాయో తెలియచెబుతుంది. దేశాన్ని అధ్యక్షతరహా పాలననుంచి విముక్తం చేసి, తిరిగి పార్లమెంటరీ వ్యవస్థను ప్రతిష్ఠిస్తానని కెమల్ ఇచ్చిన హామీ ఆయనను బలమైన పోటీదారుగా నిలబెట్టినమాట వాస్తవం.
అంతిమఫలితాన్ని మరోదశవరకూ తీసుకువెళ్ళడమే కెమల్ సాధించిన విజయమనీ, ఎర్డొగాన్‌కు రెండుదశాబ్దాలుగా ఎన్నడూ ఎదురవ్వని అవమానమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ఇటీవలి భూకంపంలో యాభైవేలమంది మరణించడం, ఆ సందర్భంలో అధ్యక్షుడి పనితీరు ప్రజలకు నచ్చకపోవడం, ద్రవ్బోల్బణం, ధరలు పతాకస్థాయిలో ఉండటం, కరెన్సీ విలువ పతనం కావడం వంటి అడ్డంకులన్నీ దాటి ప్రస్తుత అధ్యక్షుడు ఈ మాత్రం ఓట్లు సాధించడం విశేషమే. ఎర్డొగాన్ నాయకత్వంలో టర్కీ అనేక అంతర్జాతీయ వ్యవహారాల్లో చాలా దూకుడుగా వ్యవహరించింది. కొన్ని సందర్భాల్లో అమెరికా, నాటో ప్రయోజనాలకు భిన్నంగా, స్వతంత్రంగా వ్యవహరించింది. అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి టర్కీ మధ్యవర్తిగా ఉపకరిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. కశ్మీర్ విషయంలో భారతదేశ వైఖరిని తప్పుబడుతూ, పాకిస్థాన్ పక్షాన నిలబడుతూ ముస్లిం ప్రపంచానికి తానే నాయకుడుగా నిలవాలన్నది ఎర్డొగాన్ ఆశయం. ఆయన ఓడిపోవాలన్న పాశ్చాత్యదేశాల కోరిక నెరవేరుతుందో లేదో తెలియదు కానీ, మలివిడతలో కష్టపడి గట్టెక్కినా ఆయనకు పూర్వవైభవం మాత్రం సమకూరదు. అలాగే ఎవరు అధికారంలోకి వచ్చినా, అధ్యక్షుడి నిరంకుశ అధికారాలకు కత్తెరవేసి, దేశాన్ని తిరిగి పార్లమెంటరీ విధానంవైపు మళ్ళించాలన్న ఆలోచనకూడా నెరవేరదు. ప్రజల్లో ఎర్డొగాన్ మీద ఎంతోకొంత ఆగ్రహం, ఆయన నిరంకుశవైఖరిపై వ్యతిరేకత ఉన్నదని ఈ ఫలితాలు చెబుతున్నాయి. అటాటుర్క్ ఆలోచనలకు, ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ దాని లౌకికధోరణులను చెరిపివేసి, మతాన్ని రాజకీయాస్త్రంగా వాడుతున్న ఎర్డొగాన్, తన వైఖరిని సమీక్షించుకోవడానికీ, టర్కీని ముందుకు తీసుకుపోవడానికి ఈ ఫలితాలు ఉపకరిస్తాయి.
Updated Date - 2023-05-18T00:43:10+05:30 IST