ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెరవేరని లక్ష్యం

ABN, First Publish Date - 2023-04-07T00:53:40+05:30

ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశంగా ఆరేళ్ళుగా అగ్రస్థానంలో నిలుస్తూవచ్చిన ఫిన్లాండ్‌ ‘నాటో’లో చేరింది. ఆదాయం, జీవనప్రమాణాలు, మానసిక శారీరక ఆరోగ్యాలు ఇత్యాది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశంగా ఆరేళ్ళుగా అగ్రస్థానంలో నిలుస్తూవచ్చిన ఫిన్లాండ్‌ ‘నాటో’లో చేరింది. ఆదాయం, జీవనప్రమాణాలు, మానసిక శారీరక ఆరోగ్యాలు ఇత్యాది ప్రమాణాల్లో అగ్రస్థానంలో ఉంటూ సంతోషాన్ని కూడబెట్టుకున్న ఈ దేశం ‘నాటో’లో చేరికతరువాత వాటిని మెరుగుపరుచుకుంటుందో, కరిగించుకుంటుందో తెలియదు కానీ, తనకు మరింత భద్రత చేకూరుతుందని మాత్రం భావించినట్టుంది. ‘నాటో’ విస్తరణను అడ్డుకోవడమే ధ్యేయంగా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆరంభించిన రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌కు, ఇలా మరో సరిహద్దు దేశం శత్రువులతో చేతులు కలపడం ఎదురుదెబ్బే.

ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌కు చురుకైన, తెలివైన పాలకురాలిగా, కరోనాకాలంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించిన యువనాయకురాలిగా మంచి పేరుంది. దశాబ్దాలుగా తటస్థంగా, రష్యాతో మంచిగా వ్యవహరిస్తూ వచ్చిన తన దేశం ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభం కాగానే ‘నాటో’లో చేరితే తప్ప భద్రంగా ఉండదని ఆమె నమ్మారు. రష్యా హెచ్చరికలను కాలదన్ని, నాటోను ఒప్పించి, తుర్కియేతోనూ సరేననిపించుకొని ఆమె చేసిన కృషికారణంగా ఫిన్లాండ్‌ ఇప్పుడు నాటోలో చేరింది కానీ, తాజా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆమె కూటమి ప్రభుత్వం స్వల్ప తేడాతో అధికారం కోల్పోయింది. మహిళల నాయకత్వంలోని ఐదుపార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆమె నాలుగేళ్ళుగా ఎంతో సమర్థవంతంగా నడిపించారు. ఇప్పుడు అధికారం కోల్పోయినా, తన దేశం ఏడు దశాబ్దాలుగా అనుసరిస్తున్న తటస్థతకు స్వస్తిచెప్పి, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో సైతం చిన్నదేశాల అలీనవిధానానికి మారుపేరుగా ఉన్న ‘ఫిన్లాండైజేషన్‌’ అన్నపదానికి స్థానం లేకుండా చేసిన ఆమె చిరస్థాయిగా నిలిచిపోతారు.

రష్యాతో దాదాపు 1350 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఫిన్లాండ్‌ చేరికతో, ముప్పైఒక్కదేశాల నాటో ఇప్పుడు రష్యాకు మరింత దగ్గరగా చొచ్చుకువచ్చింది. అవసరమైన పక్షంలో ఫిన్లాండ్‌ భూభాగాన్ని కూడా రష్యాకు వ్యతిరేకంగా వాడుకోవడానికి అవకాశం దక్కింది. ఈ చేరికతో ఫిన్లాండ్‌ ఇప్పుడు రష్యా ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తున్నది. సరిహద్దుల్లో రష్యా యుద్ధవిమానాలు నిర్వహిస్తున్న మాక్‌డ్రిల్స్‌తోనూ, ఏరియల్‌ బాంబింగ్‌తోనూ దశాబ్దాలుగా ఉన్న ప్రశాంతత కోల్పోవలసి వస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్‌ నుంచి అధునాతనమైన మిసైళ్ళు కొనుగోలు చేయడానికి ఫిన్లాండ్‌ సిద్ధపడుతున్నది.

ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు వరకూ తమ దేశం నాటోలో చేరడానికి ఏ మాత్రం ఒప్పుకోని ఫిన్లాండ్‌ ప్రజలు పుతిన్‌ దూకుడు చూసిన తరువాత తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. రష్యాతో భవిష్యత్తులోనైనా ప్రమాదం ఉన్నదని, ఇలా తటస్థంగా ఉండటంకంటే దాని శత్రువుతో చేతులు కలపడమే తమకు భద్రతనిస్తుందని ఫిన్లాండ్‌ భావించడం విచిత్రం. తనతో సరిహద్దులు పంచుకుంటున్న ఒక చిన్న దేశం నిర్భయంగా ఉండాల్సింది పోయి, తనవల్ల ప్రమాదం ఉన్నదని అనుకోవడం ఒక విధంగా రష్యా వైఫల్యమే. ఫిన్లాండ్‌ చేరిక నాటోతో పాటుగా, రష్యా ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తున్న ఉక్రెయిన్‌కు కూడా కొత్తశక్తిని ఇస్తుంది. రష్యాతో తమకు ప్రమాదం ఉన్నదని భయపడుతున్న మరిన్ని దేశాలకు ధైర్యాన్ని ఇస్తుంది. స్వీడన్‌ ప్రవేశానికి ప్రస్తుతం తుర్కియే అడ్డుపడుతున్నా అది కూడా నాటోలో వచ్చిచేరితే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఏ లక్ష్యంతో అయితే యుద్ధానికి దిగారో అది నెరవేరకపోగా అందుకు భిన్నమైన వాతావరణాన్ని సృష్టించినట్టే. సోవియట్‌ యూనియన్‌ పతనం తరువాత రష్యాకు ఇచ్చిన హామీలన్నింటికీ వమ్ముచేసి, మాజీ సోవియట్‌ రిపబ్లిక్కుల్లోనే కాక, తూర్పు యూరప్‌ దేశాలన్నింటా నాటో విస్తరణకు అమెరికా ఎంత కష్టపడిందో తెలిసిందే. ఒప్పందాలన్నీ తుంగలోతొక్కి క్రమబద్ధంగా రష్యా సరిహద్దుల వరకూ విస్తరించి, ఆయా చోట్ల ఆయుధాలు మోహరించి రష్యాను నాటో రెచ్చగొట్టింది. కనీసం ఉక్రెయిన్‌ను చేర్చుకోవద్దన్న రష్యా అభ్యర్థనను కూడా పెడచెవినపెట్టింది. ఇప్పుడు ఆ యుద్ధాన్ని కూడా మరిన్ని దేశాలను భయపెట్టడానికీ చేర్చుకోవడానికీ నాటో వాడుకుంటోంది. పుతిన్‌ యుద్ధం నాటో వెనక్కుతగ్గేందుకు కాక, మరింత విస్తరించేందుకు, అది గతంలో కంటే మరింత సన్నిహితంగా వ్యవహరించేందుకు దోహదం చేయడం ఒక విచిత్రమైన పరిణామం.

Updated Date - 2023-04-07T00:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising