ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముచిత న్యాయం!

ABN, First Publish Date - 2023-03-09T00:44:03+05:30

జమ్మూకశ్మీర్‌లో, ఉగ్రవాదుల పేరిట ముగ్గురు పేదయువకులను నకిలీ ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపినందుకు సైనిక న్యాయస్థానం ఇటీవల రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కెప్టెన్‌కు జీవితఖైదు విధించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జమ్మూకశ్మీర్‌లో, ఉగ్రవాదుల పేరిట ముగ్గురు పేదయువకులను నకిలీ ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపినందుకు సైనిక న్యాయస్థానం ఇటీవల రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కెప్టెన్‌కు జీవితఖైదు విధించింది. 2020 జులై 18న అంషిపోరాలో జరిగిన ఈ ఘాతుకం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రం కేంద్రపాలితప్రాంతంగా మారిన ఏడాదిలో జరిగిన ఈ ఘటన లోయ ప్రజలను నిర్ఘాంతపరిచింది. అప్పట్లో షోపియాన్‌జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న కెప్టెన్‌ భూపీందర్‌ సింగ్‌ తనకు సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టం నుంచి దఖలుపడ్డ అధికారాలను దుర్వినియోగపరచి ఈ నకిలీ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డాడని సైనికకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు అత్యున్నతస్థాయి సైనికాధికారుల ఆమోదానికి లోబడి ఉన్నప్పటికీ, ఇది స్వాగతించాల్సిన అంశం. ఆర్మీ దీనిని ఆమోదించాలనీ, దేశవ్యాప్తంగా అనేక సున్నితమైన పౌరప్రాంతాల్లో ప్రజాభద్రతపేరిట సైనికాధికారులు దుశ్చర్యలకు పాల్పడకుండా ఇది నిరోధిస్తుందని అనేకుల అభిప్రాయం.

ఈ నకిలీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మహమ్మద్‌ యూసఫ్‌కు పాతికేళ్ళు, ఇమ్తియాజ్‌ అహ్మద్‌, మహమ్మద్‌ ఇబ్రార్‌ అనే మిగతా ఇద్దరూ ఇంటర్మీడియట్‌ చదువుతున్నవారు. వీరి మరణానికి కారకుడైన ఆర్మీ కెప్టెన్‌కు జీవితఖైదు పడినందుకంటే, ఇది నకిలీ ఎన్‌కౌంటర్‌ అని నిగ్గుతేలినందుకు, తమ పిల్లలు ఉగ్రవాదులు కాదని నిర్థారణ అయినందుకు తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. ఒక ఆర్మీ ఇన్‌ఫార్మర్‌, మరో స్థానిక యువకుడు ఈ నకిలీ ఎన్‌కౌంటర్‌ జరిగేట్టు చేశారని జమ్మూకశ్మీర్‌ పోలీసులు జరిపిన దర్యాప్తులో తేలింది. స్థానికులకు సన్నిహితం కావడానికి తనను అస్లామ్‌గా పరిచయం చేసుకున్న కెప్టెన్‌ భూపీందర్‌ సింగ్‌కు వీరిద్దరూ తోడ్పడేవారు. కరోనా కాలంలో ఉపాధి వెదుక్కుంటూ కాలినడకన రజౌరీ నుంచి షోపియాన్‌ చేరి, అక్కడ ఒక చిన్న ఇంట్లో బసచేసిన ఈ ముగ్గురు యువకులను ఒక పాడుబడ్డ భవనంలోకి తెచ్చి, ఈ కెప్టెన్‌ కాల్చిచంపివేశాడన్నది అభియోగం. ఈ యువకులనుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ ప్రకటించింది. పోలీసులకు ముందుగా సమాచారం ఇస్తే, ఉగ్రవాదులకు చేరవేస్తారని పాలకులనుంచి సైనికాధికారులవరకూ నమ్ముతున్న కాలం అది. ఎన్‌కౌంటర్‌ జరిగి, మృతదేహాల చుట్టూ ఆయుధాలను పేర్చిన తరువాత పోలీసులను పిలిచారని ఆ తరువాత తేలింది. అనంతరం, సైనికపరంగా చేపట్టిన దర్యాప్తులోనూ ఇది నకిలీ ఎన్‌కౌంటర్‌గా నిర్థారణై, ఇప్పుడు సైనిక న్యాయస్థానంలో సదరు కెప్టెన్‌కు శిక్షపడింది.

బాధిత కుటుంబాలవారికి ప్రభుత్వోద్యోగాలు ఇస్తామన్న హామీ ఇప్పటివరకూ నెరవేరలేదు కానీ, ఇప్పుడు కెప్టెన్‌ను సైనికన్యాయస్థానమే శిక్షించడం వారికి ఊరటనిస్తున్నది. విపక్షపార్టీలన్నీ ఈ తీర్పును స్వాగతిస్తూనే, ఉగ్రవాదులపేరిట జరిగిన చాలా ఎన్‌కౌంటర్లపై నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాలని కోరుతున్నాయి. ఈ ముగ్గురు యువకుల గురించి సమాచారం అందించడంలోనూ, వారిని ఉగ్రవాదులుగా ముద్రవేసి హతం చేయడం వెనుకా ప్రోత్సాహకాలు, పారితోషికాల పాత్ర చాలా ఉంది. సమాచారం ఇచ్చినవారికి ఆర్మీనుంచి లక్షలాది రూపాయలు ముడుతుంటే, ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్న సైనికాధికారులకు ప్రమోషన్లు, లక్షలాది రూపాయల రివార్డులు దక్కుతున్నాయి. ఉగ్రవాదులకూ, కూలికోసం వెతుక్కుంటున్న నిరాయుధులైన ముగ్గురు యువకులకూ తేడాతెలియని స్థితిలో కెప్టెన్‌గానీ, ఆయన సహాయకారులుకానీ ఉన్నారని భావించడం కష్టం.

కల్లోలిత ప్రాంతాల్లో సైన్యానికి లభిస్తున్న ప్రత్యేక అధికారాలు ఉగ్రవాదుల నియంత్రణకు కొంతమేరకు తోడ్పడుతున్నాయేమో కానీ, పౌరులపై అఘాయిత్యాలకు ఎక్కువ వీలుకల్పిస్తున్నాయి.

చట్టాన్ని అడ్డుపెట్టుకొని కొందరు సైనికాధికారులు దుశ్చర్యలకు పాల్పడుతూండటం వల్ల సైన్యం పట్ల ఆయా ప్రాంతాల్లో విశ్వాసం కూడా తగ్గిపోతున్నది. సైనికాధికారులంటే స్థానికుల్లో భయం, కోపం, అనుమానం పెరిగినప్పుడు సమాజం నుంచి లభించే సహకారం తగ్గిపోతుంది. ఇది అంతిమంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించే లక్ష్యాన్ని బలహీనపరుస్తుంది. సైనిక న్యాయస్థానాలు తమ అధికారులకు శిక్షలు వేయడం గతంలోనూ జరిగింది కానీ, ఆర్మీ ట్రిబ్యునల్స్‌ వాటిని తోసిపుచ్చిన సందర్భాలు కూడా అనేకం. అంషిపోరా ఘటన విషయంలో బాధితులకు న్యాయం జరిగినప్పుడే సైన్యం పట్ల ప్రజావిశ్వాసం పెరుగుతుంది.

Updated Date - 2023-03-09T00:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising