ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాక్‌కు ఉ్రగఘాతం

ABN, First Publish Date - 2023-08-02T01:11:18+05:30

పాకిస్థాన్‌లోని ఖైబర్‌–ఫక్తుంఖ్వా ప్రావిన్సులో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ప్రకటించింది. యాభైఐదుమంది మరణానికి, మూడువందలమంది గాయాలపాలుకావడానికి కారణమైన ఈ దాడి పాకిస్థాన్‌–అఫ్ఘానిస్థాన్‌ మధ్య...

పాకిస్థాన్‌లోని ఖైబర్‌–ఫక్తుంఖ్వా ప్రావిన్సులో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ప్రకటించింది. యాభైఐదుమంది మరణానికి, మూడువందలమంది గాయాలపాలుకావడానికి కారణమైన ఈ దాడి పాకిస్థాన్‌–అఫ్ఘానిస్థాన్‌ మధ్య నానాటికీ దిగజారుతున్న వాతావరణానికి నిదర్శనం. పాకిస్థాన్‌ అధికార కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మతతత్వ రాజకీయ పార్టీ జేయూఐ–ఎఫ్‌ కార్యకర్తల సమావేశం మీద ఇస్లామిక్‌ స్టేట్‌ జరిపిన ఈ దాడికి అనేక కారణాలరీత్యా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పార్టీ అధినేత మౌలాన ఫజ్లూర్‌ రెహ్మాన్‌ సంకీర్ణకూటమి అధ్యక్షుడు కూడా.

అఫ్ఘానిస్థాన్‌ను తాలిబాన్‌ రెండేళ్ళక్రితం వశపరచుకున్నప్పటినుంచీ పాకిస్థాన్‌ అధికసంఖ్యలో ఉగ్రదాడులను చవిచూడాల్సివస్తున్నది. గత ఏడాది పదిహేను, ఈ ఏడాది ఏడునెలల్లోనే పద్దెనిమిది ఆత్మాహుతిదాడులు జరిగాయి. వీటిలో సగం ఖైబర్‌–ఫక్తుంఖ్వా ప్రావిన్సులో జరిగినవే. దీని రాజధాని నగరమైన పెషావర్‌లో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వరుసగా రెండు భీకర దాడులు జరిగి రెండువందల మంది మరణించారు. తాలిబాన్‌తో సంస్థాగతంగా వేరయినప్పటికీ సైద్ధాంతికంగా ఒక్కటే అయిన తెహ్రీక్‌–ఇ–తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఈ దాడులకు ప్రధాన కారణం. ఇటీవలి కాలంలో అది తన దాడులను అది పాకిస్థాన్‌లోని చాలా ప్రాంతాలకు విస్తరించగలిగింది కూడా. బజౌర్‌జిల్లాలో ఇప్పుడు జరిగిన దాడికి తాను కారణం కాదని ఈ పాకిస్థాన్‌ తాలిబాన్‌ ప్రకటించడానికి ముందే, ఇది ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖోరాసన్‌ (ఐఎస్‌–కె) పనేనని పాక్‌ ఇంటలిజెన్స్‌ నిర్ధారించింది. తాలిబాన్‌, దాని అనుబంధ ఉగ్రవాదసంస్థల మీద ఈ ఇస్లామిక్‌ స్టేట్‌ విభాగం అడపాదడపా దాడులు చేయడం ఉన్నదే కనుక, తాలిబాన్‌తో సత్సంబంధాలున్న మౌలాన్‌ ఫజ్లూర్‌ రెహ్మాన్‌ పార్టీని కూడా అది లక్ష్యంగా చేసుకుంది. తాలిబాన్‌ పాలనలో అఫ్ఘానిస్థాన్‌ అనేక ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా మారిపోయిందని పాకిస్థాన్‌ చాలా కాలంగా విమర్శిస్తోంది. తాలిబాన్‌ దీనిని ఖండిస్తున్నప్పటికీ, ఈ దాడితో గతంలో మాదిరిగానే ఇస్లామిక్‌ స్టేట్‌ సరిహద్దులకు అటూ ఇటూ కూడా శక్తిమంతంగా వ్యవహరించగలుగుతోందని తేలిపోయింది. ఇప్పటికే అనేక మిలిటెంట్‌ గ్రూపులకు నిలయంగా ఉన్న వాయవ్య పాకిస్థాన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఈ దాడిద్వారా తన సమర్థతను గట్టిగా చాటింది.


అమెరికా ఒత్తిడిమేరకు, దాని సహకారంతో 2014లో పాకిస్థాన్‌ తన భూభాగంలో ఉగ్రవాదుల ఏరివేత జరిపిన తరువాత, సరిహద్దుల ఆవల కూడా పరిస్థితిలో మార్పువచ్చింది కనుక, అనంతరకాలంలో కాస్తంత ప్రశాంతతనే అనుభవించింది. కానీ, ఇప్పుడు తాలిబాన్‌ పునరాగమనంతో జడలు విప్పుకుంటున్న ఉగ్రవాదాన్ని నియంత్రించగల సమర్థత పాకిస్థాన్‌కు ఉన్నదా అన్నది ప్రశ్న. దేశం ఎన్నికలకు పోబోతున్న తరుణంలో ఒక ఎన్నికల ర్యాలీమీద మిలిటెంట్‌ సంస్థ దాడి చేయడం ఇదే ప్రథమం. గత ఏడాది ఇమ్రాన్‌ఖాన్‌మీద అవిశ్వాసం ప్రవేశపెట్టి, ఆయనను పదవినుంచి దించేసినప్పటినుంచి నిరసనలు, అరెస్టులు, కేసులతో పాకిస్థాన్‌ తీవ్ర రాజకీయ అనిశ్చితిని చవిచూస్తోంది. సార్వత్రక ఎన్నికల నిర్వహణ దిశగా, ఈ నెలలో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని తాత్కాలిక ప్రధానిగా కూచోబెట్టి, ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ప్రయత్నాలు మొదలైనాయి. ఎన్నికల నిర్వహణ సజావుగా ముగిసి, సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం రాజకీయంగానూ, ఆర్థికంగానూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్‌కు ఎంతో ముఖ్యం. గతకాలపు అనుభవాల రీత్యా ఎన్నికల ర్యాలీలపైనా, ఓటింగ్‌ కేంద్రాలపైనా పాకిస్థాన్‌ తాలిబాన్‌ దాడులు చేస్తుందని ఇప్పటివరకూ భావిస్తున్న తరుణంలో ఐసిస్‌ కొత్తగా రంగప్రవేశం చేయడం ప్రమాద సూచిక.

తన భౌగోళిక, ఆర్థిక ప్రయోజనాలకోసం ఉగ్రవాదులను పెంచి పోషించే విషయంలో దశాబ్దాలుగా పాకిస్థాన్‌ అనుసరిస్తున్న ద్వంద్వవైఖరే ఇప్పుడు దానిని దెబ్బతీస్తున్నది. అఫ్ఘానిస్థాన్‌లో ఒకవైపు అమెరికాతో కలిసి యుద్ధం చేస్తూనే మరోపక్క తాలిబాన్‌కు ఆశ్రయం ఇచ్చింది. అఫ్ఘానిస్థాన్‌ను అమెరికా ఉన్నపళంగా వదిలిపోవడంలోనూ, తిరిగి తాలిబాన్‌ దానిని వశపరుచుకోవడంలో పాకిస్థాన్‌దే కీలకపాత్ర. దీనికిముందు, పాకిస్థాన్‌ సైనికచర్యతో టీపీపీని దాదాపుగా ప్రక్షాళించినా, అఫ్ఘాన్‌లో తాలిబాన్‌ పునఃప్రవేశంతో గతకాలపు ఉగ్రసంస్థలన్నీ బుసలుకొట్టడం ఆరంభించాయి. గతంలో సరిహద్దులకు ఆవల పెంచిపోషించిన ఉగ్రవాదం ఇప్పుడు హద్దులు దాటివచ్చి మరీ చావుదెబ్బ తీస్తున్నది.

Updated Date - 2023-08-02T01:11:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising