ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అద్భుతం, అద్వితీయం

ABN, First Publish Date - 2023-08-24T02:20:11+05:30

ప్రత్యక్షప్రసారాలు చూస్తున్న మనకే ఆ ఆఖరు ఇరవైనిముషాలు దడపుట్టిస్తే, జన్మనిచ్చిన శాస్త్రవేత్తలు ఆ ప్రయాణమంతటా ఎంత నొప్పి..

ప్రత్యక్షప్రసారాలు చూస్తున్న మనకే ఆ ఆఖరు ఇరవైనిముషాలు దడపుట్టిస్తే, జన్మనిచ్చిన శాస్త్రవేత్తలు ఆ ప్రయాణమంతటా ఎంత నొప్పి అనుభవించివుంటారు? దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఆ మహత్తర విన్యాసం అద్భుతంగా ముగిసింది. మన విక్రముడు చందమామమీద కాలూనాడు, క్షేమంగా చేరినట్టు జాబురాశాడు, మనకు చిరకాలం చెదరని ఆనందానుభూతినీ, చరిత్రలో చెరిగిపోని స్థానాన్ని ఇచ్చాడు. ప్రజ్ఞాన్‌ తన పాటవాన్ని పరీక్షించుకుంటోంది. ఈ మారు తప్పకుండా విజయం సాధిస్తాం అంటున్న కోట్లాదిమంది భారతీయుల నమ్మకం నిజమైంది.

నాలుగేళ్ళ క్రితం ఆఖరుక్షణాల్లో చెదిరిపోయిన ఆశలు ఇప్పుడు నెరవేరాయి. గత ప్రయోగంలోనూ విక్రమ్‌ను చందమామవరకూ చేర్చిన బాహుబలి రాకెట్‌ ఈమారు మరిన్ని మెరుగులు దిద్దుకొని, మరింత శక్తిశాలి అయి, తన ప్రయాణంలో దశలవారీగా ఎన్నో కక్ష్యలు అధిగమించి తన కర్తవ్యాన్ని పూర్తిచేసింది. వ్యోమనౌకనుంచి విడివడిన ల్యాండర్‌ మాడ్యుల్‌ ఆ తరువాత చంద్రుడికి చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా పలు పరిభ్రమణలతో, వేగ నియంత్రణతో జాబిలి ఉపరితలానికి చేరువయ్యింది. ఈ దశవరకూ యావత్‌ ప్రయాణాన్ని మానవమేధ నిర్దేశిస్తే, మాడ్యూల్‌ను చక్కగా దించాల్సిన మిగతా బాధ్యతను కృత్రిమ మేధ స్వీకరించింది. నాలుగు ఇంజన్లను ప్రజ్వలించి వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లి ఉపరితలానికి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తువరకూ చేరుకోవడం, తన దిశను మార్చుకోవడం, గమ్యాన్ని నిర్దేశించుకోవడం, కొన్ని మీటర్ల ఎత్తులో కూడా అనుకున్న ప్రదేశం కాలూనడానికి వీలుగా ఉన్నదీలేనిదీ తేల్చుకోవడం అద్భుతం కాక ఇంకేమిటి?


ఎవరి సరసన చేరామన్నది, వరుసలో ఎక్కడున్నామన్నదీ కాదు. మన సొంత జ్ఞానంతో, పరిజ్ఞానంతో, మనమే తయారుచేసుకున్న పరికరాలతో చేసిన ఫీట్‌ కనుక ఎగిరిగంతేయవచ్చు. అంతరిక్షరంగంలో కాకలుతీరినవారు కూడా సాహసించని దక్షిణధృవంలో తొలిగా కాలూనినందుకు ఎంతైనా గర్వించవచ్చు. భూమివైపుగా, మనకు కాస్తంత దగ్గరగా ఉన్న చంద్రమధ్యరేఖమీదకు సాహసయాత్రలు, మానవసహిత యాత్రలు చాలా జరిగివుండవచ్చు. కానీ, బిలాలు, లోయలతో, మైనస్‌ వందడిగ్రీలకు పడిపోయే ఒక చీకటిగుయ్యారంలోకి ప్రవేశించడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ సాహసకృత్యాన్ని సాకారం చేయాలంటే, నాలుగేళ్ళనాటి పొరపాట్లను సరిదిద్దుకోవాలి, కొత్త ప్రయాణాన్ని మరింత జాగ్రత్తగా సాగించాలి. లాండింగ్‌కు నిర్దేశించిన ప్రదేశం గతంలోకంటే పెరగడం, అక్కడ బండలూ రాళ్ళూ ఉంటే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, మరో చోటు వెదుక్కొనేందుకు వీలుగా మరింత ఇంధనం ఉండటం, సూర్యుడికి ఎదురుగా వాలకపోయినా అదనపు సోలార్‌ ప్యానెల్స్‌తో తన కర్తవ్యాన్ని పూర్తిచేయగలగడం వంటి అనేకానేక ముందస్తు జాగ్రత్తలు, చర్యలు ఈ మారు మనకు ఈ విజయాన్ని సమకూర్చాయి.

ఇటీవల రష్యా ప్రయోగించిన లూనా మనకంటే చాలా విషయాల్లో ఎంతో మెరుగైనది. రాకెట్‌ ప్రయాణం, ల్యాండర్‌ ప్రయోగం అంతా తక్కువకాలంలోనే జరిగిపోయాయి. ఆఖరునిముషంలో అది చతికిలబడిపోయినప్పుడు ఆ దేశ అంతరిక్ష సంస్థ అధినేత చాలా ఆవేదనతో మాట్లాడారు. అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు చేసిన తాము, ఇప్పుడిలా దెబ్బతినిపోవడానికి ఐదుదశాబ్దాలపాటు పరీక్షల్లోనూ, ప్రయోగాల్లోనూ ప్రదర్శించిన నిర్లక్ష్యమే కారణమన్నారు. ఏ విజయమైనా అప్పటికప్పుడు సిద్ధించదు. నిరంతర కృషి, ప్రభుత్వ సహకారం నిరంతరం కొనసాగినప్పుడు మాత్రమే అంతరిక్ష సంస్థలు విజయాలు సాధించగలవు. సైకిల్‌ మీద రాకెట్‌ను తరలించే దశనుంచి గత ఆరుదశాబ్దాల కాలంలో ఇస్రో ప్రస్థానం నెహ్రూ వేసిన పునాదులమీద అద్భుతంగా సాగింది. విదేశీ శక్తులు ఆంక్షలతో అడ్డుపడ్డా, విజ్ఞానాన్ని పంచడానికి నిరాకరించినా, అడ్డంపడ్డా సైన్స్‌మీద ప్రేమాభిమానాలున్న పాలకుల సహకారంతో, శాస్త్రవేత్తల అంకితభావంతో దేశం అంతరిక్షరంగంలో పలు విజయాలు సాధించింది. ఇటీవలికాలంలో అంతరిక్ష కార్యక్రమాల బడ్జెట్‌ ఏటా పదిశాతం మేరకు తగ్గిపోతూ, ఇస్రోకు ప్రైవేటుకు మధ్య సంధానకర్తగా ఓ సంస్థే పుట్టుకొచ్చి, ఇస్రో సమస్త వనరులను ప్రైవేటు భాగస్వామ్యం పేరిట అప్పగిస్తున్న క్రమంలో, ఒక భారీ ఇంగ్లీషు సినిమాకంటే తక్కువ ఖర్చుతో ఇప్పుడు ఆ సంస్థ సాధించిన విజయం పాలకులకు ఒక పాఠం.

Updated Date - 2023-08-24T02:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising