ప్రచార రథాలు
ABN, First Publish Date - 2023-10-27T01:01:23+05:30
మోదీ చిత్రాలతో, కటౌంట్లతో అలంకరించిన ఒక రథంలాంటి భారీ వాహనంలో ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి కూర్చుని, తొమ్మిదేళ్ళనుంచి కేంద్రప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలను...
మోదీ చిత్రాలతో, కటౌంట్లతో అలంకరించిన ఒక రథంలాంటి భారీ వాహనంలో ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి కూర్చుని, తొమ్మిదేళ్ళనుంచి కేంద్రప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలను ఏకరువుపెడుతూ, వాటిని సద్వినియోగం చేసుకోమని ప్రజలకు మైకులో ప్రచారం చేస్తుంటే ఎలా ఉంటుంది? అటువంటి వేలాది ప్రచారరథాలు ఈ దేశంలోని గ్రామాలన్నీ కలయదిరుగుతూంటే, ఏడున్నరదశాబ్దాల స్వాతంత్ర్యభారతదేశం పట్టుపని పదేళ్ళలోనే ఇంతగా ఎలా ఎదిగిపోయిందని ప్రజలు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోకుండా ఉండగలరా? కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులను ‘రథ్ ప్రభారీస్’ పేరిట సంక్షేమపథకాల ప్రచారానికి వినియోగించాలన్న మోదీ ప్రభుత్వం నిర్ణయం కాస్త అటూ ఇటూగా సారాంశంలో ఇలాగే అమలు కాబోతున్నది. కొన్ని రాష్ట్రాల ఎన్నికల కాలంలో, సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమం మీద విపక్షాలు ఆగ్రహిస్తున్నాయి. ఇది చట్టవిరుద్ధం కనుక తక్షణం నిలిపివేయమంటూ డెబ్బయ్‌మందికి పైగా మాజీ సివిల్ సర్వీసెస్ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మునుంచి ఎన్నికల సంఘం ప్రధానాధికారివరకూ అనేకమందికి లేఖలు కూడా రాశారు.
గత తొమ్మిదేళ్ళలో మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు స్వయంగా వివరించేందుకు ఉన్నతాధికారవర్గం దేశంలోని 765జిల్లాలకు, ఆ జిల్లాల్లోని గ్రామపంచాయితీల వరకూ తరలివెళ్ళబోతున్నది. జాయింట్ సెక్రటరీలు, డైరక్టర్లు, డిప్యూటీ డైరక్టర్లు రథ ప్రభారీలుగా పనిచేస్తూ, ఈ ఏడాది నవంబరు 20నుంచి వచ్చే ఏడాది గణతంత్రదినోత్సవం నాటితో ముగిసే ‘వికసిత భారత సంకల్పయాత్ర’లో భాగంగా ఈ ప్రచారం చేస్తారట. ఈ ఆదేశాలకు ఓ పదిరోజుల ముందు రక్షణశాఖ మరో సర్క్యులర్ జారీ చేసింది. వార్షిక సెలవుల్లో ఊళ్ళకు వెళ్ళిన సైనికులు ఉత్తినే కూర్చోకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ‘సైనిక దూతలు’గా ప్రచారం చేయాలన్నది దాని సారాంశం. ఇలా, ఉన్నతాధికారులను, సైనికులను మోదీ ప్రభుత్వం తన కార్యక్రమాల ప్రచారానికి వాడుకోవడాన్ని అందరూ తప్పుబడుతూంటే, బీజేపీ నాయకులు మాత్రం సంక్షేమపథకాలను ప్రజలకు తెలియచెప్పడం తప్పా అని ప్రశ్నిస్తూ, అది అధికారుల వృత్తిబాధ్యతలో అంతర్భాగమేనని అంటున్నారు. కానీ, ఇక్కడ జరుగుతున్నది సమాచార వ్యాప్తి కాదు, ప్రచారం. మోదీ చిత్రాలు, కటౌంట్లతో అలంకరించిన ఒక రథంమీద ఒక వేడుకలా, ప్రదర్శనతో జరుగుతున్నది. అది కూడా తొమ్మిదేళ్ళలో చేపట్టిన కార్యక్రమాల గురించి మాత్రమే. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియనివ్వకుండా పేదలు నిరుపేదలుగా ఉండిపోవాలని కాంగ్రెస్ కోరుకుంటోందని, అందుకే ఈ కార్యక్రమానికి అడ్డంపడుతోందని బీజేపీ పెద్దలు అంటున్నారు. దీనర్థం ఇంతవరకూ ప్రజలకు ఈ పథకాల గురించి తెలియదనేనా? గత తొమ్మిదేళ్ళకాలంలో, తాను చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు సామాన్యుల జీవితాలను అసామాన్యంగా మర్చేశాయని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. బ్యాంక్ ఎకౌంట్లనుంచి మరుగుదొడ్లవరకూ ప్రతీ పథకంతో కోట్లాదిమంది లబ్ధిపొందారని ప్రభుత్వ అధికారిక డేటా ఘోషిస్తోంది. మరి, అదంతా నిజం కానప్పుడే ప్రజల్లోకి కొత్తగా సమాచారాన్ని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. టీవీ, రేడియోతో పాటు, డెబ్బయ్ ఐదుకోట్లమందికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్న ఈ దేశంలో ఈ రథ్ ప్రభారీస్ కొత్తగా చొచ్చుకుపోవాల్సిన ప్రాంతాలు ఇంకా ఉంటాయా? పథకాల గురించి తెలియని అమాయకులు ఇంకా ఉన్నారనే అనుకున్నా, సార్వత్రక ఎన్నికలకోడ్ అమలులోకి వచ్చేలోగా సదరు లబ్ధిదారులను గుర్తించడం, పథకాలను వర్తింపచేయడం సాధ్యమయ్యేపనేనా?
బ్యూరోక్రసీ రాజకీయ తటస్థత ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక బలం. అది ఒక నైతిక విలువే కాదు, చట్టబద్ధమైన నిబంధన కూడా. ఒక ఉన్నతాధికారిని రథ్ ప్రభారీగానూ, ఒక సైనికుడిని ప్రచారదూతగానూ వినియోగించడం రాజకీయ ప్రయోజనమే అవుతుంది. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బ్యూరోక్రసీ, మిలటరీ రాజకీయంగా తటస్థంగా ఉండాల్సిందే. అందుకు భిన్నంగా ఈ వ్యవస్థలను వినియోగించుకొని వాటికి రాజకీయరంగులు పులమడం దేశశ్రేయస్సుకు హానికరం. ఉన్నతాధికారులను రంగంలోకి దించి, ఓటర్లను, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం తక్షణమే అడ్డుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానించినట్టే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే.
Updated Date - 2023-10-27T01:01:23+05:30 IST