ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కెనడా జగడం!

ABN, First Publish Date - 2023-09-20T01:32:23+05:30

కెనడాతో మన సంబంధాలు అంత చక్కగా ఏమీ లేవన్నది మొన్నటి జీ20 సదస్సులోనే స్పష్టమైంది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో దేశాధినేతల విందుకు హాజరుకాకపోవడం...

కెనడాతో మన సంబంధాలు అంత చక్కగా ఏమీ లేవన్నది మొన్నటి జీ20 సదస్సులోనే స్పష్టమైంది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో దేశాధినేతల విందుకు హాజరుకాకపోవడం, మనం ఇస్తామన్న విమానాన్ని కాదని, మరో విమానం వచ్చేవరకూ వేచివుండటం, ఆయనతో నరేంద్రమోదీ అంటీముట్టనట్టుగా ఉండటం వంటి దృశ్యాలు అనేకం చూశాం. ఇప్పుడు కెనడా ప్రధాని తమ చట్టసభలో, ఆచితూచి మాట్లాడుతున్నట్టు కనిపిస్తూనే ఓ ఖలిస్థానీ వేర్పాటువాద నాయకుడి హత్యవెనుక భారతదేశం హస్తం ఉన్నదంటూ ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటుగానే, భారత గూఢచర్య సంస్థ రీసెర్చి అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ (రా) తరఫున పనిచేస్తున్నాడన్న ఆరోపణతో ఒక దౌత్య అధికారిని బహిష్కరించడం, అందుకు ప్రతిగా మనదేశం కెనడా రాయబారిపై వేటువేయడం జరిగిపోయాయి. ట్రూడో ఆరోపణను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఖలీస్తానీ ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతలను దెబ్బతీసే వారి చర్యలను ఏమాత్రం నిలువరించకపోగా, కెనడా నేతలు వారికి బహిరంగంగానే మద్దతు పలుకుతున్న వాతావరణాన్ని కప్పిపుచ్చేందుకు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలతో ఒక కుటిల ప్రయత్నం జరుగుతోందని భారత్‌ దీటుగా సమాధానం ఇచ్చింది.

మనకు గిట్టని, మనమంటే గిట్టని దేశాలనుంచి ఇటువంటి సమస్య ఎదురైతే వేరే విషయం. కానీ, కెనడా సంపన్నదేశాల కూటమి జీ7లోనూ, అతిపెద్ద పాశ్చాత్యదేశాల కూటమి నాటోలోనూ సభ్యదేశం. ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం కూడా చక్కగా ఉంది. అన్నింటికీ మించి, మూడున్నరలక్షలమంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. ఉద్యోగాల విషయంలోనూ ఇటీవల ఆ దేశం మనకు కొంతమేరకు తలుపులు తెరిచింది. ఎంతో సాన్నిహిత్యం ఉన్న స్థితిలో, ట్రూడో ఆరోపణ ప్రభావం ఎటు దారితీస్తుందో అన్న భయాందోళనలు సహజం. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలు ట్రూడో ప్రకటనను ఆందోళనకరమైన విషయంగా అభివర్ణించాయి. తమ దేశం నడిబొడ్డున తమ పౌరుడిని భారతదేశ ఏజెంట్లు హత్య చేశారని నిండుసభలో ప్రకటించిన ట్రూడో నిర్దిష్టమైన ఆధారమేదీ చూపకుండా ఒక ప్రజాస్వామ్యదేశంపై ఆరోపణ చేయడం ఆశ్చర్యకరం. ఖలీస్తానీ వేర్పాటువాద నాయకుడు, వాంకూవర్‌ గురుద్వారా నిర్వాహకుడు అయిన హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను భారతదేశం తీవ్రవాదిగా ప్రకటించి చాలా ఏళ్ళయింది. అతడి అప్పగింతకు సంబంధించిన ప్రయత్నాలు విశేషంగా జరుగుతున్నట్టు లేదు కానీ, గురుద్వారా నిర్వహణ ద్వారా సమకూరిన నిధులతో పంజాబ్‌లో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు అతడు కృషిచేస్తున్నాడన్న అనుమానాలైతే భారత ప్రభుత్వానికి ఉన్నాయి. పైగా, 2021లో జస్టిన్‌ ట్రూడోకు ప్రభుత్వం ఏర్పాటుకు సొంతబలం చాలక ఖలిస్తానీ మద్దతుదారుడైన జగ్మీత్‌ సింగ్‌ ధలీవాల్‌ (జిమ్మీ) నేతృత్వంలోని ఎన్డీపీ మద్దతు తీసుకోవడంతో, వీరి విషయంలో ట్రూడో మెతకగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తన గురుద్వారా ముందు వ్యాన్‌లో ఉన్న నిజ్జర్‌ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపిన ఘటన కెనడాలోనే కాక, ఖలిస్తానీ సానుభూతిపరులున్న ఇతరదేశాల్లోనూ సంచలనం రేపింది. నిరసనల పేరిట భారత దౌత్యకార్యాలయాల నుంచి ఆలయాల వరకూ అన్నిటిపైనా దాడులు జరగడం తెలిసిందే. ఈ హత్య వెనుక భారతదేశం ఉన్నదని అప్పట్లోనే వీరంతా ప్రకటించారు. నలభైఐదురోజుల వ్యవధిలో విదేశాల్లో ఉంటున్న ముగ్గురు ప్రముఖ ఖలీస్తానీ నాయకులు మరణించడం వెనుక కుట్ర ఉన్నదని వారి అనుమానం. ఈ హత్యకు నాలుగురోజుల ముందు ఖలిస్థాన్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ అధినేత అవతార్‌ సింగ్‌ ఖండా బ్రిటన్‌లోని ఒక ఆస్పత్రిలో మరణించారు. ఇది కాన్సర్‌ మరణమని బ్రిటన్‌ పోలీసులు ధ్రువీకరించినా, మద్దతుదారులు మాత్రం విషం పెట్టి చంపారని నమ్ముతున్నారు. ఇక, భారతదేశం తీవ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థాన్‌ కమాండో ఫోర్స్‌ అధినేత పరమ్‌జిత్‌ సింగ్‌ పంజ్వార్‌ పాకిస్థాన్‌లోని లాహోర్‌ నడివీధిలో మే 6న హత్యకు గురయ్యారు. దీనికితోడు, దేశీయ మీడియా సంస్థలు కొన్ని ఖలిస్థాన్‌ వేర్పాటువాదాన్ని మొగ్గలోనే తుంచివేయడానికి మన పాలకులు సాహసోపేతమైన చర్యలు తీసుకుంటున్నారంటూ వీటిని ఉదహరించడం విచిత్రం. నిజ్జర్‌ మృతి విషయంలో కేవలం ఆరోపణలుగా ఉన్నవాటినే ట్రూడో ఇప్పుడు ధ్రువీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజం నిగ్గుతేలడం మాట అటుంచితే, వివాదం మరింత ముదిరి, విస్తరించకుండా పరస్పర సహకారంతో, సయోధ్యతో వ్యవహరించడం ఉభయదేశాల ప్రయోజనాలకు ముఖ్యం.

Updated Date - 2023-09-20T01:32:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising