ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘క్లస్టర్‌’ కాఠిన్యం!

ABN, First Publish Date - 2023-07-12T00:39:13+05:30

ఉక్రెయిన్ పక్షాన ఒక్కటైనిలిచిన అమెరికా, దాని మిత్రదేశాల మధ్య ‘క్లస్టర్‌ బాంబుల’ వివాదం రాజుకుంది. ఉక్రెయిన్‌కు క్లస్టర్‌బాంబులు సరఫరాచేయాలన్న అమెరికా నిర్ణయాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్ పక్షాన ఒక్కటైనిలిచిన అమెరికా, దాని మిత్రదేశాల మధ్య ‘క్లస్టర్‌ బాంబుల’ వివాదం రాజుకుంది. ఉక్రెయిన్‌కు క్లస్టర్‌బాంబులు సరఫరాచేయాలన్న అమెరికా నిర్ణయాన్ని ఇప్పటికే బ్రిటన్‌, స్పెయిన్‌ వ్యతిరేకించాయి. ఉక్రెయిన్‌ పక్షాన యుద్ధాన్ని అతివేగంగా ముగించేశక్తి ఈ బాంబులకు ఉందంటూ అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న దేశాల్లో జర్మనీ కూడా చేరడంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ దేశాలను ‘గో టు హెల్‌’ అంటూ తిట్టిపోస్తున్నాడు. రష్యా ఆక్రమించిన ప్రాంతాలను విముక్తం చేయడానికి ఈ క్లస్టర్‌బాంబులు తనకు ఉపకరిస్తాయని ఉక్రెయిన్‌ అంటోంది. రష్యన్‌ భూభాగాల్లో వీటిని ప్రయోగించబోమని, వీటిని వాడటం ద్వారా వందలాదిమంది ఉక్రెయిన్‌ సైనికుల ప్రాణాలను కాపాడుకోగలుగుతామని, వినియోగించిన ప్రతి బాంబుకు లెక్కగట్టి చెబుతానని ఉక్రెయిన్‌ చాలా హామీలు ఇస్తోంది. యుద్ధం అతిభీకరంగా మారిపోయి మారణాయుధాల వినియోగానికి, ప్రజల మానప్రాణాలకు లెక్కలేని దశకు చేరిన తరువాత ఈ క్లస్టర్‌ బాంబుల వినియోగం అవసరం మేరకు పరిమితంగా జరుగుతుందన్న వాదన ఏ మాత్రం నమ్మలేనిది. వందకుపైగా దేశాలు ఏకకంఠంతో నిషేధించిన ఆయుధాన్ని ఉక్రెయిన్‌కు అందించాలన్న అమెరికా నిర్ణయం అతి ప్రమాదకరమైనది.

రష్యా ఆక్రమిత ప్రాంతాలను విముక్తిచేసి, తన ప్రజల ప్రాణాలు రక్షించుకోవడానికి అంటూ ఉక్రెయిన్‌ ఏదో వాదిస్తున్నా, క్లస్టర్‌బాంబుల విషయంలో దుర్వినియోగమే అధికమని వియత్నాం యుద్ధం దశాబ్దాల క్రితమే తెలియచెప్పింది. వియత్నాం యుద్ధంలో మొత్తంగా ఓ రెండు మిలియన్‌ టన్నుల క్లస్టర్‌ మందుగుండును అమెరికా కుమ్మరించింది. ఆ తరువాత దశాబ్దాలపాటు ప్రజలు ఆ దుష్ఫలితాలను చవిచూశారు. సుమారు 20వేల మంది, ముఖ్యంగా పిల్లలు ఈ క్లస్టర్‌ బాంబుల కారణంగా అనంతరకాలంలో కన్నుమూశారని ఓ అంచనా. ఒక యుద్ధవిమానం నుంచి క్లస్టర్‌ ఆయుధం ద్వారా శత్రుస్థావరాలపైన ప్రయోగించడం సులువే. కానీ, వందలకొద్దీ తయారైన చిన్నచిన్న బాంబులు దారీతెన్నులేకుండా విశాలమైన ప్రదేశాల్లోకి వర్షపు చినుకుల్లా వచ్చిపడతాయి. అవి దేనినైనా తాకినప్పుడో, తాకకున్నా పేలవచ్చు. శత్రువుల అధీనంలోని ప్రాంతాల్లో నిండిపోయి ఉంటాయి కనుక, తక్షణం చావగా మిగిలిన సైనికులు కూడా ఆ తరువాత కన్నుమూయక తప్పదు. క్లస్టర్‌బాంబులకు ఉన్న రికార్డు ఏమిటంటే, అత్యధికశాతం అవి పేలకుండానే మిగిలిపోతాయి. అనంతరకాలంలో వాటిపై పౌరులు కాలువేసినప్పుడో, పిల్లలు ఉత్సుకతతో చేతిలోకి తీసుకున్నప్పుడో పేలి వారి ప్రాణాలు తీస్తాయి. సైనికులను, స్థావరాలను, ఆయుధ గిడ్డంగులను గైడెడ్‌ మిసైళ్ళతో నాశనం చేయడం వేరు, ఒక ‍‍‍సువిశాల ప్రాంతాన్ని వందలాది బాంబులతో కమ్మివేయడం వేరు. సైనికులా, పౌరులా అన్న తేడా లేకుండా ఎవరైనా వాటికి బలికాక తప్పదు.

వియత్నాం యుద్ధంలోనే కాదు, అఫ్ఘానిస్థాన్‌, ఇరాక్‌, ఇంకా చాలా యుద్ధాల్లో అమెరికా వీటిని వినియోగించింది. సౌదీ వంటి దేశాలకు అందించింది. 120 దేశాలు ఒక్కటై ఈ క్టస్టర్‌ బాంబుల తయారీ, నిలువ, వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పుడు, ఇప్పుడు యుద్ధంలో ఉన్న అమెరికా, రష్యా, ఉక్రెయిన్‌లు అందులో భాగస్వాములు కాలేదు. అయినప్పటికీ, క్లిష్టం, కష్టం అంటూనే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం నైతికంగా సరైనది కాదు. ఇప్పటికే యుద్ధంలో రష్యా వీటిని తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేసిందన్న వాదన నిజమే కావచ్చు. కానీ, రష్యన్ల అధీనంలోకి పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొనే పేరిట అమెరికా సరఫరాలతో ఉక్రెయిన్‌ సాగించబోయే వినాశనం ఇకపై స్వల్పంగా ఉండబోదు. రష్యన్‌ సైనికులతో పాటు, అమాయక పౌరులు కూడా ఈ బాంబులకు బలికాక తప్పదు. వీటి వైఫల్యం రేటు మూడుశాతం లోపేనని అమెరికా చెబుతున్న ల్యాబరేటరీ లెక్కలు క్షేత్రస్థాయిలో పనిచేయవు. దిశానిర్దేశం లేని వందలాది బాంబులు వర్షంలాగా వచ్చిపడినప్పుడు ఆ విధ్వంసం పరిణామం చిన్నగా ఉండదు. బెలారస్‌లో రష్యా అధ్యక్షుడు అణ్వాయుధాలు మోహరించింది ఉక్రెయిన్‌ యుద్ధంలో వాడటానికేనని పాశ్చాత్యదేశాలు అగ్గీబుగ్గీ అయ్యాయి. ఇప్పుడు మిగతా ప్రపంచమంతా ముక్తకంఠంతో వ్యతిరేకించిన క్లస్టర్‌బాంబులను అమెరికా సరఫరాచేస్తుంటే, ‘వండర్‌ వెపన్‌’ అంటూ ఎగిరిగంతేస్తున్న ఉక్రెయిన్‌ శత్రునిర్మూలన పేరిట తన ప్రజల ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టేస్తోంది.

Updated Date - 2023-07-12T00:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising