‘కటాఫ్’ కల్లోలం!
ABN, First Publish Date - 2023-09-22T01:04:30+05:30
పీజీవైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయం విస్మయాన్ని కలిగిస్తోంది. నీట్ పీజీ–2023 కౌన్సిలింగ్ అర్హత కటాఫ్‌ను...
పీజీవైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయం విస్మయాన్ని కలిగిస్తోంది. నీట్ పీజీ–2023 కౌన్సిలింగ్ అర్హత కటాఫ్‌ను పూర్తిగా సున్నా చేయడం ద్వారా ఈ పరీక్షకు ఉన్న విలువను ప్రభుత్వం పరోక్షంగా సున్నా చేసింది. అన్ని విభాగాల్లోనూ సీట్లభర్తీకి ఇప్పుడు సున్నా మార్కులే అర్హత. నెగటివ్ మార్కులు వచ్చినా కౌన్సిలింగ్‌లో పోటీపడగలిగే అర్హత అభ్యర్థికి దక్కడం చరిత్రలో ఇదే తొలిసారి. సున్నా మార్కులు వచ్చినవారికి కూడా పీజీ సీటు వస్తుందని ఎవరూ అనడం లేదు కానీ, ఏ ఒక్క విభాగంలోనూ, ఒక్క ఖాళీ సీటును కూడా వదిలిపెట్టకూడదన్న పేరిట తీసుకున్న ఈ నిర్ణయం పరీక్ష ప్రతిష్ఠను కచ్చితంగా దిగజార్చుతుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లబ్ధిచేకూర్చేందుకే ఈ నిర్ణయం జరిగిందన్న వాదన ఏ మాత్రం కాదనలేనిది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటివి వారం క్రితం కేంద్రానికి లేఖలు రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగింది. ఇప్పటివరకూ వివిధ రిజర్వుడు కేటగిరీలవారికి 40, జనరల్ కేటగిరీకి 50 పర్సంటైల్ కటాఫ్‌గా ఉన్న నేపథ్యంలో, గరిష్ఠంగా ఓ ముప్పైశాతం కటాఫ్ తగ్గిస్తే అన్ని విభాగాల్లోనూ సీట్లు నిండుతాయని, కరోనా కాలంలో కష్టపడిన వైద్యవిద్యార్థులకు మేలు చేకూర్చినట్టు అవుతుందని, ఉన్నత చదువుకోసం విదేశాలకు పోకుండా దేశంలోనే ఉంచినట్టు అవుతుందని అవి విన్నవించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత ఉదారంగా వాటి కోరిక తీర్చింది. కటాఫ్‌ను సున్నా చేయడమంటే పీజీసీటుకోసం పోటీపడుతున్న విద్యార్థులు కేవలం పరీక్షకు హాజరైతే చాలునని, ఒక్క ప్రశ్నకు జవాబు రాయని, రాయలేనివారు కూడా కౌన్సిలింగ్ అర్హత సాధించారని ప్రభుత్వం చెబుతున్నట్టు. దేశంలో వైద్యవిద్యకు మిగిలిన ఆ కాస్త విలువ, గౌరవాన్ని కూడా దిగజార్చి, నేరుగా సీట్లను అమ్మకానికి పెట్టేసిన దుస్థితి ఇదని చాలామంది విమర్శిస్తున్నారు. అర్హత విషయంలో మౌలికమైన మినహాయింపే తప్ప, మిగతా నిబంధనల్లో ఏ మార్పులూ లేవన్నమాట నిజమే కానీ, ఏ ప్రాతిపదికమీద ఈ నిర్ణయానికి తాను వచ్చిందీ, అందులో హేతుబద్ధత ఏమిటన్నది ప్రభుత్వం చెప్పడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లో అన్ని విభాగాల్లోనూ సీట్లన్నీ నిండిన నేపథ్యంలో, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఇబ్బడిముబ్బడిగా మిగిలిపోయిన సీట్లను, ప్రధానంగా ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను స్వేచ్ఛగా నింపుకోవడానికే ఈ నిర్ణయం అన్నది విమర్శ. నిజానికి సీట్లు భర్తీకాకుండా ఉండిపోవడానికి అర్హులైన విద్యార్థులు లేకపోవడం కారణం కాదు. అర్హత ఉన్నా కోట్లుపోసి కొనుక్కోగలిగే శక్తి లేకే వాటి జోలికి విద్యార్థులు పోవడం లేదు. ఇప్పుడు సున్నా కటాఫ్‌తో సీట్లు కొనుక్కోగలిగేవారిని తెచ్చి కూచోబెట్టగలిగే అవకాశం ప్రైవేటు కాలేజీలకు దక్కుతోంది. ఒక విధంగా ఇది ప్రభుత్వమే ధనికులకు ప్రత్యేకంగా కల్పించిన రిజర్వేషన్.
‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్’లో ‘ఎలిజిబిలిటీ’ని సున్నా చేసిన తరువాత, అసలు పరీక్ష నిర్వహించడం ఎందుకు? అన్న ప్రశ్న సముచితమైనది. ప్రతిభను, అర్హతలను ఇలా సున్నా చేసిన తరువాత, వైద్యసంఘాలు సైతం ఇటువంటి నిర్ణయాలను కోరుతున్నప్పుడు ఇక వైద్యవిద్యకు విలువ ఏముంటుంది? ఆయా విభాగాల్లో డిమాండ్‌ను బట్టి, భర్తీ కాకుండా అధికసీట్లు మిగిలిపోతున్న సందర్భాలను బట్టి అర్హతను కొద్దిగా సవరించడం అన్నది గతంలోనూ ఉన్నది కానీ, ఏకంగా దాని అవసరమే లేకుండా చేయడం ఇప్పుడే జరిగింది. పీజీ ప్రవేశపరీక్షలో అర్హత సాధించాలని, అత్యధికంగా స్కోరు చేయాలని కష్టపడి చదివిన విద్యార్థినీ విద్యార్థులకు ఇది తప్పుడు సందేశం ఇవ్వకుండా ఉంటుందా? దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలున్న ఒక పరీక్ష నిర్వహణ ద్వారా ప్రతిభగలవారిని ఎంపికచేసి, వారిని స్పెషలిస్టులుగా తీర్చిదిద్ది, ఆరోగ్యరంగంలో మంచి ప్రమాణాలు నెలకొల్పవలసిన పాలకులు, కేవలం సీట్ల భర్తీ లక్ష్యంగా ఇటువంటి నిర్ణయాలు చేయడం సముచితం కాదు. విదేశాల్లో వైద్యవిద్య చదివి వచ్చిన విద్యార్థినీవిద్యార్థులకు మళ్ళీ అర్హతపరీక్ష పెడుతున్నది మన ప్రభుత్వం. అత్యంత కఠినంగా ఉండే ఈ ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో యాభైశాతం మార్కులు కటాఫ్‌గా ఉంటే, దేశంలో చదువుకున్నవారికి మాత్రం అర్హతను సున్నా చేశాం. మెడికల్ పీజీ సీట్లభర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకున్న దశలో ప్రభుత్వం తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయం విద్యార్థినీ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణం కావడమే కాక, యావత్ ప్రక్రియను న్యాయస్థానాల సుదీర్ఘవిచారణలోకి నెట్టేసే ప్రమాదం ఉన్నది.
Updated Date - 2023-09-22T01:04:30+05:30 IST