ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాలస్‌ దారుణం

ABN, First Publish Date - 2023-05-10T01:04:01+05:30

నాలుగు గింజలకోసం ఎగిరొచ్చిన పక్షులు వేటగాడి వేటుకు బలైపోయినట్టు, ఉన్నత చదువులకోసం, ఉపాధికోసం అమెరికా తరలినవారు ఉన్మాదుల కాల్పుల్లో కన్నుమూస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు గింజలకోసం ఎగిరొచ్చిన పక్షులు వేటగాడి వేటుకు బలైపోయినట్టు, ఉన్నత చదువులకోసం, ఉపాధికోసం అమెరికా తరలినవారు ఉన్మాదుల కాల్పుల్లో కన్నుమూస్తున్నారు. టెక్సస్‌లోని డాలస్‌కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మాల్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి తాటికొండ ఐశ్వర్య సహా ఎనిమిదిమంది మరణించారు. మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. కారులో వచ్చి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూంటే, ప్రాణభయంతో అనేకమంది పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజికమాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైనాయి. సరిగ్గా ఇదేరోజున కాలిఫోర్నియాలోని ఒక అపార్టుమెంటులో పార్టీ సందర్భంగా రేగిన గొడవలో పదిహేడేళ్ళ యువతి కాల్పులకు బలైంది. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

అగ్రరాజ్యం నుంచి కాల్పుల వార్త విననిరోజంటూ లేదు. ఒకపక్క అమెరికా ఈ ఏడాది లక్షలాది వీసాలు ఇవ్వబోతున్నదన్న శుభవార్త వినబడుతుంది, మర్నాడే ఓ పెట్రోల్‌ బంకు దగ్గరో, మాల్స్‌ వద్దనో విచ్చలవిడి కాల్పులకు భారతీయులు బలైపోయిన వార్తలు వస్తాయి. అగ్రదేశం ఈ ఉగ్రత్వం నుంచి ప్రజలను రక్షించలేని దుస్థితిలో ఉండటం విషాదం. డాలస్‌ ఘటన నేపథ్యంలో వైట్‌హౌస్‌ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అధ్యక్షులవారి మీడియా ప్రతినిధి చెప్పిన లెక్కలు, చేసిన వ్యాఖ్యలను బట్టి, ఈ విషయంలో మేము చేయగలిగిందేమీ లేదని చేతులు ఎత్తేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది 128వ రోజున 201వ సామూహిక కాల్పుల ఘటన జరిగిందనీ, ఈ తుపాకీ హింసతో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మరణించినవారి సంఖ్య పద్నాలుగువేలకు చేరుకుందన్నది ఆ ప్రకటన సారాంశం. స్కూళ్ళు, కాలేజీలు, షాపింగ్‌ మాల్స్‌, చర్చ్‌లు, థియేటర్లు, పబ్లిక్‌ స్థలాలు ఇలా జనజీవనంతో ముడిపడిన ప్రతీస్థలమూ యుద్ధక్షేత్రంలాగా మారిపోతున్న స్థితిలో, అధ్యక్షుడు బైడెన్‌ తనవంతుగా ఎంతో చేశారని, చేయదల్చుకున్నారని చెప్పుకొచ్చారామె. ప్రపంచంలో మరేదేశంలోనూ ఇటువంటి దుస్థితి లేదని, తుపాకి హింసను, సామూహిక హననాన్ని నివారించుకోవాల్సిన దుర్గతి అమెరికాకు మాత్రమే పట్టిందన్న మాట నిజం.

తనకు గిట్టనవారిని, తనను సవాల్‌ చేసినవారిని ఎక్కడున్నా మట్టుబెట్టగలిగే శక్తి ఉన్న అమెరికా తన ప్రజల ప్రాణాలను కాపాడలేకపోతున్నది. అపారమైన డబ్బు, సాంకేతిక పరిజ్ఞానం, బలమైన వ్యవస్థలు, అపరిమితమైన బలగం ఉన్న ఈ దేశం చిన్న అవకాశం దొరికితే చాలు, ఇతర దేశాలకు హక్కుల గురించి ఉపదేశిస్తూంటుంది. స్వేచ్ఛ గురించి, విలువల గురించి, ప్రాణం ఖరీదు గురించి పాఠాలు చెబుతూంటుంది. కానీ, తనకు మాత్రమే పరిమితమైన ఒక రోగాన్ని నయం చేసుకోవడం దానికి చేతకావడం లేదు. బైడెన్‌ అనేక ఎగ్జిక్యుటివ్‌ ఆదేశాలతో గన్‌కల్చర్‌ నిరోధానికి కృషిచేశారని, ఒక చట్టాన్ని తెచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నానికి రిపబ్లికన్లు అడ్డుపడుతున్నందున తప్పువారిదేనని వైట్‌హౌస్‌ ఆరోపిస్తున్నది. సామూహిక హననానికి ఉపకరించే తుపాకుల నిషేధానికి వీలుగా తయారీదారులకు ఉన్న హక్కులూ అధికారాలను పరిమితం చేయాలన్న బైడెన్‌ ప్రయత్నానికి కాంగ్రెస్‌ అడ్డుపడుతున్నందున ఇందులో బైడెన్‌ తప్పేమీలేదనీ, ఆయన చేయగలిగిందీ ఏమీలేదని దీని అర్థం. ఈ బిల్లు విషయంలో రిపబ్లికన్లకు ఉన్న అభ్యంతరాల్లో నిజాయితీ ఉందా, ఆర్థికం మాత్రమే ఉన్నదా అన్న వాదన అటుంచితే, అమెరికా ప్రతీ నిర్ణయాన్నీ అక్కడి కార్పొరేట్‌ శక్తులే శాసిస్తాయన్నది లోకవిదితం. దాని వియ్యమైనా, కయ్యమైనా కార్పొరేట్‌ ప్రయోజనాలతోనే ముడిపడివుంటుంది. పార్టీలకు భారీగా నిధులు అందించే శక్తిమంతమైన గన్‌లాబీని కాదని అడుగుముందుకు వేయగలిగేస్థితిలో అక్కడి పార్టీలు లేవు. సగటు అమెరికన్‌కు ఆయుధం ధరించే హక్కు ఉన్నదని మాత్రమే అంటూ, ఇతరుల జీవించేహక్కును హరిస్తున్న ఈ వాతావరణాన్ని మార్చాలంటే ఉభయపక్షాలూ రాజీకి రావాలి. ప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్న రిపబ్లికన్లు శ్వేతజాతీయుల హక్కులు, ప్రాణాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. జాతివివక్షతో రగిలిపోతూ ఓ తెల్లవాడు ఎన్ని ప్రాణాలు పొట్టనబెట్టుకున్నా మాట్లాడరు. ఉభయపక్షాలూ హోరాహోరీ ఎన్నికల యుద్ధానికి సిద్ధపడుతున్న తరుణంలో, రిపబ్లికన్ల చేయూత ఉండదు కనుక, ఈ సామూహిక విధ్వంసానికి సమీపకాలంలో తెరపడే అవకాశం లేదు.

Updated Date - 2023-05-10T01:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising