జి20లో ‘చీకటి ఖండం’
ABN, First Publish Date - 2023-06-22T02:13:40+05:30
ఆఫ్రికన్ యూనియన్‌కు జి20లో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే విషయాన్ని సానుకూలంగా పరిశీలించమంటూ ప్రధాని నరేంద్రమోదీ జి20 దేశాధినేతలకు లేఖలు రాశారు. సెప్టెంబరులో జరిగే సదస్సులో ఈ చేరిక జరగాలంటూ ఆయన ప్రతిపాదించారు...
ఆఫ్రికన్ యూనియన్‌కు జి20లో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే విషయాన్ని సానుకూలంగా పరిశీలించమంటూ ప్రధాని నరేంద్రమోదీ జి20 దేశాధినేతలకు లేఖలు రాశారు. సెప్టెంబరులో జరిగే సదస్సులో ఈ చేరిక జరగాలంటూ ఆయన ప్రతిపాదించారు. మోదీ విజ్ఞప్తిమేరకు సభ్యదేశాలన్నీ అంగీకరించి, ఆఫ్రికన్ యూనియన్ (ఎయు) చేరిక జరిగిన పక్షంలో ఇది జి20 అధ్యక్షతన భారతదేశం సాధించిన చరిత్రాత్మక విజయం అవుతుంది. ప్రస్తుతం ఆఫ్రికాఖండం నుంచి దక్షిణాఫ్రికాకు మాత్రమే ఈ సంఘంలో సభ్యత్వం ఉంటూ, మిగతా 96శాతం ఆఫ్రికన్ జనాభా దూరంగా మిగిలిపోయిన స్థితిలో మోదీ ప్రతిపాదన స్వాగతించదగింది. ఆఫ్రికన్ యూనియన్ చేరినపక్షంలో మిగతా 54దేశాలకు నేరుగా జి20లో భాగస్వామ్యం దక్కుతుంది.
ఆఫ్రికన్ యూనియన్‌కు అధ్యక్షస్థానంలో ఉన్న సెనెగల్ అధ్యక్షుడు గత ఏడాది జూలైలో జి20లో యావత్ ఆఫ్రికాకు చోటులేకపోవడం సరికాదంటూ ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అంతర్జాతీయ వేదికలమీద దక్షిణాది దేశాలకు ప్రాతినిధ్యం అసలే తక్కువగా ఉంటే, ఆఫ్రికన్ దేశాలు ఈ విషయంలో మరింత చిన్నచూపుకు గురవుతున్నాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో, ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)కు పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వాలన్న భారత ప్రధాని ప్రతిపాదన అనాదిగా ఆ దేశాలతో భారతదేశానికి ఉన్న మైత్రిని మరింత పటిష్టపరుస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశ నాయకత్వం మరింత పటిష్టపడుతుంది. కరోనాకాలంలో ఆఫ్రికన్ దేశాల పక్షాన నిలవడంతో పాటు చాలా దేశాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతమిస్తూ భారత్ ఇప్పటికే వాటికి చేరువుగా ఉన్నది. పందొమ్మిది దేశాలు, యూరోపియన్ యూనియన్‌తో కూడిన జి20 ప్రపంచ జనాభాలో దాదాపు మూడోవంతుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ జీడీపీలో 85శాతం, వాణిజ్యంలో 75శాతం దానివాటా. యాభైఐదు దేశాల ఆఫ్రికన్ యూనియన్ జీడీపీ ఫ్రాన్స్, యుకె కంటే ఎక్కువ. అంతకంటే ముఖ్యంగా 17శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యూనియన్ చేరికతో జి20 బలం, విస్తృతి ఎంతో హెచ్చుతాయి. అతిథులుగా ఓ మూడు ఆఫ్రికన్ దేశాలను పిలవడంతో సరిపెట్టకుండా, అనేక ఆఫ్రికన్ దేశాలు ఎంతోకాలంగా అభ్యర్థిస్తున్న, ఆశిస్తున్న నేపథ్యంలో, మొత్తం యూనియన్‌కే సభ్యత్వం ఇచ్చి జి21 చేయాలన్న భారత్ ఆలోచన మంచిది.
గత ఏడాది డిసెంబరులో అమెరికా–ఆఫ్రికా సదస్సులో జోబైడెన్ ఆఫ్రికన్ యూనియన్‌కు ఈ దిశగా ఓ హామీ ఇచ్చారు. ఆ తరువాత యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా ఈయూ పక్షాన మద్దతు ప్రకటించారు. చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా జి20లో కనీసం పదమూడు సభ్యదేశాలు ఆఫ్రికన్ యూనియన్ చేరికపై సానుకూలంగా ఉన్నాయని, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణకొరియా, తుర్కియే వంటి ఓ ఏడుదేశాలు మాత్రమే ఎటూ తేల్చకుండా ఊరుకున్నాయని అంటారు. ఈ నేపథ్యంలో, తటస్థంగా ఉన్న దేశాలతో పాటు, మాటమాత్రంగా సానుకూలత ప్రకటించిన దేశాలను కూడా దారికి తేవాల్సిన బాధ్యత భారత్‌పైన ఉంది. నిజంగానే, సెప్టెంబరులోగా ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చాలంటే, భారతదేశం సత్వరమే ఉన్నతస్థాయి ప్రతినిధిబృందాలను ఆయా దేశాలకు చర్చల నిమిత్తం పంపి ఈ ప్రతిపాదనకు ఒక నిర్దిష్టత సాధించాల్సి ఉంటుంది. ఆఫ్రికన్‌దేశాల చేరికతో లేని తలనొప్పులు వస్తాయనో, పెరగడం వల్ల జి20 బలహీనపడుతుంది అనో కొన్ని దేశాల్లో ఉన్న అనుమానాలను నివృత్తిచేయాల్సి ఉంటుంది.
ఇరవైయేడు దేశాలకు యూరోపియన్ యూనియన్ (ఇయు) జి20లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, యాభైఐదు దేశాలకు ఆఫ్రికన్ యూనియన్ (ఎయు) ప్రాతినిధ్యం వహించడం సముచితమే. ప్రపంచానికి సమస్యలుగా పరిణమించిన పర్యావరణం, పట్టణీకరణ, వలసలు, ఉత్పాతాలు, ఉపద్రవాలు, మహమ్మారుల వంటి కీలకమైన అంశాల్లో ఆఫ్రికాఖండానికి ప్రాతినిథ్యం లేకుండా చర్చలు, నిర్ణయాలు జరగడం సముచితం కాదు. గతంలో మాదిరిగా ఆఫ్రికా చీకటిఖండంగా కాక, చాలారంగాల్లో అభివృద్ధిసాధిస్తోంది. అనేక ఆఫ్రికన్ దేశాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. 2016లో చైనా తన అధ్యక్షతన ఆఫ్రికన్ దేశాల్లో జి20 పారిశ్రామికీకరణకు దోహదం చేసే నిర్ణయాలు కొన్ని తీసుకున్నది. ఇప్పుడు భారతదేశం తన అధ్యక్షతన జి20లో యావత్ ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చగలిగితే చరిత్రలో నిలిచిపోతుంది.
Updated Date - 2023-06-22T02:13:40+05:30 IST